'2022లో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా’ : సౌదీ కఠిన చట్టాలు తెలుసుకోకపోతే ప్రమాదమే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే పౌరులు ఆ దేశ కఠినచట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వివిధ దేశాల రాయబార కార్యాలయాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.
ఉదాహరణకు సౌదీ అరేబియా సైబర్ నేరాల నివారణ చట్టం ప్రకారం వ్యక్తుల అనుమతి లేకుండా ఫోటోలు తీయడం నేరం.
ఇలా చేసిన నేరానికి ఐదు లక్షల సౌదీ రియాల్స్ జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుంది. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఫోటోలు తీసినా, ఆన్లైన్లో పోస్టు చేసినా కూడా నేరమే.
మరికొన్ని నేరాలకు కొరడా దెబ్బలు, జైలు శిక్ష, చివరకు మరణ శిక్ష కూడా విధించవచ్చు.
"సౌదీ అరేబియా స్థానిక చట్టాల గురించి తెలియకుండా ఉల్లంఘిస్తే వెంటనే మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరించవచ్చు, అరెస్టు చేయవచ్చు, జైలులో కూడా పెట్టవచ్చు" అని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిస్తోంది.

ఈ ఏడాదిలో ఇప్పటికే దాదాపు 100 మందికి ఆ దేశం మరణ శిక్ష విధించిందని అమ్నేస్టీ ఇంటర్నేషనల్ సంస్థ పేర్కొంది. ఇంకా మాదక ద్రవ్యాల కేసులో అనేకమంది మరణదండన శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది.
మరణ శిక్ష పడిన విదేశీయులు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన ఎదుర్కొంటున్నారని, మరణశిక్ష అమలు చేయడంలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ ఇచ్చిన నివేదిక చెబుతోంది.
మక్కా మసీదులో అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలతో బంగ్లాదేశ్ దంపతులకు మరణ శిక్ష వేసిన తర్వాత సౌదీ అరేబియా కఠిన చట్టాలు మరోసారి చర్చనీయాంశ మయ్యాయి.
ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు
సౌదీ అరేబియాలో 2022 మార్చి 12న ఒక్క రోజే 81 మందికి మరణ శిక్ష అమలు చేశారు. "హత్య, ఉగ్రవాదం, భద్రతాదళాలపై, ఆర్థిక కేంద్రాలపై దాడులు, ఆయుధాల అక్రమ రవాణా" వంటి నేరాలకు పాల్పడటమే దీనికి కారణమని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
"ఇస్లామిక్ చట్టాలు(షరియా) కఠినంగా అమలు చేస్తున్న ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా. స్థానిక సంస్కృతులను, ఆచారాలను, చట్టాలను, మతాన్ని గౌరవించాలి. అయితే అవి ఎవరికీ అభ్యంతరకరంగా ఉండకూడదు. బ్రిటన్‌లో చట్టవిరుద్ధం కాని పనులు కూడా సౌదీలో చేస్తే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది." అని సౌదీ అరేబియా వెళ్లే తన పౌరులకు బ్రిటన్ సూచించింది.
భారత్ సహా పలు దేశాలు కూడా ఇలాంటి సూచనలు జారీ చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
'సైగలు చేస్తే చేటే'
సౌదీ అరేబియా కఠిన నిబంధనలకు అనుగుణంగా కొన్ని పనులకు దూరంగా ఉండాలని తమ దేశ పౌరులకు బ్రిటిష్ ప్రభుత్వం సూచించింది.
- బహిరంగ ప్రదేశాల్లో ప్రేమను చూపించడం
- దూషించడం, అసభ్యకరమైన సైగలు చేయడం
- ఎక్కువ శబ్ధంతో సంగీతం వినడం
- విమర్శనాత్మకమైన రాజకీయ విమర్శలు, ప్రజా శాంతికి భంగం కలిగేలా ప్రవర్తించడం
" దేశ మీడియాను సౌదీ అరేబియా అధికారులు నియంత్రిస్తున్నారు. వివిధ నేరాలకుగాను పాత్రికేయులు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంది’’ అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో పేర్కొంది.
"ఇక్కడ ఆందోళనలు, ప్రదర్శనలు చట్టవిరుద్ధం. అధికారులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారనే అభియోగాలపై అరెస్టుకు, విచారణకు, జైలుశిక్షకు గురవుతారు"
అమెరికా తన పౌరులకు ఏం చెప్పింది?
