You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ అర్హత ఉన్నవారు ఎంపికైతే.. బ్యాంక్ అటెండెంట్ కేసులో సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది?
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
‘ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం తక్కువ విద్యార్హతలు ఉన్న వారికి నిర్దేశించినప్పుడు ఆ ఉద్యోగాన్ని ఉన్నత విద్యార్హతలున్న వారికి ఇవ్వడమంటే అర్హులైన వారి అవకాశాలను నిరాకరించడమే’ అని సుప్రీంకోర్టు ఇటీవల ఓ కేసు విషయంలో జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది.
తమిళనాడులోని ఓ బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండెంట్ ఉద్యోగం పొందిన గ్రాడ్యుయేట్ ఒకరిని తొలగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని లైవ్ లా వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది.
ఆ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి ఆయన్ను ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, ఆర్ మహదేవన్‌ల సుప్రీంకోర్ట్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది.
ఈ కేసులో పిటిషనర్ తాను గ్రాడ్యుయేట్ అనే విషయాన్ని దాచి పెట్టి పదో తరగతి వరకు చదివిన వారికి మాత్రమే దక్కాల్సిన ఉద్యోగాన్ని పొందారన్న విషయం మద్రాస్ హైకోర్ట్ విస్మరించిందని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
ఇలా చేయడం వల్ల తక్కువ అర్హతలున్న వారికి దక్కాల్సిన ఉద్యోగాలు వారికి దక్కవని, దీని వల్ల వాళ్లకు అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.
ఈ కేసులో ఏం జరిగింది?
సుప్రీంకోర్టు ఆర్డర్‌లో పేర్కొన్న ప్రకారం.. కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి.
ఈ కేసులో ప్రతివాది కె. పూవరసన్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు.
తమ బ్యాంకులో అటెండెంట్ ఉద్యోగం కోసం ఎనిమిదో తరగతి పాసై, ఇంటర్ పూర్తి చేయని అభ్యర్థుల జాబితాను పంపాలని 2009 అక్టోబర్ 20న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌కు ప్రతిపాదన పంపించింది.
అప్పటికే డిగ్రీ పూర్తి చేసినప్పటికీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్‌కు పంపిన దరఖాస్తులో పూవరసన్ తాను పదో తరగతి వరకే చదివినట్లు చెప్పారు.
ఉద్యోగంలో చేరిన తర్వాత డిగ్రీ చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే అతను డిగ్రీ పాసైన విషయాన్ని దాచి పెట్టారని గుర్తించిన బ్యాంక్, 2018 అక్టోబర్ 30న ఉద్యోగం నుంచి తొలగించింది.
బ్యాంక్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పూవరసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
బ్యాంక్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ పూవరసన్‌ను ఉద్యోగంలోకి తీసుకోవాలని, పని చేయని కాలానికి జీతం మినహా ఇతర సదుపాయాలను కల్పించాలని 2025 ఏప్రిల్ 16న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది.
దీనిపై బ్యాంక్ డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. 2025 సెప్టెంబర్ 9న డివిజన్ బెంచ్ ఈ అప్పీలును కొట్టేసింది. దీంతో బ్యాంకు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.
ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. పూవరసన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
"కుటుంబ పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు పెట్టడం సమంజసమే" అని సుప్రీంకోర్టు తెలిపింది.
పెద్ద చదువులు చదవని వారి కోసం ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలను రిజర్వ్ చేస్తోంది. ఇలాంటి ఉద్యోగాల నియామకాల్లో ఉన్నత విద్యావంతులతో వాళ్లు పోటీ పడలేరు. అందుకే అలాంటి విద్యార్హతలతో ఉన్న ఉద్యోగాలు వాళ్లకే చెందాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
"అటువంటి విధానాన్ని కోర్టులు నిలకడగా సమర్థిస్తూ వచ్చాయి" అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
జోమాన్. కేకే వర్సెస్ షాజిమోన్ .పి కేసులో ఏం జరిగింది?
బ్యాంక్ మేనేజర్ వర్సెస్ పూవరసన్ కేసులో తీర్పు సమయంలో జోమోన్ కెకె వర్సెస్ షాజిమోన్ పి. వర్సెస్ ఇతరులు (2025) కేసులో ఆదేశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఒక పోస్టుకు నిర్దేశించిన అర్హతలకు అనుగుణంగానే నియామకాలు చేపట్టాలని పునరుద్ఘాటించింది.
