గుండు చేయించుకుంటే జుట్టు దట్టంగా మొలుస్తుందా, తెల్లవెంట్రుకలు చేత్తో పీకేస్తే మరింత ఎక్కువవుతాయా.. నిజమేంటో చదవండి

జుట్టు రాలడం, ప్రకటనలు, మహిళ, బట్టతల, పోషకాహారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

జుట్టు మన అందాన్ని పెంచడమే కాకుండా తల చర్మాన్ని ఎండ, చలి, దుమ్ము నుంచి కొంతవరకు రక్షిస్తుంది. ఆరోగ్యవంతమైన జుట్టును మంచి పోషకాహారం, హార్మోన్ల సమతుల్యత, శారీరక ఆరోగ్యానికి కూడా ఒక సూచికగా పరిగణిస్తారు.

ఒకప్పుడు మధ్య వయస్సు దాటిన తర్వాత మాత్రమే కనిపించే జుట్టు రాలే సమస్య, ఇప్పుడు ఇరవై, ముప్పై ఏళ్లకే చాలామందిని వేధిస్తోంది.

పురుషులు మాత్రమే కాదు, మహిళలు, యువత, ప్రసవం తర్వాత తల్లులు, వృద్ధులు, కొన్నిసార్లు పిల్లలు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.

దీంతో మార్కెట్‌లో "ఒకే వారంలో జుట్టు పెరుగుతుంది", "వంద శాతం గ్యారంటీ", "బట్టతలకు శాశ్వత పరిష్కారం" అంటూ ఎన్నో ప్రకటనలు కనిపిస్తున్నాయి. కానీ వీటిలో చాలావాటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

జుట్టు రాలడం అనేది ఒక వ్యాధి కాకపోవచ్చు. చాలా సందర్భాల్లో అది శరీరంలో జరుగుతున్న మరో సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి జుట్టు రాలడానికి అసలు కారణాన్ని తెలుసుకోవడం అత్యంత ముఖ్యం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జుట్టు రాలడం, ప్రకటనలు, మహిళ, బట్టతల, పోషకాహారం

ఫొటో సోర్స్, Getty Images

జుట్టు ఎలా పెరుగుతుంది?

ప్రతి వెంట్రుక ఒక చిన్న కుదుళ్ల (Hair Follicle) నుంచి పెరుగుతుంది. ప్రతి వెంట్రుక జీవితకాలం మూడు దశలుగా ఉంటుంది.

1. అనాజెన్ (Anagen)

ఇది జుట్టు పెరిగే దశ. సాధారణంగా 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మన తలపై ఉన్న వెంట్రుకల్లో సుమారు 85–90 శాతం ఈ దశలో ఉంటాయి.

2. కాటాజెన్ (Catagen)

ఇది కొద్దిరోజులు మాత్రమే ఉండే మధ్యంతర దశ. ఈ దశలో వెంట్రుక పెరుగుదల నెమ్మదిస్తుంది.

3. టీలోజెన్ (Telogen)

ఇది విశ్రాంతి దశ. ఈ దశ ముగిసిన తర్వాత వెంట్రుక రాలిపోతుంది. దాని స్థానంలో కొత్త వెంట్రుక పెరుగుతుంది.

అందువల్ల రోజుకు 50–100 వెంట్రుకలు రాలడం పూర్తిగా సహజం. దీనిని వ్యాధిగా భావించాల్సిన అవసరం లేదు.

జుట్టు రాలడం, ప్రకటనలు, మహిళ, బట్టతల, పోషకాహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెంగీ, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు.. ప్రసవం తర్వాత కొందరిలో జట్టు రాలుతుంటుంది.

జుట్టు రాలడంలో రకాలు, ప్రధాన కారణాలు

జుట్టు రాలడం అందరిలో ఒకేలా ఉండదు.

జుట్టు రాలడంలో ఇది అత్యంత సాధారణమైన రకం.

పురుషుల్లో నుదుటి వెంట్రుకలు వెనక్కి వెళ్లడం, తల మధ్య భాగంలో జుట్టు పలచబడడం, క్రమంగా బట్టతల ఏర్పడటం, మహిళల్లో తల మధ్య భాగంలో వెంట్రుకలు పలచబడటం వంటివి ఉంటాయి. మహిళల్లో పూర్తిగా బట్టతల రావడం అరుదు. ఈ రకం ఎక్కువగా జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల ప్రభావం వల్ల వస్తుంది.

2. టెలోజెన్ ఎఫ్లూవియం (Telogen Effluvium)

ఇది అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రాలే పరిస్థితి.

సాధారణంగా డెంగీ, కోవిడ్, టైఫాయిడ్, పెద్ద శస్త్రచికిత్సలు, ప్రసవం, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి వాటి తర్వాత ఇది కనిపిస్తుంది

చాలా సందర్భాల్లో ఈ పరిస్థితుల తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది.

3. అలోపీసియా ఏరియాటా (Alopecia Areata)

ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి.

