భారత్: ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక హింస ప్రకటనలు-బీబీసీ పరిశోధన

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక హింస గురించిన వివరణలు ఉన్నాయి.
‘రేప్ వీడియో’ ‘పిల్లల వీడియో’ అనే పదాలున్న ప్రకటనలను బీబీసీ వరల్డ్ సర్వీస్ చూసింది. అవి టెలిగ్రామ్ యాప్‌లో ఉన్న వినియోగదారులకు లింక్ చేస్తున్నాయి. ఈ వీడియోలను 99 రూపాయలకు కొనుక్కోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ సాంకేతిక ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఈ ప్రకటనలు పేజ్ మీద పబ్లిష్ అవుతాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తున్న ఈ ప్రకటనల గురించి బీబీసీ ఫిర్యాదు చేసిన 24 గంటల తర్వాత ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్పందించింది.
ఈ పోస్టులు తమ 'నిబంధనల'కు లోబడే ఉన్నాయని తెలిపింది.

బీబీసీ ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాను సంప్రదించింది. అలాంటి అనేక ప్రకటనలను, అవి పోస్ట్ చేస్తున్న అకౌంట్లను తాము తొలగించామని మెటా తెలిపింది.
బీబీసీ గుర్తించి ఫిర్యాదు చేసిన అకౌంట్లపై స్పందిస్తూ ఇన్‌స్టాలో ఉన్న అదనపు ప్రకటనలతో పాటు తమ నిబంధనలను ఉల్లంఘించిన అకౌంట్లు, వెబ్ అడ్రస్‌లు, ఇతర కంటెంట్‌ను తొలగించినట్లు మెటా సంస్థ తెలిపింది.
2026లో చిన్నారులపై లైంగిక హింస గురించి ఉన్న మెటీరియల్‌కు సంబంధించి 2.74 లక్షల గ్రూపులతో పాటు ఇతర చానళ్లను తొలగించినట్లు టెలిగ్రామ్ వెల్లడించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో బీబీసీ మారుపేరుతో ఒక ఖాతా సృష్టించింది. యూజర్లు సెక్స్‌కు సంబంధించిన విషయాలు వెతక్కున్నా, ఈ ప్లాట్‌ఫామ్ సెక్స్‌కు సంబంధించిన కంటెంట్‌ను ముందుకు తెస్తోందని బీబీసీ గుర్తించింది.
ఇందులో భారత్‌లో ఆహారం, వాతావరణ పరిస్థితులు, రోజువారీ జీవితం గురించి పోస్టులు పెట్టే మహిళలు ఉన్నారు. వారు ఆకర్షణీయంగా కనిపించే దుస్తులు వేసుకుని, తమ పోస్టుల్లో సెక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఇన్‌స్టాలో లైంగికపరమైన కంటెంట్ గురించి పరిశోధించేందునకు బీబీసీ సృష్టించిన మారు ఖాతాతో ఈ మహిళలను, అలాంటి మరో పది మంది అకౌంట్లను ఫాలో అయింది.
కేవలం వారం రోజుల్లోపే ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో వీడియోకాల్స్ చేయాలని కోరే మహిళలు, నగ్నంగా ఉన్న జంటలు సెక్స్‌లో పాల్గొంటున్నట్లు చూపించే ప్రకటనలు బీబీసీ మరో ఖాతా మీద కనిపించాయి.
కొన్ని రోజుల తర్వాత, చానల్స్ పిల్లలతో పెద్ద వాళ్లు సెక్స్ చేస్తున్నట్లు సూచించే ప్రకటనలను టెలిగ్రామ్ చానల్స్‌ను లింక్ చేస్తూ చూపించడం మొదలైంది.

పిల్లల లైంగిక హింసను ప్రోత్సహించే 30 ప్రత్యేక ప్రకటనలు కనిపించాయి. వీటిలో కొన్నింటిని అనేక అకౌంట్ల ద్వారా పంపించారు.
బీబీసీ మారు ఖాతాలో పెద్దలకు సంబంధించిన పోర్న్ వీడియోలకు సంబంధించి 20 ప్రకటనలు కనిపించాయి.