జోమోన్ కేకే వర్సెస్ షాజిమోన్ పి కేసు విషయానికొస్తే..
కేరళ రాష్ట్ర జల రవాణా శాఖలో 12 "బోట్ లస్కర్" (కేరళలో పడవల్లో పని చేసే సిబ్బందికి ఇచ్చే చట్టబద్దమైన సర్టిఫికెట్) భర్తీకి 2012లో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ పరీక్షలో ర్యాంకులు సాధించిన వారిలో అర్హత లేని వ్యక్తులు ఉన్నారని గుర్తించిన కొంతమంది అభ్యర్థులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
దీంతో ట్రైబ్యునల్ అలాంటివారిని తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి కేరళ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఈ కేసు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకెళ్లారు.
నోటిఫికేషన్ వచ్చే నాటికే తనకు సెరాంగ్ లైసెన్స్( కేరళలో పడవలు నడుపుకోవడానికి ఇచ్చే చట్టబద్దమైన సర్టిఫికెట్) ఉందని, తాను ఉద్యోగానికి అర్హుడినని సుప్రీంకోర్టులో వాదించారు.
అయితే సెరాంగ్ పోస్టుకు పదోన్నతి పొందడానికి లస్కర్ పోస్టు ఫీడర్ పోస్టు అయినంత మాత్రాన,సెరాంగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి లస్కర్ ఉద్యోగానికి అర్హుడు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
లస్కర్ లైసెన్స్ ఉన్న వాళ్లకు మాత్రమే లస్కర్ పోస్ట్ ఇవ్వాలని ఇతర లైసెన్సులు ఉన్న అభ్యర్థులను కేపీఎస్‌సీ "ర్యాంక్డ్ లిస్ట్"లో చేర్చి, ఆ అభ్యర్థులను నియామకానికి సిఫార్సు చేయకూడదనే కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
చట్టబద్దం, చెల్లుబాటు కాని ప్రక్రియ ద్వారా అప్పీలుదారుడు ఉద్యోగంలో చేరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అతని నియామకం చెల్లదని కోర్టు తెలిపింది.
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. 2026 ఏప్రిల్లో భారతదేశంలో నిరుద్యోగిత 5.2 శాతానికి చేరింది.
ఇది ఆరు నెలల గరిష్ఠసాయి అని కేంద్ర ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నెలవారీ బులెటిన్‌లో పేర్కొంది.
మార్చిలో ఇది 5.1 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో స్వల్పంగా పెరిగినట్లు తెలిపింది.
ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుపై నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు వాళ్లు మిశ్రమంగా స్పందించారు.
"కోర్టు తీర్పు రాజ్యాంగ పరిధికి లోబడి ఉంది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కోర్టులు కాపాడతాయి. తక్కువ విద్యార్హతలు ఉన్న వారికి దక్కాల్సిన ఉద్యోగాలు వారికే దక్కాలి. పీజీ, పీహెచ్‌డీ అర్హతలు ఉన్న వారితో పదో తరగతి చదివిన వాళ్లు పోటీ పడగలరా? సుప్రీంకోర్టు తీర్పు పెద్దగా చదువుకోని నిరుద్యోగుల హక్కుల్ని కాపాడుతోంది" అని న్యాయవాది అభిలాష్ బీబీసీతో చెప్పారు.
"ఇంట్లో పరిస్థితుల వల్ల పదో తరగతి వరకే చదువుకోగలిగాను. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో నాలాంటి వాళ్లు పీజీలు, పీహెచ్‌డీలు చదివిన వాళ్లతో పోటీ పడగలరా? మేం ఇద్దరం పోటీ పడితే ఉద్యోగం ఎవరికి వస్తుంది?. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాల్ని అమలు చేయాలి" అని విజయవాడలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న సురేంద్ర అన్నారు.
"కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాగా తగ్గిపోయింది. ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ చదివిన వాళ్లు పోటీ పడుతున్నారు. ఉన్నత విద్యార్హతలు ఉన్నాయని ఉద్యోగాలకు పోటీ పడవద్దంటే ఎలా?" అని ప్రస్తుతం హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)