‘సోషల్‌ మీడియా ద్వారా పర్మిషన్లు అడుగుతారా’ - హీరో నానీపై నెటిజన్ల ట్రోల్, అసలేం జరిగింది?

ప్యారడైజ్ మూవీ, నానీ, పుష్ప మూవీ

ఫొటో సోర్స్, Nani/FB

ఫొటో క్యాప్షన్, ది ప్యారడైజ్ సినిమాలో ఓ దృశ్యం

హీరో నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రీమియర్ షో ఈ నెల (సెప్టెంబరు) 23 సాయంత్రం వేస్తున్నారు.

ఈ ప్రీమియర్ షో విషయంలో నాని చేసిన విజ్ఞప్తిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ డీజీపీ కూడా స్పందించారు.

ఇంతకీ నాని చేసిన విజ్ఞప్తి ఏమిటి?

ప్రభుత్వం స్పందన ఏమిటి? దీనిపై నెటిజన్లు ఏమంటున్నారు?

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్యారడైజ్ మూవీ, నానీ, పుష్ప మూవీ

ఫొటో సోర్స్, Nani/FB

ఫొటో క్యాప్షన్, నాని చేసిన విజ్ఞప్తిపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

నాని ఏం అడిగారంటే..

‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి చూడాలనుకుంటున్నట్లు నాని చెప్పారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వెళ్లి థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వాలని 'ఎక్స్'లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసులను నాని కోరారు.

''సినిమాను ఎంతగానో ఇష్టపడే ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు ఇష్టపడతాను. అది కూడా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చూడటం ప్రత్యేక అనుభూతి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒక థియేటర్‌కు వెళ్లి సెప్టెంబరు 23న వేయనున్న ప్రీమియర్ షో ప్రేక్షకులతో కలిసి చూడటం, వారి స్పందనను ప్రత్యక్షంగా చూస్తే మేం తీసిన సినిమా విషయంలో ఎంతో సంతృప్తి చెందినట్లుగా ఉంటుంది'' అని నాని తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో అవసరమైన భద్రత నిబంధనలను పాటిస్తామని, ప్రేక్షకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.

ప్యారడైజ్ మూవీ, నానీ, పుష్ప మూవీ

ఫొటో సోర్స్, Revanthreddy/X

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి స్పందన ఏంటంటే..

నాని చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి 'ఎక్స్'లో స్పందించారు. ప్రజల భద్రత, రద్దీ దృష్ట్యా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

''నాని మీరు పెట్టుకున్న దరఖాస్తుపై పోలీసులు సమీక్షించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు'' అని చెప్పారు.

ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ డీజీపీని సీఎం ట్యాగ్ చేశారు.

మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా 'ఎక్స్'లో స్పందించారు.

'మా ప్రభుత్వం తెలుగు సినిమా, నటులను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో ప్రజల భద్రత, రద్దీ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోగలరు'' అని ట్వీట్ చేశారు.

ప్యారడైజ్ మూవీ, నానీ, పుష్ప మూవీ

ఫొటో సోర్స్, Odelasrikanth/X

ఫొటో క్యాప్షన్, శ్రీకాంత్ ఓదెల చేసిన ట్వీట్

''అవసరమైతే రద్దు చేసుకుంటాం''

సీఎం చేసిన సూచనపై అటు నాని, ఇటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వేర్వేరుగా స్పందించారు.

తెలంగాణ నుంచి వచ్చిన యువ దర్శకుడిగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ది ప్యారడైజ్ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడటం ఎంతో మంచి అనుభూతి ఇస్తుందని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. ఈ విజ్ఞప్తిపై స్పందించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు.

అలాగే సీఎం ట్వీట్‌పై నాని కూడా స్పందించారు. పోలీసు శాఖ తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

''గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ప్రజల భద్రత ఎంత ముఖ్యమో మేం అర్థం చేసుకుంటున్నాం. పోలీసు శాఖకు అదనపు భారం కావాలని గానీ, జరుగుతున్న ఏర్పాట్లలో అసౌకర్యం కలిగించాలనిగానీ అనుకోవడం లేదు. ప్రజల భద్రత, రద్దీ నియంత్రణ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయనుకుంటే, మా సందర్శనను రద్దు చేసుకుంటాం'' అని నాని పేర్కొన్నారు.

