వైభవ్ సూర్యవంశీ: వింబుల్డన్‌కు వేసుకెళ్లిన ఆ 'సూట్' వెనుక ఉన్న అసలు కథ ఇదీ..

వైభవ్ సూర్యవంశీ, యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ, వింబుల్డన్, దుస్తులు

ఫొటో సోర్స్, Instagram/@abhisheksharma_4

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఈ ఆదివారం(జులై 12) చాలా ప్రత్యేకంగా నిలిచింది. టెన్నిస్‌లో ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ టోర్నమెంట్ మెన్స్ ఫైనల్ చూసే అవకాశం అతనికి దక్కింది.

ఫైనల్ మ్యాచ్ ఇటలీ ఆటగాడు యానిక్ సినర్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగింది. జ్వెరెవ్‌ను ఓడించిన సినర్ ఈ టైటిల్ గెలుచుకున్నారు.

క్రీడా, వినోద రంగాల ప్రముఖులు వింబుల్డన్ చూడటానికి సాధారణంగా ధరించే సంప్రదాయ సూట్‌లో వైభవ్ సూర్యవంశీ కనిపించారు. మ్యాచ్‌కు ముందు అతను టెన్నిస్, క్రికెట్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సమయంలో వైభవ్‌తోపాటు తోటి క్రికెటర్ అభిషేక్ శర్మ, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నారు.

ఈ సూట్ ఎలా ఎంచుకున్నారని ప్రజెంటర్ అడిగినప్పుడు, "నేనేమీ ప్రత్యేకంగా ప్లాన్ చేయలేదు. కాకపోతే, త్వరత్వరగా ఏది దొరికితే అది... అభిషేక్ భయ్యాను అడిగి ఏర్పాటు చేయించుకుని, అలా వేసుకుని వచ్చేశాను" అని వైభవ్ సూర్యవంశీ సమాధానమిచ్చాడు.

యువరాజ్ సింగ్‌ను అతను కలవడం ఇదే మొదటిసారి."యువీ పాజీ నా రోల్ మోడల్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను" అని వైభవ్ చెప్పాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైభవ్ సూర్యవంశీ, యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ, వింబుల్డన్, దుస్తులు

ఫొటో సోర్స్, Instagram/@abhisheksharma_4

'ఎప్పటికీ గుర్తుండిపోతుంది'

ఇంత పెద్ద టెన్నిస్ వేదికపైకి రావడం, ఫైనల్ మ్యాచ్ చూడటం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని వైభవ్ సూర్యవంశీ అన్నాడు.

టెన్నిస్‌లో తనకు ఇష్టమైన ఆటగాళ్ల గురించి చెబుతూ, "నేను గత 4-5 ఏళ్లుగా టెన్నిస్‌ను ఫాలో అవుతున్నాను. జకోవిచ్, నాదల్‌ను చాలా ఇష్టపడతాను. ప్రస్తుత జనరేషన్‌లో కార్లోస్ అల్కరాజ్, యానిక్ సినర్ నచ్చుతారు" అన్నాడు.

"నేను ఇతన్ని బాస్ బేబీ అని పిలుస్తా. ఎందుకంటే ఇప్పుడు బౌలర్లకు బాస్‌గా మారాడు. అభిషేక్‌తో నేను చాలా సమయం గడిపాను. కానీ వైభవ్‌తో ఇదే తొలి పరిచయం. అతడితో కూడా సమయం గడపాలని అనుకుంటున్నాను. క్రికెట్ పట్ల చాలా సీరియస్‌గా ఉన్నాడు, అందుకే అతడి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది" అని వైభవ్ గురించి యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు.

వైభవ్ సూర్యవంశీ, యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ, వింబుల్డన్, దుస్తులు

ఫొటో సోర్స్, Instagram/@abhisheksharma_4

జకోవిచ్ అంటే ఇష్టం: యువరాజ్

"నాకు దూకుడుగా ఆడటం ఇష్టం. కానీ అభిషేక్, వైభవ్ ఈ దూకుడును మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. వీరు క్రికెట్‌ను ఎంతో మెరుగుపరిచారు" అని యువరాజ్ సింగ్ చెప్పారు.

