పాకిస్తాన్‌లో ‘వ్యవస్థ కుప్పకూలి పోయింది’ అని వ్యాఖ్యానించిన హోంమంత్రి, ఆయనపై విమర్శలేంటి?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, మొహమ్మద్ హనీఫ్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, రచయిత
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
మొదట సగం పెట్రోల్, సగం విద్యుత్‌తో నడిచే హైబ్రిడ్ వాహనాలు వచ్చాయి. ఆ తర్వాత పాకిస్తాన్‌లో హైబ్రిడ్ రాజకీయ వ్యవస్థ వచ్చింది.
దీని అర్థం ఏంటంటే నిర్ణయాలు అక్కడెక్కడో మూసి ఉన్న గదులలో తీసుకుంటారు. మిగిలిన నాయకులు, కోర్టులు, అధికార యంత్రాంగం, మీడియా... పాత నవాబుల గుమాస్తాలు చేసే పనినే చేస్తారు.
అంటే వారు లెక్కలు, రికార్డులను మాత్రమే చూసుకుంటారు. లాభమైనా, నష్టమైనా చివరికి నింద మాత్రం వారిపైనే పడుతుంది.
ఈ హైబ్రిడ్ వ్యవస్థకు చోదక శక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన హోం మంత్రి మోహ్సిన్ నక్వీనే. పోలీసులు, జైళ్లు, రేంజర్స్... అన్నీ ఆయన నియంత్రణలోనే ఉన్నాయి.
ఈ దేశ ప్రజలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నిర్వహణ కూడా ఆయన చేతుల్లోనే ఉంది.


ఫొటో సోర్స్, ICANA News Agency via Getty Images
‘సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు’
గతంలో ఇస్లామాబాద్‌లో 'ఈ ప్రభుత్వంలోనే మరో ప్రభుత్వం ఉంది' అని అనేవారు. ఇప్పుడు ప్రభుత్వానికి అతీతంగా మొహ్సిన్ నక్వీ తన సొంత ప్రభుత్వాన్ని సృష్టించుకున్నట్టుగా ఉంది.
విజయానికి ఉన్న ఏకైక రహస్యం 'ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి' అని జ్ఞానులు చెబుతారు. ఎందుకంటే దేవుడు రెండు చెవులు, ఒక నాలుక ఇచ్చాడు కదా.
నక్వీ కూడా అలాంటివారే. తక్కువగా మాట్లాడతారు. అయితే ఇటీవల ఆయన మాట్లాడినప్పుడు మాత్రం చాలా గట్టిగా మాట్లాడారు.
ఈ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆయన అన్నారు.
సైనిక నాయకత్వం ప్రపంచాన్ని మీ ముందు ఉంచినా మీరు ఇప్పటికీ దేశాన్ని సరిగా నడపలేకపోతున్నారని సొంత నాయకత్వానికే ఆయన వ్యంగ్యంగా చెప్పారు.
ఆయన కొత్త రాష్ట్రాలకు కొత్త నాయకత్వం అవసరమని మాట్లాడారు.
ఆయన మాటలు విన్న ప్రభుత్వంలోని కొందరు సీనియర్ వ్యక్తులు ఉర్దూలో వినిపించే ఓ మాటను గుర్తుచేసుకున్నారు. 'ముందు మీ దుస్తులు, మీ స్థితి చూసుకోండి' అని.
కానీ ప్రభుత్వంలోని నిజమైన నాయకులు ఏమీ మాట్లాడలేదు. కొత్త రాష్ట్రాల లెక్కలను పాత రాష్ట్రాలే చూసుకుంటాయి.
కొత్త నాయకత్వం అనేకసార్లు ఆవిర్భవించడాన్ని మనం చూశాం. మనకు షరీఫ్ ఖాన్ అనే కొత్త తరం ఉంది. అలాగే భుట్టో కుటుంబ పిల్లలు కూడా ముందుకు వచ్చారు.
కానీ అందరిలో ముఖ్యమైన కొత్త నాయకత్వం నక్వీదే.
నాలుగైదు సంవత్సరాల కిందటి వరకు ఆయన మీడియా ప్రపంచానికి మాత్రమే బాగా తెలుసు.
తర్వాత ఆయన పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత హోం మంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
‘కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది?’
ఇప్పుడు మన భవిష్యత్తుకు సంబంధించిన ఏ నిర్ణయం అయినా ఏ మూసివున్న గదిలో తీసుకున్నా ఆయన కచ్చితంగా ఆ గదిలో ఉంటారు.
ఇప్పుడీ కొత్త నాయకత్వమే మరో కొత్త నాయకత్వం కావాలని డిమాండ్ చేస్తోంది. వ్యవస్థ పతనం గురించి మాట్లాడుతోంది. వ్యవస్థ పతనమైందని వాదిస్తోంది.
ఇప్పుడు కుప్పకూలిపోయిందని వ్యవస్థే తనకు తానుగా చెబుతోంది. ఏదో ఒకటి చేయాలని చెబుతోంది. ప్రజలు కూడా వ్యవస్థ కుప్పకూలిపోయిందని అంటున్నారు.
ఈ ప్రభుత్వం ఆ పతనమైన వ్యవస్థ శిథిలాలపై నిలిచి ఉంది. ఈ విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఆ శిథిలాలు మనపై పడ్డాయి.
ఎన్నో కష్టాల తర్వాత మేము కొత్త నాయకత్వాన్ని తీసుకువచ్చాం. కానీ అది నాలుగేళ్లు కూడా కొనసాగలేకపోయింది.
ఇమ్రాన్ ఖాన్ మూడేళ్లుగా జైలులో ఉన్నారు. ఈ హైబ్రిడ్ విధానం కొనసాగితే ఆయన్ను ముప్పై ఏళ్లు కూడా జైలులో ఉంచొచ్చు.
కొత్త నాయకత్వం గురించి మాట్లాడే ముందు గతంలో వచ్చిన కొత్త నాయకత్వానికి ఏమైందో కూడా ఆలోచించాలి.
వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆయన చెప్పింది నిజమే,
అయితే మీరు ఆ శిథిలాల మీదే పరిపాలిస్తున్నారు...అలాగే కొనసాగించండి.
(ఈ కథనంలోని అంశాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























