సౌదీ అరేబియా: వేలకోట్ల డాలర్లు పెట్టి క్షిపణులు కొని కూడా హూతీ దాడులను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?

హూతీ దాడులు, సౌదీ అరెబియా రక్షణ వ్యవస్థలు
ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాకు సుమారు 15 బిలియన్ డాలర్ల విలువైన థాడ్ లాంచర్స్, క్షిపణుల విక్రయానికి 2017లో అమెరికా ఆమోదం తెలిపింది.
    • రచయిత, మున్జా అన్వర్
    • హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

గడిచిన దశాబ్ద కాలంలో సౌదీ అరేబియా తన వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేసింది.

సౌదీ అరేబియాకు సుమారు 15 బిలియన్ డాలర్ల విలువైన థాడ్ లాంచర్స్, క్షిపణుల విక్రయానికి 2017లో అమెరికా ఆమోదం తెలిపింది. తరువాత 2022లో మూడు బిలియన్ డాలర్ల విలువైన పేట్రియాట్ క్షిపణుల ఒప్పందానికి, తదుపరి 2026లో అదే రక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.

అమెరికా తయారీ పేట్రియాట్, థాడ్ వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలను సౌదీ అరేబియా కలిగి ఉన్నప్పటికీ ఇటీవల యెమెన్‌కు చెందిన హూతీ గ్రూపు (అన్సారుల్లా) సౌదీ అరేబియాలోని ముఖ్యమైన విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో ఎలా దాడులు చేయగలిగాయనే ప్రశ్నలు తలెత్తాయి.

అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో కనీసం 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మరుసటి రోజు అదే విమానాశ్రయంపై మరో క్షిపణి దాడి జరగడంతో ఒకరు మరణించి, 11 మంది గాయపడ్డారు.

ఈ దాడుల అనంతరం విమాన సర్వీసులను నిలిపివేశారు. హూతీలు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు సౌదీ రక్షణ వ్యవస్థలను ఎలా దాటుకుని వచ్చాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేశామని సౌదీ అధికారులు చెబుతున్నా, కొన్ని లక్ష్యాలను చేరుకోవడంతో ఆధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ దాడులన్నింటినీ అడ్డుకోవడం ఎందుకు కష్టమవుతోందన్న చర్చకు ఇది దారితీసింది.

హూతీల క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యం పెరగడం దీనికి కారణమా? వివిధ రక్షణ వ్యవస్థల మధ్య సమాచార మార్పిడి, సమన్వయంలో సమస్యలున్నాయా? దేశ విస్తీర్ణం, అనేక దిశల నుంచి నిరంతరం దాడులు జరగడం, అడ్డుకునేందుకు ఉపయోగించే క్షిపణుల నిల్వలు పరిమితంగా ఉండటం వంటి అంశాలు కూడా రక్షణ వ్యూహాలను క్లిష్టతరం చేస్తున్నాయా?

హూతీ దాడులు, సౌదీ అరెబియా రక్షణ వ్యవస్థలు
ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది జూలైలో జెడ్డాలో థాడ్ రక్షణ వ్యవస్థను ప్రారంభించారు.

సౌదీ రక్షణ వ్యవస్థ ఎలాంటిది?

వివిధ దూరాలు, ఎత్తుల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా బహుళ అంచెల వైమానిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.

పేట్రియాట్ వ్యవస్థ

అమెరికా తయారీ పేట్రియాట్ వ్యవస్థ సౌదీ అరేబియా వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా పరిగణిస్తారు.

స్ట్రాటజిక్ విజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌వీఐ) పరిశోధకుడు హమ్మద్ వలీద్ బీబీసీ న్యూస్ ఉర్దూతో మాట్లాడుతూ, డ్రోన్లు, విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, కొన్ని బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోడానికి సౌదీ అరేబియా పేట్రియాట్ వ్యవస్థను ఉపయోగిస్తోందని చెప్పారు.