టెన్నిస్‌లో తన స్ఫూర్తి గురించి యువరాజ్ మాట్లాడుతూ, "నాకు నోవాక్ జకోవిచ్ చాలా ఇష్టం. ఈ వయసులో కూడా అతను అద్భుతంగా ఆడుతున్నాడు. సెమీఫైనల్స్ వరకు చేరుకుంటున్నాడు. 24 గ్రాండ్ స్లామ్స్ గెలవడం అసాధారణం. ప్రేక్షకుల మద్దతు లభించినప్పుడల్లా, అతను రెట్టింపు వేగంతో పునరాగమనం చేశాడు. క్యాన్సర్ తర్వాత నాకు కూడా ఇదే మైండ్‌సెట్ తిరిగి రావడానికి ప్రేరణనిచ్చింది. కొత్త తరం ఆటగాళ్లలో యానిక్ సినర్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌లను చూసినప్పుడు, వారు నాకు అభిషేక్, వైభవ్‌లను గుర్తుచేస్తారు. వారు ఆటను శాసించే విధానం, వీరిద్దరూ చేసే విధానం ఒకేలా ఉంటాయి" అన్నారు.

సినర్, జ్వెరెవ్‌లను తనకు ఇష్టమైన ఆటగాళ్లని, వారు టెన్నిస్‌ను శాసించినట్లే, తాను కూడా క్రికెట్ ప్రపంచాన్ని శాసించాలని అనుకుంటున్నట్లు అభిషేక్ శర్మ చెప్పాడు.

రఫెల్ నాదల్ తన ఆల్-టైమ్ ఫేవరెట్ అంటూ "అతను కూడా ఎడమచేతి వాటం ఆటగాడే, నేను కూడా అంతే. ఆ కారణంగానే నేను నాదల్‌తో కనెక్ట్ అవ్వగలను" అన్నాడు.

వైభవ్ సూర్యవంశీ, యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ, వింబుల్డన్, దుస్తులు

ఫొటో సోర్స్, Ranjith Kumar/NurPhoto via Getty Images

సూర్యవంశీ ఫామ్‌పై ఆందోళన

ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఫామ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 0-4 తేడాతో ఓడిపోయింది.

అంతకుముందు ఐర్లాండ్‌పై కూడా భారత్ రెండు టీ20 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఐర్లాండ్‌పై జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11లోకి తీసుకోలేదు. అప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని పలువురు క్రికెటర్లు, నిపుణులు, సోషల్ మీడియా యూజర్లు విమర్శించారు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం దక్కింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది అతడికి తొలి మ్యాచ్ కాగా, 10 బంతుల్లో 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

మూడో మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల తేడాతో ఓడిపోగా, వైభవ్ ఐదు బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నాలుగో మ్యాచ్‌లో వైభవ్ 10 బంతుల్లో 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో, సిరీస్‌లోని ఐదో మ్యాచ్‌లో వైభవ్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు.

వైభవ్ ప్రతి బంతికీ ఎటాక్ చేసే మూడ్‌లో ఉంటాడని, ఈ విధానమే అతడిని దెబ్బతీస్తోందని నిపుణులు అంటున్నారు. ఆడిన మూడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ బ్యాక్-ఆఫ్-లెంగ్త్ బంతులపై ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు.

వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో సుదీర్ఘకాలం కొనసాగాలంటే, కేవలం ఐపీఎల్ ఫ్లాట్ పిచ్‌లపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్థితులలో కూడా పరుగులు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఈ వ్యూహం విజయవంతం కావడంతో, రాజస్థాన్ రాయల్స్‌లో వైభవ్ సూర్యవంశీ సహచర ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మొదటి ఓవర్లోనే రెండుసార్లు షార్ట్ బంతులు వేశాడు.

ఈ యువ బ్యాటర్ ఆ రెండు బంతుల్లోనూ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు, కానీ బంతిని బ్యాట్‌తో సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)