‘సెక్స్ వర్కర్‌ని అయినంత మాత్రాన గ్యాంగ్ రేప్ చేస్తారా?’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
(ఈ కథనంలోని కొన్ని భాగాలు మిమ్మల్ని కలచివేయచ్చు.)
‘‘నేను ఒక సెక్స్ వర్కర్‌ని. అంతమాత్రాన వాళ్ళు నాపై సామూహిక అత్యాచారం చేస్తారా?’’
దిల్లీలో స్లీపర్ బస్సులో కొంతమంది తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళ ఆరోపిస్తూ ఆమె ముందుగా అడిగిన ప్రశ్న ఇదే.
మే 11-12 తేదీల మధ్య రాత్రి 12:15 గంటల నుంచి 2:30 గంటల మధ్య జరిగిన ఈ ఘటనపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు దిల్లీ పోలీసులు చెప్పారు.
అరెస్టయిన నిందితులిద్దరూ ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు. వీరిద్దరూ దిల్లీ, బిహార్ మధ్య నడిచే స్లీపర్ బస్సులో డ్రైవర్, క్లీనర్‌గా పనిచేస్తున్నారు.
ఈ ఘటనపై మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కలత చెందిన ఆ మహిళ ఇల్లు మారారు.


ఫొటో సోర్స్, Getty Images
'డబ్బులిస్తాం రమ్మన్నారు'
"మీడియా కెమెరాలు మా ఇంటివరకూ వచ్చాయి. నాకేమైందో మా బస్తీ మొత్తానికి తెలిసి పోయింది. నేను నా కుటుంబంతో కలిసి నివసిస్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల వల్ల కొన్ని రోజుల క్రితమే నేను వ్యభిచారం చేయడం మొదలుపెట్టాను. ఇంట్లో వాళ్లకు కూడా ఈ విషయం తెలియదు. ఇప్పుడు ప్రజలు నా మీద జరిగిన దారుణం గురించి మాట్లాడటం లేదు. నా కుటుంబాన్ని పోషించడానికి నే చేస్తున్న పని గురించి మాట్లాడుతూ నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు" అని ఆ మహిళ ఏడుస్తూ బీబీసీతో చెప్పారు.
కుటుంబాన్ని పోషించడానికి కొన్ని రోజులుగా వ్యభిచారం చేస్తున్నప్పటికీ ఆ రోజు మాత్రం అందుకోసం తాను ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని ఆ మహిళ చెప్పారు.
"నేను నా సోదరుడు గది మారడంలో సాయం చేశా. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నా. బస్టాండ్‌లో బస్సు ఆగి ఉంది. కండక్టర్ నన్ను పిలిచారు. నేను బస్సు తలుపు దగ్గర నిలబడి మాట్లాడుతున్నా. నేనా పని చేయడానికి నిరాకరించా. అయినప్పటికీ ఆయన నన్ను బలవంతంగా బస్సు లోపలికి లాగారు"
"వారు సెక్స్ కోసం డబ్బులు ఇస్తామన్నారు. కానీ నేను నిరాకరించాను. ఆ బస్సులో ఐదుగురు ఉన్నారు. ఒక వ్యక్తి నిద్రపోతున్నారు. వాళ్లు నన్ను రాత్రంతా తమతోనే ఉండాలన్నారు. నేను పదేపదే నిరాకరించినా వారిలో ఇద్దరు నాపై అత్యాచారం చేశారు" అని బాధితురాలు తెలిపారు.
ఈ ఘటనపై దిల్లీ పోలీసులు భారత న్యాయ సంహితలోని (బీఎన్ఎస్)లో అత్యాచారం, సామూహిక అత్యాచారం, కామన్ ఇంటెన్షన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
"ఇద్దరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళ ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులకు ఈ విషయం తెలిసింది. పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించి, బాధితురాలికి సహాయం చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు" అని ఈ ఘటనపై విడుదల చేసిన ఒక ప్రకటనలో డీసీపీ (ఔటర్ ఢిల్లీ) విక్రమ్ సింగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, @dcpouter
పోలీసులు ఎలా స్పందించారు?
బస్సు దిగిన వెంటనే తాను పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేశానని, ఐదు నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారని మహిళ తెలిపారు.
"పోలీసులు అక్కడకు వచ్చి నేను చెప్పిందంతా విన్నారు. నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నా ఫిర్యాదు ఆధారంగా వెంటనే కేసు నమోదు చేశారు. వారు సాధ్యమైనంత సాయం చేయడానికి ప్రయత్నించారు. నాకు వైద్య పరీక్షలు చేయించారు. నా భోజనం గురించి కూడా అడిగారు" అని ఆమె చెప్పారు.
