‘పిల్లలను వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో పెట్టినట్లు, టాయిలెట్ నీళ్లు విసిరినట్లు వీడియోల్లో ఉంది’... బెంగళూరు డే కేర్‌ సెంటర్‌పై ఆరోపణలేమిటి

క్రెష్, డే కేర్, బెంగళూరు, చిన్నారుల వేధింపులు, క్యాప్‌జెమినీ

ఫొటో సోర్స్, DCPC, Bangalore East

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

చిన్నారులను వేధించిన ఆరోపణలపై బెంగళూరులోని ఒక క్రెష్(పిల్లలను చూసుకునే డే కేర్ సదుపాయం) మహిళా సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారులను వాషింగ్ మెషీన్‌లో పెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో వారి నోట్లోకి నీరు చిమ్మడం వంటివి ఇక్కడ చేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి.

బెంగళూరు ఈస్ట్‌లోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ ఉద్యోగుల కోసం ఔట్‌సోర్స్ ఫెసిలిటిగా ఈ క్రెష్ పనిచేస్తోంది.

క్రెష్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, దర్యాప్తులో అధికారులకు పూర్తిస్థాయి సహకారమందిస్తామని ఆ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

(గమనిక: ఈ కథనంలో కలచివేసే అంశాలున్నాయి)

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఐదుగురు మహిళా సిబ్బందిని విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరారు.

ఈ విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి బీబీసీ హిందీకి వెల్లడించారు.

ఇదిలా ఉండగా "ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు నిజంగానే జరిగి ఉంటే అది అత్యంత ఆందోళనకరమైన విషయం" అని బెంగళూరు పోలీసు కమిషనర్ సీమాంత్ కుమార్ సింగ్ బీబీసీతో అన్నారు.

క్రెష్, డే కేర్, బెంగళూరు, చిన్నారుల వేధింపులు, క్యాప్‌జెమినీ

రెండు నుంచి మూడేళ్ల లోపు చిన్నారులను వేధిస్తున్నారంటూ చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని బెంగళూరు ఈస్ట్ జిల్లా బాలల సంరక్షణ విభాగం న్యాయాధికారి తిలకేశ్వర్ కుమార్ బీబీసీకి తెలిపారు.

"మరిన్ని వివరాలు పంచుకోవాలని ఫిర్యాదుదారుడిని కోరాం. ఆ తర్వాతే మాకు వీడియోలు లభించాయి" అని ఆయన చెప్పారు.

అనంతరం అదే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

‘వీడియోలో.. గదిలో నేలపై కూర్చుని చిన్నారులు ఏడుస్తుండగా వారిపై టాయిలెట్ నుంచి నీరు విసురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్నారులను వాషింగ్ మెషీన్ డ్రమ్‌లోకి విసిరేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి’ అని తిలకేశ్వర్ కుమార్ చెప్పారు.

ఉద్యోగంలో నుంచి తొలగించిన ఒక మాజీ ఉద్యోగి ప్రాథమిక ఫిర్యాదు చేశారని తిలకేశ్వర్ కుమార్ ధ్రువీకరించారు.

"ఆయనని ఎందుకు తొలగించారో మాకు తెలియదు. వీడియోలో ఇద్దరు చిన్నారులను వేధిస్తున్నట్లు కనిపిస్తోంది. చిన్నారుల తల్లిదండ్రుల గురించి కంపెనీ నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదు" అని ఆయన చెప్పారు.

ఐటీ సంస్థ ప్రాంగణంలో ఉన్న డే కేర్ క్రెష్‌పై కేసు నమోదు చేశారు.

"ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు మహిళల తరఫున ఇప్పటివరకు ఏ న్యాయవాది కూడా హాజరుకాలేదు" అని ఓ అధికారి తెలిపారు.

డే కేర్ క్రెష్‌ యజమాని సోసియెట్ బేబీ జెనరాలే ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారని, క్రెష్‌ సూపర్‌వైజర్‌ను ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నామని తిలకేశ్వర్ కుమార్ తెలిపారు.

తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని క్యాప్‌జెమినీ పేర్కొంది.

వాస్తవాలను నిర్ధరించే ప్రక్రియలో సంబంధిత అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని, ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరులోని తమ ప్రాంగణంలోని డే కేర్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశామని కంపెనీ తెలిపింది.

చిన్నారుల తల్లిదండ్రుల వివరాలను పోలీసులు, జిల్లా బాలల సంరక్షణ విభాగానికి కంపెనీ అందించలేదని అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు ఇతర కంపెనీల్లో జరగకుండా మార్గదర్శకాలు రూపొందించాలని సంబంధిత అధికారులకు తమ శాఖ లేఖ రాస్తుందని బెంగళూరు పోలీసు కమిషనర్ సీమాంత్ కుమార్ సింగ్ తెలిపారు.

జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం, చిన్నారి సంరక్షణ బాధ్యతను చూసుకునే వ్యక్తి ఆ చిన్నారిని కొట్టినా, వేధించినా లేదా మానసిక, శారీరక హింసకు గురిచేసినా, గరిష్ఠంగా మూడు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష లేదా రూ. లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)