పత్రికా స్వేచ్ఛకు కొలమానాలేంటి, భారత్‌లో మీడియా స్వేచ్ఛపై వివాదం దేనికి?

ఫొటో సోర్స్, Getty Images/@HelleLyngSvends
- రచయిత, షేక్ అన్సారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
'పత్రికా స్వేచ్ఛలో అగ్రగామిగా ఉన్న నార్వే జర్నలిస్ట్‌లు అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానమివ్వరు'' అంటూ నార్వే జర్నలిస్టు ప్రధాని మోదీని ప్రశ్నించడం, తదుపరి జరిగిన విదేశాంగ మంత్రిత్వశాఖ మీడియా సమావేశంలోనూ సదరు జర్నలిస్ట్ భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు తనకు స్పష్టమైన సమాధానం కావాలని అడగడం తదితర పరిణామాలు భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తన ప్రశ్నలకు సమాధానమివ్వనందుకు నార్వే జర్నలిస్టు హెలే లింగ్.. ఎక్స్‌లో ఆక్షేపణ తెలిపారు.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ పాలస్తీనా, యూఏఈ, క్యూబాలతో పోటీపడుతూ 157వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
దీంతో భారత్‌లో నిజంగానే పత్రికా స్వేచ్ఛ ప్రమాదకర స్థాయిలో ఉందా అనే చర్చ మొదలైంది.
దీనిపై పత్రికారంగ నిపుణులు ఏమంటున్నారు? అసలింతకీ పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటి? ఈ 'స్వేచ్ఛ'కు ప్రమాణాలేంటి?


ఫొటో సోర్స్, Getty Images
గూటెన్‌బర్గ్ నుంచి గూగూల్ దాకా...
అచ్చు యంత్రం కొనుగొన్నప్పటి నుంచే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడానికి బీజం పడిందినే చెప్పాలి.
జోహన్నెస్ గూటెన్‌బర్గ్ ముద్రణా యంత్రాన్ని కనుగొనడం అప్పటి అధికార నిర్మాణాలను సవాలు చేసింది. బైబిల్‌ను ఎక్కువమందికి చేరవేయడానికి చర్చి ఈ సాంకేతికతను స్వాగతించినప్పటికీ, చర్చిని విమర్శిస్తూ కరపత్రాల ముద్రణకు కూడా ఇది పనికొస్తుందని త్వరగానే గ్రహించింది.
దీంతో 1557లో పోప్ పాల్ -IV కాలంలో నిషేధిత పుస్తకాల జాబితా విడుదలైంది. స్థానిక బిషప్ అనుమతి ఉంటేనే పుస్తకాలను ముద్రించాలనే నియమం పెట్టారు. లేదంటే పుస్తక రచయితకు ప్రాణసంకటమే.
దీనిపై జాన్ మిల్టన్ 1644లో అరియోపాగిటికా అనే గ్రంథంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు కోసం డిమాండ్ చేశారు. ఈ స్వేచ్ఛను ఆయన సహజసిద్ధమైన హక్కు అని వాదించారు. ఈయన ఆలోచనలే తదనంతరం ఫ్రెంచ్ విప్లవ మానవ హక్కుల ప్రకటన (1791), అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణకు పునాదిగా నిలిచాయి.
ఇక రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక, ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తన తొలి సమావేశంలోనే 59(1) తీర్మానాన్ని ఆమోదించింది. ఇది సమాచార స్వేచ్ఛను ప్రాథమిక మానవహక్కుగా, అన్ని రకాల స్వేచ్ఛలకు మూలస్తంభంగా ప్రకటించింది.
సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ప్రభుత్వాలు స్వేచ్ఛాయుత సమాచార ప్రసార, ప్రచురణలకు అనుమతిస్తూనే అనేక మెలికలు పెట్టడం మొదలుపెట్టాయి. వీటిల్లో దేశభద్రతను ప్రధాన అంశంగా మార్చాయి. అలాగే అధికారిక రహస్యాలు పేరుతో పారదర్శకతకు అవకాశం లేకుండా చేశాయి.
