బంగారు ఇటుకలు, లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు: ఓ గూఢచారి ఘరానా మోసం..

ఫొటో సోర్స్, Alexandria Sheriff's Office
- రచయిత, మాక్స్ మట్జా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇంట్లో వందలాది బంగారు ఇటుకలను దాచినందుకు అరెస్ట్ అయిన సీఐఏ మాజీ అధికారి, అమెరికా ప్రభుత్వాన్ని సుమారు 200 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 1,900 కోట్లు మోసం చేసినట్లు ఒప్పుకున్నారు.
ఈ భారీ కుంభకోణం నకిలీ కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ లావాదేవీల రూపంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.
అగ్రిమెంట్ ప్రకారం.. 49 ఏళ్ల డేవిడ్ రష్ అమెరికా ప్రభుత్వానికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేరంతో సంబంధం ఉన్న విలాసవంతమైన ఇళ్లు, కార్లు, గడియారాలు, ఇతర ఆస్తులను కూడా ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.
ఒక విదేశీ ప్రభుత్వానికి రహస్య సమాచారాన్ని అందించినట్లు కూడా రష్ అంగీకరించారు. దీనివల్ల జాతీయ భద్రతకు "తీవ్రమైన నష్టం"జరిగే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు అంటున్నారు.
"నిందితుడు నేరాన్ని ఒప్పుకుంటాడు" అని ఒప్పందంలోని నిబంధనలను వివరిస్తూ ప్రాసిక్యూటర్లు కోర్టులో దాఖలు చేసిన పత్రంలో తెలిపారు.

రష్ తరఫు న్యాయవాదిని బీబీసీ సంప్రదించింది. అయితే ఆయన ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.
మొదట ప్రభుత్వ నిధులను దొంగిలించినట్లు రష్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు వైర్ ఫ్రాడ్ అంటే ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఆయన మోసాలకు పాల్పడినట్లు నమోదైన ఆరోపణపై నేరాన్ని అంగీకరించారు.
రష్‌ను అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో 298 బంగారు ఇటుకలు లభించాయి. ఆ బంగారం తన పని ఖర్చుల కోసం ఇచ్చారని రష్ చెప్పారు.
ఈ ఒప్పందానికి సంబంధించిన కోర్టు పత్రాల్లో ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూశాయి.
ఒక విదేశీ అధికారికి సీక్రెట్ హ్యూమన్ సోర్స్ ఉన్నాడనే విషయాన్ని, ఆ వ్యక్తి గుర్తింపుకు సంబంధించిన సమాచారాన్ని రష్ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు.
"ఈ సమాచారం బయటకు రావడం వల్ల ఆ రహస్య వ్యక్తికి, అతనితో కలిసి పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ అధికారులకు ప్రాణహాని, భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి రహస్య వ్యక్తులను నియమించుకునే అమెరికా ప్రభుత్వ సామర్థ్యంపై కూడా ప్రభావం పడవచ్చు" ప్రాసిక్యూటర్లు తమ డాక్యుమెంట్స్‌లో తెలిపారు.
"రష్ తన పదవిని దుర్వినియోగం చేసి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడు. అతను చేసిన పనులకు పూర్తిగా బాధ్యుడిని చేయాలి" అని ఒక పత్రికా ప్రకటనలో సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ పేర్కొన్నారు.
నవంబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య రష్ "పని సంబంధిత ఖర్చుల" కోసం పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ, కోట్లాది డాలర్ల విలువైన బంగారు ఇటుకలను పదేపదే అడిగారని ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది.
దక్షిణ ఫ్లోరిడాలో ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసేందుకు రష్ ఒక రహస్య కార్యక్రమం పేరుతో నకిలీ కథను సృష్టించాడు. ఆ ఆస్తులను తర్వాత వ్యక్తిగత లాభం కోసం అమ్మాలన్నది ఆయన ఉద్దేశమని ఈ ఒప్పందానికి సంబంధించిన కోర్టు డాక్యుమెంట్స్‌లో ఉంది.
"రష్ తనకు తాను అనుమతి ఇచ్చే అధికారిలా వ్యవహరించాడు" అని ఆ డాక్యుమెంట్ పేర్కొన్నారు. దీంతో సరైన పర్యవేక్షణ లేకుండానే అమెరికా ప్రభుత్వానికి చెందిన భారీ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఆయనకు లభించింది.
ఆ తర్వాత ఆయన మోసం చేసి పొందిన ప్రభుత్వ డబ్బుతో దక్షిణ ఫ్లోరిడాలో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశారు. ఈ మోసంలో ఒక ఆస్తి కోసం ఇంటీరియర్ డిజైనర్‌ను నియమించడం, 40,000 డాలర్ల విలువైన వంటగది పరికరాలను కొనుగోలు చేయడం కూడా ఉన్నట్లు కోర్టు డాక్యుమెంట్లు చెబుతున్నాయి.