పేట్రియాట్ అడ్వాన్స్‌డ్ కెపాబిలిటీ-3 (పీఏసీ-3) వ్యవస్థ ఆధునిక రాడార్ల సాయంతో ఒకేసారి అనేక లక్ష్యాలను గుర్తించి, వాటిని అడ్డుకోగలదు. అయితే, ఈ వ్యవస్థలో ఉపయోగించే క్షిపణులు అత్యంత ఖరీదైనవి.

అందుకే చిన్న డ్రోన్లను తక్కువ ఖర్చుతో ఎదుర్కొనేందుకు కొన్ని సందర్భాల్లో స్విట్జర్లాండ్ తయారీ ఔర్లెక్ 35 ఎంఎం విమాన విధ్వంసక తుపాకులను కూడా సౌదీ అరేబియా ఉపయోగిస్తుందని హమ్మద్ తెలిపారు.

థాడ్

టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) వ్యవస్థ ఎక్కువ ఎత్తుల్లో బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేయడానికి రూపొందించారు. పేట్రియాట్ వంటి వ్యవస్థలతో కలిపి ఉపయోగించినప్పుడు ఇది అదనపు రక్షణగా పనిచేస్తుంది.

సౌదీ అరేబియా తన తొలి థాడ్ యూనిట్‌ను 2025 జులైలో కార్యకలాపాలకు సిద్ధం చేసింది. ఇరాన్ లేదా హూతీలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణకు ఇది కీలకమని హమ్మద్ వలీద్ తెలిపారు. అయితే, అత్యంత ఖరీదైన వ్యవస్థ కావడంతో సాధారణంగా డ్రోన్లను అడ్డుకునేందుకు దీనిని ఉపయోగించరు.

ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలు

సౌదీ అరేబియా వద్ద మధ్యస్థ, స్వల్ప శ్రేణి రక్షణ వ్యవస్థలైన ఐ-హాక్, క్రోటేల్, షహైన్, ఎంఐసీఏ కూడా ఉన్నాయి. నిర్దిష్ట ప్రాంతాలు, కీలక స్థావరాలను రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిసి మొత్తం వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

హూతీ దాడులు, సౌదీ అరెబియా రక్షణ వ్యవస్థలు
ఫొటో క్యాప్షన్, ఇటీవలి దాడుల వల్ల సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్లు భావించాల్సిన అవసరం లేదని నిపుణుల అభిప్రాయం

క్షిపణులు, డ్రోన్లను ఎందుకు అడ్డుకోలేకపోయారు?

ఇంటర్‌నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) మధ్యప్రాచ్య విభాగంలోని డిఫెన్స్ అండ్ మిలిటరీ అనాలిసిస్ ప్రోగ్రామ్ పరిశోధకుడు సాషా బ్రూచ్‌మన్ బీబీసీ న్యూస్ ఉర్దూతో మాట్లాడుతూ, సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ చాలా లక్ష్యాలను విజయవంతంగా అడ్డుకుందని చెప్పారు. అయితే, విమానాశ్రయంపై తొలి క్షిపణి దాడికి ముందే హూతీలు వారం రోజులుగా సౌదీ రక్షణ వ్యవస్థలపై వరుస దాడులు చేస్తున్నారని తెలిపారు.

రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెంచి, వాటిని అధిగమించేలా కొన్ని ఆయుధాలకు అవకాశం కల్పించడమే డ్రోన్లతో దాడులు చేయడం వెనుక ఉద్దేశమని ఆయన వివరించారు.

డ్రోన్లు తక్కువ ఎత్తులో, తక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు వాటిని గుర్తించడం రాడార్లకు కష్టమవుతుంది. దీర్ఘశ్రేణి రాడార్లు సాధారణంగా క్షిపణులు, యుద్ధవిమానాలను గుర్తించేందుకు రూపొందిస్తారు. డ్రోన్లను ప్రత్యేకంగా గుర్తించే రాడార్ల పరిధి మాత్రం తక్కువగా ఉంటుందని సాషా చెప్పారు.

ఎస్‌వీఐ పరిశోధకులు హమ్మద్ వలీద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలి దాడుల వల్ల సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్లు భావించకూడదన్నారు.

