You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
స్మార్ట్‌ఫోన్‌లు, యాప్‌ల రాకకు చాలాకాలం ముందే, ప్రపంచంలోని అతిపెద్ద గణాంక ప్రక్రియలలో ఒకటైన జనగణనలో ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తన విస్తారమైన పోస్టల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంది.
ప్రస్తుతం దేశంలో 16వ జనగణనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపడుతున్న ఎనిమిదో జనగణన ఇది.
ఈ తరుణంలో ఏర్పాటు చేసిన ఒక కొత్త ఎగ్జిబిషన్ ఆనాటి చరిత్రను గుర్తు చేస్తుంది.
జాతీయ జనగణన కోసం పౌరులందరినీ సమీకరించేందుకు ఒకప్పుడు ఉపయోగించిన స్టాంపులు, పోస్టల్ ముద్రలు, ఉత్తరాలతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
బెంగళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ఎకనామిక్స్ ప్రొఫెసర్ వికాస్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాలలో భారత తపాలా వ్యవస్థ దేశ నిర్మాణానికి ఒక అనూహ్యమైన సాధనంగా ఎలా మారిందో తెలియజేస్తుంది.
ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు, అలాగే ఆర్థిక ప్రణాళికలను నిర్మించడానికి స్వతంత్ర భారతానికి విశ్వసనీయమైన జనాభా లెక్కలు అత్యవసరమయ్యాయి.
కొత్త గణతంత్రపు రాజకీయ ఆర్థిక వ్యవస్థకు జనాభా గణనను కీలకమైనదిగా భావించి ... రాజ్యాంగాన్ని ఖరారు చేయకముందే 1948లో జనాభా గణన చట్టాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది.
కానీ, అప్పట్లో ప్రభుత్వం ముందు రెండు ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయి. మొదటిది.. జనాభా గణనలో పాల్గొనాలని ప్రజలను ఎలా ఒప్పించాలి? రెండోది.. విస్తారమైన, పేదరికంతో కూడిన, పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలున్న దేశంలో గణన సిబ్బందికి (ఎన్యూమరేటర్లకు), జనాభా గణన అధికారులకు మధ్య నిరంతర సమాచార బదిలీ ఎలా చేపట్టాలి?
జనాభ లెక్కల సేకరణలో నమ్మకం అనేదే కీలకమైన అంశం. 1931, 1941ల్లో బ్రిటీష్ పాలకులు చేపట్టిన జనగణన.. భారత్‌లోని కొన్ని ప్రాంతాలలో బహిష్కరణకు గురైంది.
అలాగే, పంజాబ్, బెంగాల్‌లలో 1941 జనగణన ప్రక్రియ మతపరమైన అవకతవకల ఆరోపణలతో మసకబారింది. అందుకే, స్వతంత్ర భారత్ తొలి జనగణన చట్టబద్ధత ప్రజల్లోకి వెళ్లడం కీలకంగా మారింది.
అప్పుడే పోస్టల్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగింది.
కొన్ని దశాబ్దాల కిందటి వరకు కూడా భారత ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న అతిపెద్ద ఏకీకృత సమాచార ప్రసార వ్యవస్థ తపాలా శాఖే.
స్వాతంత్య్రం తర్వాత.. బ్యాంకింగ్ వంటి ఇతర ప్రజా వ్యవస్థలతో పోలిస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది తపాలా వ్యవస్థే. 1968 నాటికి లక్షకు పైగా పోస్టాఫీసులు ప్రతిరోజూ 3 లక్షల గ్రామాలకు, ప్రతివారం మరో 3 లక్షల గ్రామాలకు ఉత్తరాలు పంపిణీ చేసేవి.
ఒకప్పుడు ప్రభుత్వం ప్రజలతో ఎంత భిన్నంగా వారితో కమ్యూనికేట్ చేసేదో కుమార్ రీసెర్చ్ వెల్లడిస్తుంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లో మొట్టమొదటి జనగణన చేపట్టడానికి ముందు.. దేశవ్యాప్తంగా వెళ్లే ఉత్తరాలపై ద్విభాషా చిత్రపటాలతో ముద్రించిన పోస్టుమార్క్‌ను ప్రభుత్వం ఉపయోగించేది.
ఈ పోస్టుమార్క్‌పై హిందీ, ఇంగ్లీష్‌లో 'భారత జనగణన' అనే పదాలతో ముగ్గురు సభ్యులున్న ఒక కుటుంబం కనిపించేది.
తక్కువ అక్షరాస్యత ఉన్న దేశానికి అనుగుణంగా చాలా జాగ్రత్తగా ఈ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు.
తపాలా సిబ్బంది తరచూ గ్రామాల్లో పాఠకులుగా, అనధికారిక ప్రభుత్వ మధ్యవర్తులుగా కూడా వ్యవహరించేవారు. ప్రజలకు సందేశాలు చేరవేయడానికి ఒక ఆదర్శవంతమైన సాధనంగా తపాలా వ్యవస్థ ఉండేది.
దశాబ్దాలుగా దేశంతోపాటు ఈ సమాచార వ్యవస్థ కూడా పరిణామం చెందింది.