ఈ క్రమంలో పత్రికాస్వేచ్ఛను నిర్థరించే అంశాలు కీలకంగా మారాయి. వీటి నిర్థరణ కోసం రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ సంస్థ 5 అంశాలను ప్రామాణికంగా తీసుకుంది.
''ప్రజాప్రయోజనాల కోసం జర్నలిస్టులు వ్యక్తిగతంగా గానీ, సామూహికంగా గానీ ఎలాంటి రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన, సామాజిక ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా వార్తలను స్వేచ్ఛగా సేకరించి, ప్రసారం, ప్రచారం చేయగలగడమే పత్రికా స్వేచ్ఛ' అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ పేర్కొంది.
ప్రజాస్వామిక సూత్రాల ప్రకారం నడుచుకుంటామని చెబుతున్న ఈ సంస్థ 1985లో ఫ్రాన్స్‌లోని మాంట్పెల్లియర్ నగరంలో పురుడుపోసుకుంది.
ఇది ప్రపంచంలోని 180 దేశాలకు ర్యాంకులు ఇస్తుంది.
ఆయా దేశాలలోని జర్నలిస్టులకు లభిస్తున్నస్వేచ్ఛను అనుసరించి ఈ ర్యాంకులు ఉంటాయి. ఇది ఆయా దేశాలు, లేదా ప్రాంతాలలో రాజకీయ పరిస్థితులు, మీడియా బహుళత్వం, మీడియా స్వతంత్రత, చట్టపరమైన నిబంధనల నాణ్యత, జర్నలిస్టుల భద్రత వంటి అంశాలను అంచనా వేస్తూ అక్కడి మీడియా స్వేచ్ఛను కళ్లకుకట్టే తాజాచిత్రాన్ని చూపుతామని ఈ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది.
పత్రికా స్వేచ్ఛ సూచి 2026ను కూడా రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్డ్స్ విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ గత పాతికేళ్ల కంటే దిగజారిందని పేర్కొంది.
వార్తా ప్రపంచంలో స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉందో 5 విభిన్న అంశాల ఆధారంగా నిర్థరించి, తదనుగుణంగా ఆయా దేశాలకు ‘‘వెరీ సీరియస్’’ నుంచి ‘‘గుడ్’’ వరకు ర్యాంకులు ఇస్తుంది. ఈ సూచీని 2002లో మొదలుపెట్టినప్పటికీ తొలిసారిగా 2026లో 180 దేశాలలో సగానికి పైగా 52.2% ‘డిఫికల్ట్’’ నుంచి ‘‘వెరీసీరియస్’’ విభాగంలోకి చేరాయి. 2002లో ఇది 13.7 శాతంగా ఉంది.
మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు చట్టాలు ఉన్న నార్వే ఈ ర్యాంకింగ్‌లో మొదటిస్థానంలో ఉంది.
సంఘర్షణల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఇరాక్, సూడాన్, యెమెన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, సూడాన్, దక్షిణ సూడాన్‌లో మీడియా స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం ఉంది.
ఇక ఈ జాబితాలో చివరి మూడుస్థానాల్లో ఉన్న చైనా, దక్షిణ కొరియా, ఎరిత్రియా అక్కడి నియంతృత్వ పోకడల కారణంగా వాటి స్థానాల్లో ఎటువంటి మార్పు రాలేదు.
ఇక భారత్ వెరీ సీరియస్ కేటగిరీ కింద 157వ ర్యాంకులో ఉంది. అయితే ఈ ర్యాంకింగులను ఇండియా ఎప్పటికప్పుడు తిరస్కరిస్తోంది.