భారతదేశంలో పిల్లల లైంగిక హింస, అడల్ట్ పోర్నోగ్రఫీని ప్రోత్సహించడం నేరం.
మెటా నిబంధనల ప్రకారం ప్రకటనల్లో పెద్దవాళ్లు నగ్నంగా కనిపించడం, జననావయవాలు, పిల్లలను లైంగికంగా హింసించడం లేదా ప్రమాదంలో పెట్టే కంటెంట్ ఉండకూడదు.
ఇన్‌స్టా అకౌంట్లలో కనిపిస్తున్న సెక్స్‌కు సంబంధించిన ప్రకటనలు, టెలిగ్రామ్ చానళ్ల గురించి బీబీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఒక ప్రకటనలో 12 ఏళ్ల వయసున్న బాలుడు, బాలిక లైంగిక చర్యలో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది.
మరో ప్రకటనలో ఓ పురుషుడున తన చేతిని ఓ బాలిక చుట్టూ వేసి కౌగిలించుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో పురుషుడి వయసు 52 ఏళ్లు, బాలిక వయసు 12 ఏళ్లుగా ఉంది. ఆ ప్రకటనపై "మరింత చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి" అని ఒక టెలిగ్రామ్ చానల్ లింక్ మీద రాసి ఉంది.
ఒక యువతి ఏడుస్తూ ఉన్న వీడియోలో తనను లైంగికంగా హింసించారని రాసి ఉన్న ప్రకటన గురించి బీబీసీ ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేసింది.
దీనిపై ఇన్‌స్టాగ్రామ్ 24 గంటల తర్వాత స్పందించింది. ఆ ప్రకటనను తాము తొలగించలేమని "ఆ ప్రకటన సంస్థ నియమావళిని ఉల్లంఘించలేదని మా రివ్యూ టీమ్ గుర్తించింది" అని సమాధానమిచ్చింది.
"ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణమైంది కాదు. విధాన పరమైన ఉల్లంఘనలు అన్నింటిని మా రివ్యూ ప్రక్రియ గుర్తించలేదు" అని మెటా తర్వాత బీబీసీకి వివరించింది.
"ప్రకటనలు ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత అందులో విధానపరమైన ఉల్లంఘనలను గుర్తించేందుకు సాంకేతికతను నిరంతరం ఉపయోగిస్తూనే ఉంటాం. ఆ ప్రకటనలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు" అని మెటా తెలిపింది.
పిల్లలను హింసిస్తున్నట్లు తెలిసిందంటే, దాని గురించి చట్ట ప్రకారం నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) దృష్టికి తీసుకొస్తామని మెటా పేర్కొంది.
ఆన్‌లైన్‌లో పిల్లల మీద జరిగే లైంగిక దోపిడీకి సంబంధించి ఎన్‌సీఎంఈసీ అనేది రిపోర్టు చేయవచ్చు. ఇది కేంద్రీకృత అంతర్జాతీయ సంస్థ.
పిల్లలపై లైంగిక హింస దృశ్యాలున్న వీడియోలను అమ్ముతున్న రెండు చానళ్ల గురించి టెలిగ్రామ్‌కు బీబీసీ ఫిర్యాదు చేసింది.
అందులో ఒకదాన్ని నెమ్మదిగా డౌన్ చేశారు. దాని స్థానంలో "ఈ గ్రూప్ మీకు కనిపించదు. ఎందుకంటే ఇది టెలిగ్రామ్ నియమావళిని ఉల్లంఘించింది" అనే సందేశం కనిపిస్తోంది. అయితే రెండో చానల్ మాత్రం ‘అమ్మకానికి కొత్త వీడియోలు’ అంటూ పోస్టులు పెడుతోంది.
నేరపూరిత కంటెంట్‌ను షేర్ చేయకుండా నిరోధించడంలో టెలిగ్రామ్ చేయాల్సినంత చేయడం లేదని గతంలో కొంతమంది విమర్శించారు.
దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ ఎన్‌సీఎంఈసీ లేదా ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్‌లో సభ్యురాలు కాదు. చిన్నారుల లైంగిక హింస, అడల్ట్ పోర్నోగ్రఫీ, సెక్సువల్ కంటెట్‌ను గుర్తించడం తొలగించడం గురించి ఇది అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో కలిసి పని చేస్తుంది.
ఈ సంస్థ టెలిగ్రామ్ యాప్ నుంచి బాలలపై లైంగిక హింసకు సంబంధించిన దృశ్యాలను తొలగించేందుకు మనుషులతో పాటు మెషీన్లతోనూ పని చేస్తుందని బీబీసీతో టెలిగ్రామ్ చెప్పింది.
దీని వల్ల తాము "బాలలపై లైంగిక హింసకు సంబంధించిన దృశ్యాలు ప్రజా జీవితంలో విస్తరించకుండా వర్చువల్‌గా తొలగిస్తున్నాం" అని టెలిగ్రామ్ పేర్కొంది..

ఫొటో సోర్స్, Reuters
మెటాకు ఆదాయంలో ప్రకటనలు చాలా ముఖ్యమైన వనరు.
2025 ఆర్థిక సంవత్సరంలో తన రూ. 19.5 లక్షల కోట్ల ఆదాయంలో 90శాతం ప్రకటనల నుంచే వచ్చిందని మెటా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ఆదాయంలో 90 శాతం ప్రకటనల ద్వారా వస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇన్‌స్టాలో సాధారణ పోస్టులు ఎలాంటి తనిఖీలు లేకుండా ఆటోమేటిగ్గా అప్‌లోడ్ అవుతున్నప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసేందుకు అనుమతించడానికి ముందు ప్రతీ ప్రకటనను సమీక్షిస్తామని మెటా చెప్పింది.
తమ సమీక్ష విధానం ప్రాథమికంగా ఆటోమేటెడ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉందని చిత్రాలు, వీడియో, టెక్స్ట్, ఆడియోను తనిఖీ చేయడానికి అలాగే పోస్ట్ చేసే ప్రకటనలు ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నాయి, వాటి లింకులు ఎక్కడకు తీసుకెళతాయనే దాన్ని పరిశీలిస్తుందని మెటా చెబుతోంది.
ఈ సాఫ్ట్‌వేర్ ప్రకటనలను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తుంది. తనకు వీలుకాని వాటి గురించి మనుషుల జోక్యం కోసం అభ్యర్థిస్తుంది.
తాము థర్డ్ పార్టీ మనుషుల మీద ఆధారపడం తగ్గించామని, కృత్రిమ మేథస్సు వాడకాన్ని పెంచామని మెటా ఈ ఏడాది మార్చ్‌లో ప్రకటించింది.
"నిపుణులు మా ఏఐ సిస్టమ్స్‌ను రూపొందిస్తారు, శిక్షణ ఇస్తారు. పర్యవేక్షిస్తారు" అని మెటా తెలిపింది.
ఈ ప్రకటనల గురించి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్‌కు బీబీసీ వివరించింది. ఇన్‌స్టాగ్రామ్ "నేరపూరిత చర్యల ద్వారా డబ్బు సంపాదిస్తోంది" అని ఆయన అన్నారు.
"సుప్రీంకోర్టు సూమోటో కేసుగా తీసుకోదగినంత తీవ్రత ఉన్న వ్యవహారం ఇది. ప్రభుత్వం కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి" అని ఆయన అన్నారు.
యూజర్లు అప్‌లోడ్ చేసే కంటెంట్‌కు సంబంధించి సోషల్ మీడియా కంపెనీలను బాధ్యుల్ని చేయకుండా చట్టపరంగా రక్షణ ఉన్నప్పటికీ "ప్లాట్‌ఫామ్ తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు" అని లోకూర్ అన్నారు.

వినియోగం, ఎంగేజ్‌మెంట్, ఇవే సంస్థ లక్ష్యాలు
బీబీసీ గుర్తించిన అంశాలు "భయంకరంగా ఉన్నాయి, పెద్దగా ఆశ్చర్యం గొలిపే అంశాలు కాదు" అని 2021లో మెటాగా మారక ముందు ఫేస్‌బుక్‌గా ఉన్న ఈసంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఒకరు చెప్పారు.