సౌదీ అరేబియా విస్తారమైన భూభాగం కలిగిన దేశం కావడంతో, ఆధునిక రక్షణ వ్యవస్థలతో కొన్ని నిర్దుష్ట ప్రాంతాలు, కీలక స్థావరాలకే సమర్థంగా రక్షణ కల్పించగలమని ఆయన వివరించారు. హూతీలు పెద్ద సంఖ్యలో దాడులు చేస్తుండటంతో కొన్ని క్షిపణులు, డ్రోన్లు రక్షణ వ్యవస్థలను దాటుకుని వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. అప్పుడప్పుడు కొన్ని ఆయుధాలు లక్ష్యాలను చేరుకోవడం రక్షణ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం కాకపోవచ్చని, నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నదనడానికి సూచనగా చూడాలన్నారు.

ఇటీవలి నెలల్లో ఇరాన్‌కు సంబంధించిన ముప్పులు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల నుంచి సౌదీ అరేబియా ఎదుర్కొంటున్న సవాళ్లు పెరిగాయని హమ్మద్ తెలిపారు.

చాథమ్ హౌస్‌కు చెందిన మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా కార్యక్రమ పరిశోధకులు థామస్ జునో ప్రకారం, సౌదీ రక్షణ వ్యవస్థలు అన్ని దాడులను అడ్డుకోలేకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటిది దేశ విస్తీర్ణం. 20 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు, పైప్‌లైన్లు, విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు వంటి అనేక కీలక మౌలిక సదుపాయాలున్నాయి. వీటన్నింటికీ పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడం పెద్ద సవాలు.

రెండో కారణం హూతీల సామర్థ్యం పెరగడం. 2025 తర్వాత సౌదీ అరేబియా హూతీలను ఎదుర్కొనే సైనిక సామర్థ్యాన్ని క్రమంగా మెరుగుపరుచుకున్నప్పటికీ, అదే సమయంలో హూతీల సామర్థ్యాలు కూడా గణనీయంగా పెరిగాయని థామస్ జునో తెలిపారు.

ఏకకాలంలో వివిధ ఆయుధాలను అడ్డుకోలేరా?

క్షిపణి సాంకేతికత, డ్రోన్లు, అధునాతన ఆయుధాల వ్యాప్తిపై పరిశోధనలు చేసే కాన్ఫిక్ట్ ఆర్మమెంట్ రీసర్చ్ సీనియర్ విశ్లేషకుడు ఫాబియన్ హింజ్ బీబీసీ న్యూస్ ఉర్దూతో మాట్లాడుతూ, హూతీలు బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో ఒకేసారి దాడులు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు.

వేర్వేరు వేగాలు, ఎత్తులు, మార్గాలు, దిశల్లో ప్రయాణించే ఆయుధాలతో సమన్వయంతో దాడి చేయడం అంత సులభం కాదు. అయితే, ఇటువంటి దాడులు విజయవంతమైతే లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేయడం వైమానిక రక్షణ వ్యవస్థలకు మరింత కష్టమవుతుందని ఆయన వివరించారు.

బాలిస్టిక్ క్షిపణులు అంతరిక్షం లేదా దాని అంచుల వంటి అత్యంత ఎత్తుల నుంచి ధ్వని వేగం కంటే అనేక రెట్లు వేగంతో లక్ష్యాల వైపు వస్తాయని సాషా బ్రూచ్‌మన్ తెలిపారు. దీంతో వాటిని అడ్డుకునేందుకు రక్షణ వ్యవస్థలకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. హూతీలు ప్రయోగించే క్షిపణులు గాల్లో పది నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటాయని తన అంచనా అని ఆయన చెప్పారు.

క్రూయిజ్ క్షిపణులు విమానాల మాదిరిగా ప్రయాణిస్తాయి. వీటి వేగం సాధారణంగా ధ్వని వేగం కంటే తక్కువగా ఉంటుంది. భూభాగ ఆకృతులకు అనుగుణంగా ప్రయాణించగలగడం వల్ల పర్వతాల వెనుక దాక్కుని, లక్ష్యానికి సమీపంలోకి వచ్చిన తర్వాతే రాడార్లకు కనిపించే అవకాశం ఉంటుంది.