ఈ సంస్థ అడిగే ప్రశ్నలు సర్వే నిర్వహణలో పారదర్శకత లేదని భారత్ అంటోంది. డేటా ఆధారంగా కాకుండా, వ్యక్తుల అభిప్రాయాలు, దృక్పథాల ఆధారంగా దీన్ని రూపొందించారని చెబుతోంది. ‘శాంపిల్ సైజు చాలా చిన్నది’ అని 2020లో నీతి అయోగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో వీరి వ్యవహారశైలి వేరుగా ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ
బ్రిటిష్ పాలనా సమయంలో భారత్‌లోని వార్తాపత్రికలపై ఎన్నో నియంత్రణలు ఉండేవి.
స్వాతంత్య్ర ఉద్యమంలో పత్రికలు ముఖ్యపాత్ర పోషించాయి.
భారత్‌లో ప్రచురితమైన మొట్టమొదటి వార్తాపత్రిక హిక్కీస్ బెంగాల్ గెజిట్. ఇది 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఐరీష్ జర్నలిస్టు కలకత్తాలో స్థాపించిన ఒక ఆంగ్ల వారపత్రిక. అయితే 1782లో ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని అణచివేసింది.
తరువాత బ్రిటిష్ ప్రభుత్వం వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878ను తీసుకువచ్చింది. దీన్నే గ్యాగింగ్ యాక్ట్ అనేవారు. ముద్రణా సంస్థల ఏర్పాటు, అవి ఏం ముద్రిస్తున్నాయి, సంబంధిత లైసెన్సులు వంటి వాటిని ప్రభుత్వమే ఈ చట్టం ప్రాతిపదికన క్రమబద్దీకరించింది.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏం ప్రచురించినా దాన్ని రాజ్య ఉల్లంఘనగా పరిగణించేవారు.

ఫొటో సోర్స్, Facebook/Gauri Lankesh
ఫోర్త్ పిల్లర్ కుంగుతోందా?
పత్రికా స్వేచ్ఛ అనే పదం రాజ్యాంగంలో ప్రత్యేకంగా లేకపోయినా, కోర్టులు దాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా గుర్తించి తదనుగుణంగా అనేక సందర్భాలలో రక్షణ కల్పించాయి.
2025-26 సంవత్సరానికి పత్రికా స్వేచ్ఛ సూచికను రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసింది.
దీనిప్రకారం నార్వే మొదటిస్థానంలో ఉండగా, ఎరిట్రియా 180వ స్థానంలో ఉంది. భారత్ 157లో స్థానంలో ఉంది.
గడిచిన 15 ఏళ్లలో భారత్ పత్రికాస్వేచ్ఛ ర్యాంకింగ్స్‌లో దిగజారుతోంది. 2009లో 105వ స్థానంలో ఉండగా, 2024లో 159, 2025లో 151గా ఉండగా, తాజాగా157లోకి వచ్చింది.
ప్రపంచంలో మీడియా ప్రొఫెషనల్స్‌కు ప్రమాదకరంగా మారిన దేశాలలో భారత్ ఒకటని రిపోర్టర్ వితవుట్ బోర్డర్స్ పేర్కొంది. ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులను ఆన్లైన్లో వేధించడం సాధారణంగా మారిందని, బెదిరించడం, భౌతికదాడులు, నేర విచారణలు, అరెస్టులు నిత్యకృత్యంగా మారాయాని పేర్కొంది.
2017లో గౌరీ లంకేష్ అనే స్వతంత్ర పాత్రికేయురాలు బెంగళూరులో తన సొంత ఇంటి వద్దే కాల్పులకు గురై మరణించినప్పుడు ‘‘ఇది పత్రికా స్వేచ్ఛపై క్రూరమైన దాడి’ అని ఎడిటర్స్ గిల్డ్ వ్యాఖ్యానించిందని బీబీసీ రిపోర్టు చేసింది.
అలాగే ఖనిజాల నిలయమైన ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జర్నలిస్టుగా పనిచేసిన చంద్రాకర్ 2025 జనవరిలో హత్యకు గురయ్యారు. ఆయన ఎవరి అవినీతి గురించి అయితే కథనం రాశారో ఆ వ్యక్తి ఇంటి ప్రాంగణంలోని సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైంది. ఈ హత్య స్వతంత్ర జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తు చేసింది.