ఘటనపై సమాచారం అందిన కొన్ని గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
"నా భర్త చాలా ఏళ్లగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాకు ముగ్గురు చిన్న ఆడపిల్లలున్నారు. మా కుటుంబంలో సంపాదించే వారు ఎవరూ లేరు. నేను కొన్ని ఇతర పనులు చేయడానికి ప్రయత్నించానుగానీ నా కుటుంబాన్ని పోషించడానికి సరిపడా సంపాదించగలిగే పని ఏదీ దొరకలేదు. కొన్ని రోజుల క్రితం నేను ఈ పని ప్రారంభించాను" అన్నారు.
"ముగ్గురు ఆడపిల్లల తల్లి ఇల్లు వదిలి వ్యభిచారం చేస్తోందంటే ఆమె నిస్సహాయురాలు కావడం వల్లే. ఆమె బలహీనతను, పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకోకూడదు" అని ఆ మహిళ ఏడుస్తూ అన్నారు.
నిందితులతో తనకు ఇంతకుముందు ఎలాంటి పరిచయం లేదని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
మీడియా కవరేజీపై ప్రశ్నలు
" నా భార్య కుటుంబాన్ని పోషించడానికి ఏం చేస్తోందో మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఆమె నాకు కూడా చెప్పలేదు. కుటుంబ పోషణ కోసమే ఆమె ఇదంతా చేసింది" అని ఆ మహిళ భర్త బీబీసీతో అన్నారు.
''చాలా మంది జర్నలిస్టులు మా ఇంటికి వచ్చారు. వారు బయట పెద్ద కెమెరాలతో వీడియోలు తీయడం మొదలుపెట్టారు. నా పేరు, నా భార్య పేరు అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడందరూ మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేము అక్కడ బతకగలమా?" అని ఆయన ప్రశ్నించారు.
తనకు న్యాయం జరిగే వరకు ఈ కేసులో పోరాడతానని బాధితురాలు చెప్పారు.
"ఇది కేవలం నా భద్రతకు సంబంధించిన విషయం కాదు. ఇది నాలాంటి మహిళల భద్రతకు సంబంధించిన విషయం. వీధిలో నిలబడినప్పటికీ ప్రతి మహిళకు, ఇతర ఏ మహిళకైనా ఉండే భద్రతాహక్కే ఉంటుంది" అని ఆమె అన్నారు.
"నాకు ముగ్గురు కూతుళ్లున్నారు. నేను వారికి మంచి చదువు అందించాలనుకుంటున్నాను. నేను పడిన కష్టాలు నా కూతుళ్లు ఎప్పటికీ పడకూడదు. పోలీస్‌స్టేషన్‌కు గానీ, కోర్టుకు గానీ ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చినా వెళ్తాను. నిందితులకు కఠినమైన శిక్ష పడే వరకు నేను వెనక్కి తగ్గను" అని ఆ మహిళ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
సుప్రీంకోర్టు ఆదేశాలు
భారత్‌లో న్యాయస్థానాలు సెక్స్‌వర్కర్లకు ఇతర పౌరులతో సమానంగా మర్యాద, భద్రత, న్యాయం పొందే హక్కు ఉందని స్పష్టం చేస్తున్నాయి.
2022లో వెలువరించిన ఒక చరిత్రాత్మక తీర్పులో భారత సుప్రీంకోర్టు లైంగిక వృత్తి అనేది ఒక 'పని' అని, కేవలం ఒక మహిళ సెక్స్ వర్కర్ అయినంత మాత్రాన పోలీసులు గానీ, సమాజం గానీ ఆమె హక్కులను నిరాకరించకూడదని పేర్కొంది.
సెక్స్ వర్కర్ ఫిర్యాదును కూడా అంతే సున్నితత్వంతో నమోదు చేయాలని, ఆమె గుర్తింపు, గోప్యతను కాపాడాలని ఆదేశించింది.
"ప్రతి మహిళకు, ఆమె వృత్తితో సంబంధం లేకుండా, లైంగిక హింస, దోపిడీ నుంచి రక్షణ పొందే హక్కు ఉంది" అని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.
భారత చట్టాల ప్రకారం మహిళ సమ్మతి లేకుండా జరిగే ఏ లైంగిక సబంధాన్నయినా అత్యాచారంగా పరిగణిస్తారు. ఒక మహిళ సెక్స్ వర్కర్ అయినంత మాత్రాన ఆమె సమ్మతించిందని భావించడానికి వీలులేదు.
అత్యాచార కేసుల్లో ఒక మహిళ 'క్యారెక్టర్'ను ప్రశ్నించడం ద్వారా గానీ లేదా ఆమె వృత్తిని ఆధారంగా తీసుకుని ఆ నేరాన్ని తక్కువగా చూపించడంగానీ సరైనది కాదని సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు కూడా తీర్పుల్లో పేర్కొన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.


























