స్తంభించిన ఇరాన్ ఆస్తులు: ఆ డబ్బు ఎక్కడుంది, అది ఎందుకంత కీలకం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా ఫయద్
- హోదా, బీబీసీ న్యూస్ అరబిక్
- రచయిత, అలీ రమజానియన్,
- హోదా, ఇరాన్ ఎకానమీ అనలిస్ట్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇరాన్ - పశ్చిమ దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత వివాదాస్పదమైన, సంక్లిష్టమైన అంశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల ఒకటి.
ఇరు దేశాల మధ్య యుద్ధ ముగింపు లక్ష్యంతో ఇటీవల అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందంలోని కీలకమైన అంశాల్లో ఇది కూడా ఉంది.
ఆంక్షలు, బ్యాంకింగ్ పరిమితుల కారణంగా విదేశాల్లో ఉండిపోయిన నిధుల్లో చాలా వరకూ ఇప్పుడు అందుబాటులో లేవు. వాటిని తిరిగి పొందేందుకు తెహ్రాన్ చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఈ ఆస్తులు అమెరికాలో పెద్దగా లేనప్పటికీ.. వాటిని పొందే వీలుందా లేదా అనే విషయాన్ని నిర్ధరించడంలో మాత్రం వాషింగ్టన్ కీలకపాత్ర పోషిస్తుంది.
ఏళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలు, ఆర్థికంగా ఏకాకితనం, పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, అలాగే ఇటీవల అమెరికా - ఇజ్రాయెల్‌తో జరిగిన సంఘర్షణ వల్ల కలిగిన నష్టంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు.. స్తంభించిపోయిన ఆస్తుల్లో కొంతమేర దక్కినా అదొక జీవనాధారంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.
అయితే, ఇందులోని చట్టపరమైన, ఆర్థిక, రాజకీయ అడ్డంకుల దృష్ట్యా ఏ ఒప్పందాన్నయినా వాస్తవ నిధుల బదిలీగా మార్చడం అంత తేలిక కాదని, ఈ ప్రక్రియ చాలా ఆలస్యంగా, సంక్లిష్టంగా సాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు ఈ నిధులు ఏమిటి?

ఆ ఆస్తులు వేటితో ముడిపడి ఉన్నాయి?
స్తంభింపజేసిన ఇరాన్ మొత్తం ఆస్తుల విలువపై ఎలాంటి అధికారిక గణాంకాలు లేవు. కానీ, సుమారు 27 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం.. వీటి విలువ సుమారు రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.9.5 లక్షల కోట్లు.
ఇవన్నీ ఒకే అకౌంట్‌లో లేవు. వాటిలో చమురు, గ్యాస్, విద్యుత్ ఎగుమతుల ద్వారా వచ్చిన రాబడులు, విదేశీ బ్యాంకుల్లో ఉన్న విదేశీ మారక నిల్వలు, చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్న ఆస్తులు ఉన్నాయి. వీటిలో కొన్ని దశాబ్దాల నాటివి కూడా ఉన్నాయి.
ఇరాన్ తన చమురును విదేశాలకు అమ్మినప్పుడు, కొనుగోలు చేసిన దేశంలోని అకౌంట్లలో వీటి చెల్లింపులు డిపాజిట్ అయ్యాయి. అయితే, ఆంక్షల కారణంగా తెహ్రాన్ ఈ నిధులను స్వదేశానికి తరలించలేకపోయింది.
తెహ్రాన్‌లో అమెరికా రాయబార కార్యాలయం బందీల సంక్షోభం తర్వాత, 1979లో తొలిసారి ఆస్తులను స్తంభింపజేశారు. ఆ తర్వాత ఒప్పందాల కింద కొన్ని ఆస్తులు విడుదలైయినప్పటికీ, 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు సంతకాలు చేసిన సైనిక ఒప్పందాలకు సంబంధించిన కొన్ని చెల్లింపులు, ఆస్తుల విషయం ఇంకా పరిష్కారం కాలేదు.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
రెండో, విస్తృత ఆంక్షల దశ 2011 - 12 మధ్య ఆరంభమైంది. ఇందులో కఠినమైన అణు ఆంక్షలు, ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని ప్రాంతాల నుంచి ఇరాన్‌ను మినహాయించడం వంటివి ఉన్నాయి. 2015 నాటి అణు ఒప్పందం (జేసీపీఓఏ) నుంచి 2018లో అమెరికా వైదొలిగిన తర్వాత.. ఈ ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి.
ఆంక్షలు పెరుగుతున్న కొద్దీ.. పెద్దయెత్తున రాబడులు విదేశాల్లోనే చిక్కుకుపోయాయి, అధికారికంగా స్తంభింపజేయడం లేదా వాటి వినియోగంపై కఠినమైన పరిమితుల రూపంలో ఈ ఆంక్షలు ఉన్నాయి.
