You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కడుపులో గ్యాస్ ఎలా తయారవుతుంది, అన్నిసార్లూ గ్యాస్ దుర్వాసన ఎందుకు రాదు? ఆ దుర్వాసనను నియంత్రించడమెలా?
- రచయిత, కే. శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
గ్యాస్ (అపాన వాయువు) వదలడం అనేది అత్యంత సాధారణ విషయాల్లో ఒకటి. కానీ, శరీర క్రియల్లో అతి తక్కువగా చర్చించే విషయం కూడా ఇదే.
ప్రతి ఒక్కరూ గ్యాస్ విడుదల చేస్తారు. చాలామంది రోజులో చాలాసార్లు గ్యాస్ విడుదల చేస్తారు. ఒక వ్యక్తి 8 నుంచి 25 సార్లు గ్యాస్ విడుదల చేస్తుంటారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
చాలా వరకు ఇది ఇతరుల దృష్టికి రాదు. కానీ, కొన్నిసార్లు గ్యాస్ విడుదల చేసేటప్పుడు పెద్దగా శబ్దం వచ్చినా, లేదా దుర్వాసన వచ్చినా.. చుట్టుపక్కల ఉన్న వారికి అసౌకర్యంగా ఉంటుంది.
శరీరం గ్యాస్ విడుదల చేసినప్పుడు కొన్నిసార్లు ఎందుకు అంత తీవ్రమైన దుర్వాసన వస్తుంది? ఈ దుర్వాసన ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి ఏం చెబుతుంది? దాన్ని నియంత్రించవచ్చా?
కడుపుబ్బరం అంటే ఏమిటి?
వైద్యపరంగా ఫ్లాటులెన్స్ లేదా ఫ్లాటస్ అని పిలిచే ఈ ప్రక్రియలో మలాశయం (రెక్టమ్) ద్వారా జీర్ణవ్యవస్థ నుంచి గ్యాస్ బయటికి విడుదల అవుతుంది.
జీర్ణవ్యవస్థలో రెండు ప్రధాన మార్గాల్లో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఒకటి గాలిని మింగడం, రెండోది పెద్దపేగులో (కొలన్) ఆహారాన్ని బ్యాక్టీరియా పులియపెట్టడం వల్ల అని యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్స్‌కు చెందిన మెడ్‌లైన్ ప్లస్, జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పేర్కొంది.
పేగులలో ఉండే గ్యాస్‌కు వాస్తవానికి ఎలాంటి వాసన ఉండదు. ఇది నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, కొన్నిసార్లు మీథేన్‌తో కూడినదై ఉంటుంది. దానికి భిన్నంగా పేగులలో ఉత్పత్తి చేసే అతి తక్కువ పరిమాణంలో సల్ఫర్ కలిగిన గ్యాస్‌ల నుంచి దుర్వాసన వస్తుంది.
ఈ సల్ఫరస్ గ్యాస్‌లలో.. హైడ్రోజన్ సల్ఫైడ్ దుర్వాసనకు ప్రధాన కారణం. ఇది కుళ్లిన గుడ్ల వాసనకు కారణమయ్యే సమ్మేళనం కూడా.
గ్యాస్ట్రోఎంటరాలజీ స్టడీస్ ప్రకారం.. పేగుల్లోని గ్యాస్‌లో చాలా తక్కువ పరిమాణంలో ఉండే 'వొలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ (అస్థిరమైన సల్ఫర్ సమ్మేళనాలు)' ముఖ్యంగా హైడ్రోజన్ సల్ఫైడ్ వల్లనే ఈ దుర్వాసన వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
పేగులోని గ్యాస్ గురించి మొదట్లో పలు కీలకమైన అధ్యయనాలు నిర్వహించిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ మైకేల్ లెవిట్ నేతృత్వంలోని ఒక పరిశోధనా బృందం 'ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్'లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కూడా ఇదే విషయాన్ని పేర్కొంది.
పేగులలో గ్యాస్ ఉత్పత్తిపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు.. పేగులలోని గ్యాస్‌లో ఒక శాతం కంటే తక్కువగానే దుర్వాసన కలిగించే సమ్మేళనాలు ఉంటాయని కనుగొన్నారు. కానీ, చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ అవి తీవ్రమైన దుర్వాసనను ఉత్పత్తి చేయగలవని చెప్పారు.
తీవ్రమైన దుర్వాసన ఎందుకు?
దీనికి సమాధానం చాలా వరకు ఒక వ్యక్తి ఏం తింటారు? వారి పేగులోని సూక్ష్మజీవులు(గట్ మైక్రోబయోమ్) దానిని ఎలా జీర్ణం చేసుకుంటాయనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కొన్ని ఆహారాల్లో సల్ఫర్ సమ్మేళనలు లేదా కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని అరిగించుకోవడం చిన్న పేగుకు కాస్త కష్టమైన పనే. అక్కడ అరగని పదార్థాలు పెద్ద పేగులోకి వెళ్లినప్పుడు, వాటిని బ్యాక్టీరియా పులియబెట్టి, గ్యాస్‌లను విడుదల చేస్తుంది.
