వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది, అసలు వేళ్లు విరుచుకోవడం అలవాటా, అనారోగ్యమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సాండి ఆంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
చాలామంది తరచూ తమ వేళ్లను విరుస్తుంటారు. దానివల్ల వచ్చే శబ్దం వారికి ఒక రకమైన తృప్తిని ఇస్తుంది.
అయితే వేళ్లు విరిచే అలవాటుపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా దీని వల్ల కీళ్ల వాతం(ఆర్థరైటిస్) వస్తుందని అంటుంటారు.
కానీ, నిజంగా వేళ్లు విరవడం వల్ల కీళ్లకు ఏమైనా శాశ్వత నష్టం జరుగుతుందా?
దీనిపై డాక్టర్ డోనల్డ్ ఉంగర్ ఒక ప్రయోగం చేసి చూశారు.
చిన్నతనంలో డోనల్డ్ ఉంగర్‌ను ఆయన తల్లి, పిన్నమ్మలు, ఆ తర్వాత అత్తగారు నిరంతరం వేళ్లు విరిస్తే కీళ్ల వాతం వస్తుందని హెచ్చరించారు. వారి మాట తప్పు అని నిరూపించే బలమైన సంకల్పంతో ఆయన 50 సంవత్సరాల పాటు రోజుకు కనీసం రెండుసార్లు తన ఎడమ చేతి వేళ్లను విరిచారు.
మొత్తంగా దాదాపు 36 వేల సార్లు వేళ్లు విరిచారు. కుడి చేతిని మాత్రం అస్సలు ముట్టుకోలేదు. 1998లో 72 ఏళ్ల వయస్సులో ఆయన తన జీవితకాల ప్రయత్న ఫలితాన్ని తెలుసుకోవడానికి రెండు చేతులకు ఎక్స్-రే తీయించారు.
"ఏ చేతిలోనూ కీళ్ల వాతం లేదు, రెండు చేతుల మధ్య ఎలాంటి స్పష్టమైన తేడా లేదు" అని ఆయన కనుగొన్నారు. అయితే , ఇది ఒక్క వ్యక్తిపై మాత్రమే చేసిన ప్రయోగం. సర్వేల ప్రకారం దాదాపు 20 నుంచి 50 శాతం మంది ప్రజలు తమ వేళ్లను విరుస్తుంటారు.
మరి ఇది మనం ఆందోళన చెందాల్సిన విషయమేనా? వేళ్లు విరవడం వల్ల వచ్చే శబ్దంతో ఏమైనా శాశ్వత నష్టం జరుగుతుందా?


ఫొటో సోర్స్, Getty Images
శబ్దం ఎందుకు వస్తుంది?
కొంతమందికి వేళ్లు విరవడం ఆలోచించకుండా చేసే ఒక అలవాటు. మరికొందరికి కీళ్లు విరవడం వల్ల కలిగే అనుభూతి నచ్చుతుంది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కైరోప్రాక్టిక్ అడ్జస్ట్‌మెంట్ వీడియోలను చూస్తే, 'విరిచినప్పుడు వచ్చే శబ్దం' విని ఆనందించేవారు చాలామంది ఉన్నారని అర్థమవుతుంది.
మన కీళ్లను విరిచినప్పుడు చాలా సాధారణమైన ప్రక్రియ జరుగుతుంది. రెండు ఎముకలు కలిసే చోటునే కీలు అంటారు.
మన వేళ్ల కణుపులు, మెడ, వీపు భాగాల్లో ఉన్న కీళ్ల చుట్టూ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది గుడ్డులోని తెల్లసొన లాంటి పదార్థం. కీళ్లకు జిడ్డు (లూబ్రికెంట్) లాగా పనిచేస్తుంది.
కీళ్లను విరవడానికి వాటిని తిప్పినా, లాగినా లేదా వంచినా కీలు లోపల ఉండే ఖాళీ కొంత పెరుగుతుంది. దీనివల్ల సైనోవియల్ ఫ్లూయిడ్‌లో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా ఫ్లూయిడ్‌లో వాయువులు బుడగలుగా బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఈ బుడగలు పగిలిపోవడం వల్లే వేళ్లువిరిచినప్పుడు టిక్ మనే శబ్దం వస్తుంది.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ శబ్దం 83 డెసిబుల్స్ వరకు పెరగొచ్చు.
గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వెళ్లే డీజిల్ ట్రక్ చేసే శబ్దంతో ఇది దాదాపు సమానం.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (డేవిస్) శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్ ఉపయోగించి వేళ్లు విరుస్తున్న కీలును పరిశీలించినప్పుడు, ఆ 'శబ్దం వచ్చే క్షణాన్ని' స్క్రీన్ పై బాణసంచా కాలినట్లుగా అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
హాని కలిగించని అలవాటు
,కీళ్లు విరిచినప్పుడు వచ్చే శబ్దం 'కేవలం ఒక సాధారణ శారీరక ప్రక్రియ' అంటారు బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీరుమటాలజిస్ట్ కిమే హైరిచ్.
అయితే సాధారణమైనది అయినంత మాత్రాన ఎల్లప్పుడూ హాని కలిగించదని అనుకోవచ్చా?
"కచ్చితంగా కీళ్లలో నొప్పి లేదా వాపు వంటి కొన్ని ప్రమాద సంకేతాలు ఉండవచ్చు" అని అమెరికాలోని మిషిగన్‌కు చెందిన న్యూరోసర్జన్ జే జగన్నాథన్ చెప్పారు.
మెడను చాలా బలంగా విరిచిన తర్వాత నరాల ఒత్తిడి, ఇతర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగులను ఆయన చూశారు. అలా చేయడం ఏమాత్రం మంచిది కాదని సూచించారు.
"సాధారణంగా కీళ్లను విరవాలనిపించడాన్ని హానిరహితమైనదిగానే చూస్తారు’’ అని జగన్నాథన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బలంగా వేళ్లు విరవడం వల్ల వేళ్లు స్థానభ్రంశం చెందుతాయేమోనని కొంతమంది ఇప్పటికీ ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఎక్కువ బలాన్ని ఉపయోగించినప్పుడు లేదా వేలును హఠాత్తుగా లాగినప్పుడు అది పొరపాటున కీలు నుండి విడిపోయే ప్రమాదం ఉందంటారు.
నిజానికి ఇలాంటి కేసులు కూడా నమోదయ్యాయి. ఉదాహరణకు 1999లో ఫిలడెల్ఫియాకు చెందిన ఒక హ్యాండ్ సర్జన్ తెలిపిన వివరాల ప్రకారం, వేళ్లు విరిస్తే వచ్చే శబ్దాన్ని వినాలని ఆత్రుతగా వేళ్లు విరిచిన ఇద్దరు రోగులకు కీలు మడతపడి నరాల నొప్పులకు గురయ్యారు
అయితే తక్కువ బలంతో విరిచినప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.
అయినప్పటికీ తరచూ కీళ్లు విరిచేవారు ఎక్కువగా ఆందోళన చెందేది ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుందేమోనని, ఇది కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వచ్చే అత్యంత సాధారణ ఆర్థరైటిస్ రకం.
కార్టిలేజ్ కీళ్ల వద్ద ఎముకలకు మెత్తటి దిండులా రక్షణ ఇచ్చే కణజాలం.
"నా క్లినిక్‌లో, భోజన సమయంలో చాలామంది నన్ను దీని గురించే అడుగుతుంటారు. దానికి సూటిగా చెప్పే సమాధానం ఏమిటంటే అలా జరగదు" అని హైరిచ్ అన్నారు.
అనేక అధ్యయనాలు ఈ పాత నమ్మకాన్ని తప్పు అని నిరూపించాయి. 1975లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పరిశోధకులు నర్సింగ్ హోమ్‌లో ఉండే 28 మందిపై పరిశోధన చేశారు. తరచూ వేళ్లు విరిచేవారిలో డిజెనరేటివ్ ఆర్థరైటిస్ వచ్చే రేటు, అలా విరవని వారితో సమానంగానే ఉందని కనుగొన్నారు.
