విగ్గు పెట్టుకోవడం సియా గోయల్‌కు నచ్చలేదా, ఆ ట్రెకింగ్ ప్లాన్ ఎవరిది? కేతన్ తండ్రి ఏమన్నారు?

పుణే, కేతన్ అగర్వాల్ హత్య, సియా గోయల్

ఫొటో సోర్స్, PTI

    • రచయిత, బీబీసీ మరాఠీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.

కేతన్‌ను హత్య చేసిన ఆరోపణలపై సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధురిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మీడియాలో వస్తున్న కొన్ని కథనాలపై కేతన్ తండ్రి స్పందించారు.

మరోవైపు, తాము దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు సియా తరఫు న్యాయవాది పేర్కొనగా, ఈ కేసు దర్యాప్తు కోసం పలు బృందాలు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'విగ్గు గురించి ముందే చెప్పాం': కేతన్ తండ్రి

కేతన్ విగ్ (కృత్రిమ జుట్టు) ధరించడం సియా గోయల్‌కు నచ్చలేదని, అందుకే ఈ హత్య జరిగిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

దీనిపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ స్పందిస్తూ, "కేతన్ విగ్గు వాడుతున్నాడనే విషయాన్ని మేం సియా గోయల్ కుటుంబానికి ముందే చెప్పాం" అన్నారు.

"విగ్గు నచ్చకపోవడం అనేది ఒక మనిషిని చంపడానికి కారణం కాదు. ఒకవేళ విగ్గు నచ్చకపోతే పెళ్లి వద్దని చెప్పాల్సింది. నాకున్న సమాచారం ప్రకారం, లోహగఢ్ కోట ట్రెకింగ్‌కు వెళ్లాలనే ప్రతిపాదన సియాదే" అని తెలిపారు.

పుణే, కేతన్ అగర్వాల్ హత్య, సియా గోయల్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, విశాల్ అగర్వాల్ (మృతుడి తండ్రి)

"పెళ్లి నిశ్చయమైన తర్వాత, జూన్ 18న కేతన్, సియాలు లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడ జరిగిన హత్యను మొదట్లో ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. అయితే, తదుపరి దర్యాప్తులో సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు తేలింది" అని పోలీసులు తెలిపారు.

కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ, "నిందితులకు మరణశిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరాను. ఈ కేసుపై వేగంగా విచారణ జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నాకు సమాచారం అందింది" అన్నారు.

పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో అగర్వాల్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కలిశారని బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ మీడియాకు తెలిపారు.

ఉజ్వల్‌ దగ్గరికి కేసు

కేతన్ అగర్వాల్ హత్య కేసులో సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ ఉజ్వల్ నికమ్‌ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా (స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) నియమితులయ్యారు.

దీనిపై ఉజ్వల్ నికమ్ మాట్లాడుతూ, "ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రోజు మధ్యాహ్నం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నాకు ఫోన్ చేశారు. అగర్వాల్ కుటుంబ సభ్యులు ఆయన్ను కలిసి, ఈ కేసులో నన్ను ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా నియమించాలని కోరినట్లు చెప్పారన్నారు. ఈ కేసు మహారాష్ట్రకు ఒక సవాల్ లాంటిదని, ఇందులో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు. నేను అంగీకరించాను" అన్నారు.

"ప్రస్తుతం పోలీసుల విచారణ సాగుతోంది. చార్జిషీట్ దాఖలైన తర్వాతే దర్యాప్తు పురోగతిని వెల్లడించగలం. ఇది చాలా బాధ్యతాయుతమైన పని. మహారాష్ట్రలో నేను ఇలాంటి ఎన్నో కేసులను వాదించాను, ఇప్పటికీ వాదిస్తున్నాను. పూర్తి అంకితభావంతో పనిచేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతుంటారు. మహారాష్ట్రలో చట్టబద్ధమైన పాలన కొనసాగాలనే ఉద్దేశంతోనే, 'తప్పకుండా నేను ఈ కేసు చూస్తాను' అని ముఖ్యమంత్రికి చెప్పాను" అని ఉజ్వల్ నికమ్ అన్నారు.

'విచారణకు సియా సహకరిస్తున్నారు'

సియా గోయల్ తరపు న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "నేను ఇదివరకే చెప్పినట్లుగా, ఈ కేసులో దర్యాప్తు సరైన దిశలో, సక్రమంగా సాగుతోంది" అన్నారు.

"మా క్లయింట్ సియా విషయానికి వస్తే, పోలీసులు సరైన ముగింపునకు రావడానికి, అన్ని వివరాలతో చార్జిషీట్ దాఖలు చేయడానికి వీలుగా ఆమె దర్యాప్తు సంస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. కోర్టులో విచారణ సాఫీగా సాగడానికి, తుది తీర్పు రావడానికి ఇది సహాయపడుతుంది" అని తెలిపారు.

అంతకుముందు, సియాను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారని, అయితే జ్యుడీషియల్ కస్టడీ మాత్రమే ఇవ్వాలని తాము కోర్టును కోరామని సియా గోయల్ తరఫు న్యాయవాది రాజ్‌శ్రీ సకట్ చెప్పారు. కానీ, కోర్టు ఆమెకు ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించిందని, జూన్ 29న కోర్టు ముందు వాదనలను మళ్లీ వినిపిస్తామని చెప్పారు.

పుణే, కేతన్ అగర్వాల్ హత్య, సియా గోయల్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, పుణె రూరల్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ గజానన్ తోంపే

సియా సోదరుడి విచారణ

"ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ మా టీమ్‌లు పనిచేస్తున్నాయి. మేం కొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించడంతో పాటు సాక్షులను కూడా విచారించాం. వీటన్నింటి ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. చాలామందిని ప్రశ్నించాం. ఈ రోజు సియా సోదరుడిని విచారిస్తున్నాం, అలాగే కొందరు బంధువుల విచారణ కూడా కొనసాగుతోంది" అని పుణె రూరల్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ గజానన్ తోంపే చెప్పారు.

సాంకేతిక ఆధారాలు, ఘటనా స్థలంలోని పరిస్థితులు, నిందితుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దర్యాప్తు వేగం పుంజుకుందని పుణె రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ గతంలో చెప్పారు.

ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌధురిలను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

పుణే, కేతన్ అగర్వాల్ హత్య, సియా గోయల్

దర్యాప్తులో ఎలా బయటపడింది?

జూన్ 18న లోహగఢ్ కోటకు విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి లోయలో పడి కేతన్ అగర్వాల్ మరణించారు.

అనంతరం, సియా గోయల్ పోలీసులతో "కోటలో తిరుగుతుండగా కేతన్ కాలు జారి లోయలో పడిపోయారు" అని చెప్పారు. దీంతో మొదట్లో పోలీసులు ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా నమోదు చేశారు.

అయితే, కుటుంబీకుల సమాచారం, సాంకేతిక ఆధారాలు, తదుపరి దర్యాప్తు ఆధారంగా పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత రెండు ప్రత్యేక బృందాలను నియమించారు.

పోలీసుల కథనం ప్రకారం, సాంకేతిక దర్యాప్తులో ఘటన జరిగిన రోజున చేతన్ చౌధురి లోహగఢ్ పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు వెల్లడైంది. దాంతో ఈ ఘటనను హత్య కేసుగా నమోదు చేసి, సియా గోయల్, చేతన్ చౌధురిలను అరెస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)