యుక్రెయిన్‌లో ఎన్నికలకు జెలియెన్‌స్కీ ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎలక్షన్లు జరపాలని పదవి కోల్పోయిన రక్షణ మంత్రి మైఖేల్ ఫెదొరోవ్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు

ఫొటో సోర్స్, Moose Campbell/BBC
- రచయిత, డ్యాన్ జాన్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీని ప్రభుత్వంలోని అవినీతి గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మైఖైలో ఫెదొరోవ్ బీబీసీతో అన్నారు. ఇటీవలే ఆయన్ను రక్షణమంత్రి పదవినుంచి తొలగించారు.
మంత్రిగా ప్రజాదరణ పొందిన ఫెదొరోవ్ సైన్యంలో ఆధునిక మార్పులు తీసుకొచ్చారు. డ్రోన్లతో యుద్ధానికి కొత్త రూపు ఇచ్చారు. యుక్రెయిన్ సాయుధ దళాల అధిపతితో విభేదాలు రావడంతో గత నెలలో ఆయనను పదవి నుంచి తొలగించారు.
కొద్ది రోజుల కిందట మనీల్యాండరింగ్ దర్యాప్తు ప్రకటన గురించి ఫెదొరోవ్ మాట్లాడారు. సన్నిహిత వర్గంలోని అవినీతి గురించి తెలుసా అనే ప్రశ్నకు జెలియెన్‌స్కీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఫెదొరోవ్ బీబీసీతో అన్నారు.
అయితే జెలియెన్‌స్కీకి అవినీతి కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్టు తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు.
''నేను ఆయనతో కలిసి పనిచేసిన మొత్తం సమయంలో చట్టానికి లేదా నా నిజాయితీకి వ్యతిరేకంగా ఏ ఆదేశమయినా ఆయన నుంచి రావడం గానీ, ఏదైనా పని చేయాల్సిన పరిస్థితి గానీ ఒక్కసారి కూడా రాలేదు'' అని ఫెదొరోవ్ చెప్పారు.

‘ఎన్నికలు నిర్వహించాల్సిందే’
యుక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఫెదొరోవ్ మరోసారి కోరారు. యుద్ధ సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కొన్నిరోజుల క్రితం ఆయన వీడియో విడుదల చేశారు.
''ప్రజాస్వామ్యం పుతిన్‌కు బందీగా మారకూడదు'' అని ఆయన అన్నారు. అయితే తన రాజకీయ లక్ష్యాల గురించి ఫెదొరోవ్ స్పష్టంగా వెల్లడించలేదు.
ఫెదొరోవ్‌ను పదవి నుంచి తొలగించడంపై తీవ్ర నిరసనలు జరిగాయి. తర్వాత ఆయనకు మద్దతు క్రమంగా తగ్గిపోయింది. ఆయన స్థానంలో కొత్త మంత్రి నియామకం ఖరారైన తర్వాత నిరసనలు ముగిశాయి. ఎన్నికలు నిర్వహించాలన్న ఫెదొరోవ్ పిలుపుపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది.
‘పాత ఉద్యోగం గుర్తుకొస్తుందా’ అని అడిగినప్పుడు 35ఏళ్ల ఫెదొరోవ్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. రష్యాతో యుద్ధాన్ని చేస్తూ అదే సమయంలో యుక్రెయిన్ రక్షణమంత్రిత్వశాఖలో మార్పులు తీసుకురావడం చాలా తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్నదన్నారు.
2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటినుంచి యుక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉంది. దీనివల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. జెలియన్ స్కీ ఐదేళ్ల అధ్యక్ష పదవీకాలం 2024మేలో ముగిసింది.

ఫొటో సోర్స్, Reuters
‘ఎన్నికలపై చర్చించడం నా ప్రాథమిక హక్కు’
ఎన్నికలపై చర్చ ప్రారంభించడం తన నైతిక హక్కు అని ఫెదొరోవ్ అన్నారు.
