ఫ్లై దుబయి దాడి: కెప్టెన్‌పై దాడిచేసిన కో-పైలట్ ఎవరు, అతని ఉద్దేశం గురించి అంతర్జాతీయ మీడియా ఏం చెబుతోంది?

ఫ్లైదుబాయ్ విమానం FZ1073, కో పైలట్ దాడి, యూఏఈ
ఫొటో క్యాప్షన్, బుధవారం దుబయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ దాడి చేశారు.
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

ఫ్లైదుబయి విమానం FZ1073 ప్రయాణిస్తున్న సమయంలో కో-పైలట్ 'ఉగ్రవాద' దాడికి యత్నించాడని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాసిక్యూటర్ జనరల్ శనివారం చెప్పినట్లు యూఏఈ ప్రభుత్వ వార్తాసంస్థ డబ్ల్యూఏఎమ్ రిపోర్ట్ చేసింది.

కో-పైలట్ కాక్‌పిట్‌లో ఉన్న క్రాష్ యాక్స్‌ (గొడ్డలి)తో పైలట్‌పై దాడి చేసి, విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోడానికి యత్నించాడని ప్రాసిక్యూటర్ జనరల్ వెల్లడించారు.

ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, దాడి ఉద్దేశం, ఇతర అంశాలను తెలుసుకోడానికి దర్యాప్తు కొనసాగుతోందని ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు. దీంతో పాటు భౌతిక, డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సాధారణంగా విమాన ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కాక్‌పిట్‌‌లో ఉండే క్రాష్ యాక్స్‌ను ఉపయోగిస్తారు.

ఈ ఘటనను ఎమిరేట్స్ అధికారులు 'ఉగ్రవాద' దాడి యత్నంగా పేర్కొనడం ఇదే తొలిసారి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘ఆ కో-పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఒమన్ జాతీయుడని’’ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అయితే, కో-పైలట్ జాతీయత గురించి ఫ్లైదుబయ్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

కానీ, అంతర్జాతీయ మీడియాలో ఆ కో-పైలట్ నేపథ్యం గురించి అనేక కథనాలు వస్తున్నాయి.

''ఆ కో-పైలట్ ఒమన్ పౌరుడు. ఆయన నుంచి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని గుర్తించిన ఒమన్ ఎయిర్ సంస్థ, ఆయన విమానాలు నడపకుండా నిషేధించింది'' అని ఏబీసీ రిపోర్ట్ చేసింది.

''2024లో ఒమన్ ఎయిర్‌లో హమామ్ అల్-హమామీ కో-పైలట్ ట్రైనీగా పనిచేస్తున్న సమయంలో ఆయన వద్ద తీవ్రవాదానికి సంబంధించిన సమాచారం లభ్యమైందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఆ ఎయిర్‌లైన్‌లోని పరిపాలనా విభాగంలో ఆయన పని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి'' అని తెలిపింది.

''అనుమానిత వ్యక్తికి ఆ తర్వాత ఫ్లైదుబయ్‌లో విమానం నడిపేందుకు అనుమతి ఎలా లభించింది? ఇజ్రాయెల్ వెళ్తున్న విమానం కాక్‌పిట్‌లోకి ఫస్ట్ ఆఫీసర్‌గా ఎలా ప్రవేశించారు? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు'' అని ఏబీసీ కథనం తెలిపింది.

అల్ హమామీని గురువారం సౌదీ అరేబియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తీసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దర్యాప్తు అధికారులకు ఆయన 'సహకరిస్తున్నారని', విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని సంకేతాలు ఇచ్చారని దర్యాప్తు సమాచారం తెలిసిన వర్గాలు తెలిపాయి.

ఈ విషయంపై ఫ్లైదుబయ్, ఒమన్ ఎయిర్, ఒమన్ రాయబార కార్యాలయ ప్రతినిధులను ఏబీసీ న్యూస్ సంప్రదించగా, వారు స్పందించలేదు.

కో-పైలట్ గతంలో ఎక్కడ పనిచేశారు?

అంతకుముందు శుక్రవారం ఫ్లైదుబయ్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. అధికారుల విజ్ఞప్తి మేరకు తదుపరి సమాచారం వచ్చేవరకు టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

"సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో, ఫ్లైదుబయ్ పూర్తి సహకారంతో అధికారిక దర్యాప్తు జరుగుతోంది" అని ఆ ప్రకటనలో తెలిపారు.

"విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్ నిందితుడిని ఎదిరించడం, పలువురు ప్రయాణికులు అతడిని అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. అంతకుముందు, నిందితుడు విమానాన్ని వేగంగా కిందికి తీసుకెళ్లడం ప్రారంభించారు"

వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా తన కథనంలో "నిషేధం ఉన్నప్పటికీ ఫ్లైదుబయ్ సంస్థ ఆ పైలట్‌ను ఉద్యోగంలోకి తీసుకుందని చెబుతున్నారు. యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఈ సున్నితమైన మార్గంలో విమానం నడిపేందుకు ఆయనకు అనుమతి ఇచ్చారు. నిందితుడు ఒమన్ పౌరుడని, ఆయన పేరు హమామ్ అల్-హమామీ అని దర్యాప్తు విషయాలు తెలిసిన మరికొందరు చెప్పారు. ఆ పైలట్ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడవుతున్నారన్న ఆందోళనలను ఇతర దేశాలు లేదా ఎయిర్‌లైన్స్‌తో ఒమన్ పంచుకుందా లేదా అనేది తెలియరాలేదు. ఆయన ఉగ్రవాద భావజాలం గురించి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు" అని రాసింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఈ ఘటనపై యూఏఈ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. ఒమన్‌లో నిందితుడి గత రికార్డుపై స్పందించేందుకు యూఏఈ ప్రతినిధి ఒకరు నిరాకరించారు. దర్యాప్తు ఫలితాలపై ముందే ఒక అంచనాకు రాకుండా ఉండటానికి, దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫ్లైదుబయ్ విమానాన్ని హైజాక్ చేసేందుకు జరిగిన యత్నాన్ని 'ఉగ్రవాద చర్య'గా యూఏఈ అధ్యక్షుడి సీనియర్ దౌత్య సలహాదారు అన్వర్ మొహమ్మద్ గర్గాష్ శుక్రవారం అభివర్ణించారు.

"పైలట్ స్మిత్ మచ్చర్ ప్రశంసలకు అర్హుడు. తీవ్రమైన ఉగ్రవాద ముప్పు, పెను ప్రమాదం పొంచివున్న వేళ ఆయన నిజమైన ధైర్యాన్ని, బాధ్యతను కనబరిచారు" అని గర్గాష్ ఎక్స్‌లో తెలిపారు.

"కుట్ర సిద్ధాంతాల క్యాంపెయిన్‌కు అతీతంగా, తీవ్రవాదం, ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోవడంలో అప్రమత్తత, జాగ్రత్త వహించడం చాలా అవసరం" అని రాశారు.

"దాడికి పాల్పడిన వ్యక్తి ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యారు. ప్రయాణికులతో ఉన్న విమానాన్ని కూల్చాలన్న ఉద్దేశంతోనే ఆయన వచ్చారు" అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు.

ఫ్లైదుబాయ్ విమానం FZ1073, కో పైలట్ దాడి, యూఏఈ
ఫొటో క్యాప్షన్, 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబయి విమానం, సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

ఈ ఘటన భద్రతా వ్యవస్థలోని తీవ్రమైన లోపానికి అద్దం పడుతోందని ఏవియేషన్ భద్రతా వ్యవహారాల విశ్లేషకులు పేర్కొన్నారు. తనిఖీల్లో లోపం కారణంగా ఆయుధం విమానంలోకి చేరి ఉండొచ్చు కానీ, దాడి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిని విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందే గుర్తించి అడ్డుకుని ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు.

విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఏం జరిగిందనే దానిపై ఇప్పుడు మరింత స్పష్టత వస్తోందని నెతన్యాహు అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఒమన్ పౌరుడని, అయితే అతడి గుర్తింపుకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియరాలేదని తెలిపారు.

ఆ పైలట్ ఇదంతా ఒంటరిగా చేశాడా లేక ఇతరులతో కలిసి పనిచేశాడా అనే కోణంలో ఇజ్రాయెల్ దర్యాప్తు చేస్తోందని ప్రధాని వెల్లడించారు.

