‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' మూవీ రివ్యూ: ‘బేబీ’ కాంబో మ్యాజిక్ చేసిందా?

 ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆదిత్య హాసన్, లండన్

ఫొటో సోర్స్, vaishnavi_chaitanya/INSTA

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

'బేబీ' సినిమాతో సంచలనంగా మారిన జోడీ వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ.

'90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్.

ఈ ముగ్గురి కలయికలో 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' సినిమా ప్రేక్షకులు ముందుకొచ్చింది.

కాంబినేష‌న్ ప‌రంగా చాలా ఆస‌క్తికి క‌లిగించిన సినిమా ఇది.

ప్ర‌చార చిత్రాలు చూస్తే.. యువ‌త‌రానికి క‌చ్చితంగా న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. మ‌రి.. ఆ న‌మ్మ‌కం నిజ‌మైందా, ‘బేబీ’ కాంబో మ‌ళ్లీ మ్యాజిక్ చేసిందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దర్శకుడు కావాలనే కలతో...

'90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'లో చిన్న కొడుకు పాత్రకు కొనసాగింపుగా సాగే కథ ఇది. శివాజీ చిన్న కొడుకు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) డిగ్రీ పూర్తి చేసుకొని దర్శకుడు కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు.

అయితే తండ్రి శివాజీ.. ఆదిత్యని లండన్‌కి వెళ్లి ఏడాది పాటు చదువుకోమని సలహా ఇస్తాడు. తండ్రి మాటతో లండన్ వెళ్లిన ఆదిత్యకి కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది.

ఆ పరిచయం లివింగ్ రిలేషన్ కి దారితీస్తుంది. మొదట్లో అంత ఎమోషనల్‌గా లేని అనుబంధం తర్వాత ఎమోషనల్‌గా మారుతుంది. ఈ ప్రేమ ఆ ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? ఆదిత్య దర్శకుడు అయ్యాడా? కడలి ఏం కావాలని కోరుకుంది? అనేది మిగతా కథ.

 ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆదిత్య హాసన్, లండన్

ఫొటో సోర్స్, vaishnavi_chaitanya/INSTA

ఫొటో క్యాప్షన్, ఎపిక్‌లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో,హీరోయిన్లుగా నటించారు.

సెకండ్ సెమిస్టర్‌కు లీడ్ ఉందా?

ప్రేమ, కుటుంబం, పెళ్లంటే భయం, బాధ్యతలు.. ఇలా 90లనాటి యువతలో కనిపించే అంశాలన్నీ ఒకచోట గుదిగుచ్చి కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆదిత్య హాసన్. కాకపోతే ఈ ప్రయత్నంలో బలమైన కథ లేకపోవడంతో ప్రతి ఎమోషన్ విడివిడిగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఒక్క సినిమాగా చూసిన అనుభూతిని అందించదు.

ఇందులోనూ కథ పూర్తి కాదు. ఫస్ట్ సెమిస్టర్‌తోనే ఆపేయడంతో ఇంటర్వెల్‌లోనే శుభం కార్డు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా సెకండ్ సెమిస్టర్‌కి బలమైన లీడ్ ఇవ్వకపోవడం కూడా ఒక చిన్న అసంతృప్తిని కలిగిస్తుంది.

దర్శకుడు ఈ కథని మొదలుపెట్టిన తీరు ఆసక్తికరంగానే ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు తెలుగు భాష గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పే మాటల్ని వాడుకుంటూ టైటిల్స్ వేయడం నిజంగా దర్శకుడి అభిరుచిని తెలియజేస్తుంది.

అలాగే ఎయిర్‌పోర్ట్ దగ్గర ఆదిత్య తన తండ్రిని కౌగిలించుకోవడానికి వెళ్తున్న సమయంలో తండ్రి శివాజీ మొలతాడు కట్టడం.. నిజంగా పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల దృష్టిలో ఇంకా చిన్నవాళ్లే అనే ఒక మంచి మూమెంట్‌ని క్యాప్చర్ చేయగలిగాడు దర్శకుడు.

 ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆదిత్య హాసన్, లండన్

ఫొటో సోర్స్, vaishnavi_chaitanya/INSTA

ఫొటో క్యాప్షన్, హీరోయిన్ క్యారెక్టర్‌ని విభిన్నంగా తెరకెక్కించారు దర్శకుడు.

‘సందీప్ వంగా హీరోయిన్ క్యారెక్టర్’

ఆరంభంలో ఇలాంటి చక్కని డీటెయిల్ ఉంటుంది. కానీ కథ లండన్‌కి షిఫ్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆదిత్య, కడలి కలిశారో.. అక్కడి నుంచి మళ్లీ ఒక రొటీన్ లైన్‌లో పడిపోతుంది.

హీరోయిన్‌కి క్యారెక్టర్‌ని కాస్త వెరైటీగా రాసుకున్నాడు దర్శకుడు. ఆరంభంలో ప్రేక్షకుడికి అంత సులువుగా అందదు. ఆ క్యారెక్టర్‌ని తప్పు పట్టే అవకాశం కూడా ఉంది. నిజంగా ఒకరకంగా అది సందీప్ వంగా హీరోయిన్ క్యారెక్టర్ అనుకోవాలి.