శరీర రోగనిరోధక వ్యవస్థ వెంట్రుకల కుదుళ్లపై దాడి చేయడం వల్ల గుండ్రంగా ప్యాచ్‌ల రూపంలో జుట్టు ఊడిపోతుంది.

కొంతమందిలో కనుబొమ్మలు, గడ్డం కూడా ప్రభావితమవుతాయి.

4. ట్రాక్షన్ అలోపీసియా (Traction Alopecia)

జుట్టును ఎక్కువకాలం బిగుతుగా కట్టడం వల్ల వస్తుంది. గట్టిగా జడలు వేయడం, బిగుతుగా పోనీటైల్ వేయడం, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్(సవరం వంటివి) వల్ల జుట్టు ఊడిపోతుంది.

5. స్కారింగ్ అలోపీసియా (Scarring Alopecia)

ఇది అరుదైనది కానీ తీవ్రమైన పరిస్థితి. వెంట్రుకల కుదుళ్లు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఆలస్యం చేస్తే ఆ ప్రాంతంలో మళ్లీ జుట్టు పెరగదు. అందుకే వెంటనే చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించాలి.

రోజుకు వందకుపైగా వెంట్రుకలు రాలడం, జుట్టు పలచబడటం, తల చర్మం కనిపించడం, గుండ్రంగా జుట్టు ఊడిపోవడం, కనుబొమ్మలు లేదా గడ్డం మీద వెంట్రుకలు కూడా రాలిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించడం మంచిది.

జుట్టు రాలడం, ప్రకటనలు, మహిళ, బట్టతల, పోషకాహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి.

వైద్యులు చేసే పరీక్షలు

ప్రతి ఒక్కరికీ అన్ని పరీక్షలు అవసరం ఉండవు. లక్షణాలను బట్టి కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ), సీరం ఫెరిటీన్ , థైరాయిడ్ పరీక్ష, విటమిన్ డి, విటమిన్ బి12, సీరం జింక్, హార్మోన్ పరీక్షలు, ట్రైకోస్కోపీ (Trichoscopy), అరుదుగా స్కాల్ప్ బయాప్సీని వైద్యులు సూచించి దాని ఆధారంగా చికిత్స అందిస్తారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు

చికిత్స పూర్తిగా కారణంపై ఆధారపడి ఉంటుంది.

1. పోషకాహార లోపం ఉంటే ఐరన్, విటమిన్ బి12, విటమిన్ డి వంటి లోపాలను సరిచేస్తారు.

అవసరం లేకుండా విటమిన్ మాత్రలు వాడటం మంచిది కాదు.

2. మినాక్సిడిల్ (Minoxidil)

జుట్టు పెరుగుదలను పెంచే మందుల్లో దీన్ని అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

ఇది పురుషుల్లో, మహిళల్లో కొన్ని రకాల జుట్టు రాలే సమస్యల్లో ఉపయోగపడుతుంది.

కానీ ఇది వైద్యుల సలహాతోనే వాడాలి.

3. ఫినాస్టరైడ్ (Finasteride)

ప్రధానంగా పురుషుల్లో జన్యుపరమైన బట్టతల సమస్యకు ఉపయోగిస్తారు.

ఈ మందును వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి.

4. పీఆర్‌పీ (Platelet-Rich Plasma)

రోగి రక్తంలోని ప్లేట్‌లెట్లను ప్రత్యేక పద్ధతిలో వేరు చేసి తలకు ఇంజెక్ట్ చేసే విధానాన్ని పీఆర్‌పీ అంటారు.

కొంత మందిలో ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే అందరికీ ఒకేలా ఫలితం వస్తుందని చెప్పలేం.

5. లో-లెవల్ లేజర్ థెరపీ (ఎల్ఎల్ఎల్‌టీ)

కొన్ని పరిశోధనల్లో ప్రయోజనం కనిపించినప్పటికీ, ఇది ప్రతి ఒక్కరికీ అవసరం ఉండదు.

6. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్

జన్యుపరమైన బట్టతల ఉన్న కొంతమందికి ఇది మంచి ఎంపిక కావచ్చు.

ఈ చికిత్స అనుభవజ్ఞులైన ప్లాస్టిక్ సర్జన్ లేదా డెర్మటాలజిస్ట్ వద్ద మాత్రమే చేయించుకోవాలి.

జుట్టు రాలడం, ప్రకటనలు, మహిళ, బట్టతల, పోషకాహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జుట్టు పెరగడంపై సోషల్ మీడియాలో కనిపించే చాలా ప్రకటనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు.

సోషల్ మీడియాలో కనిపించే చికిత్సలు నిజమేనా?

ఈ రోజుల్లో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వందలాది వీడియోలు కనిపిస్తున్నాయి.

"ఏడు రోజుల్లో జుట్టు పెరుగుతుంది", "ఈ నూనెతో బట్టతల మాయం", "ఒక ఆకుతో కొత్త జుట్టు" వంటి ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు.

జుట్టు రాలడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల అందరికీ ఒకే మందు పనిచేయదు.

