కేరళలో వర్షాలు లేని ప్రాంతంలో ముంచెత్తిన వరదలకు ఆరుగురు మృతి...అసలు ఎందుకిలా జరిగింది?

ఫొటో సోర్స్, Hameed Ali
- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ రిపోర్టర్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
కేరళలోని మలప్పురం జిల్లాలో కొట్టపుళ నదిలో ఆకస్మికంగా వచ్చిన వరద కారణంగా ఒక మహిళ సహా ఆరుగురు మృతి చెందారు. చుక్క వర్షం కూడా కురవని ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇంతమంది చనిపోవడం ఇప్పుడు కేరళలో చర్చనీయాంశంగా మారింది.
నీలగిరిలో కురిసిన భారీ వర్షాల కారణంగానే నదిలో ఆకస్మిక వరదలు వచ్చి ఉంటాయని కేరళకు చెందిన పర్యావరణవేత్త హమీద్ అలీ బీబీసీతో చెప్పారు. పర్యాటకులు స్థానిక భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకొని పర్యటనలు చేయడం మేలని ఆయన సూచిస్తున్నారు.
ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఆ ప్రాంతంలో రద్దీ సర్వసాధారణమని వరదలు వచ్చిన సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న అంబులెన్స్ డ్రైవర్ మజీద్ బీబీసికి తెలిపారు.
ఆకస్మిక వరదల గురించి అవగాహన లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు.
ఇది ఊహించని ప్రకృతి వైపరిత్యమని, ప్రజలకు ముందుగానే తెలియజేసే అవకాశం లేకుండా పోయిందని ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేరళ ముఖ్యమంత్రి సతీశన్ అన్నారు.


ఫొటో సోర్స్, Kerala Government
అందమైన ప్రాంతం, పొంచి ఉన్న ప్రమాదం
కేరళలోని మలప్పురం జిల్లాలో నిలంబూర్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకాడు-అమరంబలం గ్రామపంచాయతీల సరిహద్దు ప్రాంతం గుండా కొట్టపుళ నది ప్రవహిస్తోంది. ఒళవట్టం కడవు, టి.కె. కాలనీ ప్రాంతాల మీదుగా సాగుతుంది. చుట్టూ దట్టమైన అడవులు, తోటలతోపాటు ఒక చెక్ డ్యామ్ కూడా ఉంది. ఎన్నో ప్రకృతి సుందర ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తాయి.
ఎన్నో ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామస్థులు ఉపయోగిస్తున్న టి.కె. కాలనీ డ్యామ్, ఇటీవల సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. కేరళ ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రదేశంగా గుర్తించనప్పటికీ, సెలవుల్లో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారని స్థానికులు చెప్పారు.
గత ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పూదోట్టం కడవు నుంచి టి.కె. కాలనీ దిగువ ప్రాంతం వరకు వంద మందికిపైగా పర్యాటకులు స్నానం చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షం పడకపోయినా, నిమిషాల వ్యవధిలోనే నది నీటి మట్టం అనూహ్యంగా పెరిగిందని మలప్పురానికి చెందిన జర్నలిస్ట్ గోపు బీబీసీకి చెప్పారు.
‘‘వరద నీరు పెరగడంతో, చాలామంది రాళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి తాళ్లు, పొడవైన కర్రలను ఉపయోగించి వారిని ఒడ్డుకు చేర్చారు. అక్కడి పెద్ద రాళ్లు చాలామంది ప్రాణాలు కాపాడాయి’’ అని జర్నలిస్ట్ గోపు అన్నారు.
నదిలో స్నానం చేస్తున్న స్థానిక మహిళతో సహా 9 మంది కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) ఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానికుల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది ముగ్గుర్ని రక్షించారు. మిగిలిన ఆరుగురు మరణించారు. వారిలో ఐదుగురి మృతదేహాలను అదే రోజు వెలికితీశారు. ఓ మహిళ మృతదేహం సెప్టెంబర్ 22న దొరికింది.

