‘పిల్లలను ఉపవాసంతో చనిపోయేలా చేస్తే వారు జీసస్‌ను కలుసుకుంటారు’ 191హత్యలలో దోషిగా తేలిన మత గురువు ఇలా ఎందుకు బోధించారు?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, థామస్ మఖ్వానా
- హోదా, బీబీసీ ఆఫ్రికా ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు
అంధ విశ్వాసాలను తీవ్రంగా నమ్మే కెన్యాకు చెందిన మత తెగ నాయకుడు పాల్ మెకెంజీ 191 మందిని హత్య చేసినట్లు నిర్థరణ అయింది. వీరిలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా చిన్నారులే.
పిల్లలు ‘జీసస్‌ను కలుసుకోవాడినికి’ వీలుగా వారిని ఉపవాసం ఉంచి చనిపోయేలా చేయాలని మెకెంజీ తన మత తెగ అనుచరులను ఆదేశించారు.
ఆయన సిద్ధాంతాలు విద్యను నిషేధించాయి, ఆధునిక వైద్యాన్ని ‘దెయ్యం’లా చూశాయి.
ఆయన మతతెగకు చెందిన మరో 28 మంది నాయకులు కూడా హత్యలకు పాల్పడినట్లు నిర్థరణ అయింది.
కానీ, ఎవరినీ చనిపోవాలని తాము బలవంతం చేయలేదని వారు పదే పదే వాదిస్తూ, తాము నిర్దోషులమని పేర్కొన్నారు.

కెన్యాలో ఓడరేవు నగరమైన మొంబాసాలో న్యాయమూర్తి డయానా మోచాచే ఎనిమిది గంటల పాటు తీర్పును వెలువరించారు
మెకెంజీని ఆయన అనుచరులు జీసస్ తరఫున మాట్లాడే వ్యక్తిగా విశ్వసించేవారని చెప్పారు.
ఉపవాసం ఉండాలన్నఆదేశాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే, వారిని చావగొట్టి స్వర్గానికి పంపించాలని మెకెంజీ తన అనుచరులకు చెప్పేవాడని ఈ కేసులో మెకెంజీతో పాటు నిందితుడిగా ఉన్న ఒకరు వెల్లడించారు.
ఈ మత తెగ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న అడవిలో మృతదేహాల సమాధులను వివాహాలు అని పిలిచేవారు. చనిపోయిన వారు జీసస్‌ను పెళ్లి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకునేవారు అని న్యాయమూర్తి తెలిపారు.
ఒక మహిళను అప్పుడే పుట్టిన తన బిడ్డకు పాలివ్వకుండా అడ్డుకున్నారని ఓ సాక్షి తెలిపారు. ఆ శిశువు 12 రోజుల తర్వాత చనిపోయిందని చెప్పారు. అలాగే ఆ శిశువు తల్లిన కూడా ‘‘చనిపోయే వరకు ఉపవాసం ఉండి,తన శిశువును కలుసుకోవాలని ఆదేశించారు" అని ఆ సాక్షి వెల్లడించారు.
మెకెంజీకి గతంలో భద్రతా విభాగం అధిపతిగా పనిచేసిన ఎనోస్ అమాన్యా నగాలా కూడా తొలుత నిందితుడిగా ఉన్నారు. కానీ తరువాత ఆయన తన వైఖరిని మార్చుకుని, ప్రాసిక్యూషన్ తరఫున సాక్షిగా మారారు.
మెకెంజీ, ఇతర మతతెగ నాయకులపై ఉగ్రవాదం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, చిన్నారులకు విద్యను నిరాకరించడం వంటి మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి.
అయితే, హత్యకు సంబంధించిన అత్యంత తీవ్రమైన ఆరోపణలపై ఈ పాస్టర్కు తీర్పు వెలువడటం ఇదే తొలిసారి. నవంబర్ 6న ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మెకెంజీని 2023లోఅరెస్టు చేశారు. కెన్యా తీర ప్రాంతానికి సమీపంలోని షకహోలా అడవిలో పైపైన పూడ్చిపెట్టిన 400కు పైగా మృతదేహాలు బయటపడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తన అనుచరులను మెకెంజీ ఈ అడవికి తీసుకువచ్చారు.
తన ఆరుగురు పిల్లలనూ ఈ మత తెగ కారణంగా కోల్పోయానని 48 ఏళ్ల స్టీఫెన్ మ్వితి చెప్పారు. మెకెంజీతో పాటు హత్య కేసులో దోషిగా తేలినవారిలో ఆయన మాజీ భార్య కూడా ఉన్నారు.
"అందరికీ శిక్ష పడినందుకు సంతోషంగా ఉందని’’ మ్వితి బీబీసీతో చెప్పారు.
