You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోదీ తలనరికి బాబర్ ముందు పెట్టినప్పుడు ఏమైంది.. ఏనుగులు భయంతో వెనక్కి ఎందుకు పరుగెత్తాయి?
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 8 నిమిషాలు
భారత్‌పై తైమూర్ దాడి జరిపిన దాదాపు 125 ఏళ్ల తర్వాత, ఆయన ఆరో తరం వారసుడు జహీరుద్దీన్ బాబర్ కూడా భారత్‌పై దండయాత్ర చేశారు.
బాబర్ జీవితం 12 ఏళ్ల వయసు నుంచే పోరాటాలతో నిండిపోయింది. ఆయన ఎన్నోసార్లు ఓటమిని రుచి చూసినప్పటికీ, ప్రతి పరాజయం నుంచి నేర్చుకునే పట్టుదలను మాత్రం వదల్లేదు.
ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని తన సొంత రాజ్యమైన ఫర్గానాను కోల్పోయిన తర్వాత, బాబర్ కాబూల్‌లో స్థిరపడ్డారు. అక్కడి నుంచి పంజాబ్‌పై పలుమార్లు దాడులు చేశారు. ఆ రోజుల్లో దిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోదీ ప్రతినిధిగా ఉన్న దౌలత్ ఖాన్ పంజాబ్‌ను పాలిస్తుండేవారు.
దౌలత్ ఖాన్ ఇబ్రహీం లోదీకి అంత నమ్మకస్తుడు కాదు. ఏదో ఒక రోజు ఇబ్రహీం లోదీ పాలన నుంచి విముక్తి పొందుతాననే ఆశతో ఆయన లోపాయికారీగా బాబర్‌కు సహకరించేవారు. కానీ, 1525లో బాబర్ ఆయన్ను ఓడించి పంజాబ్‌ను చేజిక్కించుకున్నారు.
ప్రముఖ చరిత్రకారుడు జదూనాథ్ సర్కార్ తన పుస్తకం 'మిలిటరీ హిస్టరీ ఆఫ్ ఇండియా'లో ఇలా రాశారు: "1517లో ఇబ్రహీం లోదీ దిల్లీ సుల్తాన్ అయ్యారు.
ఆయన ధైర్యవంతుడే, కానీ తన బంధువుల తిరుగుబాటు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది"
"వారు లోదీని అధికారం నుంచి తప్పించి, సొంత స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలని చూసేవారు. బాబర్ మాటల్లో చెప్పాలంటే లోదీకి ఉన్న 'మూర్ఖత్వం' కూడా ఆయన సమస్యలకు మరో కారణం. అందుకే బాబర్ వద్దనున్న అనుభవజ్ఞులైన సైనికులకు వ్యతిరేకంగా ఎలాంటి పక్కా ప్రణాళికలు రచించలేకపోయారు."
"బాబర్ సైనికులు కఠిన క్రమశిక్షణకు అలవాటు పడిన వారు. వారికి అత్యంత సమర్థులైన జనరల్స్ నాయకత్వం వహించారు".
బాబర్ స్వల్ప సైన్యం
బాబర్ తన దండయాత్రను 1525 నవంబర్ 17న సింధ్ ప్రాంతంలోని హైదరాబాద్ (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) నగరం నుంచి ప్రారంభించారు. సింధు నదిని దాటిన తర్వాత బాబర్ తన సైనికులను లెక్కించారు.
అప్పుడు ఆయన సైన్యం తను ఊహించిన దానికంటే తక్కువగా ఉంది. ఆ సమయంలో ఆయన వద్ద మొత్తం 12 వేల మంది సైనికులు ఉన్నారు. ఆ తర్వాత, గత భారత దండయాత్రల్లో పక్కనపెట్టిన సైనికులు, అసంతృప్తితో ఉన్న అఫ్గాన్ సైనికులు కూడా వచ్చి బాబర్‌తో కలిశారు.
