ఫిఫా వరల్డ్ కప్ 2026: రూ. 8,000 కోట్లకు పైగా ప్రైజ్ మనీ, విజేతకు ఎన్ని కోట్లంటే..

ఫొటో సోర్స్, Tnani Badreddine/Defodi Images via Getty Images
- రచయిత, క్యాథరిన్ షార్ప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఫిఫా వరల్డ్ కప్ 2026 జోరుగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 48 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈసారి టోర్నమెంట్ కేవలం ఆట కోసమే కాకుండా, ప్రైజ్ మనీ విషయంలోనూ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ టోర్నీ కోసం ఫిఫా మొత్తం 871 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కేటాయించింది. అంటే, భారత కరెన్సీలో దాదాపు 8,218 కోట్ల రూపాయలు. ఫిఫా చరిత్రలో ఇదే ఇప్పటివరకు అత్యధిక మొత్తం.
ప్రారంభంలో ఫిఫా 727 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇది 2022 ఖతార్ టోర్నమెంట్ కంటే 50 శాతం ఎక్కువ.
కానీ, వరల్డ్ కప్‌లో పాల్గొనే దేశాల బహుమతి, సన్నాహక ఖర్చులను ఫిఫా ఏప్రిల్‌లో పెంచింది.
అందుకే మొత్తం ప్రైజ్ మనీ 871 మిలియన్ డాలర్లకు చేరింది.


ఫొటో సోర్స్, Liao Pan/China News Service/VCG via Getty Images
ప్రదర్శన ఆధారంగా దక్కే బహుమతి
ఈ ప్రైజ్ మనీని రెండు విధాలుగా విభజించారు. ఒకటి ప్రదర్శన ఆధారిత బహుమతి, మరొకటి ప్రదర్శనతో సంబంధం లేని ఆర్థిక సాయం.
ప్రదర్శన ఆధారంగా లభించే బహుమతి వివరాలు ఇలా ఉన్నాయి: (సుమారుగా, రూపాయల్లో)
- విజేత: 51 మిలియన్ డాలర్లు (481 కోట్ల రూపాయలు)
- రన్నరప్: 34 మిలియన్ డాలర్లు (321 కోట్ల రూపాయలు)
- మూడో స్థానం: 30 మిలియన్ డాలర్లు (283 కోట్ల రూపాయలు)
- నాలుగో స్థానం: 28 మిలియన్ డాలర్లు (264 కోట్ల రూపాయలు)
- 5 వ స్థానం నుంచి 8 వ స్థానం: 20 మిలియన్ డాలర్లు (189 కోట్ల రూపాయలు)
- 9 వ స్థానం నుంచి 16 వ స్థానం: 16 మిలియన్ డాలర్లు (151 కోట్ల రూపాయలు)
- 17 వ స్థానం నుంచి 32 వ స్థానం: 12 మిలియన్ డాలర్లు (114 కోట్ల రూపాయలు)
- 33 వ స్థానం నుంచి 48 వ స్థానం: 10 మిలియన్ డాలర్లు (95 కోట్ల రూపాయలు)
ఏ జట్టు ఎంత ఉత్తమంగా రాణిస్తే, ఆ జట్టుకు అంత ఎక్కువ బహుమతి లభిస్తుంది.

ఫొటో సోర్స్, Liao Pan/China News Service/VCG via Getty Images
ప్రతి జట్టుకు దక్కే కనీస మొత్తం
ప్రదర్శనతో సంబంధం లేకుండా ప్రతి జట్టుకు కచ్చితంగా లభించే ఆర్థిక సహాయం వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రొడక్షన్ బడ్జెట్: ప్రతి జట్టుకు 2.5 మిలియన్ డాలర్లు (23 కోట్ల రూపాయలు)
గ్రూప్ కంట్రిబ్యూషన్ : 16 మిలియన్ డాలర్లు (151 కోట్ల రూపాయలు)
ఈ విధంగా ప్రతి జట్టుకు కనీసం 12.5 మిలియన్ డాలర్లు అందుతాయి. ఇందులో 10 మిలియన్ డాలర్ల (95 కోట్ల రూపాయల) క్వాలిఫికేషన్ ఫీజు కూడా కలిసి ఉంది.
ప్రొడక్షన్ బడ్జెట్(సన్నాహక ఖర్చుల) కోసం ఇచ్చే మొత్తాన్ని జట్ల ట్రైనింగ్ క్యాంప్‌లు, టోర్నమెంట్‌కు ముందు చేసే ప్రయాణాల కోసం కేటాయిస్తారు. ఫిఫా నిబంధనల ప్రకారం 'టీమ్ కాంట్రిబ్యూషన్' అంటే జట్టు ఖర్చులకు సహాయం చేయడం, టిక్కెట్ల సంఖ్యను పెంచడం.
ప్రయాణాలు, ఏర్పాట్లు, కార్యాలయ పనుల వంటి వరల్డ్ కప్ ఖర్చుల విషయంలో ధనిక, పేద దేశాల మధ్య వ్యత్యాసాలను తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఫొటో సోర్స్, Jose Breton/Pics Action/NurPhoto via Getty Images
తొలిసారి 48 జట్ల మధ్య పోటీ
వరల్డ్ కప్ ఫుట్‌బాల్ చరిత్రలో మూడు దేశాలు కలిసి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ పోటీలను అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ మూడు దేశాలలోని 16 నగరాల్లో 104 మ్యాచ్‌లు పూర్తయిన తర్వాతే వరల్డ్ కప్ విజేత ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది.
ఈ నిర్వహణతో, వరల్డ్‌కప్‌కు మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా మెక్సికో నిలిచింది. అంతకుముందు 1970, 1986 వరల్డ్ కప్ పోటీలను మెక్సికో విజయవంతంగా నిర్వహించింది.
ఫుట్‌బాల్ ప్రపంచంలో అగ్రస్థానం కోసం జరిగే ఈ మహా సంగ్రామంలో, ప్రపంచవ్యాప్తంగా 48 జట్లు తలపడటం ఇదే మొదటిసారి. గత ఏడు వరల్డ్ కప్ టోర్నమెంట్‌లలో ప్రపంచ అత్యుత్తమ 32 జట్ల మధ్యే పోటీ జరిగేది.
ఈసారి ప్రపంచవ్యాప్తంగా అదనంగా 16 దేశాలకు వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. గత వరల్డ్ కప్‌లోని 64 మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఈసారి కనీసం 600 కోట్ల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను వీక్షిస్తారని ఫిఫా అంచనా వేస్తోంది. అంటే నాలుగేళ్ల కిందట ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్ వీక్షకుల కంటే వంద కోట్లు ఎక్కువ.
వరల్డ్‌కప్ 23వ ఎడిషన్‌లో - కేప్ వర్డే, కురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ ఫుట్‌బాల్ జట్లు తొలిసారి అరంగేట్రం చేయబోతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