అధికారికంగా బ్లాక్ చేసిన నిధులు, స్వదేశానికి తీసుకురాలేని నిధులు, ప్రస్తుతం కొనసాగుతున్న చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న నగదు వంటి వివిధ రూపాల్లో ఇరాన్ ఆస్తులు స్తంభించిపోయాయని మిడిల్ ఈస్ట్ కౌన్సిల్ ఆన్ గ్లోబల్ అఫైర్స్‌లో ఆర్థికవేత్త ఫ్రెడెరిక్ ష్నైడర్ చెప్పారు.
ఈ నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయి?
విదేశాలలో చిక్కుకుపోయిన నిధుల్లో చాలా వరకు అమెరికా వెలుపలే ఉన్నాయి. చాలా వరకు నిధులు చైనాలో ఉన్నాయి. ఇరాన్‌కు అతిపెద్ద చమురు వినియోగదారు చైనానే. 20 బిలియన్ డాలర్ల (రూ.1,90,226 కోట్ల) నుంచి 50 బిలియన్ డాలర్ల (రూ.4,75,552 కోట్ల) వరకు అక్కడ ఉంటాయని అంచనా.
ఇవి ఇరాక్‌లోనూ పెద్దమొత్తంలోనే ఉన్నాయని అంచనా. గ్యాస్, విద్యుత్ ఎగుమతులకు చెల్లింపుల రూపంలో ఇవి ఇరాక్‌లో నిలిచిపోయాయి. వీటి మొత్తం 10 బిలియన్ డాలర్ల (రూ.95,119 కోట్ల) నుంచి 15 బిలియన్ డాలర్ల (రూ.1,42,678 కోట్లు) వరకు ఉంటుందని అంచనా.
ఇరాన్ చమురు రాబడుల్లో 6 బిలియన్ డాలర్లు (రూ.57,071 కోట్లు) దక్షిణ కొరియాలో ఉన్నాయని, వీటిని 2023లో ఖతార్‌లోని అకౌంట్లకు బదిలీ చేసినట్లు అమెరికా కాంగ్రెస్ గణాంకాలు తెలిపాయి.
అయితే, సమీప భవిష్యత్తులో ఇరాన్ ఈ నిధులను పొందే అవకాశాల్లేవని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. దీంతో ఆ నిధులు దోహాలోనే నిలిచిపోయాయి.
ఇతర నిధులు భారత్, జపాన్, లక్సెంబర్గ్‌తో సహా పలు దేశాలలో ఉన్నాయి.
అమెరికా పరిధిలో ఉన్న మొత్తాలు చాలా తక్కువేనని, సుమారు 2 బిలియన్ డాలర్లే ఉన్నాయని అమెరికా కాంగ్రెస్ తెలిపింది. వాటిలో చాలా వరకు కోర్టు తీర్పులు, నష్టపరిహార దావాలతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల వీటి విడుదల అంత తేలిక కాదు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఇందులో అమెరికా పాత్రేంటి?
చాలా వరకు నిధులు అమెరికా వెలుపలే ఉన్నప్పటికీ.. సెకండరీ శాంక్షన్స్ ద్వారా వాటిపై వాషింగ్టన్ ప్రభావం ఉంటుంది.
ఈ చర్యలు కేవలం ఇరాన్‌ను మాత్రమే కాకుండా, ఆ దేశంతో వ్యాపార కార్యకలాపాలు సాగించే విదేశీ బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాయి.
ఇరాన్ నిధుల తరలింపులో సాయపడే ఏ సంస్థ అయినా అమెరికా ఆర్థిక వ్యవస్థతో సంబంధాలు కోల్పోవడం లేదా జరిమానాలను ఎదుర్కొనే ప్రమాదముంది.
దీంతో, ఇరాన్ నిధులున్న దేశాలు అమెరికా అనుమతి లేకుండా నిధుల విడుదలకు లేదా బదిలీకి వెనుకాడతాయి.
ఈ డీల్ ద్వారా ఇరాన్‌కు ఒరిగేదేంటి?
ఆ మెమోరాండం, ప్రధానంగా రెండు రకాలుగా ఆర్థిక ఉపశమనాన్ని కలిగించవచ్చు..
- షిప్పింగ్, ఇన్సూరెన్స్ (బీమా), బ్యాంకింగ్ వంటి సంబంధిత సేవలతో పాటు, ఇరాన్ చమురు, పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుమతించే మినహాయింపులు.
- స్తంభింపజేసిన లేదా పరిమితం చేసిన నిధులను పొందే అవకాశం కల్పించడం. తద్వారా ఆ డబ్బును ఎలా ఉపయోగించాలనే దానిపై ఇరాన్ సెంట్రల్ బ్యాంక్‌కు మరింత నియంత్రణ లభిస్తుంది.
ప్రాంతీయ భాగస్వాముల సహకారంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి, అభివృద్ధి చేయడానికి కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన పునర్నిర్మాణ ప్రయత్నాలను కూడా ఇది సూచిస్తుంది. ఈ కార్యక్రమం అమలు ఎలా ఉంటుందో తుది ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌లో స్పష్టత రావాల్సి ఉంది.