అదే సమయంలో హీరో పాత్రని మరీ అమాయకంగా చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్నికొన్నిసార్లు హీరో అమాయ‌కుడేనా, అలా న‌టిస్తున్నాడా? అనే అనుమానం కూడా కలుగుతుంది.

ఈ రెండు పాత్రల మధ్య ఉన్న వైవిధ్యానికి సరైన సన్నివేశాలు తోడైతే బాగుండేది. కానీ దర్శకుడు సన్నివేశాలు కొత్తగా చూపించడంలో చేసిన వర్క్ అంతగా కనిపించదు. అసలు ఇంటర్వెల్ వరకు మనం ఏ కథ చూస్తున్నామనేది క్లారిటీ ఉండదు.

 ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆదిత్య హాసన్, లండన్

ఫొటో సోర్స్, vaishnavi_chaitanya/INSTA

కెరీర్ గొప్పదా? ప్రేమ గొప్పదా?

సెకండ్ హాఫ్ విష‌యానికొస్తే.. యువతలో జీవితం, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు పట్ల ఉన్న భయాన్ని చూపించడానికి ఈ కథ వాడుకున్నాడు దర్శకుడు.

అదే సమయంలో అమ్మాయి జీవితం, తన మానసిక, శారీరక పరిస్థితులు, రుతుచక్రానికి సంబంధించిన విషయాలు.. ఇవన్నీ ఒక ప్రేమకథలో డిస్కస్ చేసే ఆలోచన బానే ఉంది. కానీ వాటికి సరైన ప్లేస్‌మెంట్ కుదరకపోవడంతో ఆ సన్నివేశాలు కథ నుంచి దూరంగా కనిపిస్తాయి.

క్లైమాక్స్‌కి వెళ్తున్న కొద్దీ కెరీర్ వైపు ఫోకస్ పెట్టాడు దర్శకుడు. ఇక్కడే కెరీర్ గొప్పదా? ప్రేమ గొప్పదా? లాంటి విషయాలు చర్చించాడు.

 ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆదిత్య హాసన్, లండన్

ఫొటో సోర్స్, vaishnavi_chaitanya/INSTA

ఫొటో క్యాప్షన్, సినిమా చాలా భాగం లండన్‌లో తెరకెక్కింది.

క్యూట్ జోడి

ఆదిత్య‌, కడలి పాత్రల చుట్టూనే కథంతా తిరుగుతుంది.నిజానికి దర్శకుడు ఇలాంటి కథలు తీయడం కష్టమే. ఇందులో రెండు పాత్రలే ఉన్నాయి. ఏం చేసినా సరే ఆ రెండు పాత్రల మధ్యలోనే సన్నివేశాలు రాయాలి. ఈ విషయంలో ఆదిత్య హాసన్‌కి ఇంకా అనుభవం రావాలేమో అనిపించింది.

పర్ఫామెన్స్ పరంగా స్క్రీన్ మీద ఆనంద్, వైష్ణవి చైతన్య జోడీ అందంగా ఉంది. శివాజీ, వాసుకి ఎప్పటిలాగే సహజంగా చేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇందులో ఒక కీలక పాత్ర చేశాడు. ఆ పాత్ర సెకండ్ హాఫ్‌లో కొంత సంఘర్షణ తీసుకురాగలిగింది.

హెషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది గానీ పాటలు మరీ అంత క్యాచీగా లేవు. కొన్ని మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి. కానీ అందులో మెలోడీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వదు.

మొత్తం లండన్‌లోనే తీయడంతో ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే లండన్‌లో తీసినప్పటికీ ఒక రెస్టారెంట్, ఇల్లు, ఒక వీధితోనే మొత్తం సినిమా సరిపెట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.

'ఎపిక్' దర్శకుడు కథ కంటే ప్రేమ, స్నేహం, ఆర్థిక ఇబ్బందులు, పెళ్లి, కెరీర్.. ఇలాంటి అంశాల చుట్టూనే దృష్టి పెట్టాడు. అయితే ఇన్ని ఎలిమెంట్స్ ఒకే చోటకి రావడంతో పాత్రల డైరెక్షన్ మిస్ అయింది. దీంతో అసలు ఇందులో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అనేది కూడా కొంతమంది ప్రేక్షకులకు సందేహంగా మిగిలిపోవచ్చు.

ఈ కథని సెమిస్టర్‌గా విడగొట్టి మొదటి సెమిస్టర్ చూపించాడు. ఈ ఫస్ట్ సెమిస్టర్‌లో చేసిన స్కోర్ అంత ఆశాజనకంగా లేదు. కాకపోతే యూత్‌ఫుల్ మూమెంట్స్ ఉంటే సరిపోతుందని భావించే ప్రేక్షకులు ఓసారి ప్రయత్నించొచ్చు.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)