బలూచిస్తాన్ మహిళా ఉద్యమకారిణికి జీవిత ఖైదు విధించిన పాక్ ప్రభుత్వం... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ముహమ్మద్ ఖాజిమ్, ఫేలాన్ ఛటర్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో కొందరు ‘బలవంతంగా అదృశ్యం’ అవుతున్న తీరుకు వ్యతిరేకంగా హక్కుల కార్యకర్త మహరంగ్ బలూచ్ గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు.
తాజాగా పాక్ ప్రభుత్వం ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఆమె ప్రజలను రెచ్చగొట్టి ఒక గార్డు హత్యకు కారణమయ్యారన్న అభియోగం.
2024లో ఒక ర్యాలీ జరుగుతుండగా ఓ పారామిలిటరీ గార్డు హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేసేలా అక్కడ గుమిగూడిన జనాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ప్రభుత్వం ఆరోపించింది.
మహరంగ్ బలూచ్‌తో పాటు మరో కార్యకర్త సిబ్‌గతుల్లాను కూడా హత్య, ఉగ్రవాద అభియోగాలతో దోషులుగా తేల్చారు. మహరంగ్, బలూచిస్తాన్ యూనిటీ కమిటీ నాయకురాలు.
న్యాయవాదుల బృందంతో కలిసి కోర్టు విచారణను బహిష్కరించిన ఈ ఇద్దరు కార్యకర్తలు తమపై మోపిన ఆరోపణలను ఖండించారు.


ఫొటో సోర్స్, Getty Images
గ్వాదర్ పోర్టు సిటీలో జరిగిన నిరసనలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, దాని ఫలితంగా 30, 40 మంది కలిసి, తన సైనికుల్లో ఒకరి వాహనంపై కర్రలతో దాడి చేస్తూ రాళ్ళు రువ్వారని ఒక భద్రతాధికారి బలూచ్ పై ఆరోపణలు చేశారు.
షబ్బీర్ అహ్మద్ అనే పారామిలిటరీ పోలీసు గార్డును ఇతర గార్డులు నుంచి వేరు చేసి చనిపోయేంత వరకు అక్కడి జనం కొట్టారని ఆ అధికారి పేర్కొన్నారు.
బలూచ్ యూనిటీ కమిటీ నిర్వహించిన ఒక చట్ట విరుద్ధ సమావేశంలో ఈ ఇద్దరు కార్యకర్తలు చురుగ్గా పాల్గొని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది హత్యకు కారకులయ్యారని క్వెట్టాలోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం పేర్కొంది.
వారిద్దరికీ జీవిత ఖైదు విధించిన కోర్టు, 2 లక్షల పాకిస్తానీ రూపాయలు (సుమారు రూ.68,000) జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, బలూచ్, సిబ్‌గతుల్లాలు ఇప్పటికే పలు కేసుల్లో రెండేళ్లుగా జైలులో ఉన్నారు. ఈ తీర్పును తక్షణమే సమీక్షించాలని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ కోరింది.
ప్రాథమిక హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాలను కూడా తీవ్రవాదంతో సమానంగా పరిగణించే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందని, దాని ఫలితంగా పరిపాలనా, న్యాయపరమైన తీర్పులు ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో వస్తున్నాయని కమిషన్ పేర్కొంది.
బలూచ్ సోదరి, న్యాయవాది నాదియా బలూచ్‌తో పాటు ఈ ఇద్దరి కార్యకర్తల న్యాయవాదుల బృందం తమకు చట్టపరమైన న్యాయ ప్రక్రియను నిరాకరించారని ఆరోపిస్తూ తీర్పును తిరస్కరించింది.
ఈ తీర్పును 'ముఖం లేని కోర్టు' వెలువరించిందని, వీడియో లింక్ ద్వారా సాక్ష్యం చెప్పిన ప్రత్యక్ష సాక్షులకు క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాన్ని డిఫెన్స్ తరపు న్యాయవాదులకు ఇవ్వలేదని వారు తెలిపారు.
స్వీడన్ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ కూడా ఈ విచారణను విమర్శించారు. ఇది న్యాయానికే అవమానమని, దీన్ని అత్యంత రహస్యంగా నిర్వహించారని ఆమె అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగణిస్తోందని ఆమె ఆరోపించారు.
అభియోాలు చేసిన పక్షం దగ్గర తిరస్కరించలేని ఆధారాలు ఉన్నాయని, ఈ కేసుకు ఎలాంటి రాజకీయ ప్రేరణ లేదని బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు.
2024లో బీబీసీ 100 ఉమెన్ జాబితాలో చోటు దక్కించుకున్న మహరంగ్ బలూచ్ 2009లో తన తండ్రిని భద్రతా సిబ్బంది ఎత్తుకెళ్లారని, రెండేళ్ల తర్వాత చిత్రహింసల ఆనవాళ్లతో ఆయన మృతదేహం లభించిందనే ఆరోపణల నేపథ్యంలో ‘బలవంతపు అదృశ్యా’లకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు.
2023 చివర్లో అదృశ్యమైన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె వందలాది మహిళలతో కలిసి ఇస్లామాబాద్ వరకు సుమారు 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.
ఆమె సంస్థ బలూచిస్తాన్ యూనిటీ కమిటీ, బలూచిస్తాన్‌లో బలవంతపు అదృశ్యాలు, చట్ట విరుద్ధ హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోంది. బలూచిస్తాన్ కేంద్రంగా కొన్ని దశాబ్దాలుగా స్వయంప్రతిపత్తి కోసం పోరాటం జరుగుతోంది.
బలూచ్ మిలిటెంట్ గ్రూపులతో తమకు సంబంధాలున్నాయన్న పాకిస్తాన్ ప్రభుత్వ ఆరోపణలను బలూచిస్తాన్ యూనిటీ కమిటీ తిరస్కరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































