75 వేల సంవత్సరాల కిందట మరణించిన నియాండర్తల్ మానవుడి ఛాతీలో రంధ్రం.. చెక్క ఈటెతో పొడిచి చంపేశారా

నియాండర్తల్, మనిషి పరిణామక్రమం, హింస
ఫొటో క్యాప్షన్, నియాండర్తల్ మానవుడు(ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, పల్లబ్ ఘోష్
    • హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

నియాండర్తల్ మానవుడి ఛాతీలోకి పదునైన చెక్కఈటె దూసుకెళ్లి ఉండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మానవుడు 75,000 సంవత్సరాల క్రితం మరణించాడు.

ఇరాక్‌లోని కుర్దిస్తాన్‌ ప్రాంతంలో ఉన్న ఒక గుహలో దొరికిన అవశేషాలలో భుజం ఎముకపై 15 మిల్లీమీటర్ల రంధ్రం కనిపించింది. చెక్కఈటెతో జరిగిన ప్రాణాంతక దాడికి సంబంధించి ఇప్పటివరకు లభించిన ఆధారాల్లో ఇదే అత్యంత పురాతనమైనదని కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

గాయమైన కోణాన్ని, ఇతర ఆధారాలను పరిశీలించిన పరిశోధకులు దీనిపై ఓ అంచనాకు వచ్చారు.

ఆ ఈటె ఆ వ్యక్తి ఛాతీలోకి దూసుకెళ్లి శరీరంలోంచి చొచ్చుకుని వెళ్లి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో ఊపిరితిత్తి, ప్రధాన రక్తనాళాలు దెబ్బతిని ఉండొచ్చు. చివరకు ఆ ఈటె ఎడమ భుజం ఎముకను చీల్చుకుని బయటకు రావడంతో దానిపై దాదాపు సంపూర్ణ వృత్తాకారంలో రంధ్రం ఏర్పడిందని వాళ్లు అంచనావేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నియాండర్తల్స్ సమాజాల్లో గతంలో అనుకున్న కంటే ఎక్కువ హింస ఉండొచ్చని సూచిస్తున్న కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా పరిశోధన వాటిలో ఒకటి.

నియాండర్తల్స్ మనుషులకు దగ్గరి సంబంధం ఉన్న ఓ ప్రత్యేక మానవజాతి. సుమారు 40,000 సంవత్సరాల క్రితం ఈ జాతి అంతరించిపోయింది. యూరప్‌తో పాటు పశ్చిమ, మధ్య ఆసియాలో ప్రాంతాల్లో వాళ్లు నివసించారు.

కొన్ని సందర్భాల్లో ప్రస్తుత మానవ జాతి అయిన హోమో సేపియెన్స్‌తోనూ కలిసిమెలిసి జీవించారు.

నియాండర్తల్, మనిషి పరిణామక్రమం, హింస
ఫొటో క్యాప్షన్, చెక్క ఈటె వల్ల ఈ నియాండర్తల్ భుజం ఎముకపై రంధ్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అనుకోకుండా ఆయుధంతో దాడి జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా చేసిందా?

గాయపడిన ఆ నియాండర్తల్ మానవుని అవశేషాలు ఇరాక్‌లోని కుర్దిస్తాన్‌ ప్రాంతంలో ఉన్న ఒక గుహలో లభించాయి.

ఎడమ భుజం ఎముకతో పాటు, కుడి చేతి ఎముక, మూడు పక్కటెముకలు, కొన్ని పళ్లు కూడా దొరికాయి.

చెక్క ఈటెతో జరిగిన ప్రాణాంతక దాడికి భుజం ఎముకపై ఉన్న రంధ్రం అత్యంత పురాతన ఆధారంగా నిలుస్తుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ ఎమ్మాపోమెరాయ్ తెలిపారు.

" ఉద్దేశపూర్వకంగా గుండెకు గురిపెట్టి ఆ దాడి చేసి ఉండొచ్చు" అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఈ అవశేషాలకు పురావస్తు శాస్త్రవేత్తలు 'షానిదార్ ఏ' అని పేరు పెట్టారు.

అవి లభించిన గుహ పేరు ఆధారంగా ఈ పేరు పెట్టారు.

1950ల ప్రాంతంలో ఆ గుహలో జరిపిన తవ్వకాల సమయంలో కనీసం పది నియాండర్తల్స్ అవశేషాలు బయటపడ్డాయి.