''దీనిపై చర్చించడానికి మనం భయపడకూడదు. ప్రజాస్వామ్యం అంటే అదే ''. నా సొంత సమాజంలో నా ఆలోచనలను పంచుకోలేకపోతే, వాటి గురించి బహిరంగంగా మాట్లాడలేకపోతే మనం మరి దేని కోసం పోరాడుతున్నట్టు'' అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలు ఎప్పటికీ నిర్వహించకపోతే అప్పుడు మనం ఇక ప్రజాస్వామ్యదేశంగా ఉండబోం అని ఆయన అన్నారు.
గతంలో విడుదల చేసిన వీడియోలో కూడా రాజకీయ అవినీతిని ఫెదొరోవ్ ప్రస్తావించారు.
''కొన్ని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్ధం కాని పరిస్థితిల్లో ప్రజలు ఎల్లకాలం జీవించలేరు'' అని ఆయన అన్నారు.
జెలియన్‌స్కీని ఆయన నేరుగా విమర్శించలేదు. ఎన్నికలు జరిగితే జెలియెన్‌స్కీకి మద్దతిస్తారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.
కాగా ప్రస్తుత యుద్ధం సమయంలో ఎన్నికలు నిర్వహించడం యుక్రెయిన్‌కు చాలా ప్రమాదకరమని తాను భావిస్తున్నట్టు కొన్నిరోజుల క్రితం విడుదల చేసిన ప్రకటనలో జెలియెన్‌స్కీ చెప్పారు.
''ఇలాంటి యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించడం చాలా పెద్ద ప్రమాదం అని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే అది సునామీలా మారి యుక్రెయిన్‌ను చీల్చుతుంది'' అని జెలియెన్‌స్కీ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘అవినీతి గురించి అధ్యక్షుడికి తెలుసా?’
ఎన్నికలు నిర్వహించడానికి అనేక అడ్డంకులున్నాయని నిపుణులు చెబుతున్నారు.
'సైనికులు ఎలా ఓటు వేస్తారు, విదేశాల్లో ఉన్న లక్షలాదిమంది యుక్రెయిన్ శరణార్థులు ఎలా ఓటు వేస్తారు, రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాల ప్రజలు ఎలా ఓటు వేస్తారు అనే ప్రశ్నలున్నాయి. అలాగే రష్యా నుంచి తప్పుడు సమాచారా ప్రచారాల ముప్పు కూడా ఉంది' అని అంటున్నారు.
రాజకీయ అవినీతిని ప్రస్తావిస్తూ ఫెదొరోవ్ కొద్ది రోజుల కిందట వీడియో విడుదలచేశారు. ఆ వీడియో విడుదలైన మరుసటిరోజే ఎంపీలు, బ్యాంకర్లపై మనీల్యాండరింగ్ దర్యాప్తు ప్రారంభించినట్టు ప్రకటించారు.
30లక్షల డాలర్లకుపైగా నిధులను దుర్వినియోగం చేసిన ఓ పథకాన్ని అధికారులు బయటపెట్టినట్టు యుక్రెయిన్ అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంధన మంత్రి బెయిల్ చెల్లింపుల కోసం ఈ డబ్బును ఉపయోగించినట్టు చెప్పింది.
జెలియెన్‌స్కీ కార్యాలయంలో ఓ సీనియర్ అధికారి కూడా ఈ వ్యవహారంలో పాల్గొన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయన్ను పదవినుంచి తొలగించారు.
తన సన్నిహితవర్గంలో జరిగే అవినీతి గురించి జెలియెన్‌స్కీకి ఎంతవరకు తెలుసు అనే ప్రశ్నలున్నాయని ఫెదొరోవ్ చెప్పారు.
''ఆయన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి..ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నా. వీటన్నింటి గురించి తనకు తెలుసా లేదా అనే విషయాన్ని అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. నేను ఎలాంటి ఊహాగానాలు చేయదల్చుకోలేదు'' అని ఫెదొరోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘అప్పుడెందుకు మాట్లాడలేదు?’