సౌదీ అరేబియాలో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఈ చర్యలకు గురి కావచ్చని యూఎస్ రాయబార కార్యాలయం తెలియజేస్తోంది:
- ఎలాంటి విచారణ లేకుండా సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం
- దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడం, వెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకోవడం
- న్యాయవాది లేకుండానే మిమ్మల్ని విచారిస్తారు
- నేరాన్ని ఒప్పకుంటున్నట్టు బలవంతంగా పత్రాలపై సంతకాలు చేయించడం
- కొట్టడం, కొరడాలతో కొట్టడం లాంటి శారీరక శిక్షలకు గురి చేయడం
చాలా నేరాలకు మరణ శిక్ష విధించవచ్చు.
క్రిమినల్ కేసుల్లో ఏటా అనేక మందికి మరణశిక్ష అమలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వలస కార్మికుల నిబంధనలు
భారత ప్రభుత్వ డేటా (డిసెంబర్, 2025) ప్రకారం 27,47,551 మంది భారతీయ కార్మికులు సౌదీ అరేబియాలో పని చేస్తున్నారు.
వలస కార్మికులను క్రమబద్ధీకరించేందుకు సౌదీ అరేబియా కఫాలా(స్పాన్సర్షిప్) విధానాన్ని అనుసరిస్తుంది.
"సౌదీ అరేబియాలోకి ప్రవేశించే ఏ విదేశీ కార్మికుడైనా/ కార్మికురాలైన ఖచ్చితంగా సౌదీ పౌరుడు లేదా సంస్థ స్పాన్సర్ చేసిన కఫీల్ (స్పాన్సర్షిప్) కలిగి ఉండాలి. ఉద్యోగ ఒప్పందం ఉన్నంత వరకు ఆ కార్మికుడు/కార్మికులు ఆ స్పాన్సర్ బాధ్యతలోనే ఉండాలి" అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
- సౌదీ అరేబియాలో విదేశీయులు ఎప్పుడూ తమ వెంట గుర్తింపు కార్డును ఉంచుకోవాలి. లేకపోతే జరిమానా లేదా జైలు శిక్ష పడవచ్చు.
- మీరు పర్యటకులు అయితే మీతో ఎప్పుడూ పాస్‌పోర్ట్, వీసా కాపీలు ఉంచుకోవాలి.
- మీరు సౌదీ అరేబియా పౌరులు అయితే మీతో నివాస గుర్తింపు కార్డు(ఇఖామా) ఉంచుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
దుస్తుల విషయంలో నిబంధనలు
గతంలో మాదిరిగా విదేశీ మహిళలు కూడా శరీరం కనిపించకుండా నల్లటి అబయా ధరించడం, తలను పూర్తిగా కప్పుకోవడం ఇప్పుడు తప్పనిసరికాదు.
అయితే దుస్తులకు సంబంధించిన సాధారణ నిబంధనలు మాత్రం అమల్లో ఉంటాయి.
స్త్రీ, పురుషులు ఇద్దరూ బహిరంగ ప్రదేశాల్లో భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా వదులైన దుస్తులు ధరించాలి.
బిగుతైన దుస్తులు, రాజకీయ, మతపరమైన నినాదాలు ఉన్న దుస్తులు ధరించడం నిషేధం.
అసభ్యకరమైన పదాలు, చిత్రాలు, చిహ్నాలు ఉన్న దుస్తులను ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరగడం శిక్షార్హమైన నేరమని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. దీనికి జరిమానా విధిస్తామని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీలోకి మతపరమైన పుస్తకాలు తీసుకెళ్లొచ్చా?
సౌదీ అరేబియాలోని బహిరంగ ప్రదేశాల్లో ఇస్లాం మినహా ఏ మతానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం చట్టవిరుద్ధం. ముస్లిమేతర మత కార్యక్రమాలను ప్రైవేటుగా చేసుకోవడానికి సౌదీ అరేబియా అధికారులు అంగీకరిస్తున్నారు.
ఇస్లాం, ఖురాన్ సహా మత పెద్దలను బహిరంగంగా కానీ, సోషల్ మీడియాలో కానీ విమర్శించడానికి సౌదీ అరేబియా అధికారులు అనుమతించరు.
ఇలాంటి నేరాలకు జైలు శిక్షలు (10 నుంచి 20 ఏళ్ల అంతకంటే ఎక్కువ ) భారీ జరిమానాలు విధిస్తారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో మరణ శిక్ష కూడా విధించవచ్చు.
మత మార్పిడులకు యత్నించడం చట్టవిరుద్ధం.
వ్యక్తిగత అవసరాల కోసం ఇతర మతాల పుస్తకాలను తీసుకోవచ్చు. అయితే భారీ ఎత్తున మతపరమైన పుస్తకాలను దిగుమతి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
'మందులు తీసుకెళ్లాలన్నా అనుమతి కావాల్సిందే'
మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలను సౌదీ అరేబియా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. చిన్న మోతాదులో డ్రగ్స్ లభించినా ఐదేళ్ల జైలు శిక్ష, 30వేల సౌదీ రియాల్స్(దాదాపు 7.5 లక్షలు)వరకు జరిమానా వేస్తారు.