ఫొటో సోర్స్, k. srinivas
భారత్‌లో మీడియా స్వేచ్ఛ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉంటుందని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు స్వతంత్ర మీడియాపై ఓ అప్రకటిత సెన్సార్ షిప్ అమలవుతోందనే అభిప్రాయం సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులలో ఉంది.
‘‘మన దేశంలో పత్రికాస్వేచ్ఛ ఎలా ఉందో మనకు తెలియదా, ప్రత్యక్షంగానే చూస్తున్నాం కదా వేరేవరో వచ్చి చెప్పాలా? పైగా 2025లో ఇండియా స్థానం 151గా ఉండింది. ఆ ర్యాంకింగ్ మీద అప్పుడెందుకు చర్చ జరగలేదు?’’ అన్నారు ఆంధ్రజ్యోతి దినపత్రిక పూర్వ సంపాదకులు, విశ్లేషకులు కె.శ్రీనివాస్.
‘‘ఈ ఏడాది మన ర్యాంకింగ్ ఇంకా పడిపోయి 157 కు చేరింది. నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న నార్వే నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ మన ప్రధానిని నిలదీసేసరికి, ఈ అంతర్జాతీయ ర్యాంకింగులే పెద్ద కుట్ర అన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టారు’’ అన్నారు శ్రీనివాస్.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వారు తమ ర్యాంకింగ్స్‌కు ప్రమాణాలు కూడా చెబుతున్నారు కదా అని ఆయన అన్నారు.
‘‘కఠినమైన, క్రూరమైన చట్టాలను ప్రయోగించడం, మీడియా మీద పరోక్ష ఒత్తిడులు, భౌతిక దాడులు, కేసులు- ఇవన్నీ కలిసి ఇండియాలో పాత్రికేయుల పని దుర్భరం చేస్తున్నాయని ఆ సంస్థ చెప్పింది కదా’’ అన్నారు శ్రీనివాస్.
‘‘అవన్నీ నిజాలో కాదో మనకు ప్రత్యక్షంగా తెలుస్తోంది కదా? వేరెవరో వచ్చి చెప్పాలా?’’ అన్నారు శ్రీనివాస్.

ఫొటో సోర్స్, Dilip Reddy
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందా? అనే బీబీసీ ప్రశ్నకు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి ఏం చెబుతారంటే..
"భారత రాజ్యాంగలో పత్రికా స్వేచ్ఛ గురించిన ప్రస్తావనే లేకపోయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్19(1)(a) ద్వారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నీడలో పత్రికా స్వేచ్ఛ కూడా ఉంది. కానీ అంతే స్ఫూర్తితో, అంతే స్వేచ్ఛగా ఆ హక్కుని వినియోగించుకునే పరిస్థితి క్రమంగా బలహీనపడుతూ వస్తోంది. పత్రికా యాజమాన్యాలు వారి ఇష్టానుకూలంగా వ్యవహరించడం, అది రిపోర్టర్ స్వేచ్ఛ అని భావించకపోవడం, కార్పోరేట్ శక్తులు మీడియాను గుప్పిట్లో ఉంచుకుని పాలకుల ప్రయోజనాలకి అనుకూలంగా వ్యవహరించడం వంటి పరిణామాలవల్ల పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది తప్ప రాజ్యంగం మాత్రం భద్రత కల్పించింది" అన్నారు దిలీప్ రెడ్డి
‘‘60,70వ దశకాల్లో కూడా పత్రికా స్వేచ్ఛ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రాజకీయాలు దారితప్పాయో, స్వార్థం పెచ్చుమీరిందో, సమాజంలో అవలక్షణాలు బలపడ్డాయో ఫోర్త్ పిల్లర్ అని పిలిచే మీడియాలో కూడా డైల్యూషన్ రావడంతో ప్రమాదంలో పడింది" అని దిలీప్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