''కొన్ని కార్బోహైడ్రేట్లు చిన్న పేగులో పూర్తిగా జీర్ణం కావు'' అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ తన వెబ్‌సైట్‌లో వివరించింది.
''బదులుగా, అవి పెద్ద పేగులోకి వెళ్తాయి. అక్కడున్న బ్యాక్టీరియా వాటిని విచ్ఛిన్నం చేసి, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది'' అని తెలిపింది.
బీన్స్, కొన్ని కూరగాయాలు, తృణధాన్యాలు గ్యాస్‌కు సాధారణ కారణంగా కూడా చెబుతుంది.
గుడ్లు, మాంసం, బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియ సమయంలో సల్ఫర్ సమ్మేళనాలను విడుదల చేయడం వల్ల దుర్వాసనతో కూడిన గ్యాస్ ఉత్పత్తి అవుతుందని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసు తెలిపింది.
అదనంగా, ''లాక్టోజ్ పడని వారికి (పాలు, పాల పదార్థాలు పడనివారికి) పాల ఉత్పత్తులు కూడా కడుపు ఉబ్బరానికి కారణం కావొచ్చు'' అని పేర్కొంది.
సల్ఫర్ ఉన్న ఆహారాలు హైడ్రోజన్ సల్ఫైడ్, ఇతర సంబంధిత సమ్మేళనాలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాకు ఇంధనంగా పనిచేస్తాయని పేగుల్లోని గ్యాస్‌పై అధ్యయనం చేస్తున్న ప్రముఖుల్లో ఒకరైన డాక్టర్ మైకేల్ లెవిట్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో వివరించారు.
అలాగే, విడుదలయ్యే దుర్వాసనకు దాని పరిమాణం కారణం కాదని, అందులో ఉండే ఈ వాయువులే కారణమని ఆయన చెప్పారు.
ఒక వ్యక్తి ఎలాంటి దుర్వాసన లేకుండా పెద్ద మొత్తంలో గ్యాస్‌ను విడుదల చేస్తారని నిపుణులు పేర్కొన్నారు. అలాగే, తక్కువ మొత్తంలో విడుదలయ్యే గ్యాస్ తీవ్రమైన దుర్వాసనను కలిగిస్తుందని కూడా తెలిపారు.
బ్యాక్టీరాయిడ్స్, క్లోస్ట్రిడియం, డెసల్ఫోవిబ్రియో వంటి బ్యాక్టీరియాలు పేగులో గ్యాస్‌ను ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని 2023 జనవరిలో జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్‌లో 'ఇంటెస్టినల్ గ్యాస్ ప్రొడక్షన్ బై గట్ మైక్రోఆర్గానిజమ్స్-ఏ రివ్యూ' పేరుతో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు.
గట్ మైక్రోబయోమ్ కీలకపాత్ర
కడుపు ఉబ్బరానికి కేవలం ఆహారంతో మాత్రమే కాకుండా, జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా సమతుల్యతతో కూడా సంబంధం ఉందని గత పదేళ్లలో శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు.
శరీరం సొంతంగా జీర్ణం చేసుకోలేని కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసేందుకు సాయపడేలా పెద్దపేగులో అధిక సంఖ్యలో మైక్రోఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు సహజంగానే గ్యాస్ విడుదలవుతుంది.
జీర్ణం కాని కార్బోహైడ్రేట్లు అంటే చక్కెరలు, పిండి పదార్థాలు, ఫైబర్ పెద్దపేగులోకి వెళ్తాయి, అక్కడున్న బ్యాక్టీరియా వాటిని పులియబెట్టి, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ తెలిపింది.
కొంతమంది పేగులోని బ్యాక్టీరియా ఎక్కువ మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. మరికొందరు ఎక్కువ సల్ఫర్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుండొచ్చు. కొన్ని బ్యాక్టీరియాలు హైడ్రోజన్ వంటి గ్యాస్‌లను ఉత్పత్తి చేస్తే.. మరికొన్ని సూక్ష్మజీవులు వాటిని ఉపయోగించుకుంటాయి. సూక్ష్మజీవుల మధ్య ఉండే ఈ సమతుల్యతే దుర్వాసన తీవ్రతకు దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
హైడ్రోజన్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా..హైడ్రోజన్ వినియోగించే సూక్ష్మజీవులు( మీథేనోజెన్స్, సల్ఫేట్‌ను తగ్గించే బ్యాక్టీరియా) మధ్య జరిగే రసాయన చర్య ఫలితంగా పేగులో గ్యాస్ ఏర్పడుతుందని జర్నల్ నేచర్ రివ్యూస్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది.
వ్యక్తుల మధ్య గట్ మైక్రోబయోమ్ సమ్మేళనాలు ఎందుకు భిన్నంగా ఉంటాయో శాస్త్రవేత్తలు ఇప్పటికీ అధ్యయనం చేస్తున్నారు.