తాము ఇరాన్‌కు నేరుగా చెల్లింపులు చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. (ఇది ఇరాన్, ఒబామా ప్రభుత్వం మధ్య కుదిరిన 2015 అణు ఒప్పందానికి పూర్తి విరుద్ధమని ట్రంప్ ప్రభుత్వం అంటోంది). బదులుగా మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఇతర రంగాలలో పెట్టుబడులపై దృష్టి సారిస్తామని అంటోంది.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
ఆ నిధులు ఇరాన్‌కు వస్తాయా?
ఆచరణలో ఈ నిధులు లభించే అవకాశం పరిమితంగానే ఉండొచ్చని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ బోర్స్ అండ్ బజార్ ఫౌండేషన్ వ్యవస్థాకులు ఎస్ఫాండ్యార్ బాట్మాంగెలిడ్జ్ పేర్కొన్నారు.
ఇలాంటి ఏర్పాట్లు అత్యంత సంక్లిష్టమైన అడ్డంకులను ఎదుర్కొంటాయని ఆయన బీబీసీకి చెప్పారు. అంటే, ఇరాన్ నిధులను ఒక నిర్దిష్ట దేశంలో ఖర్చు చేయగలిగినప్పటికీ, వాటిని అంతర్జాతీయంగా బదిలీ చేసుకోవాలంటే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ష్నైడర్ ఒక తీవ్రమైన సమస్యను లేవనెత్తుతున్నారు, అదేంటంటే ఏ ఒప్పందమైనా ఎంతకాలం నిలబడుతుందనే దానిపై నెలకొన్న అనిశ్చితి.
కొన్ని ఆంక్షలకు అమెరికా కాంగ్రెస్ చట్టబద్ధత ఉందని, అంటే అధ్యక్షుడు వీటిని ఏకపక్షంగా పూర్తిగా తొలగించలేరు. వాటిపై తాత్కాలిక మినహాయింపులను మాత్రమే జారీ చేయగలరని ఆయన అంటున్నారు.
అందువల్ల, ఏదైనా మినహాయింపు ఇచ్చినా, అది ఎంతకాలం కొనసాగుతుందనే అనుమానాలు తలెత్తుతాయని ష్నైడర్ అన్నారు.
2015 అణు ఒప్పందం సమయంలో కూడా ఇలాంటి విధానమే పునరావృత్తమైంది. అప్పుడు ఇరాన్ కొన్ని నిధులను తిరిగి పొందింది.
అయితే, చాలా బ్యాంకులు అప్రమత్తతో వ్యవహరించాయి. 2018లో అమెరికా ఒప్పందం నుంచి వైదొలిగి, తిరిగి ఆంక్షలు విధించింది.
స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా గత వారం రిపోర్ట్ చేసింది. కానీ, వాషింగ్టన్ దీన్ని ధ్రువీకరించలేదు.
యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో కలిగిన నష్టానికి పరిహారంగా ఇరాన్‌కు చెందిన ఈ ఆస్తుల్లో కొంత భాగాన్ని అమెరికా ఉపయోగించుకుంటుందా? లేదా? అనే అంశంపైనా ఇంకా స్పష్టత లేదు.
ఆ నష్టాలను "ఇరాన్ అకౌంట్ల నుంచి సేకరించిన నిధులతో చెల్లిస్తామని" అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ జూన్ ఆరంభంలో సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.
అయితే, ఇరాన్ దీన్ని తిరస్కరించింది. తమ ఆస్తులు వాషింగ్టన్‌కు దక్కిన యుద్ధ సొమ్ముకాదు, అలాగే దాని మిత్రదేశాలకు చెల్లింపులు చేయడానికి ఉద్దేశించిన నిధి కూడా కాదని ఉప విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాదీ స్పష్టం చేశారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావమేంటి?
2024లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ విలువ 475 బిలియన్ డాలర్లుగా (రూ.45,14,929 కోట్లుగా) ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
యుద్ధ సంబంధిత ఆర్థిక నష్టాలు 300 బిలియన్ డాలర్ల (రూ.28,51,357 కోట్ల) వరకు ఉంటాయని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ సుమారు 10 శాతం మేర కుచించుకుపోయిందని పేర్కొంటున్నారు.
ఒకవేళ సగం నిధులు విడుదల చేసినా.. అవి స్వల్పకాలిక ఉపశమనాన్ని అందించగలవు.
దేశంలో విదేశీ కరెన్సీ కొరత ఏస్థాయిలో ఉందంటే.. చాలా ఆర్డర్లు నిలిచిపోయాయి లేదా తీవ్ర ఆలస్యాలను ఎదుర్కొంటున్నాయని ఇరాన్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన ఒక సభ్యుడు బీబీసీకి చెప్పారు. అలాగే, దిగుమతులు కేవలం నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు.
బిలియన్ల కొద్దీ విదేశీ కరెన్సీ అందుబాటులోకి రావడం ఇరాన్ కరెన్సీ రియాల్‌ను స్థిరంగా మార్చడానికి సాయం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, నిత్యావసర వస్తువులతో పాటు దిగుమతులకు ఆర్థిక సహాయం అందించడానికి, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికి సాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
కానీ, లోతైన నిర్మణాత్మక సమస్యలను ఇవి పరిష్కరించలేవని నిపుణులు చెబుతున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