మాదక ద్రవ్యాల వ్యాపారం, అక్రమ రవాణాకు మరణ శిక్ష కూడా విధించవచ్చు.
"మాదక ద్రవ్యాలు, మద్యం, పంది మాంసం కలిగిన ఆహారం, గసగసాలు, ఖాత్ ఆకులు, గుట్కా, పాన్ మసాలా, అశ్లీల వస్తువులు, మంత్రతంత్రాలకు సంబంధించిన వస్తువులను సౌదీలో నిషేధించారు." అని రియాద్‌లోని రాయబార కార్యాలయం తెలిపింది.
డాక్టర్ సూచించిన సాధారణ మందులను కూడా అరేబియాలోకి తీసుకెళ్లాలన్నా, అక్కడి నుంచి తీసుకురావాలన్నా తగిన అనుమతి అవసరం.
రోగులు తమ కోసం మందులు తెచ్చుకోవచ్చు. గరిష్టంగా 30 రోజులు లేదా, వారు ఆ దేశంలో ఉన్నంత కాలానికి(ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే అదే వర్తిస్తుంది) మించకూడదు. దీని కోసం కూడా వారు తగిన వైద్య పత్రాలు చూపించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
'స్వలింగ సంబంధాలు నిషేధం'
"సౌదీ అరేబియాలో స్వలింగ సంపర్కం పూర్తిగా నిషేధం. ఇలాంటి కేసుల్లో శిక్షలు తీసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ, స్థానిక చట్టాలు, ఆచారాలపై అవగాహన కలిగి ఉండాలి. బహిరంగ ప్రేమలకు దూరంగా ఉండాలి" అని బ్రిటీష్ రాయబార కార్యాలయం సూచించింది.
సౌదీ అరేబియా లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం సాధారణ లైంగిక వేధింపుల కేసుల్లో రెండేళ్ల జైలు శిక్ష, లక్ష సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తారు.
బాధితురాలు మైనర్ అయినా, వైకల్యం కలిగి ఉన్నా, నిందితులు అధికారం కలిగి ఉన్న ప్రదేశం(పని ప్రదేశం, విద్యాసంస్థ, ఆసుపత్రి లాంటి ప్రాంతాలు) అయినా, పదేపదే లైంగికంగా వేధించినా శిక్ష తీవ్రత పెరుగుతుంది. గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, 3 లక్షల రియాల్ జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో బాధితురాలి పేరును బహిరంగపరిస్తే కూడా కఠినమైన శిక్షలు విధిస్తారు.
షరియా చట్టాల ప్రకారం లైంగిక దాడి ఒక తీవ్రమైన నేరంగా పరిగణించి కొరడా దెబ్బల నుంచి మరణ శిక్ష వరకు విధిస్తారు. అయితే వైవాహిక జీవితంలో జరిగే లైంగిక వేధింపులను మాత్రం అక్కడి చట్టం నేరంగా గుర్తించదు.
దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారా?
"దొంగతనం కేసుల్లో ఎక్కువ సందర్భాల్లో ఒక సంవత్సరం నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు, చోరీ అయిన వస్తువుల విలువ, నేరం స్థాయిని బట్టి శిక్ష పడుతుంది" అని సౌదీ లీగల్ అడ్వైజర్ వెబ్సైట్ పేర్కొంది.
"మీరు బహిరంగ ప్రదేశంలో హింసకు పాల్పడి, ఆయుధాలు ఉపయోగించి చోరీ చేస్తే దాన్ని ఉగ్రవాద చర్యగా పరిగణించి తీవ్రమైన శిక్ష వేస్తారు. మరణ శిక్ష కూడా అమలు చేయవచ్చు" అని తెలిపింది.
"షరియా చట్టం ప్రకారం దొంగతనం చేసిన వ్యక్తి చేతిని నరికేయాలి. కానీ వాస్తవంగా చూస్తే అవసరమైన సాక్ష్యాధారాలు(దొంగతనం తాళం వేసిన చోట జరగాలి, దొంగిలించిన వస్తువులు నిర్దిష్ట విలువ కలిగి ఉండాలి, ప్రత్యక్ష సాక్షులు ఉండాలి) లభించడం కష్టంగా మారినందున ఈ శిక్షలను అరుదుగా అమలు చేస్తున్నారు. "అని వివరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































