దుబయ్: 'ప్రియుడి హత్య' కేసులో ఈ టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మరణశిక్ష తప్పదా? అసలేమిటీ కేసు?

ఫొటో సోర్స్, Detained in Dubai
- రచయిత, క్యాథరిన్ ఇవాన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
దుబయ్‌లో తన ప్రియుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఫైరింగ్ స్క్వాడ్ (సైనికులు లేదా పోలీసులు తుపాకులతో కాల్చి చంపడం) ద్వారా మరణదండన విధించే అవకాశం ఉందని ఒక మానవ హక్కుల సంస్థ తెలిపింది.
యూకేలో కెంట్‌లోని గ్రేవ్‌సెండ్‌కు చెందిన బ్రూక్ జార్జ్, ఆన్‌లైన్‌లో పరిచయమైన ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆయన్ను పొడిచి చంపినట్లు ఆమెపై కేసు నమోదైందని 'డిటైన్డ్ ఇన్ దుబయ్' అనే న్యాయ సహాయక సంస్థ పేర్కొంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తన భాగస్వామి తనపై హింసాత్మక దాడికి పాల్పడినప్పుడు, ఆత్మరక్షణ కోసం మాత్రమే కత్తి పట్టినట్లు బ్రూక్ వాదించారని ఈ సంస్థ తెలిపింది.
ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని, ఈ కేసును గృహ హింసగా పరిగణించాలని ఆ సంస్థ కోరింది.
మరోవైపు, యూఏఈలో నిర్బంధంలో ఉన్న బ్రిటిష్ మహిళకు, ఆమె కుటుంబానికి మద్దతు అందించనున్నట్లు యూకే ఫారిన్ కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ప్రకటించింది.

జాన్ లూయిస్ మాజీ ఉద్యోగి అయిన బ్రూక్‌ను జూన్ 22 తెల్లవారుజామున అరెస్టు చేశారు.
ప్రియుడిని పథకం ప్రకారం హత్య చేసినట్లు ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. యూఏఈ చట్టాల ప్రకారం, ఈ నేరం రుజువైతే ఆమెకు మరణశిక్ష పడుతుంది.
'డిటైన్డ్ ఇన్ దుబయ్' ప్రకారం.. బర్ దుబయ్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న సమయంలో, మహిళా అధికారి ఎవరూ లేకుండా కేవలం పురుష అధికారుల ముందే తన దుస్తులు బలవంతంగా విప్పించారని బ్రూక్ ఆరోపించారు. ఇది తీవ్ర అవమానకరమని, బాధగా అనిపించిందని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Detained in Dubai
ప్రవర్తనలో మార్పు
దుబయ్‌కి వెళ్లిన మొదటి పర్యటనలో, జార్జ్ ఆ సమయాన్ని "నా జీవితంలోనే అత్యంత అద్భుతమైన సమయం"గా అభివర్ణించారు.
కానీ, రెండో పర్యటనలో వేధింపులు మొదలయ్యాయని 'డిటైన్డ్ ఇన్ దుబయ్' సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాధా స్టిర్లింగ్ తెలిపారు. బ్రూక్ భాగస్వామి ఆమెను 'ఎక్కువగా నియంత్రించడం, వేధించడం' ప్రారంభించారని స్టిర్లింగ్ ఆరోపించారు. ఆయన ఆమెపై దాడి చేసి, పాస్‌పోర్ట్‌ను తన దగ్గర పెట్టుకున్నారని, ఆ తర్వాత వారి అపార్ట్‌మెంట్‌లో మరోసారి దాడి చేయడంతో ఆమె దుబయ్ వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు.
ఆ సమయంలో ఆమె "తన ప్రాణాలకు ముప్పు ఉందని భయపడి, చేతికి అందిన వంటగదిలో ఉపయోగించే కత్తితో ఆత్మరక్షణ కోసం దాడి చేశారు" అని స్టిర్లింగ్ చెప్పారు.
"బ్రూక్ రెండోసారి దుబయ్ వెళ్లిన తర్వాత, వారి సంబంధంలో మార్పు వచ్చింది. ఆ ఘటన జరగడానికి ముందురోజు ఆమె ఎప్పటిలా లేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది, మునుపటిలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపించలేదు. అందుకు గల కారణాన్నీ నాకు చెప్పలేదు" అని బ్రూక్ తల్లి థెరిసా జార్జ్ అన్నారు.