1961లో.. ''మీరు, మీ కుటుంబ సభ్యులు లెక్కలోకి వచ్చేలా చూసుకోండి'', ''మీ స్నేహితులను కూడా అలాగే చేయమని చెప్పండి'' అనే సందేశాలను పోస్టుమార్కులు చేరవేశాయి.
1971 నాటికి జనగణనను ప్రపంచంలోనే అతిపెద్ద పరిపాలన ప్రక్రియలో ఒకటిగా పోస్టల్ కమొమరేటివ్ స్టాంప్స్ ( స్మారక స్టాంపులు) అభివర్ణించాయి.
అంతేకాక, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల సాయంతో జనాభా డేటాను ప్రాసెస్ చేస్తున్నట్లు ఆ స్టాంపులపై గర్వంగా పేర్కొన్నారు.
2000లో ప్రచురితమైన ప్రకటనల్లో.. జనగణనను ''దేశాని ప్రతిబింబిం''గా , ''దేశ సమూహ చిత్రం''గా అభివర్ణించాయి. జనగణనను ఒక అధికారిక ప్రభుత్వ ప్రక్రియగా కాకుండా.. ప్రజలందరి స్వీయ చిత్రంగా పేర్కొన్నాయి.
తర్వాత వచ్చిన చిత్రాల్లో జనగణనను జనాభా నియంత్రణతో ఎక్కువగా ముడిపెట్టాయి. ముఖ్యంగా ఇద్దరు పిల్లల నియమాన్ని ప్రతిబింబించాయి. ఇది జనాభా విషయంలో ఆ కాలపు ఆందోళనలకు అద్దం పట్టాయి.
కుమార్ దృష్టిలో ఈ పోస్టల్ చిత్రాలు ప్రభుత్వ పరిపాలనా చరిత్రకు మించినవి.
భారత ప్రభుత్వం ప్రతిరోజూ కమ్యూనికేషన్ ద్వారా చట్టబద్ధతను, నమ్మకాన్ని ఎలా పెంపొందించుకోవడానికి ప్రయత్నించిందో ఇవి వెల్లడించాయి. జనగణన అనేది దేశ అభివృద్ధి, వైవిధ్యం, జాతి గుర్తింపు వంటి భావనలతో ఎలా ముడిపడి ఉందో కూడా ఇవి చూపించాయి.
అయితే, నమ్మకానికి చెందిన ప్రశ్న నేటికి కూడా సందర్భోచితంగానే ఉంది.
డిజిటల్ సాధనాలు డేటా సేకరణను వేగవంతంగా చేసినప్పటికీ.. కేవలం సాంకేతికత విశ్వసనీయమైన డేటాకు హామీని ఇవ్వలేదని కుమార్ అంటున్నారు.
''నమ్మకాన్ని పెంపొందించడానికి జనగణనకు సంబంధించిన అవగాహన అత్యంత కీలకం'' అని తెలిపారు. తపాలా వ్యవస్థ కనుమరుగవుతున్న సమయంలో.. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు సరికొత్త మార్గాలను ప్రభుత్వం కనుగొనాల్సి ఉందని హెచ్చరిస్తున్నారు.
అయితే, నేడు భారత్ సిద్ధమవుతున్న జనగణన.. మసకబారిన ఆనాటి పోస్టల్ చిత్రాలతో పోలిస్తే చాలా భిన్నమైంది.
ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంలో విధాన రూపకల్పనకు, సంక్షేమ పథకాల పంపిణీకి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి వాటికి ఈ కొత్త జనగణన చాలా కీలకమైనది.
దశాబ్దాల తర్వాత తొలిసారి కులాలవారీ డేటాను కూడా సేకరించనున్నారు. కుల వ్యవస్థ ఇప్పటికీ సామాజిక, ఆర్థిక జీవితాలను శాసిస్తోన్న దేశంలో రాజకీయంగా ఇది ఎంతో సున్నితమైన ప్రక్రియ.
మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. 7,092 మండలాలు - తాలూకాలు.. 9700కి పైగా పట్టణాలు.. సుమారు 6,40,000 గ్రామాలలో జనగణన చేస్తారు.
2027 జనాభా లెక్కల కోసం దేశవ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర అధికారులు విధులు నిర్వహించనున్నారు.
కానీ, ఒక్క అంశం ఈసారి కీలకంగా మారింది. జనగణనను తొలిసారి డిజిటల్‌గా చేపడుతున్నారు.
ఎన్యూమరేటర్లు స్మార్ట్‌ఫోన్ ద్వారా మొబైల్ యాప్‌లో సమాచారం నమోదు చేసి, ఆ డేటాను ప్రభుత్వానికి సమర్పిస్తారు.
డేటా సంరక్షణకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
పోస్టల్ ఎన్వలప్‌లపై ముద్రించిన కుటుంబ ఆకారపు పోస్టుమార్కుల నుంచి స్మార్ట్‌ఫోన్ల నుంచి తక్షణమే అప్‌లోడ్ చేసే డేటా వరకు.. జనగణన ప్రక్రియ చాలా ఆధునికంగా మారింది.
అయినప్పటికీ, ఈ ఎగ్జిబిషన్ సూచిస్తున్నట్లుగా... దీని వెనుక అసలైన సవాలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)