డ్రోన్లు కూడా ఇలాంటి లక్షణాలనే కలిగి ఉంటాయని సాషా చెప్పారు. అవి చిన్నవిగా ఉండటం, రాడార్లకు సులభంగా గుర్తించలేని పదార్థాలతో తయారవడం వల్ల వాటిని నిరంతరం గుర్తించడం కష్టమవుతుంది. కొన్ని డ్రోన్లు చాలా నెమ్మదిగా ప్రయాణించడంతో రాడార్ సాఫ్ట్‌వేర్ వాటిని ప్రాధాన్యం లేని లక్ష్యాలుగా పరిగణించి విస్మరించే అవకాశం ఉందని తెలిపారు.

ఇరాన్, హూతీలు పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడంతో పాటు, నెమ్మదిగా ప్రయాణించే డ్రోన్లు, వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులు, అంతకంటే వేగంగా ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులు దాదాపు ఒకేసారి లక్ష్యాలను చేరుకునేలా సమన్వయం చేయడంలో నైపుణ్యం సాధించాయని సాషా వివరించారు.

ఇలాంటి వ్యూహాన్ని కొందరు నిపుణులు శాచురేషన్ అటాక్ గా పిలుస్తారని హమ్మద్ వలీద్ తెలిపారు. ఇందులో మొదట పెద్ద సంఖ్యలో డ్రోన్లను పంపించి రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతారు. ఆ తర్వాత క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి దాడి విజయవంతమయ్యే అవకాశాలను పెంచుతారు. యుక్రెయిన్‌లో రష్యా, కొన్ని దాడుల్లో ఇరాన్ కూడా ఇలాంటి వ్యూహాలను అనుసరించాయని ఆయన చెప్పారు.

ఒకేసారి అనేక రకాల లక్ష్యాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కొన్ని ఆయుధాలు రక్షణ వ్యవస్థలను దాటుకుని వెళ్లే అవకాశాలు పెరుగుతాయని ఆయన వివరించారు.

హూతీ దాడులు, సౌదీ అరెబియా రక్షణ వ్యవస్థలు
ఫొటో క్యాప్షన్, హూతీల క్షిపణి, డ్రోన్ సామర్థ్యాల అభివృద్ధిలో ఇరాన్ మద్దతు కీలకం

హూతీల క్షిపణులు, డ్రోన్లు ఎంత అధునాతనమైనవి?

గత కొన్నేళ్లలో హూతీలు తమ క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాలను గణనీయంగా పెంచుకున్నారని ఫాబియన్ హింజ్ తెలిపారు. వివిధ దూరాలకు ప్రయోగించగల డ్రోన్లు, భూమి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులతో కూడిన ఆయుధ సంపత్తిని వారు అభివృద్ధి చేశారు. వీటిని యెమెన్‌లోని ప్రత్యర్థి దళాలతో పాటు పొరుగు దేశాలపై దాడులకు ఉపయోగించవచ్చు.

లక్ష్యానికి సమీపంలో దిశను సరిచేసుకునే వ్యవస్థ కలిగిన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఇటీవల సంవత్సరాల్లో హూతీలు అభివృద్ధి చేసుకున్నారు. దీంతో గతంలో ఉపయోగించిన అదే శ్రేణి క్షిపణులతో పోలిస్తే లక్ష్యాలను మరింత ఖచ్చితంగా ఛేదించగలుగుతున్నారని ఫాబియన్ తెలిపారు.

హూతీలు ప్రస్తుతం ఖైబర్-షకాన్ శ్రేణికి చెందిన అధునాతన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇవి ప్రయాణం చివరి దశలో దిశను మార్చుకునే విన్యాసాలు చేయగలవని, తక్కువ వంపుతో ప్రయాణించడం వల్ల అడ్డుకోవడం మరింత కష్టమవుతుందని చెబుతున్నారు. అయితే, సౌదీ అరేబియాపై ఇటీవలి దాడుల్లో హూతీలు నిర్దిష్టంగా ఏ సామర్థ్యాలు లేదా వ్యవస్థలను ఉపయోగించారనేది ఇంకా స్పష్టంగా తెలియదని ఫాబియన్ అన్నారు.

