You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ అగ్ని ప్రమాదం: వైద్యం కోసం విదేశీయులు ఇండియాకు ఎందుకు వస్తున్నారు?
- రచయిత, పవన్ కాంత్ దిగవల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
భారత్‌లో మెడికల్ టూరిజం వృద్ధి చెందుతోంది. చికిత్సల కోసం సరిహద్దులు దాటి వచ్చే విదేశీయులకు ఇండియాలో కొంత తక్కువ ఖర్చుతో వైద్యం అందడమే ఇందుకు కారణం. ఆఫ్రికా,పశ్చిమాసియాదేశాల ప్రజలు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం లభించే ఇండియావైపు మొగ్గు చూపుతున్నారు.
ఇలా వైద్యం కోసం ఇండియాకు వచ్చిన కొందరు విదేశీయులకు దిల్లీ మాలవీయనగర్‌లోని హౌజ్‌రాణి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మరణించిన, గాయపడిన బాధితులకు చెందిన బంధువులు కొందరు తాము వైద్యం కోసం వచ్చినట్లు మీడియాతో చెప్పారు.
కాగా ఈ ప్రమాదంలో 13 మంది విదేశీ పౌరులు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. 20 నుంచి 22 మంది విదేశీ పౌరులు గాయపడ్డారని చెప్పారు.
భారీగా ఎగసిపడిన మంటల కారణంగా దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
భవనంలో ఉన్న మరో 47 మందిలో కొందరు పైఅంతస్తుల నుంచి కిందకు దూకేయగా, ఇంకొందరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ధైర్యంగా లోపలికి వెళ్లి బయటకు తీసుకురాగలిగారు.
పరుపులతో ప్రాణాలు దక్కాయి
హోటల్ ఎదురుగా ఉన్న పరుపుల దుకాణం యజమాని, షాపులోని పరుపులన్నీ రోడ్డు మీద పరిచి పైనుంచి దూకుతున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆయన పరుపులన్నీ రోడ్డు మీద పరిచేయడంతో భవనంపైనుంచి కిందకు దూకిన ఎనిమిది మంది గాయాలైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు.
''దుకాణంలోని పరుపులను రోడ్డుపై పరచడంతో నాకు రెండు లక్షల రూపాయల వరకూ నష్టం జరిగింది. కానీ, ఎనిమిది మంది ప్రాణాలు కాపాడగలిగాననే సంతృప్తి ఉంది. లోపల చిక్కుకున్న వారిలో అంతమంది ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదు'' అని పరుపుల దుకాణం యజమాని రియాజుద్దీన్ అన్నారు.
బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీ కింద 6 గదుల వసతికి అనుమతి పొంది, అనధికారికంగా 20కిపైగా గదులను నిర్వహిస్తున్న భవనంలో లోపలకు వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే ప్రవేశ మార్గం ఉంది.
ఆ మార్గానికి ఉన్న గేట్ లాక్ చేసి ఉంది. ఐదంతస్థుల ఆ ఇరుకైన భవనంలో ఎలాంటి వెంటిలేషన్ లేక, మంటల నుంచి తప్పించుకనే మార్గం లేక, సమయానికి అత్యవసర సహాయం అందక.. లోపలున్న వారిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గురుగ్రామ్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాలు కోల్పోయిన విదేశీ పౌరులలో నలురుగు నైజీరియన్లు, ముగ్గురు కిర్గిజిస్తాన్, మొజాంబిక్, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్, కాంగో, లైబీరియా, ఇరాక్ పౌరులు ఒక్కొక్కరు ఉన్నారని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
ప్రమాదం జరిగిన రోజు మొత్తం పదిహేను మందిని సమీప మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పదమూడు మంది విదేశీయులున్నారు. వీళ్లందరూ కోలుకుంటున్నారని మ్యాస్ హాస్పిటర్ మెడికల్ డైరక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా తెలిపారు.
వైద్యం కోసం దిల్లీకి వస్తున్న విదేశీయులు
మెడికల్ టూరిజానికి ప్రధాన కేంద్రంగా మారిన దేశాల్లో భారత్ కూడా ఒకటి.
మెడికల్ టూరిజం ఇండెక్స్ 2020-21 ప్రకారం ప్రపంచంలోని 46 గ్లోబల్ మెడికల్ టూరిజం డెస్టినేషన్స్‌లో భారత్ 10వ స్థానంలో ఉంది.
ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి వైద్య చికిత్స కోసం ఇండియాకు వచ్చే విదేశీయులు, ఎక్కువగా దిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాలకు వెళ్తారు.
కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2025లో భారత్‌కు 91.5 లక్షల మంది విదేశీయులు రాగా అందులో 5,07,244 మంది విదేశీయులు వైద్య చికిత్సల కోసం వచ్చారు.
దేశంలో ‘జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్’(జేసీఐ) అక్రెడిటేషన్ ఉన్న ఆసుపత్రులు సహా అధునాతన చికిత్స సదుపాయాలు అధికంగా ఉన్న ఆసుపత్రులు, ఇతర దేశాలకు విమాన సర్వీసుల సదుపాయం కూడా ఎక్కువగా దిల్లీకే ఉండడంతో ఈ నగరం దేశంలో మెడికల్ టూరిజానికి కేంద్రంగా మారింది.
విదేశీ రోగులు ప్రధానంగా ఇక్కడి మ్యాక్స్ హాస్పిటల్, మెడీసిటీ, అపోలో, ఫోర్టిస్, ఆర్టెమిస్ ఆసుపత్రులకు ఎక్కువగా వెళ్తారు. ఇలాంటి హాస్పటల్స్‌తో ప్రధాన మెడికల్ హబ్‌గా మారిన దేశ రాజధాని నగరం దిల్లీ, విదేశీయులను ఆకర్షిస్తోంది.
''మా దేశంతో పోల్చుకుంటే ఇక్కడ వైద్యం చౌక. మెరుగైన వైద్యం అందుతుంది. మా నాన్నకు గుండె సమస్య ఉంది. వైద్యులు ఇండియా తీసుకెళ్లమని చెప్పారు. అందుకే గుండె చికిత్స కోసం నాన్నను తీసుకుని దిల్లీ వచ్చాను'' అని నైజీరియాలోని కేనో రాష్ట్రానికి చెందిన 37 ఏళ్ల యాకూబ్ జాంకో ‘బీబీసీ’తో చెప్పారు.
దిల్లీలో తన తండ్రి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి అత్యంత సమీపంలోనే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి యాకూబ్ ఘటనా స్థలాన్ని చూసేందుకు వచ్చారు. ఇంత మంది విదేశీయులు ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం భయానికి గురి చేసిందన్నారు.
ప్రమాద స్థలంలో కనిపించిన మరో 47 ఏళ్ల మహిళ ఆమ్రోస్‌తో బీబీసీ మాట్లాడింది. ఆమె ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం కేమెరూన్ నుంచి దిల్లీ వచ్చినట్లు తెలిపారు.
''నేను అమ్రోస్ కోసం అనువాదకురాలిగా పని చేస్తున్నాను. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం అమ్రోస్ దిల్లీలో రెండు నెలలుగా ఉంటున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితమే అమ్రోస్ తన భర్తతో కలిసి ఫ్లరిష్ బీఅండ్‌బీలో రెండు వారాల పాటు బస చేశారు. ఈ ప్రమాదం సంగతి తెలిశాక అమ్రోస్ చాలా భయపడ్డారు. షాక్‌కు గురయ్యారు'' అని ఆమ్రోస్ కోసం అనువాదకురాలిగా పని చేస్తున్న కేమరూన్ మహిళ 44 ఏళ్ల మిషెల్ మైఖేల్ తెలిపారు.
మెడికల్ టూరిజం ఇండెక్స్‌లో 10వ స్థానంలో
ప్రపంచ మెడికల్ టూరిజం ఇండెక్స్‌లో ఇండియా పదో స్థానంలో ఉందని భారత పర్యటక శాఖ ఇటీవలే విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీయులతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగే నర్సులు భారతీయ ఆసుపత్రుల్లో పని చేయడం విదేశీయులకు బాగా కలిసొచ్చే అంశమని కేంద్ర పర్యటక శాఖ డేటా చెబుతోంది.
2025లో ఇండియా వచ్చిన విదేశీ పర్యటకులలో సగానికి పైగా వైద్య చికిత్సల కోసం వచ్చినవారేనని పర్యటక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
కోవిడ్ అనంతరం వైద్య చికిత్సల కోసం ఇండియా వచ్చే విదేశీయుల సంఖ్య భారీగా పెరిగింది. ఐదేళ్ల క్రితం అంటే 2020లో 1,83,000 మంది విదేశీయులు ఇండియాకు రాగా, 2025 నాటికి ఈ సంఖ్య ఐదు లక్షలు దాటింది. రానున్న సంవత్సరాల్లో ఇలా వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.