వైర్ ఫ్రాడ్ ఆరోపణ 2026 జనవరిలో రష్ చేసిన 4.5 కోట్ల డాలర్ల బదిలీకి సంబంధించింది.
"రష్ ఒక విదేశీ ప్రభుత్వానికి చెందిన, ఆ సమాచారాన్ని పొందేందుకు అనుమతి లేని, దాని అవసరం కూడా లేని అధికారికి అత్యంత రహస్యమైన సమాచారాన్ని అందించాడు" అని కూడా ఈ ఒప్పందంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, US Department of Justice
బంగారు ఇటుకలతో పాటు రష్ వద్ద 20 లక్షల డాలర్ల నగదు, 35 ఖరీదైన లగ్జరీ వాచ్‌లు కూడా లభించాయి.
సులభంగా కొనుగోలు చేసి, అమ్మగలిగే వస్తువులుగా డబ్బును రష్ మార్చుతున్నారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. డబ్బును దాచిపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనడానికి "బలమైన ఆధారాలు" ఉన్నాయని వారు చెప్పారు.
ఆ వాచ్‌లతోపాటు ప్రభుత్వానికి తన రెండు బీఎండబ్ల్యూ కార్లను కూడా రష్ అప్పగించాలి. అంతేకాకుండా 20 లక్షల డాలర్ల నగదు, ఆయన బ్యాంకు ఖాతా నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 3.9 కోట్ల డాలర్లను కూడా ప్రభుత్వానికి అప్పగించాలని ఒప్పందంలో ఉంది.
తర్వాత ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి రష్‌కు శిక్షను ఖరారు చేస్తారు. ఈ కేసులో గరిష్ఠంగా 20 ఏళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఫెడరల్ చట్టం ప్రకారం ఈ శిక్ష ఇంకా పెరగవచ్చని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
రష్ గత వృత్తిని దృష్టిలో ఉంచుకుని, ఆయన దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని జూన్‌లో మేజిస్ట్రేట్ జడ్జి విలియం ఫిట్జ్‌పాట్రిక్ చెప్పారు. అందుకే విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ని జైలులో ఉంచాలని ఆదేశించారు.
" చట్ట సంస్థలకు చిక్కకుండా అతను సులభంగా పారిపోగలడు" అని ఆయన అన్నారు.
కోర్టు రికార్డుల్లో సీఐఏ కోసం రష్ చేసిన పనికి సంబంధించిన వివరాలు పెద్దగా లేవు. అయితే వర్జీనియాలో ఉన్న ఒక అమెరికా ప్రభుత్వ సంస్థలో ఆయన గతంలో సీనియర్ అధికారిగా పనిచేశారని, ఆయనకు టాప్ సీక్రెట్ భద్రతా అనుమతి, రహస్య సమాచారాన్ని పొందే అధికారం ఉన్నట్లు పేర్కొన్నారు.
అమెరికా మీడియా కూడా ఆయన గతంలో సీఐఏలో పనిచేసిన విషయాన్ని ధృవీకరించింది.
ఆయన సీఐఏలోని సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టరేట్‌లో సీనియర్ అధికారిగా పనిచేశారని, ఈ విభాగం అత్యాధునిక గూఢచర్య పరికరాలను అభివృద్ధి చేస్తుందని ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
రష్‌పై ఇంతకుముందు కూడా ఆరోపణలు ఉన్నాయి. అమెరికా నేవీ నుంచి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసిన తర్వాత జీతంతో కూడిన మిలిటరీ సెలవులను మోసపూరితంగా తీసుకున్నారని, 2009లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో తన విద్య, సైనిక సేవ గురించి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
ఉద్యోగం ఇచ్చేవారికి తాను నేవీ పైలట్ అని అబద్ధం చెప్పినట్లు కూడా రష్‌పై ఆరోపణలు ఉన్నట్టు కోర్టు రికార్డుల్లో ఉంది.
రష్ తన సైనిక, విద్యకు సంబంధించి చేసిన ఈ ఆరోపణలు, ఇతర వాదనలు కూడా అబద్ధాలే అని ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.
దరఖాస్తు ఫామ్‌లో అబద్ధాలు చెప్పినప్పటికీ, బ్యాగ్రౌండ్ చెక్‌లో రష్ ఎలా ఉత్తీర్ణుడయ్యారనేది స్పష్టంగా తెలియదు.
రష్ బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో ఎలా ఉత్తీర్ణుడయ్యారనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
భారీ మొత్తంలో డబ్బుకు ఇప్పటికీ లెక్క తెలియలేదని అమెరికా ప్రభుత్వం గతంలో ఆరోపించింది. అయితే రష్ తరఫు న్యాయవాది ఈ ఆరోపణను ఖండించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