హూతీల దీర్ఘశ్రేణి దాడి వ్యవస్థలన్నీ ఇరాన్ రూపకల్పనల ఆధారంగా రూపొందినవేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో సంబంధాలున్న నెట్‌వర్క్‌లు ఇప్పటికీ హూతీలకు ఆయుధాలు, ఇతర వనరులు అందిస్తున్నాయని తెలిపారు.

హూతీల క్షిపణి, డ్రోన్ సామర్థ్యాల అభివృద్ధిలో ఇరాన్ మద్దతు కీలకమని థామస్ జునో అన్నారు. ఇరాన్ నుంచి ఏళ్ల తరబడి మద్దతు లభించకపోతే, సౌదీ రక్షణ వ్యవస్థలను దాటుకునే స్థాయికి హూతీలు చేరుకునేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆయుధాలను తయారు చేయడం, విడిభాగాలను అమర్చడం, వాటిని ఉపయోగించడంలో హూతీలు తమ స్వతంత్ర సామర్థ్యాలను కూడా పెంచుకున్నారని, అధునాతన క్షిపణి, డ్రోన్ కార్యక్రమాలకు అవసరమైన అనేక విడిభాగాల కోసం ఇప్పటికీ ఇరాన్‌పై ఆధారపడుతున్నారని చెప్పారు.

హమ్మద్ వలీద్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. హూతీల క్షిపణి వ్యవస్థలకు, ఇరాన్ క్షిపణులకు మధ్య పోలికలను గతంలో పలువురు రక్షణ నిపుణులు గుర్తించారని తెలిపారు. కొన్ని దాడుల అనంతరం లభించిన శకలాల విశ్లేషణలోనూ ఇరాన్, హూతీల ఆయుధ వ్యవస్థల మధ్య సంబంధాలను సూచించే ఆధారాలు బయటపడ్డాయని చెప్పారు. అయితే, ఇరాన్, హూతీలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి.

సెప్టెంబర్‌లో ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ మాట్లాడుతూ, యెమెన్ వ్యవహారాల్లో ఇరాన్ జోక్యం చేసుకోదని అన్నారు. హూతీలు పూర్తిగా స్వతంత్ర పక్షాలని, తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు.

హూతీలు స్థానికంగా ఆయుధాల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు కూడా ప్రారంభించినట్లు కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయని ఫాబియన్ తెలిపారు.

పాత యెమెన్ సైనిక వ్యవస్థలను ఆధునికీకరించడంతో పాటు, భూగర్భ రక్షిత కేంద్రాలు, మొబైల్ ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ల నుంచి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం హూతీలకు ఉందని హమ్మద్ చెప్పారు. దీంతో వారి క్షిపణి ప్రయోగ కేంద్రాలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం కష్టమవుతుంది. అనధికారిక మార్కెట్లు, ఇతర మార్గాల ద్వారా డ్రోన్లు, ఆయుధ సాంకేతికతను కూడా వారు పొందుతున్నారని తెలిపారు.

హూతీ దాడులు, సౌదీ అరెబియా రక్షణ వ్యవస్థలు
ఫొటో క్యాప్షన్, పేట్రియాట్, థాడ్ వంటి ఆధునిక వ్యవస్థలు సమర్థమైనవే అయినప్పటికీ, వాటి సంఖ్య పరిమితం.

సౌదీ రక్షణ వ్యవస్థలోని బలహీనతలు

వివిధ రాడార్లు, సెన్సార్ల మధ్య అనుసంధానం ఉన్నప్పుడే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని సాషా బ్రూచ్‌మన్ తెలిపారు. వివిధ సైనిక విభాగాల రాడార్ల నుంచి వచ్చే సమాచారాన్ని వైమానిక రక్షణ కార్యకలాపాల కేంద్రంలో సమీకరించాలి. వీలైతే వైమానిక దళం కోసం సమగ్ర గగనతల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

అయితే, ఇందుకు అధునాతన సాఫ్ట్‌వేర్, కంప్యూటింగ్ సామర్థ్యం, వివిధ వ్యవస్థల మధ్య అనుకూలత, సైనిక విభాగాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని ఆయన చెప్పారు. ఇటువంటి సంక్లిష్టమైన వ్యవస్థను సమర్థంగా ఏర్పాటు చేయడం సౌదీ అరేబియాకే కాకుండా ఏ దేశానికైనా పెద్ద సవాలేనని వివరించారు.