మెడికల్ వేల్యూ ట్రావెల్ (MVT) రంగం మల్టీ బిలియన్ డాలర్స్ మార్కెట్‌గా మారింది. ఇండియాలో 2025లో మెడికల్ టూరిజం మార్కెట్ విలువ 8.7 బిలియన్ డాలర్లుగా ఉందని కేంద్ర పర్యటక శాఖ తెలిపింది. ఇది 2030 నాటికి 16.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
విదేశీ రోగులు ప్రధానంగాపరిగణనలోకి తీసుకునే జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జేసీఐ)అక్రెడిటేషన్ పొందిన ఆసుపత్రులు ఇండియాలో దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, నాగ్‌పూర్, కొచ్చి నగరాల్లోనే ఉన్నాయి.
జేసీఐ అక్రెడిటేషన్ గల ఆసుపత్రుల్లో అత్యధికంగా 9 దిల్లీలో ఉండగా ముంబయిలో 6 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ డేటా చెబుతోంది. దక్షిణాదిలో బెంగళూరులో 3 ఆసుపత్రులు ఉండగా, చెన్నై, హైదరాబాద్‌లలో రెండేసి ఆసుపత్రులున్నాయి.
ఇక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు పొందిన ఆసుపత్రులు ఇండియాలో 2026 నాటికి మొత్తం 1299 ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా 600 రకాల భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వీటిపైన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) పర్యవేక్షణ ఉంటుంది.
ఎక్కువగా తీవ్రమైన ఆనారోగ్య సమస్యలతో బాధపడే విదేశీయులు ఇండియాకు వస్తున్నారు. వీటిలో గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు, ఆర్థోపెడిక్, క్యాన్సర్ చికిత్సలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సహా ఇతర ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్, తీవ్రమైన న్యూరలాజికల్ సమస్యలు, కాస్మెటిక్ సర్జరీలు, డెంటల్ కేర్, ఐవీఎఫ్ లాంటి ఫెర్టిలిటీ చికిత్సలు, ఆయుష్ ఆధారిత వెల్‌నెస్ చికిత్స కోసం విదేశాల నుంచి ఇండియాకు వస్తున్నారు.
బంగ్లాదేశ్, ఇరాక్ నుంచి అత్యధికంగా..
2025లో అత్యధికంగా బంగ్లాదేశ్, ఇరాక్ నుంచి వైద్య చికిత్సల కోసం ఇండియా వచ్చారు.
వైద్యం కోసం 2025లో ఇండియాకు వచ్చిన విదేశీ పౌరుల్లో బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా మూడు లక్షల మందికి పైగా ఉన్నారు.
తర్వాతి స్థానాల్లో ఇరాక్ నుంచి 30,989 మంది, ఉజ్బెకిస్తాన్ నుంచి 13,699 మంది, సోమాలియా నుంచి 11,506 మంది, తుర్కెమెనిస్తాన్ నుంచి 10,231 మంది, ఒమన్ నుంచి 9,738 మంది, కెన్యా నుంచి 9,357 మంది వచ్చారని ప్రెస్ ఇన్ఫర్మెషన్ బ్యూరో ఈ ఏడాది మే నెలలో విడుదల చేసిన రీసెర్చ్ డాక్యుమెంట్‌లో వెల్లడించింది.
మెడికల్ టూరిజంతో ఉపాధి ఎంత?
మెడికల్ టూరిజంపై ఆధారపడిన రంగాలు, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో నిర్దిష్టమైన డేటా అందుబాటులో లేనప్పటికీ, దేశవ్యాప్తంగా పర్యటక రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 8.46 కోట్లు ఉంటుందని, వీరిలో మెడికల్ టూరిజం శాంత గణనీయంగా ఉంటుందని కేంద్ర పర్యటక శాఖ డేటా చెబుతోంది.