స్టెరాయిడ్ లోషన్లు ప్రమాదకరమా?

కొన్ని సందర్భాల్లో మాత్రమే వైద్యులు స్టెరాయిడ్లు సూచిస్తారు.

కానీ మెడికల్ షాపులో స్వయంగా కొనుక్కొని నెలల తరబడి వాడితే చర్మం పలచబడటం, ఇన్ఫెక్షన్లు, ఇతర దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది.

జుట్టు రాలడం, ప్రకటనలు, మహిళ, బట్టతల, పోషకాహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రొటీన్ తక్కువగా తీసుకునేవారిలో జుట్టు బలహీన పడే అవకాశం ఉంటుంది.

హెయిర్ ఆయిల్స్ నిజంగా ఉపయోగపడతాయా?

కొబ్బరి నూనె, బాదం నూనె వంటి నూనెలు తలకు తేమను అందించవచ్చు. వెంట్రుకలు చిట్లిపోకుండా కొంత రక్షించవచ్చు. కానీ జన్యుపరమైన బట్టతల లేదా తీవ్రంగా జుట్టు రాలడాన్ని అవి పూర్తిగా నయం చేయలేవు.

వెంట్రుకల్లో ప్రధానంగా కెరాటిన్ (Keratin) అనే ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ తక్కువగా తీసుకునేవారిలో జుట్టు బలహీనపడే అవకాశం ఉంటుంది.

ప్రతిరోజూ ఆహారంలో గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, చికెన్ (మితంగా), పప్పులు, శనగలు, పెసర, సోయా పదార్థాలు, ఆకుకూరలు, బాదం, వాల్‌నట్స్, నువ్వులు, తాజా పండ్లు, రంగురంగుల కూరగాయలు తీసుకోవాలి.

జుట్టు రాలడం, ప్రకటనలు, మహిళ, బట్టతల, పోషకాహారం

ఫొటో సోర్స్, Getty Images

తలస్నానం ఎలా చేయాలి?

చాలామంది ప్రతిరోజూ షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని భావిస్తారు. ఇది అపోహ.

సాధారణంగా వారానికి 2–3 సార్లు తలస్నానం చేయడం సరిపోతుంది.

చెమట ఎక్కువగా వచ్చే వారు అవసరాన్ని బట్టి తరచుగా తలస్నానం చేయవచ్చు.

ఎక్కువ వేడి నీటితో తలస్నానం చేయడం మంచిది కాదు.

మృదువైన షాంపూ ఉపయోగించడం ఉత్తమం.

హెయిర్ డ్రయర్, స్ట్రెయిట్‌నర్ వాడొచ్చు. కానీ ఎక్కువ వేడి వద్దు. ప్రతిరోజూ వాడకూడదు.

అవసరమైతే హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులు వాడాలి. వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు బలంగా దువ్వకూడదు.

జుట్టు రాలడం, ప్రకటనలు, మహిళ, బట్టతల, పోషకాహారం

ఫొటో సోర్స్, Getty Images

అపోహలు – నిజాలు

అపోహ: రోజూ షాంపూ చేస్తే జుట్టు రాలిపోతుంది.

నిజం: సరైన షాంపూ ఉపయోగిస్తే సాధారణంగా హాని ఉండదు.

అపోహ: గుండు చేయించుకుంటే జుట్టు మందంగా వస్తుంది.

నిజం: దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

అపోహ: నూనెతో బట్టతల నయం అవుతుంది.

నిజం: కాదు.

అపోహ: తెల్ల వెంట్రుకలను పీకితే మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయి.

నిజం: ఒక వెంట్రుకను పీకడం వల్ల పక్క వెంట్రుకల రంగు మారదు.

అపోహ: బయోటిన్ మాత్రలు అందరికీ అవసరం.

నిజం: బయోటిన్ లోపం చాలా అరుదు. పరీక్షలు లేకుండా సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య అయినప్పటికీ, ప్రతి ఒక్కరిలో కారణం వేర్వేరుగా ఉంటుంది. కొందరిలో అది కేవలం తాత్కాలిక సమస్య అయితే, మరికొందరిలో హార్మోన్ల మార్పులు, పోషకాహార లోపం, థైరాయిడ్ వ్యాధులు లేదా జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు.

అందుకే ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి చిట్కాను నమ్మడం కంటే, సమస్య ఎక్కువకాలం కొనసాగితే చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించడం ఉత్తమ మార్గం. సరైన కారణాన్ని గుర్తించి, శాస్త్రీయ ఆధారాలపై చికిత్స ప్రారంభిస్తే చాలామందిలో జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఖరీదైన షాంపూలు, నూనెలు లేదా సౌందర్య చికిత్సలు మాత్రమే సరిపోవు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన సమతుల ఆహారం, సరిపడ నిద్ర, మానసిక ప్రశాంతత, తలను శుభ్రంగా ఉంచుకోవడం, అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవడం.. ఇవే దట్టమైన, ఆరోగ్యవంతమైన జుట్టుకు అసలైన రహస్యాలు.

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.