సౌదీ అరేబియా యెమెన్ నుంచి మాత్రమే కాకుండా, ఇరాన్ నుంచి, కొంతవరకు ఇరాక్ నుంచి కూడా క్షిపణి ముప్పులను ఎదుర్కొంటోందని హమ్మద్ వలీద్ తెలిపారు. వివిధ దిశల నుంచి ఒకేసారి దాడులు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ వనరులను అనేక ప్రాంతాలకు కేటాయించాల్సి వస్తోందన్నారు.

రక్షణ వ్యవస్థల సామర్థ్యం రాడార్లు, క్షిపణి నిరోధక వ్యవస్థలపైనే ఆధారపడదని ఆయన చెప్పారు. ఒక్కో లక్ష్యాన్ని అడ్డుకునేందుకు ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఉపయోగించాల్సి రావచ్చు. అయితే, వాటి నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి సమయం పడుతుంది. ఇటీవలి ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో సౌదీ అరేబియా, దాని మిత్రదేశాలు పెద్ద సంఖ్యలో అడ్డగింపు క్షిపణులను ఉపయోగించడంతో నిల్వలను తిరిగి పెంచుకోవడం సవాలుగా మారిందని వివరించారు.

పేట్రియాట్, థాడ్ వంటి ఆధునిక వ్యవస్థలు సమర్థమైనవే అయినప్పటికీ, వాటి సంఖ్య పరిమితంగా ఉంటుంది. ప్రతి ప్రాంతంలోనూ వాటిని మోహరించడం సాధ్యం కాదు. అందుకే కీలక మౌలిక సదుపాయాలు, సున్నితమైన ప్రాంతాల రక్షణకే వాటిని ప్రధానంగా ఉపయోగిస్తారని హమ్మద్ తెలిపారు.

శాచురేషన్ దాడుల లక్ష్యాల్లో ఒకటి, రక్షణ వ్యవస్థలు వీలైనన్ని ఎక్కువ క్షిపణులను ఉపయోగించేలా చేయడం కావచ్చని ఆయన అన్నారు. ఒక ప్రాంతంలోని పేట్రియాట్ వ్యవస్థ పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించి, మళ్లీ సిద్ధం కావడానికి లేదా క్షిపణులను నింపుకోవడానికి కొన్ని గంటలు అవసరమైతే, ఆ వ్యవధిలో మరో దాడి చేసే అవకాశం ప్రత్యర్థులకు లభిస్తుంది. మొదటి దశలో డ్రోన్ల దాడులతో రక్షణ వనరులు తగ్గిపోయినప్పుడు, ఆ తర్వాత ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు రక్షణను దాటుకునే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

ఇరాన్ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడుల్లోనూ ఇలాంటి పరిస్థితిని చూశామని హమ్మద్ తెలిపారు. ప్రపంచంలో ఏ వైమానిక రక్షణ వ్యవస్థ కూడా వంద శాతం సమర్థంగా పనిచేయదని, ప్రతి లక్ష్యాన్ని అడ్డుకునేందుకు ఎన్ని క్షిపణులను ఉపయోగించాలి, అందుబాటులో ఉన్న వనరులను ఎలా వినియోగించాలనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

హూతీలతో పోరులో సౌదీ అరేబియా ఎదుర్కొంటున్నది ప్రాథమికంగా అసమాన యుద్ధ పరిస్థితి అని థామస్ జునో అభివర్నించారు . హూతీలు అప్పుడప్పుడు దాడుల్లో విజయం సాధించినా సరిపోతుంది. కానీ సౌదీ అరేబియా మాత్రం దాదాపు ప్రతి దాడినీ అడ్డుకోవాల్సి ఉంటుంది. అత్యధిక క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసినప్పటికీ, కొన్ని ఆయుధాలు రక్షణను దాటుకుని వెళ్లడం ద్వారా హూతీలు తమ లక్ష్యాల్లో కొన్నింటిని సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

