'పిచ్చోనివా.. ఆడపిల్లలకు స్పోర్ట్స్ ఎందుకన్నారు'

జపాన్ ఏసియా గేమ్స్, చికితారావ్, కరీంనగర్, శ్రీనివాస్ రావ్
ఫొటో క్యాప్షన్, పొలం మధ్యలో చికితారావ్ ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసిన ఆర్చరీ టార్గెట్ బట్/బోర్డ్.
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

"నా కూతురుతో ఆర్చరీ ప్రాక్టీస్ చేయిస్తుంటే.. 'నీకు వేరే పనేమీ లేదా, పిచ్చోనివా? ఆటల కోసం అప్పులు చేస్తారా? చదివిస్తే మంచి జాబ్ వస్తుందిగా' అన్నారు. ఇప్పుడు మెడల్స్ వచ్చేసరికి.. వారే శాలువాలు కప్పి సన్మానాలు చేస్తున్నారు, దీంతో నాకు ఒక జీవిత సత్యం అర్థమైంది. అదేంటంటే.. బయటి వ్యక్తులు ఎన్నైనా, ఏమైనా మాట్లాడగలరు. కానీ, మనం నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎవరేమన్నా పట్టించుకోవద్దు"

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో ఆర్చరీ విభాగంలో సెప్టెంబర్ 30న రెండు స్వర్ణ పతకాలు సాధించిన తానిపర్తి చికితా రావ్ తండ్రి తానిపర్తి శ్రీనివాస్ రావ్ మాటలివి.

చికితా రావ్ కుటుంబాన్ని కలిసేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్ గ్రామానికి బీబీసీ వెళ్లినప్పుడు తన పొలంలో శ్రీనివాస్ రావ్ పనిచేస్తూ కనిపించారు. ఆయన వరి పండించే సన్నకారు రైతు. పొలం మధ్యలో తన కూతురు ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసిన ఆర్చరీ టార్గెట్ బట్/బోర్డ్ మాకు కనిపించింది. వర్షానికి తడవకుండా, ఎండకు పాడవకుండా దాన్ని ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచారు.

"మీరొకటి గమనించారా, ప్రస్తుతం చదువుల్లో, క్రీడల్లో ఆడపిల్లలే ఎక్కువగా రాణిస్తున్నారు. అమ్మాయిలు కుటుంబానికి భారం కాదు, వారిని నమ్మి సరైన తోడ్పాటు అందిస్తే మనకు తప్పకుండా గౌరవం తెచ్చిపెడతారని నమ్ముతున్నాను" అని శ్రీనివాస్ రావ్ బీబీసీతో అన్నారు.

స్పోర్ట్స్‌మెన్‌గా రాణించాలనుకున్న శ్రీనివాస్ రావ్ కొంతకాలం వాలీబాల్ ప్రాక్టీస్ చేశారు. సరైన ప్రోత్సాహం లేక అందులో రాణించలేకపోయానని ఆయన తెలిపారు.

చదువుకు తోడుగా స్పోర్ట్ ఉంటే జీవితంలో నిలదొక్కుకోవచ్చనే తన కూతురు చికితా, కొడుకు యశ్వంత్‌లను క్రీడలవైపు తీసుకొచ్చానని శ్రీనివాస్ రావ్ అన్నారు.

ఈ క్రమంలో తనకు అప్పులైనట్లు, ఆస్తులు అమ్మినట్లు, మోసపోయినట్లు చెప్పారాయన. కూతురి కోసం రైలెక్కి దేశ రాజధాని దిల్లీకి వెళ్లారు శ్రీనివాస్ రావ్. ఆ అనుభవాలన్నింటిని ఆయన బీబీసీకి వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జపాన్ ఏసియా గేమ్స్, చికితారావ్, కరీంనగర్, శ్రీనివాస్ రావ్
ఫొటో క్యాప్షన్, జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో ఆర్చరీ విభాగంలో తానిపర్తి చికితా రావ్ రెండు స్వర్ణ పతకాలు సాధించారు.

కరాటే నుంచి ఆర్చరీకి

గతేడాది వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్ అండర్-21లో స్వర్ణ పతకం సాధించిన చికితా రావ్, ప్రస్తుతం ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు.

అయితే, ఆమె స్పోర్ట్స్ కెరియర్ ఐదవ తరగతిలో మార్షల్ ఆర్ట్స్‌తో మొదలైందని, కరాటేలో ఫస్ట్ డాన్ బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరుకున్న తర్వాత ఆర్చరీ క్రీడవైపు మళ్లాల్సి వచ్చిందని తండ్రి శ్రీనివాస్ రావ్ అన్నారు.

"చదువు, ఉద్యోగాల్లో కరాటే సర్టిఫికెట్లకు విలువ లేదు. టీమ్ స్పోర్ట్స్ కాకుండా ఏదైనా వ్యక్తిగత క్రీడలో చేర్చాలని అనుకున్నాను. దీనికోసం ఇద్దరం ఇంటర్నెట్ సెర్చ్ చేసి ఆర్చరీని ఎంచుకున్నాం. నిజం చెప్పాలంటే ఆర్చరీ గురించి అప్పుడు నాకేం తెలియదు. నేషనల్ గేమ్స్ స్థాయికి చేరుకున్న తర్వాత గానీ ఈ ఆటలో ఉన్న ఖర్చు, శ్రమల గురించి మాకు అవగాహన రాలేదు" అన్నారాయన.