బ్రయన్ బొలాండ్ 2009 నుంచి 2020 వరకు ఫేస్‌బుక్‌లో పని చేశారు. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ విభాగం ఏర్పాటులో సహకరించారు. "వాళ్లు యూజర్ల గురించి ఏమాత్రం పట్టించుకోరు. అందుకే ఆ సంస్థను వదిలేశాను" అని ఆయన చెప్పారు.
యూజర్లను ప్లాట్‌ఫామ్ మీద ఉంచేందుకు "బాగా తీవ్రమైనది, ఆకర్షణీయమైనవి" చూపించేలా ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథంను తయారు చేసిందని ఆయన వివరించారు.
"ఇది 'యూజర్లను పెడోఫైళ్లు (చిన్న పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ, కోరికలు ఉండే వ్యక్తులను పెడోఫైల్ అంటారు) గా మార్చుదాం' అని చెప్పే అల్గారిథం లాంటిది కాదు. ఎందుకంటే వాళ్లు దాని నిర్దేశం, నియంత్రణ విషయంలో బాధ్యతగా ఉండరు. అది ఆదాయం, క్లిక్స్ మీద మాత్రమే దృష్టి పెడుతుంది. ఈ వ్యవస్థల గురించి యూజర్లకు నిజమైన రక్షణ లభించకపోతే ఇలాంటి సమస్యలే వస్తుంటాయి" అని బ్రయన్ బొలాండ్ చెప్పారు.
2009 నుంచి 2010 మధ్య యూజర్లను మోసం చేసే ప్రకటనలను తొలగించే ప్రాజెక్టుకు తాను నాయకత్వం వహించినట్లు బొలాండ్ చెప్పారు. "ఆ సమయంలో యూజర్లకు భద్రత, ఉత్తమ అనుభవం కోసం కంపెనీకి భారీగా ఆదాయం తెచ్చే దాన్ని తొలగించడమే" దీనర్థం.
"కాలక్రమంలో ఈ చర్చలో ఆదాయం, యూజర్ల అనుభవం అనేది కేంద్రంగా మారడం విషాదకరమని నేను అనుకుంటున్నాను" అని బోలాండ్ చెప్పారు.
2025లో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లు ఆయన చెప్పారు.
"ప్రజలు భారీ స్థాయిలో నేను బయటకు వచ్చేస్తున్నాను, ఇక చాలు, మర్చిపోండి అని చెబితే కంపెనీ దీనిపై శ్రద్ధ పెడుతుంది" అని ఆయన అన్నారు.
"పిల్లల్ని అక్రమ మార్గంలో ఉపయోగించుకోవడం భయంకరమైన నేరం. మా యాప్స్‌లో ఇలాంటి వాటిపై మెటా తీవ్రంగా పోరాడుతుంది" అని బీబీసీకి పంపిన ఓ ప్రకటనలో మెటా తెలిపింది.
భద్రత కంటే ఆదాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తామనే వాదనను మెటా తిరస్కరించింది. "అనుమానిత ప్రవర్తనతో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్న" 40లక్షల అకౌంట్లను 2025లో ఆటోమేటిగ్గా తొలగించినట్లు మెటా తెలిపింది.
"నేరస్థులు తప్పించుకోకుండా మా నిపుణుల బృందం నిరంతరం రక్షణను మెరుగుపరిచే పని చేస్తూ ఉంటుంది. స్కామర్లను కూకటి వేళ్లతో తొలగించేందుకు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది. వెబ్‌సైట్ల నిబంధనలు ఉల్లంఘించే లింక్స్‌ను బ్లాక్ చేయడం, వాళ్లు కూడా చర్యలు తీసుకునేలా మిగతా సంస్థలకు సమాచారాన్ని అందించడం లాంటి చర్యలు చేపడతాం" అని మెటా తెలిపింది.
పిల్లల విషయంలో తమ ప్లాట్‌ఫామ్‌ల భద్రత గురించి యూజర్లను తప్పుదారి పట్టించిందని మెటాపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలోని న్యూమెక్సికోలో జరిగిన విచారణలో మెటాకు వ్యతిరేకంగా బొలాండ్ సాక్ష్యం చెప్పారు.