తీర్పు వెలువడటానికి ముందు తన కుటుంబం ఫొటోను పట్టుకుని భావోద్వేగానికి గురైన మ్వితి "నా ఆరుగురు పిల్లలూ షకహోలా అడవిలో చనిపోయారు. నా కుమారుడు శామ్యూల్ అవశేషాలు మాత్రమే నాకు దొరికాయి. వాటిని ఖననం చేశాను" అన్నారు.

ఫొటో సోర్స్, Mohamed Madi / BBC
షకహోలా అడవిలో 400కు పైగా మృతదేహాలు
అడవిలోని సమాధులను తవ్వి మృతదేహాలను వెలికితీసే భయానక పని కోసం సమీప పట్టణం నుంచి 17 మంది వ్యక్తులను నియమించారు. వీరిలో కొందరికి రోజుకు కేవలం 8 డాలర్లు, అంటే సుమారు రూ.800 చెల్లించారు.
"మేము తవ్విన ప్రతి సమాధిలో కనీసం మూడు మృతదేహాలు ఉండేవి" అని సమాధులు తవ్విన వారిలో ఒకరైన జేమ్స్ బీబీసీతో చెప్పారు. "కొన్ని అవశేషాలు కేవలం కొన్ని వారాల వయసున్న చిన్నారులవి" అని తెలిపారు.
"ఒకసారి ఒకే సమాధిలో వరుసగా పడుకోబెట్టిన 12 మంది చిన్నారుల మృతదేహాలను కనుగొన్నాం. ఆ సమాధి చాలా పెద్దది. బట్టలను పేర్చినట్లుగా మృతదేహాలను ఒకదానిపై మరొకటి ఉంచారు" అని జేమ్స్ వివరించారు.
కొంతమంది చిన్నారుల కాళ్లు,చేతులు కట్టేసి, మృతదేహాలను బెడ్షీట్లలో చుట్టి ఉంచినట్లు సమాధులు తవ్విన వారు తెలిపారు.
మెకెంజీ అనుచరుల్లో చాలామంది కెన్యాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ, వారిలో కొందరి అవశేషాలు స్థానికులకు తెలిసినవారివి. ఎందుకంటే కల్ట్లోని వారు తరచూ సమీపంలోని షకహోలా పట్టణానికి వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేసేవారు. పట్టణం గుండా ప్రవహించే గలానా నది నుంచి నీటిని కూడా తీసుకువచ్చేవారు.
"కొన్నిసార్లు మేము మా మోటార్‌సైకిళ్లపై కొంతమందిని అడవిలోకి తీసుకెళ్లేవాళ్లం" అని మరో సమాధి తవ్వే వ్యక్తి సలీం కరిసా చెప్పారు. "కానీ అక్కడ జరిగే విషయాలను ఎవరూ గుర్తించలేనంత పక్కా ప్రణాళికతో, రహస్యంగా ఈ వ్యవహారమంతా సాగేది" అని తెలిపారు.
మెకెంజీ 2003లో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్‌ను స్థాపించారు. ఆ తర్వాత 16 ఏళ్లలో ఈ చర్చి ప్రజాదరణ పొందింది. కెన్యా అంతటా ఉన్న చర్చ్ శాఖల్లో వేలాది మంది అనుచరులు చేరారు.
టైమ్స్ టీవీ పేరుతో ఆయన చర్చి ఓ టెలివిజన్ ఛానల్‌ను నిర్వహించేది. మాలిండిలోని చర్చ్ నుంచి మెకెంజీ ఇచ్చే ప్రసంగాలను ఈ ఛానల్ ప్రసారం చేసేది.
అంత్యకాలం సమీపించిందంటూ ఆయన ఇచ్చే ప్రసంగాల్లో కుట్ర సిద్ధాంతాలు ఉండేవి. విద్యనభ్యసించడాన్ని చెడుగానూ, వైద్య సేవలను మత సిద్ధాంతానికి వ్యతిరేకమైనవిగా, డిజిటల్ గుర్తింపు కార్డులను దెయ్యం గుర్తుగా ఆయన అభివర్ణించేవారు.
తాను చర్చిలో కెమెరాపర్సన్‌గా పనిచేశానని మెకెంజీ కుమారుడు డాన్ పాల్ మెకెంజీ చెప్పారు. "పిల్లలు వెనుక కూర్చునేవారు. పెద్దలు మధ్యలో కూర్చునేవారు. ఉదయం అందరూ భక్తి గీతాలు పాడేవారు" అని తెలిపారు.

తనను తాను పాస్టర్‌గా ప్రకటించుకున్న మెకెంజీ మధ్యాహ్నం సమయంలో ఉద్వేగభరితమైన ప్రసంగాలు ప్రారంభించేవారు. వాటిలో కొన్ని దెయ్యాలను వెళ్లగొట్టడం గురించి ఉండేవి.
