మండాడి మూవీ రివ్యూ: సూరి-సుహాస్.. విజేత ఎవరు?

మండాడి సినిమాలో సుహాస్

ఫొటో సోర్స్, RS Infotainment Pvt Ltd

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

తెలుగులో సుహాస్, తమిళ్‌లో సూరి.. ఈ ఇద్దరి ప్రయాణం దాదాపు ఒకటే. చిన్న చిన్న వేషాలతో కెరీర్ మొదలుపెట్టి కథానాయకులుగా మారారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి చేసిన 'మండాడి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

20 ఏళ్లుగా ఊరికి దూరంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ముత్తుకాళీ (సూరి), ప్రాణభయంతో తన దగ్గరకు వచ్చిన మల్లేష్ (మిథున్ జై శంకర్)కు ఆశ్రయం ఇచ్చి, అతన్ని తీసుకుని తిరిగి కళింగపట్నం వస్తాడు.

అసలు ఈ మల్లేష్ ఎవరు? సూరి ఎందుకు ఊరికి దూరంగా ఉన్నాడు?

సట్టాపులి (సుహాస్)తో తనకున్న వైరం ఏమిటి? అనేది మిగతా కథ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త కథలు పుట్టవు.. ఉన్న కథలే కొత్తగా చూపించాలి. 'మండాడి' కథ కూడా కొత్తదేం కాదు. ఇద్దరూ స్నేహితులు, కొన్ని కారణాల వల్ల శత్రువులుగా మారుతారు, మధ్యలో ఓ ప్రేమకథ, ఒకరు ఊరికి దూరంగా వెళ్లిపోవడం, మరో కారణంతో తిరిగి రావడం.. ఇలాంటి టెంప్లేట్‌లో చాలా కథలు వచ్చాయి.

'మండాడి' కూడా ఆ తరహా కథే. కాకపోతే ఇదే కథను సముద్రం బ్యాక్‌డ్రాప్‌కు మార్చి, తెరచాపల పడవల పోటీ పెట్టి కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు పుహళేంది.

ఈ ప్రయత్నం ఆరంభంలో కాస్త ఆసక్తిని పెంచింది. కాళీ, పులి పాత్రల మధ్య ఏదో బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఉన్న ఫీలింగ్ కలిగించడం, అలాగే మహిమా నంబియార్ పాత్ర రూపంలో ప్రేమకథ చూపించడం, ఇరు వర్గాల పోరు.. ఇవన్నీ కథపై అంచనాలు పెంచాయి.

కాకపోతే సీన్లు గడుస్తున్న కొద్దీ అంతా రొటీన్ ట్రాప్ వైపు వెళుతుంది.

పడవల పోటీని బలంగా నమ్మాడు దర్శకుడు. నిజానికి ఇది స్క్రీన్‌కు కొత్త ఆటే. కానీ ఈ ఆటను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు తడబాటు కనిపించింది.

మండాడి మూవీలో సూరి

ఫొటో సోర్స్, RS Infotainment Pvt Ltd

కొత్త ఆటే గానీ..

ఎప్పుడూ చూడని కొత్త ఆటను చూపించడం తప్పు కాదు. రాజమౌళి 'సై' సినిమాలో రగ్బీ ఆటను తీసుకున్నారు. నిజానికి అలాంటి ఆట తెలుగు తెరకు కొత్త.

కానీ దాని చుట్టూ ఉండే ఎమోషన్‌ను పట్టుకోవడం, దాన్ని ప్రేక్షకులకు ఎక్కించడం రాజమౌళి పనితీరు గురించి చెప్పాల్సిన పని లేదు.

అసలు ఆట రూల్స్‌ను పట్టించుకోకుండా ఎమోషన్ వైపే ప్రేక్షకుల దృష్టి ఉంటుంది.

'మండాడి'లో పడవల పోటీ ప్రేక్షకుడికి తికమకగా ఉంటుంది. చూడటానికి సముద్రంపై సాహసాలు కనిపిస్తుంటాయి. కానీ ఆ ఆట ఈ కథకు ఎంత ముఖ్యం? అది ఓడిపోతే కథానాయకుడికి, ఆ ఊరికి జరిగే నష్టం ఏమిటి? అనే ఎమోషన్‌ను బలంగా పట్టుకోలేకపోయారు.

