ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భూకంపం, కొనసాగుతున్న సహాయ చర్యలు

ఫొటో సోర్స్, BASARNAS
- రచయిత, ఫరీదా సుసాంటి, హెలెన్ సలివన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని, ఇప్పటివరకు ఐదుకి పైగా మరణాలు నమోదైనట్లు ప్రావిన్షియల్ గవర్నర్ తెలిపారు.
తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ గవర్నర్ ఇమాన్యుయెల్ మెల్కియాడెస్ లాకా లెనా మీడియాతో మాట్లాడుతూ, శిథిలాల కింద చిక్కుకుని నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
భూకంపం, ఆ తర్వాత పదుల సంఖ్యలో సంభవించిన ప్రకంపనల కారణంగా భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. మొదట సునామీ హెచ్చరిక జారీ చేశారు, భూకంపం సంభవించిన 3 గంటల తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం, ఉదయం 5 గంటలకు కాస్త ముందు ఫ్లోరెస్ ఐలాండ్‌లో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ఇండోనేషియా వాతావరణ శాఖ(మెటియరాలజీ, క్లైమటాలజీ అండ్ జియోఫిజిక్స్) ఒక ప్రకటనలో తెలిపింది.


మౌమెరె పోర్టు వద్ద రికార్డైన వీడియోలో ఫెర్రీ ఎక్కేందుకు వేచివున్న ప్రయాణికులపై టెర్మినల్ భవనం నుంచి పెద్ద పెద్ద సిమెంట్ పెళ్లలు ఊడిపడడం కనిపించింది. పడవ ఎక్కేందుకు వెళ్లే గ్యాంగ్‌వే కూడా దెబ్బతినడంతో కొందరు ప్రయాణికులు సముద్రంలో పడిపోయారు.
సునామీ హెచ్చరిక తర్వాత, కొందరు బైకులపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి.
అయితే, ఇది మారుమూల పర్వత ప్రాంతం కావడంతో భూకంపం ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించిందో అంచనా వేసేందుకు కొంత సమయం పడుతుంది.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ బీఎన్‌బీపీ సూచించింది. "భవనాల్లోకి వెళ్లొద్దు, మరీముఖ్యంగా దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండండి" అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
"భూకంప విధ్యంసాన్ని వేగంగా అంచనా వేస్తున్నాం. మృతులు, గాయాలపాలైన వారితో పాటు భూకంపం వల్ల కలిగిన నష్టాన్ని నిర్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సమాచారం ధ్రువీకరించుకున్న అనంతరం, వివరాలు తెలియజేస్తాం" అని ఆ సంస్థ తెలిపింది.
నాగెకేయోలో సుమారు 2,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ పలు భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం.
తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని సిక్కా ప్రాంతం, తలిబురా గ్రామానికి చెందిన ఆర్నాల్డ్ వెలియాంటో బీబీసీతో మాట్లాడుతూ, భూకంపం వచ్చిన సమయంలో తానింకా నిద్రలోనే ఉన్నానని, "తీవ్రమైన ప్రకంపనలు" వచ్చాయని చెప్పారు.
"ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, పిల్లలున్న గదికి వెళ్లాను" అని ఆయన అన్నారు.
"మా ఏరియా తీరప్రాంతానికి దగ్గరగా ఉంటుంది, మేం బయటికి వచ్చేప్పటికే స్థానికులు చాలా మంది ఇళ్ల నుంచి బయటికి వచ్చి కొండప్రాంతం వైపు పరిగెడుతున్నారు. రోడ్లపై భారీగా జనం గుమిగూడారు. సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో కొందరు అక్కడే నిలబడి చూస్తున్నారు."
వరుస ప్రకంపనల కారణంగా చాలామంది ఇళ్లలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారని ఆర్నాల్డ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