ఫొటో సోర్స్, Getty Images
ఘటన జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్న కేరళ ముఖ్యమంత్రి, సహాయక చర్యల గురించి విలేఖరులకు వివరించారు.
‘‘ఆ సమయంలో వర్షం లేదు. అకస్మాత్తుగా నది ఉప్పొంగి ఆరుగురి ప్రాణాలు బలిగొంది. ఆ ప్రదేశం గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రంకాదు. కానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల కారణంగా చాలామంది అక్కడికి వస్తుంటారు’’ అని కేరళ ముఖ్యమంత్రి సతీశన్ వివరించారు.
ఆ ప్రాంతంలో వరదల గురించి ప్రజలకు ముందుగా ఎందుకు హెచ్చరిక ప్రకటన చేయలేదని మీడియా ప్రశ్నించగా, ‘‘తీర ప్రాంతాలు కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలు, భారీ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో వాతావరణ సూచన ఆధారంగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తాం. కానీ, వర్షం పడే అవకాశం ఏమాత్రం లేని 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, కొండపై కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నదిలో వచ్చిన ఆకస్మిక వరద మరణాలకు కారణమైంది’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
వర్షం లేకుండా ఆకస్మిక వరదలు
‘‘ఈ నదికి పోక్కొట్టుంబాడం అనే పేరు కూడా ఉంది. మోసగించే నది అని దీని అర్థం. ఎందుకంటే సాధారణంగా ప్రశాంతంగా ప్రవహించే ఈ నది, ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటివరకు కొట్టపుళ నదిలో వివిధ సందర్భాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి. నది ప్రమాదకర స్వభావాన్ని తెలియజేస్తూ ఒళవట్టం ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కానీ దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని స్థానిక జర్నలిస్టు బీబీసీకి చెప్పారు.
రక్షణ చర్యలు ఎలా చేపట్టారో సహాయక చర్యల్లో పాల్గొన్న అంబులెన్స్ డ్రైవర్ మజీద్ వివరించారు.
‘‘ఆ రోజు ఆదివారం కావడంతో అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఎలాంటి వర్షం పడలేదు. ఎండగానే ఉంది. అయితే కొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వరదలు వచ్చి ప్రజలు చిక్కుకుపోయారు. మేం అక్కడికి చేరుకునేలోపే స్థానికులు కొందర్ని రక్షించారు’’ అని మజీద్ తెలిపారు.

ఫొటో సోర్స్, Hameed Ali
నీలగిరిలో కురిసిన వర్షమే కారణమా?
కేరళలో ఆరుగురి ప్రాణాలు తీసిన కొట్టపుళ నది భౌగోళిక స్వరూపాన్ని, అది పుట్టిన నీలగిరి పర్వతాల గురించి కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, పర్యావరణవేత్త అయిన హమీద్ అలీ ఒక పటం సహాయంతో బీబీసీకి వివరించారు. పశ్చిమ కనుమల పరిరక్షణ, దాని ప్రత్యేకతలను వివరిస్తూ ఒక యూట్యూబ్ చానెల్‌ను కూడా నడుపుతున్నారు.
‘‘కొట్టపుళ నది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న అప్పర్ భవానీ రిజర్వాయర్‌లో పుట్టి, అంకింద శిఖరం నుంచి పశ్చిమ దిశగా పాలక్కాడ్ జిల్లాలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో ఉన్న భంగి థాపల్, నడుకన్ వ్యూపాయింట్, సిస్పారాల గుండా ప్రవహిస్తోంది. ఆ ప్రాంతాల్లో, ఆదివారం అట్టపాడిలో భారీ వర్షాలు కురిశాయి. అదే ఆ వరదలకు కారణం’’ అని హమీద్ అలీ బీబీసికి వివరించారు.
ఒక ప్రాంతంలో వర్షం లేకపోయినా దట్టమైన అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం కేరళకు కొత్తేమీ కాదని హమీద్ అలీ అంటున్నారు. పశ్చిమ కనుమల భౌగోళిక స్వరూపం కారణంగా లోపలి అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అందుకే వర్షం జాడ లేకపోయినా అడవుల్లో కురిసే భారీ వర్షాల వల్ల నదుల్లో ఆకస్మిక వరదలు రావచ్చని అన్నారు.
ఇలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సందర్శకుల వివరాల నమోదు, రాకపోకల సమయాల నమోదు, వాతావరణ హెచ్చరిక జారీ, ఎక్కువ ముప్పు ఉన్న ప్రదేశాల్లో ప్రవేశాలను పరిమితి విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని కేరళ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