2019లో ప్రధాన చర్చిని మూసివేశారు. ఆ తర్వాత పాల్ మెకెంజీ షకహోలా అడవికి వెళ్లి, తన అనుచరులను కూడా అక్కడికి రావాలని ప్రోత్సహించారు.
తన తల్లి తనను కూడా అప్పట్లో షకహోలాకు తీసుకెళ్లిందని 23 ఏళ్ల పీటర్ షుక్రానీ చెప్పారు. తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పటి నుంచి మెకెంజీ చర్చికి వెళ్లేవాడినని, అతడిని తన ఆధ్యాత్మిక తండ్రిగా భావించేవాడినని తెలిపారు. "నేను ఆయన గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడను" అని చెప్పారు.
అడవిలో ఉన్నప్పుడు షుక్రానీ అనారోగ్యానికి గురయ్యారు. మందుల వాడకాన్ని నిషేధించడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.
"నాకు వేసుకోవాల్సిన మందులన్నింటినీ మా అమ్మ పారేసేది. దేవుడు మాత్రమే నన్ను నయం చేయగలడని ఆమె నమ్మేది" అని షుక్రానీ చెప్పారు.
ఆ అడవిలో అక్కడక్కడా మట్టి ఇళ్లు ఉన్నాయని, అక్కడి సమాజం అలా విస్తరించిందని వివరించారు. "మేము ప్రశాంతమైన సాధారణ జీవితమే గడిపేవాళ్లం. కొన్ని రోజులు ఉపవాసం ఉండి, ఆ తర్వాత కొద్దిగా తినేవాళ్లం" అని షుక్రానీ చెప్పారు.

స్థానిక పశువుల కాపరులు 2023 మార్చి నాటికి తొలిసారిగా మృతదేహాల అవశేషాలను గుర్తించే సమయానికి వందలాది మంది చనిపోయారు. "మేము కొన్నిసార్లు ఒకరిని అడవి నుంచి బయటకు తీసుకువచ్చేవాళ్లం. కానీ వారు ఎంత బలహీనంగా ఉండేవారంటే, మా చేతుల్లోనే చనిపోయేవారు" అని సమాధులు తవ్విన వారిలో ఒకరైన సలీం కరిసా చెప్పారు.
అడవి నుంచి రక్షించిన వ్యక్తుల్లో షుక్రానీ కూడా ఒకరు.
రక్షించడానికి ముందు ఆయన కొన్ని వారాల పాటు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. అయితే, కోలుకోవడానికి అవసరమైన మందులను ఆయన తల్లి పారేయడంతో పరిస్థితి మరింత దిగజారింది.
"మందులు చెడ్డవనే పాస్టర్ మెకెంజీ సిద్ధాంతాన్ని మా అమ్మ నమ్మింది" అని షుక్రానీ చెప్పారు.
"నన్ను షకహోలా అడవి నుంచి రక్షించకపోయి ఉంటే నేను చనిపోయేవాడిని." అన్నారు.
మెకెంజీ అనుచరులు ఎదుర్కొన్న బాధలు, ఆకలితో అలమటించడం, గొంతు నులిమి చంపడం, మొద్దుబారిన ఆయుధాలతో కొట్టి చంపడం వంటి కారణాలతో మరణించిన పురుషులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి ఉన్నప్పటికీ, ఆ ఘటనల్లో తాను కూడా బాధపడినప్పటికీ, మెకెంజీ "నా గురించి శ్రద్ధ తీసుకునే మంచి వ్యక్తి" అని షుక్రానీ భావిస్తున్నారు.
"మెకెంజీ ఎవరినీ బలవంతంగా ఉపవాసం ఉండమని చెప్పలేదు. ప్రజలు తమ నమ్మకాల ఆధారంగా స్వచ్ఛందంగానే ఆ నిర్ణయాలు తీసుకున్నారు" అని తీర్పు వెలువడటానికి ముందు షుక్రానీ అన్నారు.
"నేను ఇప్పటికీ ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన ఇప్పటికీ నా పాస్టరే" అని తెలిపారు.
అయితే, మెకెంజీ కుమారుడు డాన్ మాత్రం తన తండ్రి హత్య కేసులో దోషిగా తేలాలని భావించారు.
"ఆయనే నాయకుడు. ప్రజలు ఆయనను ఆదర్శంగా తీసుకునేవారు. కాబట్టి సామూహిక హత్యలకు పాల్పడిన హంతకుడు కూడా ఆయనే" అని తీర్పు వెలువడటానికి ముందే డాన్ మెకెంజీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