ఈ కేసులో న్యూమెక్సికో రాష్ట్రానికి మెటా రూ.3,577 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాము అప్పీలుకు వెళతామని ఆ సమయంలో సంస్థ అధికార ప్రతినిధిగా ఉన్న మహిళా ఉద్యోగి చెప్పారు.

అమెరికాలోని సోషల్ మీడియా కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారులపై లైంగిక హింసకు సంబంధించిన మెటీరియల్ గురించి తప్పనిసరిగా ఎన్‌సీఎంఈసీ సైబర్ టిప్‌లైన్‌కు నివేదించాలి.
ఈ టిప్‌లైన్ తర్వాత ఈ నివేదికలను సంఘటనలు జరిగినట్లు భావిస్తున్న దేశంలో తగిన చట్టబద్ధ సంస్థలకు పంపిస్తుంది.
2025లో భారత్ 19 లక్షల రిపోర్టులు అందుకుంది. 20 లక్షల రిపోర్టులతో అమెరికా భారత్ కంటే ముందుంది.
మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ నుంచి ఎక్కువగా టిప్ లైన్స్ వచ్చాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు.
"దీనర్ధం అవే పెద్దవని కాదు" అని ఆమె అన్నారు. "చిన్నారులపై లైంగిక హింసను ట్రాక్ చేసేందుకు వాళ్ల దగ్గర మంచి అల్గారిథం ఉంటే, సహజంగానే వాళ్ల నుంచి ఎక్కువ టిప్ లైన్స్ వస్తాయి" అని శిఖా గోయల్ చెప్పారు.
ఆన్‌లైన్‌లో ప్రమాదాల్ని ఎదుర్కొంటున్న చిన్నారులకు ముంబైకి చెందిన ఎన్జీవో రతి ఫౌండేషన్ ఒక హెల్ప్‌లైన్ నిర్వహిస్తోంది. బాలలపై లైంగిక హింస విషయంలో మెటా ప్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఈ సంస్థ చెబుతోంది.
ప్రమాదకరమైన కంటెంట్‌ను తొలగించేందుకు ఈ సంస్థ ఇతర సామాజిక మాధ్యమాలతో కలిసి పని చేస్తోంది. "మా ప్రయత్నాలను తప్పించుకునేందుకు నేరస్ధులు ఇన్‌స్టాగ్రామ్ నుంచి టెలిగ్రామ్‌కు వెళతారు. మేము తొలగించిన దాన్ని మళ్లీ మళ్లీ అప్‌లోడ్ చేస్తారు" అని ఎన్జీవో సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సిద్ధార్థ్ పిళ్లై చెప్పారు.
భారత్‌లో చిన్నారులపై లైంగిక హింసకు సంబంధించిన మెటీరియల్‌ను మానవ అక్రమ రవాణా చేసే నేర ముఠాలు తయారు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు కుటుంబం, కొంతమంది వ్యక్తులు కూడా దీనికి బాధ్యులే.
ఈ నేరాల గురించి ఫిర్యాదు చేయడం లేదని, దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పోలీసులు ఇంకా అభివృద్ధి చేస్తున్నారని భారత్‌లో పిల్లలపై హింసను నిరోధించడానికి పనిచేస్తున్న 250కు పైగా సంస్థల నెట్‌వర్క్ 'జస్ట్ ఫర్ రైట్స్' వ్యవస్థాపకుడైన భువన్ రిభు చెప్పారు.
దీన్ని సక్సెస్ చేసేందుకు అంతర్జాతీయ సహకారం, సరిహద్దుల్ని దాటి నిఘా సమాచార పంపిణి ముఖ్యమని ఆయన అన్నారు.
"వ్యవస్థీకృత నేరాల మూలాలను గుర్తించాలంటే మొత్తం డిమాండ్, సరఫరా చైన్ మొత్తాన్ని పరిశిలించాల్సి ఉంది" అని భువన్ రిభు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