హూతీ దాడులు, సౌదీ అరెబియా రక్షణ వ్యవస్థలు
ఫొటో క్యాప్షన్, "హూతీలకు బలమైన సైనిక ప్రతిఘటన ఎదురుకానంత వరకు సౌదీ అరేబియా బలహీనమైన స్థితిలోనే కొనసాగుతుంది"

హూతీల ముప్పును నివారించలేరా?

యెమెన్‌లో హూతీల నియంత్రణలో ఉన్న ప్రాంతాలు, పర్వతాలతో కూడిన కఠిన భూభాగాలని హమ్మద్ వలీద్ తెలిపారు. అక్కడ వైమానిక దాడులు నిర్వహించడం సంక్లిష్టమైన పని. సమర్థంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు నిఘా, కొన్ని సందర్భాల్లో అక్కడ సైనికుల ప్రత్యక్ష ఉనికి కూడా అవసరమవుతుందని చెప్పారు.

గత కొన్నేళ్లుగా నిరంతర వైమానిక దాడులు జరిగినప్పటికీ, హూతీల సైనిక సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతినలేదని, అనేక అంశాల్లో అవి మరింత మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.

హూతీల క్షిపణి, డ్రోన్ దాడులు కొత్త పరిణామేమీ కాదని, దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ప్రచారంలో భాగమని హమ్మద్ చెప్పారు. గతంలోనూ రియాద్, అబ్కైక్‌తో పాటు సౌదీ అరేబియాలోని ఇతర కీలక స్థావరాలపై ఇటువంటి దాడులు జరిగాయని గుర్తుచేశారు. దీర్ఘశ్రేణి ఆయుధాలను ఉపయోగించి సౌదీ అరేబియాపై దాడులు చేయడంలో హూతీలకు గణనీయమైన అనుభవం ఉందని వివరించారు.

ఇరాన్‌కు సంబంధించిన డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల ముప్పులను కూడా సౌదీ అరేబియా గతంలో ఎదుర్కొందని, హూతీలు, ఇరాన్ మధ్య సైనిక సంబంధాలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై అనేక నివేదికలు వెలువడ్డాయని ఆయన చెప్పారు.

ఒక దేశం తన కీలక కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, గగనతలాన్ని నిరంతరం రక్షించుకోవాల్సి ఉంటుందని హమ్మద్ అన్నారు. అయితే, కొంత వ్యవధి తర్వాత కొన్ని దాడులు చేస్తూ సౌదీ రక్షణ వ్యవస్థపై ఒత్తిడి కొనసాగించడం కూడా హూతీలకు సమర్థమైన వ్యూహం కావచ్చని వివరించారు.

హూతీల ముప్పును ఎదుర్కోవడానికి సౌదీ అరేబియాకు సులభమైన పరిష్కారం లేదని థామస్ జునో అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో అమెరికా మద్దతుతో యెమెన్‌లో హూతీ వ్యతిరేక దళాలను గణనీయంగా బలోపేతం చేసి, హూతీలపై సమర్థమైన సైనిక ఒత్తిడి పెంచాల్సి ఉంటుందని చెప్పారు.

హూతీలకు బలమైన సైనిక ప్రతిఘటన ఎదురుకానంత వరకు సౌదీ అరేబియా బలహీనమైన స్థితిలోనే కొనసాగుతుందని ఆయన అన్నారు. స్వల్పకాలంలో వైమానిక రక్షణ వ్యవస్థలను మెరుగుపరచడం, క్షిపణుల నిల్వలను పెంచడం, వాటిని సమర్థంగా వినియోగించడం ద్వారా సౌదీ అరేబియా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. అయితే, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం మాత్రమే హూతీల ముప్పును పూర్తిగా తొలగించడానికి సరిపోకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)