కాళీ ఫ్లాష్‌బ్యాక్‌పై ఆడియన్స్‌లో చాలా ఆసక్తిని పెంచారు. కానీ ఓపెన్ చేసిన తీరు, అక్కడ జరిగిన సంఘటనలు ఏమంత కొత్తగా లేవు.

ప్రేమకథ రొటీన్. ప్రీక్లైమాక్స్ నుంచి చివరి వరకు మొత్తం పడవల పోటీనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఒక దశ దాటిన తర్వాత ల్యాగ్ అనిపిస్తుంది.

ముఖ్యంగా సుడిగుండం సీక్వెన్స్ మరీ లెంగ్త్ ఎక్కువైంది. పైగా అందులో హీరో చేసిన విన్యాసాలు మరీ అతిగా అనిపిస్తాయి. రియాలిటీకి దూరంగా ఉంటుంది. అంత పెద్ద సీక్వెన్స్ జరిగిన తర్వాత కూడా మళ్లీ పులి పాత్రతో విన్యాసాలు చేయించారు.

ఇదంతా స్క్రీన్‌పై చూడటానికి భారంగా తయారవుతుంది.

మండాడి

ఫొటో సోర్స్, RS Infotainment Pvt Ltd

సూరి ఓకే.. కానీ సుహాస్?

సూరి చేసిన ముత్తుకాళీ పాత్రను చాలా సెటిల్డ్‌గా, లోపల ఎన్నో బాధలను దాచుకున్న మనిషిగా డిజైన్ చేశారు.

కాకపోతే అతని గతం, స్నేహం, ప్రేమ, ఆ బాధలన్నీ బయటకు వస్తుంటే ఆ పాత్రపై ఒక ఎమోషనల్ కనెక్షన్ రావాలి. ఇందులో అది పెద్దగా కనిపించలేదు.

ముత్తుకాళీ–సట్టపులి మధ్య ఉన్న పగ సినిమాకు అసలు డ్రైవింగ్ ఫోర్స్ కావాల్సింది. కానీ అది అంత బలంగా జరగలేదు. ఇక సుహాస్ చేసిన పులి పాత్రలో సరైన ఆర్క్ లేదు. ఆ పాత్రను మొదటి నుంచి చివరి వరకు నెగిటివ్ షేడ్స్‌లోనే చూపించారు. పైగా కథ ముగించినప్పుడు కూడా ఆ పాత్రకు సరైన దిశ రాలేదు.

కాకపోతే సుహాస్ ఎప్పటిలానే తన పాత్రను చాలా సహజంగా ప్రదర్శించాడు. సత్యరాజ్ పాత్ర నిడివి చిన్నదే కాకపోతే, ఈ కథ ప్రధాన సంఘర్షణ ఆ పాత్ర నుంచే వస్తుంది. ఏంజిల్‌గా చేసిన మహిమా నంబియార్ మెప్పిస్తుంది. మిథున్ జై శంకర్, రవీంద్ర విజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

మండాడి మూవీలో సూరి

ఫొటో సోర్స్, RS Infotainment Pvt Ltd

ఫొటో క్యాప్షన్, మండాడి సినిమాలో సూరి(మధ్యలో)

జి.వి. ప్రకాష్ విజృంభణ

టెక్నికల్‌గా సినిమా బాగుంది. కెమెరా వర్క్ తీరం అందాన్ని పట్టుకుంది.

మొత్తం రియల్ లొకేషన్స్‌లో చేసిన సినిమా ఇది. ఆ సహజ వాతావరణం తెరపై కనిపిస్తుంది.

కాకపోతే మొత్తం సముద్రం ఒడ్డునే జరగడంతో కథ ఒకే చోట తిరుగుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది.

జి.వి. ప్రకాష్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

చాలా సన్నివేశాలను తన సంగీతం నిలబెట్టింది. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది.

నేమ్ బోర్డ్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా తమిళ పేర్లు కనిపిస్తుంటాయి.

ఇది పూర్తి తమిళ్ ఫ్లేవర్‌తో నడిచే సినిమా. సముద్రంలో తెరచాపల పడవల పోటీ ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం ఉంటే ఓ లుక్ వేయొచ్చేమో.

కానీ మంచి కథ, ఎమోషన్‌తో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు 'మండాడి' కష్టమే.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)