'ఈ ఏడాదే పెళ్లి చేద్దామనుకున్నాం.. కానీ, ఇంతలోనే..'- యుక్రెయిన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశా యువకుడి తల్లిదండ్రులు ఏం చెప్పారు?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
మాస్కోపై యుక్రెయిన్ చేసిన డ్రోన్ దాడిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని గంజాం జిల్లా చికిటి బ్లాక్‌లోని మాధభండ్ గ్రామానికి చెందిన రమేయ అనే యువకుడు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు సోమవారం (మే 18న) తెలిపారు.
కుటుంబ పోషణ కోసం రష్యాకు వెళ్లిన రమేయ, అక్కడ ఒక రష్యన్ కంపెనీలో పని చేస్తున్నారు.
కంపెనీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా... అకస్మాత్తుగా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అందులో రమేయ ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆయన మరణించాడనే విషయం ఆయన స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది.

రమేయ రష్యా ఎందుకు వెళ్లారు?
రమేయ కుటుంబ పోషణ కోసం... రష్యాలోని గజ్‌ప్రోమ్ ఆయిల్ రిఫైనరీలోని ఒక నిర్మాణ సంస్థలో స్ట్రక్చర్ ఫిట్టర్‌గా ఏడాదికి పైగా పని చేస్తున్నారని రమేయ సమీప బంధువు బిశ్వజీత్ బీబీసీతో చెప్పారు.
"ఇటీవలే రష్యా నుంచి సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. మళ్లీ నెలన్నర రోజుల కిందటే రష్యాకు వెళ్లాడు" అని బిశ్వజీత్ తెలిపారు.
'' రమేయ స్నేహితుల నుంచి ఫోన్ వచ్చింది. డ్రోన్ దాడిలో రమేయ చనిపోయాడు. దాడి జరిగిన తర్వాత ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మరణించాడని తెలిపారు. ఆ విషయం విన్న మాకు అసలేమీ అర్ధం కాలేదు. రమేయతో పాటు గంజాం జిల్లాలోని రంగైలుండా బ్లాక్ పరిధిలోని కొఠార్సింగ్ గ్రామానికి చెందిన జి.తేజేశ్వర్ రెడ్డి (22), జి. ఖేత్రబాసి రెడ్డి (35)లు కూడా ఆ దాడిలో గాయపడ్డారని... వారికి అక్కడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని తెలిపారు'' అని బిశ్వజీత్ బీబీసీకి చెప్పారు.
రాత్రి షిఫ్ట్ ముగించుకుని బస్సు కోసం ఎదురుచూస్తుండగా... డ్రోన్ దాడి జరిగిందని రమేయ స్నేహితులు తమతో చెప్పారని తెలిపారు.
రమేయ మరణ వార్త తెలిసిన వెంటనే మాధభండ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

‘ఈ ఏడాది వివాహం చేద్దామని..’
ఈ ఏడాది తన కొడుక్కి వివాహం చేయాలని అనుకున్నామని రమేయ తండ్రి నీమా బీబీసీతో అన్నారు. బిశ్వజీత్ ఫోన్ నుంచే నీమా కూడా బీబీసీతో మాట్లాడారు.
''మార్చి చివర్లోనే (మార్చి 22న) మావాడు రష్యా వెళ్లాడు. ఇప్పుడు చనిపోయాడని అంటున్నారు..'' అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
"మా అబ్బాయితో పాటు కలిసి పని చేస్తున్న అతని స్నేహితులు ఆ కంపెనీ నుంచే ఫోన్ చేసి చెప్పేవరకు మేము నమ్మలేకపోయాం" అని రమేయ తండ్రి తెలిపారు.
నీమా మాధభండ్ గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నారు.
"ప్రతి రోజు డ్యూటీకి వెళ్లే ముందు మాతో మాట్లాడతాడు. శనివారం డ్యూటీకి వెళ్లే ముందు వాళ్లమ్మతో మాట్లాడాడు" అని నీమా గుర్తు చేసుకున్నారు.
''కనీసం మా అబ్బాయి మృతదేహాన్ని మాకు అప్పగిస్తే ఇక్కడ మా ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరుపుకుంటాం. ఇదైనా మాకు మిగిలితే చాలు. ఈ విధంగానైనా మా బాబు చివరి చూపు చూసుకుంటాం. ఎవరైనా అధికారులతో మాట్లాడి మా అబ్బాయి మృతదేహమైనా త్వరగా వచ్చేటట్లు చూడండి" అంటూ నీమా అన్నారు.

కలెక్టర్ ఏమన్నారంటే...
రమేయ మృతదేహాన్ని తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు గంజాం జిల్లా కలెక్టర్ కీర్తి వాసన్‌ను సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు.
"రమేయ మాస్కోలో మృతి చెందిన విషయం మాకు తెలిసింది. దిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించాం. భారత రాయబార కార్యాలయంతో దౌత్య మార్గాల్లో మాట్లాడి మృతదేహాన్ని ఒడిశాకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం" అని కలెక్టర్ మీడియాకు తెలిపారు.
మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, X/IndEmbMoscow
రష్యా సంతాపం
భారతీయ కార్మికుడి మృతిపై భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం తమ అధికారిక అకౌంట్‌లో సంతాపం వ్యక్తం చేసింది.
"మాస్కో ప్రాంతంలో పౌరులు నివసించే భవనాలు, కార్యాలయాలపై జరిగిన యుక్రెయిన్ దాడిలో మరణించిన భారతీయ కార్మికుడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