''2019 నుంచి ఏర్పడిన ప్రతి ప్రభుత్వంలోనూ ఫెదొరోవ్ భాగంగా ఉన్నారు. కానీ ఇప్పుడాప్రభుత్వాలతో తనకు సంబంధం లేనట్టుగా ఆయన మాట్లాడడం విచిత్రంగా ఉంది. ఆ సమయంలో ఆయన నుంచి గట్టి ప్రకటనలు మనమెప్పుడూ వినలేదు'' అని అధ్యక్షుని ప్రతినిధి గతంలో బీబీసీతో అన్నారు.
రక్షణశాఖకు సంబంధించిన ఆయుధాలు, ఇతర వస్తువుల కొనుగోళ్లలోని అవినీతిని తాను తొలగించానని ఫెదొరోవ్ చెప్పారు. అయితే అవినీతి ఇప్పటికీ యుక్రెయిన్ యుద్ధక్షేత్రంలో సైనిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోందని ఆయన హెచ్చరించారు.
కొన్నివారాలుగా అధ్యక్షునితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఫెదొరోవ్ చెప్పారు. అధ్యక్షుడు వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారనడానికి తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.
''నేను అధ్యక్షునితో కలిసి పనిచేసిన మొత్తం సమయంలో చట్టానికి లేదా నా నిజాయితీకి వ్యతిరేకంగా పనిచేయాలని, వ్యవహరించాలని ఎలాంటి ఆదేశాలు నాకు రాలేదు. కాబట్టి ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తిగా ఇదే నా వ్యక్తిగత అనుభవం'' అని ఫెదొరోవ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం రూపు మార్చిన ఫెదొరోవ్
రక్షణమంత్రిగా, అంతకుముందు డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ మంత్రిగా పనిచేసిన ఫెదొరోవ్ కొత్త వ్యూహాల అమలులో కీలకపాత్ర పోషించారు. సైనికుల స్థానంలో ''డ్రోన్ల సైన్యాన్ని'' ఉపయోగించే విధానాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. దీంతో యుద్ధభూమిలో సైనికుల ప్రాణాలను కాపాడడంతో పాటు రష్యా సైనిక లక్ష్యాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, సరఫరా గిడ్డంగులపై యుక్రెయిన్ సరిహద్దుదాటి వేలకిలోమీటర్ల దూరం నుంచి దాడులు చేయగలిగింది.
యుద్ధం చేయడానికి కొత్త మార్గాలను ప్రచారం చేయడాన్ని కొనసాగిస్తానని ఫెదొరోవ్ చెప్పారు. రాబోయే కొన్ని వారాల్లో అమెరికా వెళ్లనున్నట్టు, అక్కడ ఎలాన్ మస్క్‌ను కలవాలని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ యుక్రెయిన్ విజయాల్లో కీలకపాత్ర పోషించింది. రష్యా గగనతలంలో కూడా ఈ సాంకేతికతను ఉపయోగించేలా మస్క్‌ను ఒప్పించాలని ఫెదొరోవ్ భావిస్తున్నారు. అదే సమయంలో రష్యా ప్రభుత్వం ఈ సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశం లేకుండా చూడాలని ఆయన కోరుతున్నారు.
''ప్రపంచంలోని అత్యుత్తమ టెక్ కంపెనీలు మాకు మద్దతు ఇస్తున్నాయి. ఈ యుద్ధాన్ని ముగించి మేం విజయం సాధించేందుకు అవి పెట్టుబడులు పెడుతున్నాయి. నా పదవితో సంబంధం లేకుండా వాళ్లతో సంబంధాలు కొనసాగించాలి. ఆ కంపెనీలతో కలిసి పనిచేసిన విజయవంతమైన అనుభవం నాకు ఉంది. నా దేశం కోసం వాళ్లతో సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది'' అని ఆయన చెప్పారు.
