వైభవ్ సూర్యవంశీ: ‘ఈత కొలనులో పైపుల్లా అతని చేతులు సులువుగా తిరుగుతాయి’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తిమోతి అబ్రహం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇక అతడిని ఎంతమాత్రం పక్కనపెట్టలేరు. 13 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చి ఎన్నో రికార్డులను నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. శుక్రవారం బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ ఆడే సమయానికి అతడి వయసు 15 ఏళ్ల 91 రోజులు. 1989లో పాకిస్తాన్‌పై 16 ఏళ్ల 205 రోజుల వయసులో వన్డే ఆడిన భారత ప్లేయర్ సచిన్ తెందూల్కర్ కంటే కూడా వైభవ్ చిన్నవాడు.
చిన్న వయసు కావడం వల్ల, భద్రతా ప్రమాణాల దృష్ట్యా వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాళ్లతో కాకుండా ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ ఉపయోగించాల్సి ఉంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాణించిన తర్వాతే అతడికి ఈ అంతర్జాతీయ పిలుపు వచ్చింది. వైభవ్ గత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 16 ఇన్నింగ్స్‌ల్లో 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేశాడు.
కొద్దిరోజుల కిందటే, శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. లిస్ట్-ఏ 50 ఓవర్ల క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకమది.
అయితే ఈ గణాంకాలకు మించి, ఈ టీనేజ్ ఓపెనింగ్ బ్యాటర్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటి?
దానిని తెలుసుకోవడానికి.. వైభవ్ ఆటను దగ్గరగా పరిశీలించిన రాహుల్ ద్రావిడ్, మైఖేల్ వాన్, జస్టిన్ లాంగర్ లాంటి ముగ్గురు దిగ్గజ మాజీ బ్యాటర్లతో బీబీసీ స్పోర్ట్ మాట్లాడింది.


ఫొటో సోర్స్, Getty Images
‘ఈత కొలనులో పైపుల్లా’
లక్నో సూపర్ జెయింట్స్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ కూడా సూర్యవంశీలాగే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్.
వైభవ్ గురించి లాంగర్ మాట్లాడుతూ, "నా జీవితంలో నేను అడిగి మరీ తీసుకున్న రెండో సెల్ఫీ వైభవ్ సూర్యవంశీదే! మొదటిది, నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగిన ఒక ఏఎఫ్‌ఎల్ ఛాంపియన్‌తో తీసుకున్నది.
నేను వైభవ్‌తో- 'నీ ప్రతిభ, నీ ఆలోచనా విధానం, నువ్వు క్రికెట్ ఆడే విధానం చూసి ఫిదా అయిపోయా. నేనెప్పుడూ ఇలా చేయలేదు. నీతో ఓ సెల్ఫీ దిగొచ్చా' అన్నాను.
అతడి బ్యాటింగ్ చూడటం ఒక అద్భుతమైన అనుభూతి.
వైభవ్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అతడి అసాధారణమైన చేతుల వేగం. గొప్ప ఆటగాళ్ల చేతులు ఈతకొలనులో నీటిపైపుల్లా చాలా సులువుగా కదులుతాయని ఎప్పుడూ చెబుతుంటాను.
బ్యాక్‌స్వింగ్ ఆడేటపుడు అతడి చేతులు ఎనిమిది (8) ఆకారంలోకి తిరుగుతాయి. అది చాలా స్వల్పంగా, సూక్ష్మంగా గమనిస్తేనే తెలుస్తుంది. ఆ చేతుల్లో అంతటి ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది.
చాలామంది ఎడమ చేయి వాటం బ్యాటర్లు సిక్సర్లు కొట్టేటప్పుడు సైట్ స్క్రీన్ వైపు నుంచి లెగ్ సైడ్ వైపు బ్యాట్ తిప్పుతారు. కానీ, వైభవ్ ఆఫ్ సైడ్ షాట్లు ఆడటానికి సిద్ధంగా ఉంటాడు.
తన ఐపీఎల్ కెరీర్ తొలి బంతికే వైభవ్ కవర్స్ మీదుగా సిక్స్ కొట్టాడు. చాలామంది లెఫ్ట్ హ్యాండర్లలా లాంగ్-ఆన్ లేదా డీప్ మిడ్-వికెట్ మీదుగా కాదు.. కవర్స్ మీదుగా కొట్టిన ఆ సిక్సర్ స్టాండ్స్‌లో దాదాపు 20 వరుసల వెనక్కి వెళ్లి పడింది.
‘‘ఈ కుర్రాడికి కేవలం ఆట, నేర్చుకోవాలనే జిజ్ఞాస, చేతి-కంటి సమన్వయమే కాదు.. మరిన్ని పరుగులు చేయాలనే ఆకలి కూడా ఉంది. అంతటి ప్రతిభ ఉన్నా అతడు ఎంతో వినయంగా ఉంటాడు. ఒక చాంపియన్ ప్లేయర్‌కు ఉండాల్సిన అసలైన లక్షణం అదే" అన్నారు.

