మూవీ రివ్యూ: ‘మారెమ్మ’ ఆకట్టుకుందా, మాధవ్ భూపతిరాజు హీరోగా ఎలా నటించాడు?

ఫొటో సోర్స్, INSTA/deepabalu
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
మాస్ మహారాజ రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా తొలి సినిమా మారెమ్మ థియేటర్‌లోకి వచ్చింది.
రవితేజ కుటుంబం నుంచి హీరో రావడం, ట్రైలర్, ప్రమోషన్స్ బావుండడంతో మారెమ్మకి కొంత బజ్ ఏర్పడింది. మరి ఈ పల్లెటూరి ఫాంటసీ డ్రామా ఆకట్టుకుందా? మాధవ్ హిట్ కొట్టాడా?
కథేంటంటే. వరంగల్ సమీపంలోని మహిషాపురం గ్రామం. పదేళ్లకో సారి జరిగే జాతరలో మారెమ్మకు దున్నపోతుని బలిస్తే ఊరికి మంచి జరుగుతుందని, లేదంటే అరిష్టమని నమ్మకం.
కర్ని (మాధవ్) చిన్నప్పటి నుంచి అమ్మవారి దున్న మారిని పెంచుతూ వుంటాడు. విపరీతమైన ప్రేమ, తమ్ముడిలా చూసుకుంటాడు. పొరుగూరిలో వున్న జలంధర్ (వికాస్ వశిష్ట)కి మారి వల్ల అవమానం జరుగుతుంది. మారిని ఎలాగైనా చంపాలనుకుని ఒక మంత్రగత్తె (రూపాలక్ష్మి)ని ఆశ్రయిస్తాడు.
మరి జలంధర్ మారిని చంపగలిగాడా? ఇంతకాలం పెంచినా, జాతరలో తన చేతుల మీదుగానే బలి ఇవ్వాల్సి వస్తే కర్ని అంగీకరిస్తాడా? ఇదంతా సినిమాలో చూడాల్సిందే.


ఫొటో సోర్స్, INSTA/deepabalu
మారెమ్మ, అమ్మవారి దున్నపోతు
ఒక పల్లెటూరు, గ్రామ దేవత మారెమ్మ, అమ్మవారి దున్నపోతుపై హీరో మమకారం, విలన్ పగ, అడిషనల్‌గా గ్రామీణ ప్రేమకథ.
ఈ లైన్‌లోనే కమర్షియల్ కథకి కావాల్సినన్ని ఎలిమెంట్స్ వున్నాయి. కానీ దర్శకుడు మంచాల నాగరాజు పల్లె సంస్కృతి, ఆచారాలు, నమ్మకాలపై చూపిన శ్రద్ధ, కథ కథనాలపై చూపలేదు.
మొదటి అరగంట మంచి సినిమా చూస్తున్న ఫీల్ కలిగించినా తర్వాత గ్రాఫ్ పడిపోతుంది. మళ్లీ లేవదు. కథలో ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి తెలిసిపోయినా, క్లైమాక్స్‌లో కొత్తగా ఏదో జరుగుతుందని ఆశిస్తాడు. కానీ దర్శకుడు ఆ ఆశని కూడా చంపేశాడు.

ఫొటో సోర్స్, INSTA/deepabalu
సహజసిద్ధంగా పల్లె అందాలు
1970 ప్రాంతంలో చిన్నప్ప దేవర్ జంతువులతో సినిమాలు తీసి హిట్ కొట్టేవాడు. ఏనుగు, ఆవు, పొట్టేళ్లు తమ విన్యాసాలతో ప్రేక్షకులను అలరించేవి. తర్వాత జంతువులతో షూటింగ్ చేయడంపై అనేక ఆంక్షలు వచ్చేసరికి గ్రాఫిక్స్ ఖర్చు భరించలేక ఆ కథలను వదులుకున్నారు.
మారెమ్మలో కూడా ఒక రకంగా దున్నే హీరో. శక్తులు చూపడానికి మారెమ్మ తల్లి ఎలాగూ వుంది. ఈ అంశాలతో కథలో సంఘర్షణ వుండి, హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్ బావుంటే సినిమా ఎలివేట్ అయ్యేది. రిపిటేడ్ సన్నివేశాలు, పాత్రలకి బలమైన ఆర్క్ లేకపోవడంతో మంచి ప్రయత్నం విఫలమైంది.
రవితేజ వారసుడిగా వచ్చిన మాధవ్ ఫిజిక్‌లో హీరో మెటీరియల్ ఉంది. పల్లెటూరి కుర్రాడిగా సెట్ అయ్యాడు. కానీ నటనే ప్రశ్నార్థకం. రూరల్ డ్రామాలో ఎమోషన్స్ యాక్షన్‌కు స్కోప్ వుంది కానీ మాధవ్ ఎక్స్‌ప్రెషన్స్ మరీ ప్రాథమికంగానే వున్నాయి. ముందుముందు చూడాలి.
తమిళ నటి దీపాబాలు మంచినటి. అయితే నటించడానికే సన్నివేశాలు లేవు. విలన్‌గా నటించిన వికాస్ వశిష్ట బావున్నాడు. సినిమా మొత్తానికి రూపాలక్ష్మి పాత్ర కాస్త గుర్తుంటుంది. చాలా కాలానికి కనిపించిన వినోద్‌కుమార్ ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయాడు.
అవుట్‌డోర్ సన్నివేశాల్లో, నేచురల్ బ్యూటీని పట్టుకోవడంలో కెమెరామన్ ప్రశాంత్ అంకిరెడ్డి చాలా మటుకు సక్సెస్ అయ్యాడు. పాటలు తెలంగాణ జానపదాల్ని ప్రతిబింబించాయి. బీజీఎం అంతంత మాత్రమే. నిడివి 2 గంటల 15 నిముషాలే. ఇది పెద్ద ఊరట. లోపాలను పక్కన పెడితే సినిమా అంతా నిజంగా పల్లెలో జరిగినట్టే వుంటుంది. ఎక్కడా కృత్రిమంగా కనిపించదు.

ఫొటో సోర్స్, INSTA/deepabalu
ప్లస్ పాయింట్స్:
1.మొదటి అరగంట
2.జానపద పాటలు
మైనస్ పాయింట్స్:
1.కథ, కథనాలు
2.బలహీనమైన క్లైమాక్స్
ఫైనల్‌గా మారెమ్మ కరుణించలేదు.
(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