జపాన్ ఏసియా గేమ్స్, చికితారావ్, కరీంనగర్, శ్రీనివాస్ రావ్
ఫొటో క్యాప్షన్, ఏమాత్రం అవగాహనే లేని క్రీడలో కూతురిని రాణింపజేసేలా సాగించిన ప్రయాణంలో బంధువులు, గ్రామస్తులు, బయటి వ్యక్తుల నుంచి శ్రీనివాస్ రావ్‌కు అనేక అనుభవాలు ఎదురయ్యాయి.

ఏమాత్రం అవగాహనే లేని క్రీడలో కూతురిని రాణింపజేసేలా సాగించిన ప్రయాణంలో బంధువులు, గ్రామస్తులు, బయటి వ్యక్తుల నుంచి శ్రీనివాస్ రావ్‌కు అనేక అనుభవాలు ఎదురయ్యాయి.

"ప్రొఫెషనల్ విల్లు, బాణం చూడటం అదే మొదటిసారి'' అని తన కూతురు ప్రాక్టీస్ కోసం వాటిని మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చి కొన్న క్షణాలను శ్రీనివాస్ రావ్ గుర్తుచేసుకున్నారు.

"2018లో ఆర్చరీ వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కరీంనగర్ ప్రాంతంలో సరైన సదుపాయాలు, కోచ్ లేరు. విల్లు ఎలా పట్టుకోవాలి, ఎలా ఆడాలన్న బేసిక్స్ ఓ ప్రైవేట్ కాలేజ్ పీఈటీ దగ్గర నేర్పించాను. నేలపైన ఆర్చరీ బట్/ఎయిమ్ బోర్డ్‌ను ఉంచి ప్రాక్టీస్ చేయాలని తెలియక, గోడకు వేలాడదీసి ప్రాక్టీస్ చేసేది. ఈ క్రమంలో కొన్ని బాణాలు విరిగిపోయాయి. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలియలేదు" అన్నారు శ్రీనివాస్ రావ్.

జపాన్ ఏసియా గేమ్స్, చికితారావ్, కరీంనగర్, శ్రీనివాస్ రావ్
ఫొటో క్యాప్షన్, ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన భారత అథ్లెట్లు చికితా తానిపర్తి, ప్రితికా ప్రదీప్, జ్యోతి సురేఖ వెన్నం.

ఇంటర్నెట్‌లో వెతికే క్రమంలో.. నేషనల్ ఆర్చరీ సీనియర్ ప్లేయర్ అభిషేక్ వర్మ గురించి తెలుసుకున్నామన్నారు. కోచింగ్‌లో తమకు సహాయం చేయాలని అనేక మార్లు మెసేజ్‌లు చేస్తే ఆయన భార్య సహకారంతో ఒకసారి అవతలి వైపు నుంచి పాజిటివ్ మెసేజ్ వచ్చిందని శ్రీనివాస్ రావ్ చెప్పారు. వెంటనే తన జీవితంలో మొదటిసారి తన కూతురు కోసం రైలు ఎక్కానని ఆయన తెలిపారు.

ఆ సమయంలో హోటల్‌లో ఉంటూ, ఇంటి నుంచి తెచ్చిన డబ్బులను పొదుపుగా వాడినట్లు, ఒక పూట మాత్రమే ఆహారం తిన్నట్లు శ్రీనివాస్ రావ్ తెలిపారు.

"ఆ సమయంలోనే ప్రయాణాలు, బస, కోచింగ్ ఖర్చుల కోసం హార్వెస్టర్‌ను అమ్మేశాను. కొన్ని అప్పులు కట్టాను" అన్నారు.

జపాన్ ఏసియా గేమ్స్, చికితారావ్, కరీంనగర్, శ్రీనివాస్ రావ్
ఫొటో క్యాప్షన్, చదువుకు తోడుగా స్పోర్ట్ ఉంటే జీవితంలో నిలదొక్కుకోవచ్చనే తన కూతురు చికితా, కొడుకు యశ్వంత్‌లను క్రీడలవైపు తీసుకొచ్చానని శ్రీనివాస్ రావ్ అన్నారు.

దిల్లీ నుంచి వచ్చాక స్వగ్రామం సుల్తాన్‌పూర్‌లో ఇంటి వద్దే చికితా రావ్ ప్రాక్టీస్ చేసేవారు. ఈ క్రమంలో దారి వెంట వెళ్లే గ్రామస్తుల సూటిపోటి మాటలతో వేదన కలిగిందని ఆమె తల్లి తానిపర్తి శ్రీలత అన్నారు.