జన్యువులు, ఆహారం, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక ఆహారపు అలవాట్లతో సహా అనేక రకాల కారకాలు ఒక వ్యక్తి పేగులోని సూక్ష్మజీవులను రూపొందిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
గాలిని మింగడం వల్ల గ్యాస్ వస్తుందా?
అన్ని రకాల గ్యాస్‌లు బ్యాక్టీరియా కారణంగా ఆహారం పులియడం వల్లనే ఉత్పత్తి కావు. కొన్నిసార్లు ప్రజలు ఆహారం తినేటప్పుడు లేదా ద్రవపదార్థాలను తాగేటప్పుడు కొద్ది మొత్తంలో గాలిని మింగేస్తుంటారు.
అదే సమయంలో.. వేగంగా తినడం, బబుల్‌గమ్ నమలడం, ధూమపానం, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వంటి అలవాట్లు కూడా ఒక వ్యక్తి గాలిని మింగే మొత్తాన్ని పెంచుతాయి.
ఈ అదనపు గాలి జీర్ణవ్యవస్థ గుండా ప్రయాణించి, చివరికి గ్యాస్‌గా బయటికి వెళ్లిపోతుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ పేర్కొన్నాయి.
ఒత్తిడి, ఆందోళన కూడా దీనికి దోహదం చేస్తాయి. ఆందోళన చెందే వ్యక్తులు తెలియకుండానే ఎక్కువ గాలిని మింగవచ్చు, దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ డేటా సూచిస్తుంది.
పేగుల నుంచి వచ్చే గ్యాస్ వాసన ఆరోగ్యానికి సంకేతమా?
గ్యాస్ వెలువడటం అనేది పూర్తిగా సాధారణమైన జీవప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు వచ్చే దుర్వాసనతో కూడిన గ్యాస్ సాధారణంగా అనారోగ్యం వల్ల కాకుండా ఆహారపు అలవాట్ల వల్ల వస్తుందని వైద్యులు తెలిపారు.
అయితే, కడుపు ఉబ్బరంతో పాటుగా కడుపులో నిరంతర మార్పులు, ముఖ్యంగా కడుపు నొప్పి, విరేచనాలు, మలబద్ధకం, బరువు తగ్గడం వంటివి ఉంటే అవి లోపలున్న జీర్ణవ్యవస్థలోని ఇబ్బందులకు సంకేతం కావచ్చని బ్రిటన్ ఎన్‌హెచ్‌ఎస్ సూచిస్తోంది.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, లాక్టోజ్ ఇన్‌టాలరెన్స్ (పాలు, పాలపదార్థాలు పడకపోవడం), సెలియాక్ డిసీజ్, కొన్ని గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్‌ఫెక్షన్లు వంటి ఆరోగ్య సమస్యలు గ్యాస్ ఉత్పత్తిని లేదా పేగులోని గ్యాస్ వల్ల ఇబ్బందులను పెంచుతాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వివరించింది.
మలంలో రక్తం, తరచూ కడుపు నొప్పి, అకస్మాత్తుగా కారణం తెలియకుండా బరువు తగ్గడం, దీర్ఘకాలికంగా వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపు ఉబ్బరం వంటి లక్షణాలతో పాటు అధిక గ్యాస్ ఉంటే వైద్యులను సంప్రదించాలని ఎన్‌హెచ్ఎస్ సూచిస్తోంది.
ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ప్రయోజనం ఉంటుందా?
తీవ్ర దుర్వాసనతో కూడిన గ్యాస్ సమస్యను తగ్గించడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అనేక ఆచరణాత్మక పద్ధతులను సిఫార్సు చేస్తోంది.
"కొద్ది కొద్దిగా భోజనం చేయడం, ఆహారాన్ని నెమ్మదిగా నమలడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అలాంటి లక్షణాలను నిరంతరం ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండటం" వంటివి వీటిల్లో ఉన్నాయి.
అదే సమయంలో, శరీరానికి తగినంత నీరు అందించడం కూడా చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం జీర్ణక్రియకు సహాయపడి, మలవిసర్జనను క్రమబద్ధం చేస్తుందని వైద్యులు చెప్పారు.
కార్బోహైడ్రేట్ సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నెర్లు, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించడం వల్ల కూడా కొంతమందికి ప్రయోజనం కలుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
వైద్య నిపుణుల సూచన లేకుండా సొంతంగా ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే, చాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల పోషకాహార లోపాలకు దారితీస్తుంది. ఆహార నియమాలను కచ్చితంగా పాటించడానికి, అర్హత ఉన్న పోషకాహార నిపుణుడిని సంప్రదించడమే ఉత్తమ మార్గమని చెబుతున్నారు.
సాధారణంగా, జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందనడానికి గ్యాస్‌ను ఒక సాధారణ సంకేతంగా నిపుణులు భావిస్తారు.
పేగులలో గ్యాస్ ఇరుక్కుపోవడం వల్ల కడుపు ఉబ్బరం, కండరాల నొప్పులు, పొత్తికడుపులో ఒత్తిడి వంటివి కలుగుతాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)