ఇటీవల జరిగిన ఒక రెట్రోస్పెక్టివ్ అధ్యయనంలో ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న 215 మంది రోగుల వేళ్లు విరిచే అలవాటును పరిశీలించారు. ఈ వ్యాధి లేనివారితో వారిని పోల్చి చూశారు.
దీని నుంచి కూడా అదే ఫలితం వచ్చింది. ఒక వ్యక్తి జీవితకాలంలో ఎన్నిసార్లు, ఎంతకాలం వేళ్లు విరిచారు అనే అంశం వారికి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ప్రమాదంపై ఎటువంటి ప్రభావం చూపలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్య సమస్యలతో ముడిపడి ..
వేళ్లు విరవడానికి సంబంధించిన మరొక ప్రమాదం ఏమిటంటే, ఇది మీ పట్టుత్వ బలం (గ్రిప్ స్ట్రెంత్)పై ప్రభావం చూపుతుంది. ఇది గుండె జబ్బులు, ఆలోచనా శక్తి తగ్గడం, డిప్రెషన్, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ఆరోగ్య కొలమానం.
1990లో 18 నుంచి 60 సంవత్సరాలుగా వేళ్లు విరుస్తున్న 74 మందిపై ఒక అధ్యయనం జరిగింది.
వేళ్లు విరవని వారితో పోలిస్తే, ఇలా వేళ్లు విరిచే వారి చేతి పట్టుత్వం బలహీనంగా ఉండి, చేతుల్లో వాపు ఎక్కువగా ఉన్నట్లు ఇందులో కనుగొన్నారు.
అయితే 2017లో ఈ ఫలితాలు తప్పని నిరూపితమయ్యాయి. మరొక అధ్యయనంలో వేళ్లు విరవడానికి, పట్టుత్వం బలహీనపడటానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలింది.
దీని గురించి ఇంకా అనేక అపోహలు ఉన్నాయి. కానీ అవ్వన్నీ తప్పు అని హైరిచ్ చెప్పారు. పైన పేర్కొన్న అల్ట్రాసౌండ్ అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధరిస్తుంది. వైద్యులు వేళ్లు విరిచే వారిని శారీరకంగా పరీక్షించినప్పుడు వారికి ఎలాంటి వాపు లేదా ఏ విధమైన సమస్యా కనిపించలేదు.
కొంతమందికి వేళ్లు విరవడం వల్ల ఉపశమనం లభించవచ్చు, కీళ్ల కదలికల్లో కొంత సమయం మెరుగుదల రావచ్చు. దీనివల్ల కీళ్లు సాగి, ఎక్కువ కోణంలో కదలగలుగుతాయి.
వేళ్లు విరవడం వల్ల కీలు చుట్టూ ఉండే నరాల కొసలు ఉత్తేజితమై, చుట్టుపక్కల ఉండే కండరాలు ఉపశమనం పొందుతాయని, నొప్పులు తగ్గి ఎండోర్ఫిన్లు విడుదలవుతాయని ఒక సిద్ధాంతం ఉంది. కానీ ఈ విషయం ఇంకా నిరూపితం కాలేదు.
వేళ్లు విరవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు కాబట్టి, దీన్ని నిలిపివేయడానికి ప్రత్యేక కారణమేదీ లేదు.
అయినప్పటికీ మీరు దీన్ని ఆపాలనుకుంటే, మీరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకుని, దాన్ని చేయకుండా ఉండటానికి మార్గాలు వెతికేందుకు కాగ్నిటివ్ థెరపీ వంటి పద్ధతులతో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలని జగన్నాథన్ సూచిస్తున్నారు.
మొత్తంమీద వేళ్లు విరవడం కీళ్లకు హానికరం కాదని హైరిచ్ చెప్పారు. మీ వేళ్లు విరిచే అలవాటు మీ స్నేహితులకు తీవ్ర అసహనం కలిగిస్తే, ఇది కేవలం మీ వ్యక్తిగత సంబంధాలపై మాత్రమే చెడు ప్రభావం చూపవచ్చని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