పదునుగా చేసిన చెక్క ఈటెలను ఉపయోగించినట్టు సూచించే ఆధారాల్లో ఈ గాయం అత్యంత పురాతనమైనదని పోమెరాయ్ భావిస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇలాంటి ఈటెల వాడకానికి ఇది తొలి ఆధారం కావొచ్చని భావిస్తున్నారు.

"ఇది సహజసిద్ధంగా ఏర్పడింది కాదు. ఎందుకంటే రంధ్రం చాలా గుండ్రంగా ఉంది" అని ఆమె చెప్పారు.

మళ్లీ తయారుచేసిన చెక్క ఈటెలతో చేసిన ప్రయోగాల్లో కూడా ఎముకల్లో ఇలాగే గుండ్రని రంధ్రాలు ఏర్పడ్డాయి.

అయితే ఇది ఓ వ్యక్తి మరో వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడేనా అన్నది కచ్చితంగా చెప్పలేమని ఆమె అంటున్నారు. వేట సమయంలో పొరపాటున తోటి వ్యక్తికి ఈటె తగిలి గాయమై ఉండొచ్చు.

నియాండర్తల్, మనిషి పరిణామక్రమం, హింస
ఫొటో క్యాప్షన్, లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో నియాండర్తల్ మానవుడి నమూనా

మనుషుల మధ్య హింస ఈనాటిది కాదా?

ఇది ప్రత్యర్థి చేసిన దాడి కావడానికే ఎక్కువ అవకాశం ఉందనిపిస్తోందని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన ప్రొఫెసర్ క్రిస్ స్ట్రింగర్ బీబీసీతో చెప్పారు. నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ పరిశోధనలో పాల్గొనలేదు.

"ఈ గాయం వేటలో జరిగిన ప్రమాదం వల్ల ఏర్పడిందా లేక ఒక వ్యక్తి మరో వ్యక్తిపై చేసిన దాడివల్ల ఏర్పడిందా అన్న విషయాన్ని పరిశోధకులు కచ్చితంగా చెప్పలేదు. అయితే గాయం ఉన్న ప్రదేశం, దాని తీవ్రతను బట్టి చూస్తే, ఇది ఉద్దేశపూర్వక దాడివల్ల ఏర్పడిందనే వివరణే నాకు ఎక్కువగా నమ్మదగినిదిగా అనిపిస్తోంది" అని ఆయన చెప్పారు.

ఈ ఆవిష్కరణకు ఇదే గుహలో 1957లో బయటపడిన మరో నియాండర్తల్ అవశేషాలకు పోలికలున్నాయి. ఆ వ్యక్తి సుమారు 50 వేల ఏళ్ల క్రితం జీవించాడు. తాజాగా పరిశీలించిన వ్యక్తి కంటే తక్కువకాలం క్రితం జీవించాడు.

ఆ వ్యక్తి పక్కటెముకలపై ఓ గాయం ఆనవాళ్లు కనిపించాయి. ఆ గాయం కొంతవరకు మానిపోయినట్టు ఆధారాలున్నాయి. రాతి మొన కలిగిన ఈటెతో ఆ గాయం ఏర్పడి ఉండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ నియాండర్తల్స్‌కు వేట సమయంలో తోటివ్యక్తుల వల్ల గాయాలయ్యాయా లేక ప్రత్యర్థులు వారిని హత్య చేశారా అన్నది మనం కచ్చితంగా చెప్పలేం.

అయితే మనుషులు ఒకరిపై మరొకరు హింసకు పాల్పడడం గతంలో శాస్త్రవేత్తలు భావించినదానికంటే ఎక్కువగా జరిగి ఉండొచ్చని, అంతకంటే ప్రాచీనకాలంలోనే ఈ హింస మొదలైఉండొచ్చని సూచించే ఆధారాలు ఇప్పుడు పెరుగుతున్నాయి.

''ఒక వ్యక్తి మరో వ్యక్తిపై హింసకు పాల్పడే ఘటనలు దురదృష్టవశాత్తూ మానవ చరిత్ర పూర్వకాలంలోనే చాలా లోతుగా వేళ్లూనుకున్నాయని ఈ ఆధారాల పెరుగుదల సూచిస్తోంది'' అని స్ట్రింగర్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

ఆ వాదనకు మద్దతుగా నిలుస్తున్న కీలక ఆధారాల్లో ఒకటి 2022లో ప్రచురితమైన అధ్యయనం.