యుక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న యూకే, ఇతర దేశాల్లో అధికార యంత్రాంగాన్ని ఫెదొరోవ్ విమర్శించారు. ఆయుధాల సరఫరాలో జరుగుతున్న ఆలస్యాలకు ఈ అధికార యంత్రాంగమే కారణమని ఆయన అన్నారు.
యూకే చాలా కాలంగా యుక్రెయిన్‌కు మద్దతు ఇస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి ఆయుధాల సరఫరా కోసం యూకే 16 బిలియన్ పౌండ్లు ఖర్చు చేసింది. బ్రిటిష్ తయారీ డ్రోన్లను రష్యా లక్ష్యాలపై దాడులకు ఉపయోగిస్తున్నట్టు కొద్ది రోజుల కిందట ధ్రువీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అధ్యక్ష పదవిపై ఏం చెప్పలేను’
యూకే అందిస్తున్న సాయానికి ఫెదొరోవ్ కృతజ్ఞతలు తెలిపారు. కానీ హామీ ఇచ్చినట్టుగా యుద్ధసామాగ్రి యుక్రెయిన్‌కు అందించడంలో జరుగుతున్న ఆలస్యాలకు అధికారయంత్రాంగం, నిబంధనల చిక్కులు కారణమని ఆయన అన్నారు.
''యుద్ధం వాస్తవిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వాలు వేగంగా స్పందించడం లేదు. ఇది యూకేకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. ఇతర దేశాలు కూడా సాయం అందిస్తామని ప్రకటిస్తున్నాయి. కానీ ఆ సాయం మాకు సంవత్సరం చివరి వరకు కూడా అందడం లేదు'' అని ఆయన అన్నారు.
ఇతర దేశాల నుంచి పాత పద్ధతులు, పాత పరికరాలు తీసుకురావడం కంటే ప్రస్తుతం యుక్రెయిన్‌లో తయారవుతున్న ఆధునిక డ్రోన్ల ఉత్పత్తికి నేరుగా నిధులు ఇవ్వాలని ఫెదొరోవ్ కోరారు.
'మేం ట్యాంకులే వాడనప్పుడు వాటికి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం లేదు'' అని అన్నారు.
సకాలంలో ఆయుధాలు, పరికరాలు అందితే యుక్రెయిన్ సైనికుల ప్రాణాలే కాకుండా మరెన్నో ప్రాణాలు కాపాడవచ్చని ఆయన చెప్పారు.
''దురదృష్టవశాత్తూ మా నష్టాలు, మా రక్తం, మా సైనిక అనుభవం మీ అందరికీ ఉపయోగపడుతున్నాయి. మీరు మాకు అందించే ప్రతి సహాయానికి బదులుగా ఈ అనుభవాన్ని మీరు పొందవచ్చు'' అని ఆయన అన్నారు.
తక్షణ రాజకీయ ఆశయాలు ఏమీ తనకు లేవని ఫెదొరోవ్ చెప్పారు. అయితే భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీచేసే అవకాశాన్ని మాత్రం ఆయన పూర్తిగా కొట్టిపారేయలేదు.
''ఈ ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను మనం ఎంత త్వరగా తిరిగి ప్రారంభించగలుగుతామనే దానిపై అది ఆధారపడిఉంటుంది. నాకు ఎంత శక్తి ఉంటుంది. నా బృందాన్ని నేను కాపాడుకోగలనా, నేను అధ్యక్షపదవిని చేపట్టగలనా లేదా అని నాకు నేను ప్రశ్నించుకుని సమాధానం చెప్పుకోగలనా అనే విషయాలపై అది ఆధారపడి ఉంటుంది''
'''అవును,ఈ పదవిని మీరు బాధ్యతాయుతంగా నిర్వహిస్తారని మేం నమ్మగలం' అని ప్రజలు నాకు చెబుతారా లేదా అనేది అంతకంటే ముఖ్యమైన విషయం'' అని ఫెదొరోవ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