ఇక బుధవారం దక్షిణ దిల్లీలో అగ్ని ప్రమాదం జరిగిన మాలవీయ నగర్, హౌజ్ రాణి ప్రాంతాల్లో మెడికల్ టూరిజంలో భాగంగా వచ్చే విదేశీయులపై ఆధారపడిన అనువాదకులు, గైడ్లు, ఫార్మా దుకాణాల యజమానులు, ఫారెక్స్ వ్యాపారులు, ట్రావెల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసేవాళ్లు మొత్తం దాదాపుగా పదివేల మంది ఉంటారని స్థానిక బోల్డ్ ఫారెక్స్ అండ్ ట్రావెల్స్ యజమాని యూఎస్ పాండే ‘బీబీసీ’తో చెప్పారు.
''విదేశీ పౌరులతో జరిగే స్థానిక వ్యాపారం కోట్లలో ఉంటుంది. కేవలం మా ఫారెక్స్ సంస్థ ద్వారా సంవత్సరానికి కోటి నుంచి కోటిన్నర రూపాయల వ్యాపారం ఉంటుంది. రోజుకి కనీసం 50 నుంచి 60 మంది విదేశీ పౌరులు మా దుకాణానికి వచ్చి కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. వాళ్లంతా కరెన్సీ ఎక్స్‌చేంజ్ కోసం అమెరికన్ డాలర్లే తీసుకొస్తారు'' అని బోల్డ్ ఫారెక్స్ అండ్ ట్రావెల్స్ యజమాని యూఎస్ పాండే చెప్పారు.
కరెన్సీ ఎక్స్‌చేంజ్ కోసం ఎక్కువగా సోమాలియా, అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కెమెనిస్తాన్, తజికిస్తాన్, కెన్యా, బంగ్లాదేశ్, ఎరిత్రియా, డీఆర్ కాంగో, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల నుంచే ఎక్కువ మంది వస్తారని యూఎస్ పాండే అన్నారు.
''సగటున రోజుకి రూ. 50,000 నుంచి రూ. 10 లక్షల వరకూ వ్యాపారం చేస్తున్న ఫార్మసీ దుకాణాలున్నాయి. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ వ్యాపారం కూడా జరగొచ్చు. విదేశీయులు నెల రోజులు, రెండు నెలలు, ఒక్కోసారి సంవత్సరానికి సరిపడా మందులు ఒకేసారి కొనుగోలు చేస్తారు'' అని స్థానిక ఫార్మసీ షాపు యజమాని శైలేంద్ర తిలక్ ‘బీబీసీ’తో చెప్పారు.
విదేశీయులకు ఉండే హక్కులేమిటి?
విదేశీ పౌరుల విషయంలో పాస్‌పోర్ట్ నిబంధనలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన చట్టాలు అమల్లోకి వస్తాయని, వైద్య చికిత్స కోసం విదేశీ ప్రయాణాలు చేసే పౌరుల హక్కులను పరిరక్షించేందుకు పలు ఐక్యరాజ్యసమితి (UN) కన్వెన్షన్లు కూడా అమల్లో ఉన్నాయని జన స్వాస్థ్య అభియాన్ ఇండియా జాతీయ కన్వీనర్ అమూల్య నిధి అన్నారు.
''ప్రపంచ మెడికల్ టూరిజానికి ప్రధాన గమ్యస్థానాల్లో ఒకటిగా ఉన్న ఇండియా లాంటి దేశంలో, విదేశీయులు బస చేసే హోటళ్లలో భద్రతా ప్రమాణాలు ఎందుకు విఫలమయ్యాయనే అంశంపై, సంబంధిత దేశాలు, వాటి రాయబార కార్యాలయాలు భారత ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితితో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టేందుకు వీలు కల్పించే అంతర్జాతీయ హక్కులుంటాయి'' అని అమూల్య నిధి తెలిపారు.
అలానే అగ్నిప్రమాదంలో మరణించిన విదేశీ పౌరుల కుటుంబ సభ్యులు, ఫిర్యాదులు నమోదు చేసేందుకు భారత ప్రధానమంత్రి కార్యాలయం, తమ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు, యూఎన్‌హెచ్‌సీఆర్, అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించొచ్చని చెప్పారు.
పైగా స్థానిక హోటళ్లు, ఫ్లరిష్ స్టేస్ బీఅండ్‌బీ లాంటి వసతి గృహాలు - భద్రత, రక్షణ ప్రమాణాలను పాటించేలా చేయడంలో ‘విఫలమైన’ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ , అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖలపైనా ఫిర్యాదులు చేసే హక్కు వాళ్లకుంటుందని కూడా అమూల్య నిధి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)