రెండో పైలట్ తనపై విరామం లేకుండా దాడి చేస్తున్న సమయంలో, తాను కింద పడిపోయిన స్థితిలోనే కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు కెప్టెన్ స్మిత్ మచ్చర్ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు.

"ఆ సమయంలో నా ప్రాణాలు కాపాడుకోడానికి పోరాడుతున్నాను. తీవ్రంగా గాయపడి కింద పడిపోయాను. ఒకవేళ నేను లేవలేకపోతే ఏమవుతుందనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో తలుపు అక్కడే ఉందని, దానిని ఎలాగైనా నెట్టాలని నాకు తెలుసు. అలా తలుపు తీయగానే ప్రయాణికులంతా లోపలికి వచ్చారు" అని స్మిత్ మచ్చర్ చెప్పుకొచ్చారు.

విమాన కెప్టెన్, కో-పైలట్‌లను గురువారం సౌదీ అరేబియా నుంచి యూఏఈకి తీసుకొచ్చారు. ఆ విమానం సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని విచారించే అవకాశం లభిస్తుందని ఇజ్రాయెల్‌ ఆశిస్తోంది.

ఫ్లైదుబాయ్ విమానం FZ1073, కో పైలట్ దాడి, యూఏఈ
ఫొటో క్యాప్షన్, ఫ్లైదుబయ్ విమానంలో ఉన్న 174 మందిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ వారే.

సీఎన్‌ఎన్ కథనంలో ఏముంది?

అమెరికన్ బ్రాడ్‌కాస్టర్ సీఎన్‌ఎన్ కథనం ప్రకారం, "ఫ్లైదుబయ్ విమానంలో కెప్టెన్‌పై దాడి చేసిన అనుమానిత పైలట్‌ను ఒమన్ జాతీయ ఎయిర్‌లైన్ ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన తీవ్రవాద భావాలపై వ్యక్తమైన ఆందోళనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ వ్యవహారం తెలిసిన ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు"

"ఆ పైలట్ ఒమన్ పౌరుడు, ఆయన పేరు హమామ్ అల్-హమామీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించాడని ఒక మూలం తెలిపింది. తండ్రి ఒమన్ దేశస్థుడు కాగా, తల్లి సిరియా జాతీయురాలు. ఆయన తన జీవితంలో చాలా ఏళ్లు యూఏఈలోనే గడిపారు. ఒక ఇజ్రాయెల్ అధికారి కూడా అల్-హమామీ గుర్తింపును ధ్రువీకరించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ మీడియా కూడా ఆయన వివరాలను నిర్ధరించింది"

"హమామ్ అల్-హమామీ పేరుతో ఉన్న ఒక లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన ఒమన్ ఎయిర్‌లో ఏడేళ్లు పనిచేసి 2025 ఫిబ్రవరిలో ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ తర్వాత 2025 జూన్‌లో రాయల్ ఎయిర్ మారోక్‌లో చేరి 2026 జనవరిలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ప్రొఫైల్‌లో ఫ్లైదుబయ్ ప్రస్తావన ఎక్కడా లేదు".

"బుధవారం నాటి ఘటనలో ప్రమేయం ఉన్న ఫ్లైదుబయ్ పైలట్‌దే ఈ ప్రొఫైల్ అని ఒక వ్యక్తి ధ్రువీకరించారు. ఆ తర్వాత ఆ ప్రొఫైల్‌ కనిపించడం లేదు, దీనిపై వివరణ కోరేందుకు సీఎన్‌ఎన్ లింక్డ్‌ఇన్‌ను సంప్రదించింది"

"ఈ వ్యవహారం తెలిసిన ఒక ప్రాంతీయ దౌత్య వర్గం సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ.. అనుమానితుడి తీవ్రవాద భావాలపై వ్యక్తమైన ఆందోళనల కారణంగా ఆయన్ను విమానయాన శిక్షణ నుంచి తప్పించి, ఒమన్ జాతీయ ఎయిర్‌లైన్‌లో వేరే బాధ్యతలు అప్పగించారని తెలిపింది" అని సీఎన్‌ఎన్ పేర్కొంది.