ప్యారడైజ్ మూవీ, నానీ, పుష్ప మూవీ

ఫొటో సోర్స్, Nani/FB

ఫొటో క్యాప్షన్, ది ప్యారడైజ్ సినిమాలో ఓ దృశ్యం

నాని ట్వీట్‌పై ట్రోలింగ్

నాని చేసిన విజ్ఞప్తిపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బహిరంగంగా ఈ తరహా విజ్ఞప్తి చేయడం 'పిల్లాడి మనస్తత్వం'లా ఉందని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.

‘‘మీకు అనుమతి వస్తే, అప్పడు ఈ ట్వీట్ చూసి పెద్దఎత్తున ప్రేక్షకులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది కదా'' అని అన్నారు.

"ఇలా సోషల్ మీడియాలో ఎవరైనా అనుమతి అడుగుతారా? లేదా ఇదేమైనా పబ్లిసిటీ స్టంటా?" అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

''ఇంతకీ ఆంధ్రలో చూడవా సినిమా గురు'' అని మరో నెటిజన్ అడిగారు.

"సినిమా ప్రేమికుడి నుంచి వచ్చిన హృదయపూర్వక వినతి" అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

''మిమ్మల్ని స్కిప్ చేయాలని అనలేదే..? ఎందుకు ట్వీట్ వేసినట్లు రూల్స్ తెలియనట్టు, ఎందుకు వెనక్కిపోయినట్లు.. మీ సెలబ్రిటీ కష్టాలు మాలాంటి కామన్ మ్యాన్‌కి అర్థం కాదు నాని బాబు'' అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు.

ప్యారడైజ్ మూవీ, నానీ, పుష్ప మూవీ

ఫొటో సోర్స్, Alluarjun/fb

ఫొటో క్యాప్షన్, అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి, శ్రీ తేజ్‌లు ఊపిరాడక స్పృహ కోల్పోయారని పోలీసులు ప్రకటించారు.

పుష్ప 2 విడుదల సందర్భంగా తొక్కిసలాట ప్రస్తావన

రేవంత్ రెడ్డి చేసిన సూచనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ నెల 25న గణేశ్ నిమజ్జనం ఉంది. హుస్సేన్ సాగర్ సమీపంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉంటుందికాబట్టి వాహనాలు, సందర్శకులతో రద్దీ ఉంటుందని చెప్పారు.

''మీరు (నాని) చేసిన విజ్ఞప్తిపై హైదరాబాద్ సిటీ పోలీసులతో సంప్రదించాల్సి ఉంటుంది. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దకు మీరు వస్తే, అక్కడ రద్దీని నియంత్రించగలరా లేదా? అవసరమైన పోలీసు బలగాలను మోహరించగలరా లేదా అన్నది చూడాల్సి ఉంది'' అని సీవీ ఆనంద్ చెప్పారు.

ఈ సందర్భంగా 'పుష్ప-2 ది రూల్' సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను డీజీపీ ప్రస్తావించారు.

సుమారు రెండేళ్ల కిందట ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవడం, ఒక బాలుడు అచేతన స్థితిలోకి చేరిన నేపథ్యంలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని తెలంగాణ డీజీపీ చెప్పారు.

పుష్ప-2 విడుదల సందర్భంగా ఏం జరిగిందంటే..

2024 డిసెంబర్ 5న 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలైంది. ఒకరోజు ముందు, అంటే డిసెంబరు 4న ఏపీ, తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించారు.

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోనూ బెనిఫిట్ షో వేశారు. దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన భాస్కర్ తన భార్య రేవతి (35), కుమారుడు శ్రీతేజ్ (9), కుమార్తె శాన్వికతో కలిసి సంధ్య థియేటర్‌కు వచ్చారు.

అదే సమయంలో అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి, శ్రీ తేజ్‌లు ఊపిరాడక స్పృహ కోల్పోయారని పోలీసులు అప్పట్లో ప్రకటించారు.

ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.

ఘటనపై చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది.

సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బందితో పాటు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ సిబ్బంది, పుష్ప 2 నిర్మాతలు సహా మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు.

డిసెంబరు 13న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు, అంటే డిసెంబరు 14న అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)