బంగ్లాదేశ్‌కు చెప్పకుండానే ఆ దేశ జంటకు సౌదీ మరణ శిక్ష అమలు చేసిందా?

30 లక్షల మందికి పైగా బంగ్లాదేశీయులు సౌదీ అరేబియాలో నివసిస్తూ పనిచేస్తున్నారు.
ఫొటో క్యాప్షన్, 30 లక్షల మందికి పైగా బంగ్లాదేశీయులు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు.
    • రచయిత, కోహ్ ఈవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

మక్కా నగరంలో ఇటీవల ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణ శిక్ష అమలు చేసిన విషయంపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని,శిక్ష అమలైన తర్వాతే సమాచారం అందిందని బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

మసీదులో అసభ్యకరమైన చర్యకు పాల్పడినట్లు నిర్ధరణ కావడంతో ఒక బంగ్లాదేశ్‌ పురుషుడికి, మరో మహిళకు గత బుధవారం మరణ శిక్ష అమలు చేసినట్లు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే, వారు పాల్పడినట్లు ఆరోపించిన చర్య ఏంటో మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.

ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు కోరుతూ సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు బంగ్లాదేశ్ తెలిపింది.

మతపరమైన అనుబంధం, బలమైన ఆర్థిక సంబంధాల కారణంగా ఈ రెండు ముస్లిం దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

30 లక్షల మందికి పైగా బంగ్లాదేశీయులు సౌదీ అరేబియాలో నివసిస్తూ అక్కడ పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది తక్కువ వేతనాలు లభించే ఉద్యోగాల్లో ఉన్నారు. ఇద్దరికి ఒకేసారి మరణ శిక్ష అమలు చేసినట్లు వెలువడిన వార్తలు బంగ్లాదేశ్‌లో ప్రజల్లో ఆందోళనకు దారితీశాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు ఇస్లామిక్ చట్టంలోని 'తజీర్' నిబంధన కింద మరణశిక్ష విధించారు. న్యాయమూర్తి విచక్షణ మేరకు శిక్షను నిర్ణయించే విధానాన్ని ఇస్లామిక్ చట్టంలో తజీర్ అంటారు.

నేరం తీవ్రతతో పాటు మసీదు పవిత్రతను ఉల్లంఘించినందున వారికి ఈ శిక్షలు విధించినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

ఈ కేసులో వారు చేసిన నేరాలు, అనుసరించిన న్యాయ ప్రక్రియకు సంబంధించిన వివరాలను కోరుతూ సౌదీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్ ఇస్లాం తెలిపారు.

సౌదీ అధికారుల నుంచి సమాచారం అందిన తర్వాత మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం వంటి తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆమె చెప్పారు.

విదేశాల్లో నివసిస్తున్న బంగ్లాదేశీయుల సంక్షేమం, ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.

మరణ శిక్ష పడిన ఈ ఇద్దరు బంగ్లాదేశీయుల పేర్లు కూడా సౌదీ అరేబియా బంగ్లాదేశ్‌కు అందజేసిన ఖైదీల జాబితాలో ఉన్నాయని డైలీ స్టార్ పత్రిక వెల్లడించింది. జెడ్డాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ జనరల్ కోరడంతో సౌదీ అరేబియా ఆ జాబితాను అందజేసింది. అయితే, ఆ ఇద్దరికీ మరణశిక్ష విధించినట్లు అందులో పేర్కొనలేదు.

సౌదీ అరేబియా అధికారులు విదేశీయులకు మరణ శిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి కాదు.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ఈ ఏడాది సౌదీ అరేబియాలో సుమారు 100 మందికి మరణ శిక్ష అమలు చేశారు. వీరిలో చాలామంది మాదకద్రవ్యాల సంబంధిత నేరాల్లో దోషులుగా తేలిన విదేశీయులే.

2011లో ఈజిప్టుకు చెందిన ఒక వ్యక్తిని హత్య చేసినట్లు నిర్ధరణ కావడంతో ఎనిమిది మంది బంగ్లాదేశీయులకు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో బహిరంగంగా మరణ శిక్ష అమలు చేశారు.

ఈ నెల ప్రారంభంలో, ఫేస్‌బుక్‌లో చేసిన ఓ వ్యాఖ్య కారణంగా దైవదూషణకు పాల్పడినట్లు నిర్ధరణ కావడంతో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తికి విధించిన మరణశిక్షను సౌదీ అరేబియా రద్దు చేసింది. ఈ కేసుపై శ్రీలంకలో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో పాటు, ఆ వ్యక్తికి క్షమాభిక్ష కల్పించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)