"ఆ సాయంత్రం వారు దుబయ్‌లోని ఒక బార్‌కు వెళ్లారు. ఈ ఘటన జరిగిన వెంటనే నేను బ్రూక్‌తో మాట్లాడినప్పుడు ఆమె తీవ్ర భయాందోళనతో ఉంది. నా కూతురు ఇంతగా భయపడటం నేనెప్పుడూ చూడలేదు. ఆమె ఏకధాటిగా ఏడుస్తోంది. ఆమె కళ్లలో ఒకటి బాగా వాచిపోయి, మూతపడటం నేను చూశాను" అన్నారు.
తన కూతురు క్షేమం గురించి తనకు "తీవ్ర ఆందోళన"గా ఉందని ఆమె పేర్కొన్నారు.
"ఆ రాత్రి నా కూతురు నాతో భయపడుతూ మాట్లాడింది. తనకు జరిగిన పరిస్థితుల నుంచి తప్పించుకొని, ఎలాగైనా ఇంటికి తిరిగి రావడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించిందని బలంగా నమ్ముతున్నాను" అని థెరిసా చెప్పారు.
దోపిడీ చేసే ఉద్దేశంతోనే, అబద్ధాలు చెప్పి బ్రూక్‌ను దుబయ్‌కి రప్పించి ఉండవచ్చని ఆమె సన్నిహితులు భావిస్తున్నారని రాధా స్టిర్లింగ్ చెప్పారు.
"ఆయన ప్రవర్తనలో వివరించలేని మార్పు రావడం, వన్-వే టికెట్ బుక్ చేయడం, మొదటి పర్యటనలో బికీనీతో ప్రొఫెషనల్ ఫోటో షూట్ ఏర్పాటు చేయడం, ఆమె పాస్‌పోర్ట్‌ను తన దగ్గరే ఉంచుకున్నారనే ఆరోపణలు, 'పరిస్థితులు సరిగ్గా లేవు' అని బ్రూక్ తన స్నేహితులతో చెప్పడం, అక్కడి నుంచి తప్పించుకోవాలనే ఆమె భయం అంతకంతకూ పెరగడం వంటివన్నీ వారి అనుమానాలను మరింత బలపరిచాయి" అన్నారు.
చట్టపరమైన హక్కులు
బ్రూక్ జార్జ్‌కు తన దేశ రాయబార కార్యాలయంతో (ఎంబసీ) మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, లాయర్ లేకుండానే ఆమెతో స్టేట్‌మెంట్లు ఇప్పించారని 'డిటైన్డ్ ఇన్ దుబయ్' సంస్థ తెలిపింది.
ఈ కేసు "మహిళలపై జరుగుతున్న హింస, ఆత్మరక్షణ హక్కు, సరైన చట్టపరమైన విచారణ విధానం, విదేశాలలో నిర్బంధంలో ఉన్న బ్రిటిష్ పౌరుల పట్ల ప్రవర్తించే తీరుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది" అని రాధా స్టిర్లింగ్ అన్నారు.
"విచారణ ముగిసే వరకు బ్రూక్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. తమపై జరిగిన హింస గురించి ఫిర్యాదు చేసే మహిళలను నేరస్థులుగా మార్చడం, వారిని మళ్లీ బాధితులుగా చేయడం వంటి చరిత్ర యూఏఈకి ఉందని గత రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి" అన్నారు.
విచారణ కొనసాగుతున్న సమయంలో జార్జ్‌కు "రక్షణ, సరైన వైద్య సహాయం, లాయర్ ప్రాతినిధ్యం, తక్షణ బ్రిటిష్ కాన్సులర్ సహాయం" అందించాలని 'డిటైన్డ్ ఇన్ దుబయ్' కోరింది.
యూకే ఫారిన్ కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ఒక ప్రకటనలో "యూఏఈలో నిర్బంధంలో ఉన్న బ్రిటిష్ మహిళతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం, ఆమె కుటుంబానికి మద్దతు ఇస్తున్నాం, స్థానిక అధికారులతో కూడా మాట్లాడుతున్నాం" అని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