ఫొటో సోర్స్, CricViz
'స్వేచ్ఛగా వదిలేయాలి’
భారత మాజీ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా ఉన్నప్పుడు.. 14 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్‌లో అరంగేట్రం చేయించాడు.
ద్రవిడ్ మాట్లాడుతూ, "మీరు ఒక అరుదైన ప్రతిభను చూస్తున్నారు. బౌలర్ వేగాన్ని అంచనా వేసే సామర్థ్యం, క్రికెట్ తెలివితేటలు, నిర్భయత్వం.. వీటన్నింటి సమ్మేళనమే వైభవ్.
వైభవ్ లాంటి ఆటగాడిని తయారు చేయడానికి ఎలాంటి ఫార్ములాలు లేవు. ఓ పిల్లాడిని తీసుకొచ్చి, ఇలా చెయ్యి నువ్వు కూడా అంతటి గొప్ప ఆటగాడివి అవుతావని చెప్పలేం. కొన్ని విషయాలు వారికి పుట్టుకతోనే లభిస్తాయి. అయితే అతడు కష్టపడి ఆడాడు, కాబట్టి ఇది కేవలం అయాచితంగా వచ్చింది కాదు.
చిన్నవయసు నుంచే నెట్స్‌లో చాలా బంతులు ఆడాడు, ఆ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నప్పుడే గమనించాను. వైభవ్‌లో ఉన్న పూర్తి ప్రతిభను బయటకు తీసే ప్రయాణంలో అతడికి తగిన మద్దతు, సహాయం లభిస్తాయని ఆశిస్తున్నాను.
ఇలాంటి ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అయితే అదొక సున్నితమైన విషయం. కొన్నిసార్లు వారు స్వేచ్ఛగా దూసుకుపోయేలా వదిలేయాల్సి ఉంటుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Photo by Ashley Allen-ICC/ICC via Getty Images
'కార్టూన్లు... బౌలర్ బంతిని పసిగట్టడం'
ఐపీఎల్ సమయంలో కామెంటేటర్‌గా పనిచేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, వైభవ్ సూర్యవంశీ ఆటను చాలా దగ్గరగా చూశాడు.
వాన్ మాట్లాడుతూ, "ముంబయిలో వైభవ్‌ను అనుకోకుండా కలిశాను. అదొక అభిమానిగా నాకున్న క్రేజీ మూమెంట్. నిజం చెప్పాలంటే, 1990లలో క్రిస్ వాడిల్‌ను కలిసిన తర్వాత మళ్లీ ఆ స్థాయి ఫ్యాన్ మూమెంట్ నాకు అప్పుడే దక్కింది.
మా మధ్య మంచి సంభాషణ జరిగింది. 'మ్యాచ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతావు?' అని నేను అతడిని అడిగాను. 'కార్టూన్లు చూస్తాను' అని చెప్పాడు. 'ఏం తింటావు?' అని అడిగితే.. ' అన్నీ తింటాను!' అన్నాడు.
వైభవ్‌కు అద్భుతమైన చూపు, బ్యాట్ తిప్పే వేగం(బ్యాట్ స్వింగ్) ఉన్నాయి. దాంతో పాటు బౌలర్ వేసే బంతి తీరును పసిగట్టే అసాధారణ నైపుణ్యం కూడా ఉంది.
వైభవ్ ఫీల్డింగ్‌ను అంచనా వేయగలడు. ఒక బ్యాటర్‌గా బౌలర్ ఎలాంటి బంతి వేయబోతున్నాడో ఆ సంకేతాన్ని ముందే గుర్తించాల్సి ఉంటుంది. నిజమైన గ్రేట్ ప్లేయర్స్ చేతి నుంచి బంతి విడుదల కావడానికి ముందే దానిని గ్రహించగలరు. అందుకే అతడు ఎక్స్‌ట్రా కవర్, డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని కొట్టగలడు. థర్డ్ మ్యాన్ మీదుగా కూడా సిక్స్ కొట్టగలడు.
మీరు లెంగ్త్ లైన్ కాస్త తప్పినా చాలు.. మీ బంతిని గ్రౌండ్ బయటకు కొడతాడు. ఫీల్డర్లు ఎక్కడున్నారనేది పక్కన పెడితే, వైభవ్ నేరుగా ఫీల్డర్ల తల పైనుంచే షాట్లు కొడతాడు. అలాంటిది అతడు భారత వైట్ జెర్సీ వేసుకుని టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