దీనివల్ల బాబర్ పానిపట్ చేరుకునే సమయానికి ఆయన సైన్యం సంఖ్య 20 వేలకు పెరిగింది. అయినప్పటికీ, లోదీ సైన్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. లోదీ సైనికుల సంఖ్య కనీసం ఒక లక్ష వరకు ఉంటుందని బాబర్ అంచనా వేశారు.
అంతేకాకుండా, లోదీ సైన్యంలో వెయ్యి ఏనుగులు కూడా ఉన్నాయి. అయితే, ఇబ్రహీం లోదీ భారీ సైన్యానికి బాబర్ వద్ద ఉన్న సమాధానం - అత్యాధునిక ఆయుధాలు. కానీ, లోదీ సైన్యాన్ని కేవలం మెరుగైన యుద్ధ నైపుణ్యాలతో మాత్రమే ఓడించడం సాధ్యమవుతుంది.
జదూనాథ్ సర్కార్ తన పుస్తకం 'మిలిటరీ హిస్టరీ ఆఫ్ ఇండియా'లో: "బాబర్ ముందుకు సాగే వేగం అద్భుతంగా ఉండేది. కానీ, ఇబ్రహీం లోదీ రోజుకు రెండు లేదా మూడు మైళ్ల దూరం మాత్రమే ప్రయాణిస్తూ చాలా నెమ్మదిగా ముందుకు సాగారు. మధ్యమధ్యలో రెండు రోజుల పాటు ఆగిపోయేవారు. ఆయన సైన్యం ఒక క్రమపద్ధతి లేకుండా కదిలే ఒక నగరంలా ఉండేది" అని తెలిపారు.
ఫిరంగి దళం, మెరుగైన యుద్ధ నైపుణ్యం
అంతకుముందు, బాబర్ గెలిచిన యుద్ధాల్లో ఎక్కువ భాగం పర్వత ప్రాంతాల్లో జరిగినవే. అక్కడ భారీ సైన్యాన్ని మోహరించడం సాధ్యం కాదు. అప్పట్లో యుద్ధ ఫలితాలు సైన్యం పరిమాణం మీద కాకుండా.. తెలివితేటలు, భౌగోళిక పరిస్థితులను వ్యూహాత్మకంగా వాడుకోవడం, శత్రువును బురిడీ కొట్టించడం మీద ఆధారపడి ఉండేవి.
పానిపట్ యుద్ధంలో బాబర్ మొదటిసారిగా మైదాన ప్రాంతంలో పోరాడుతున్నారు. ఇక్కడ సైనికుల సంఖ్యను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
అబ్రహం ఇరాలీ తన పుస్తకం 'ఎంపరర్స్ ఆఫ్ ది పీకాక్ థ్రోన్'లో ఇలా రాశారు: "ఇబ్రహీం లోదీకి ఉన్న భారీ సైన్యాన్ని తన వద్ద ఉన్న మెరుగైన ఫిరంగి దళం, యుద్ధ నైపుణ్యంతో నిర్వీర్యం చేయడమే బాబర్ ముందున్న అతిపెద్ద సవాల్. యుద్ధ భూమి ఎంత ఇరుకుగా ఉంటే అంత మంచిదనేది బాబర్ వ్యూహం. తద్వారా లోదీ సైన్యం తన చిన్న సైన్యాన్ని చుట్టుముట్టే అవకాశం ఉండదు."
"అయితే, కేవలం యుద్ధ క్షేత్రం ఇరుకుగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే లోదీ నేరుగా చేసే దాడులను తట్టుకునేంత లోతైన రక్షణ శ్రేణి బాబర్ సైన్యంలో లేదు."
"వ్యూహరచన కోసం బాబర్ తన అగ్రశ్రేణి జనరల్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి, సంప్రదాయ మొఘల్ యుద్ధ ప్రణాళికలో మార్పులు చేశారు. ఆ తర్వాత పానిపట్ మైదాన పరిస్థితులను అంచనా వేయడానికి తన వేగులను పంపారు".