"పైసలు లేకున్నా ఆటలంటూ ఆడపిల్ల చదువులను చెడగొడుతున్నారు. చదివిస్తే ఏ ఉద్యోగమైనా వస్తుంది, ఆటలతో ఏమొస్తుంది? అని అడిగేవారు. మనిషికో మాట అంటుంటే బాధేసేది. అయితే, నా కూతురు ముందుకే వెళ్ళింది. ఈరోజు మమ్మల్ని గౌరవప్రదమైన స్థానంలో నిలిపింది" అన్నారు శ్రీలత.

"ఏసియన్ గేమ్స్‌లో మెడల్స్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లలను చదివించాలి, ఆడించాలి. దేశంలో ఆడపిల్లలు ముందుకెళ్లాలి" అన్నారామె.

"మహిళా క్రీడల ప్రాధాన్యం తెలియని కొందరు గ్రామస్తులే ఆ రోజుల్లో ఇలాంటి కామెంట్స్ చేశారు. అదే ఆడపిల్ల ఇప్పుడు ఊరి పేరు ప్రపంచవ్యాప్తం చేసింది. ఆర్చరీలో భారత్‌ను ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ వరకు తీసుకెళ్లింది" అని సుల్తాన్‌పూర్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రావ్ అన్నారు.

'కాలం మారింది. ఆలోచన మారాలి. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదు. పట్టుదలతో సాధిస్తున్నారని అర్థం చేసుకోవాలి' అని చికితా రావ్‌కు తాతయ్య వరసయ్యే 70 ఏళ్ల హనుమంత రావ్ అన్నారు.

జపాన్ ఏసియా గేమ్స్, చికితారావ్, కరీంనగర్, శ్రీనివాస్ రావ్
ఫొటో క్యాప్షన్, ఒలింపిక్స్‌లో భారత్ తరపున ఆడే అవకాశం వస్తే, తన కూతురు పతకం తెస్తుందని చికితారావ్ తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

"ఎక్విప్‌మెంట్ కోసం డబ్బులిచ్చి మోసపోయాను"

ఆర్చరీ ఎక్విప్‌మెంట్, కోచింగ్, టోర్నమెంట్స్‌లో పాల్గొనేందుకు ఖర్చుల కోసం బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అందినకాడికి వడ్డీలకు అప్పులు తెచ్చానని శ్రీనివాస్ రావ్ అన్నారు.

''ఆర్చరీ అడ్వాన్స్‌డ్ ఎక్విప్‌మెంట్ కోసం ఒక సీనియర్ ప్లేయర్‌కు లక్షన్నర రూపాయలిస్తే, ఆయన వాటిని ఎగ్గొట్టారు. ఎక్విప్‌మెంట్ ఇవ్వకుండా మోసం చేశారు. అయినా నేను ఆగలేదు. మళ్లీ మూడు లక్షలు అప్పు చేసి కొన్నాను. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేశారు" అన్నారు.

2020లో సబ్ జూనియర్స్ విభాగంలో జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం గెలిచిన తర్వాత చికితా రావ్ హరియాణాలో సోనీపత్‌లోని 'సాయ్' జాతీయ ఎక్సలెన్స్ కోచింగ్ కేంద్రానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె కోచింగ్ అక్కడే కొనసాగుతోంది.

"సాయ్ కోచింగ్ సెంటర్ అడ్మిషన్ చేసే సమయంలో కరోనా వ్యాప్తి ముమ్మరంగా ఉంది. రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారని, సెలవులు ప్రకటిస్తారని తెలిసింది. దీంతో నా కూతురు కోసం ఇంటికి వెళ్లకుండా అక్కడే లాడ్జ్‌లో ఉండిపోయాను. వెంట తెచ్చుకున్న డబ్బులు పొదుపుగా ఖర్చు చేశాను. ఒంటిపూటే తిన్నాను" అన్నారు శ్రీనివాస్ రావ్.

ఒలింపిక్స్‌లో భారత్ తరపున తన కూతురు చికితా పాల్గొంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

"ఆడే అవకాశం వస్తే నా కూతురు కచ్చితంగా ఒలింపిక్ పతకంతో తిరిగి వస్తుంది" అన్నారాయన.

చికితా రావ్
ఫొటో క్యాప్షన్, చికితా రావ్

'చిన్న వయసు నుంచే ఎంకరేజ్ చేయాలి'

జపాన్ ఆసియా క్రీడా గ్రామం నుంచి బీబీసీతో చికితా రావ్ ఫోన్‌లో మాట్లాడారు.

"నాకు ఇవి మొదటి ఆసియన్ గేమ్స్ కావడంతో కాస్త నెర్వస్‌గా అనిపించింది. ఆ తర్వాత కోలుకున్నాను. రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం నమ్మకాన్ని పెంచింది. ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం బాగుంది, దాని కోసం ఇంతకంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది" అని చికితా రావ్ అన్నారు.

'నా తల్లిదండ్రుల సహకారం లేకపోతే ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు. తల్లిదండ్రులంతా వారి పిల్లలను చిన్న వయసు నుంచే క్రీడల్లో ఎంకరేజ్ చేయాలి' అన్నారు చికితా రావ్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)