"ఆ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో కేవలం రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి. అవి రెండూ బుధవారం నాటి ఘటన జరిగిన తొమ్మిది గంటల తర్వాత స్వల్ప వ్యవధిలో పోస్ట్ అయ్యాయి. ఈ పోస్టులను ఎవరు పోస్ట్ చేశారు, లేక ముందుగానే వాటిని షెడ్యూల్ చేశారా అనేది స్పష్టంగా తెలియలేదు. మొదటి పోస్టులో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కాక్‌పిట్‌లో చిత్రీకరించిన అనేక వీడియో క్లిప్‌లు ఉన్నాయి. బుధవారం నాటి ఘటనలో సౌదీ అరేబియా వైపు మళ్లించిన విమానం ఫ్లైదుబయ్‌కి చెందిన 737 మ్యాక్స్ 8" అని సీఎన్‌ఎన్ కథనంలో తెలిపింది.

దుబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిందని సీఎన్‌ఎన్ గుర్తించిన ఒక క్లిప్‌లో, వీడియో తీస్తున్న వ్యక్తి ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్ 'ఎల్ అల్' విమానాన్ని జూమ్ చేసి చూపించారు.

"ఆ వీడియోలో కాక్‌పిట్ స్క్రీన్‌పై OMA624 అనే విమాన సంఖ్య, 11 అక్టోబర్ 2023 అనే తేదీ కనిపిస్తోంది. ఈ విమాన సంఖ్య సాధారణంగా దుబాయ్ నుంచి మస్కట్ వెళ్లే విమానానికి ఉంటుంది. ఆ తేదీ ఆయన ఒమన్ ఎయిర్‌లో పనిచేస్తున్న కాలానికి సరిపోలుతోంది. వీడియోలోని ఇతర క్లిప్‌లలో ఎల్ అల్‌కు చెందిన మరికొన్ని విమానాలతో పాటు మరో ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్ 'ఆర్కియా' విమానం కూడా కనిపిస్తోంది" అని సీఎన్‌ఎన్ రాసింది.

ఒమన్ పౌరుడికి అనుమతి ఎలా లభించింది?

ఇజ్రాయెల్‌ను గుర్తించని ఒమన్‌ దేశానికి చెందిన ఒక పౌరుడికి, టెల్ అవీవ్‌ వెళ్తున్న విమానంలో పైలట్‌గా పనిచేసేందుకు అనుమతి ఎలా లభించిందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విమానం యూఏఈలో రిజిస్టర్ అయినందున, ఈ ఘటనపై దర్యాప్తు చేసే అధికారం ఆ దేశానికే ఉందని యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎమ్ తెలిపింది. యూఏఈ చట్టాల ప్రకారం, ఆ దేశ విమానాల్లో జరిగే నేరాలకు, అవి దేశం వెలుపల జరిగినా సరే, యూఏఈ చట్టమే వర్తిస్తుంది.

విమానం అత్యవసరంగా మళ్లించిన సౌదీ అరేబియాలో నిందితుడిని విచారించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు బుధవారం అర్ధరాత్రి సీఎన్‌ఎన్‌ జర్నలిస్ట్‌ జిమ్‌ స్కియుటోతో చెప్పారు. దర్యాప్తులో ఇజ్రాయెల్‌ కూడా భాగస్వామిగా ఉందని తెలిపారు.

"నేను యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో మాట్లాడాను. విచారణలో ఇజ్రాయెల్ కూడా పాల్గొనేందుకు ఆయన అంగీకరించారు" అని నెతన్యాహు చెప్పారు.

అనుమానిత ఒమన్ పైలట్ విమానంలోకి ఎలా ప్రవేశించగలిగారని నెతన్యాహును మీడియా ప్రశ్నించగా.... ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని దేశాలకు చెందిన పైలట్లకు సాధారణంగా ఇజ్రాయెల్‌కు విమానాలు నడిపే అనుమతి ఉండదని ఆయన బదులిచ్చారు.

"దీన్నిబట్టి, ఇక్కడ నిబంధనల అమలులో ఒక లోపం జరిగిందని స్పష్టమవుతోంది. ఇతర విషయాలతో పాటు దీనిని కూడా మేం సరిదిద్దుతున్నాం. దీనికి ఎమిరేట్స్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోంది. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూసుకోవాలని మేమిద్దరం భావిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఒమన్ ఇప్పటికీ ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)