నియాండర్తల్, మనిషి పరిణామక్రమం, హింస
ఫొటో క్యాప్షన్, ఇరాక్‌లోని షానిదార్ గుహ

‘వ్యవస్థీకృత హింసకు వ్యవసాయంతో సంబంధం లేదు’

ఉత్తర స్పెయిన్‌లోని 'పిట్ ఆఫ్ బోన్స్' అనే పురావస్తు ప్రదేశంలో లభించిన అత్యంత ప్రాచీన నియాండర్తల్ పూర్వీకులకు చెందిన పుర్రెలను పరిశోధకులు అధ్యయనం చేశారు.

సుమారు 4,30,000ఏళ్ల క్రితమే ప్రాణాంతక దాడులు జరుగుతూఉండొచ్చని ఆ అధ్యయనం సూచించింది.

20 మందికి చెందిన పుర్రెలపై మొత్తం 57 మానిన గాయాలను పరిశోధకులు గుర్తించారు.

వారిలో తొమ్మది మందికి ప్రాణాంతకంగా మారే ప్రమాదమున్న పగుళ్లు పుర్రెలలో ఉన్నాయి.

ఆరుగురి పుర్రెల వెనక ఎడమవైపు ఒకే రకమైన రంధ్రాల వంటివి కనిపించాయి.

ఈ గాయాలు దాదాపు ఒకే ప్రదేశంలో పదే పదే కనిపించడంతో అవి ప్రమాదవశాత్తూ ఏర్పడినవి కాకుండా ఉద్దేశపూర్వకంగా కొట్టిన దెబ్బల వల్ల ఏర్పడి ఉండే అవకాశమే ఎక్కువని పరిశోధకులు నిర్ధరించారు.

ఒక పుర్రెపై రెండు గాయాలు ఉన్నట్టు గుర్తించారు.

ఆ రెండు గాయాలూ ఒకే వస్తువుతో చేసిన దెబ్బల వల్ల ఏర్పడి ఉండొచ్చని వాళ్లు భావించారు.

పిట్ ఆఫ్ బోన్స్ పరిశోధనలోని ఆధారాల ద్వారా ఆ సమూహంలో ప్రతి ఒక్కరూ తరచూ హింసకు పాల్పడేవారని చెప్పలేం.

కానీ వందల వేల సంవత్సరాల క్రితమే మనుషుల మధ్య హత్యలు జరిగి ఉండొచ్చనేదానికి బలమైన ఆధారాలను అందిస్తున్నాయి.

పురావస్తు శాస్త్రవేత్తలు చాలామంది వ్యవస్థీకృత యుద్ధాల ఆరంభాన్ని వ్యవసాయం ప్రారంభమైన కాలంతో ముడిపెట్టారు.

ప్రజలు ఒక చోట స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవించడం మొదలుపెట్టినప్పుడు భూమి, పశుసంపద ఆహార నిల్వల కోసం పోటీ పెరిగిందని వాళ్లు భావించారు. ఆ పోటీ వల్లే వ్యవస్థీకృతయుద్ధాలు మొదలయ్యాయని అనుకున్నారు.

అయితే వ్యవసాయం ప్రారంభం కాకముందు జీవించిన వేటగాళ్లు ఆహార సేకరణపై ఆధారపడిన సమూహాలతో పాటు అంతకంటే ప్రాచీన మానవ పూర్వీకులపై లభించిన ఆధారాలు ఇప్పుడు మరో విషయాన్ని చూపిస్తున్నాయి. వ్యవసాయం ప్రారంభం కావడానికి చాలా ముందే ఒక మనిషి మరో మనిషిని చంపే ఘటనలు జరిగాయి.

ఇలాంటి హింస ఎంత తరచుగా జరిగేది? అప్పుడప్పుడు జరిగే దాడులు ఎప్పుడు సమూహాల మధ్య వ్యవస్థీకృత ఘర్షణలుగా, యుద్ధాలుగా మారాయి? అన్నది ఇప్పుడు శాస్త్రవేత్తల మధ్య జరుగుతున్న ప్రధాన చర్చ.

ఈ పరిశోధన సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురితమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)