ఎడ్లబండ్ల వ్యూహం
పానిపట్ మైదానం బాబర్ కంటే ఇబ్రహీం లోదీకే ఎక్కువ అనుకూలంగా ఉంటుందని వేగులు రిపోర్ట్ ఇచ్చారు. బాబర్ ప్రయోజనం పొందేందుకు అక్కడ చెట్లు, పొదలు తప్ప ఏమీ లేవు.
బాబర్ పానిపట్ చేరుకున్నాక, తన సైన్యాన్ని నగరం తూర్పు దిశలో యమునా నదికి దగ్గరగా మోహరించారు. ఆ రోజుల్లో యమునా నది నగరం పక్కనే ప్రవహించేది.
"దాదాపు 700 ఎడ్లబండ్లను గొలుసులతో కాకుండా, తోలు తాళ్లతో ఒకదానికొకటి కట్టాలని ఉస్తాద్ అలీ కులీని ఆదేశించాను" అని బాబర్ తన ఆత్మకథ 'బాబర్నామా'లో రాశారు.
ఆ పుస్తకంలో, "ప్రతి రెండు బండ్ల మధ్య ఐదు లేదా ఆరు చెక్క పలకలు అమర్చాం. వాటి వెనుక ఫిరంగులు పేల్చే సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఐదారు రోజుల పాటు బాబర్ యుద్ధానికి పూర్తి సన్నాహాలు చేసుకున్నారు."
"ఏర్పాట్లు ముగిశాక బాబర్ తన సైనికులతో 'పానిపట్ ఇళ్లు, బస్తీలు మనకు ఒకవైపు రక్షణ కవచంలా ఉంటాయి. తోలు తాడులతో కట్టిన ఎడ్లబండ్లు మరోవైపు కాపాడతాయి. వాటి వెనుక నుంచి మన పదాతి దళం దాడికి దిగుతుంది' అన్నారు. ఏప్రిల్ 12 నాటికి బాబర్ సన్నాహాలు పూర్తయ్యాయి" అని రాశారు.
లోదీ దాడి కోసం నిరీక్షణ
ఇబ్రహీం లోదీ ముందుగా దాడి చేయాలన్నదే బాబర్ ప్రధాన వ్యూహం. మొఘలులు లోదీ సామ్రాజ్యంలోకి చొరబడ్డారు కాబట్టి, వారిని వెళ్లగొట్టేందుకు లోదీనే మొదట స్పందిస్తారని బాబర్ భావించారు.
కానీ, ఇబ్రహీం లోదీ ఆలోచన మరోలా ఉంది.
అబ్రహం ఇరాలీ రాసిన 'ఎంపరర్స్ ఆఫ్ ది పీకాక్ థ్రోన్' పుస్తకం ప్రకారం, "లోదీ బాబర్‌పై దాడి చేయలేదు. బాబర్ దిల్లీ వైపు వెళ్లకుండా అడ్డుకోవడమే ఆయన ఉద్దేశం. రక్షణే అత్యుత్తమ దాడి అని ఆయన నమ్మారు"
"లోదీ నిరీక్షించారు. కానీ, బాబర్ తన సైనికుల మనోధైర్యం దెబ్బతినకుండా వెంటనే యుద్ధ ఫలితం రావాలని కోరుకున్నారు. ఏడు రోజుల పాటు లోదీ దాడి కోసం బాబర్ ఎదురుచూశారు. తన సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు లోదీ యుద్ధ నైపుణ్యాన్ని ఎగతాళి చేశారు. దూరం నుంచి బాణాలు వేస్తూ లోదీ సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారు స్పందించలేదు".
బాబర్ వలలో లోదీ సైన్యం
బాబర్ చివరికి తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
ఏప్రిల్ 19 రాత్రి లోదీ సైన్యంపై అకస్మాత్తుగా దాడి చేశారు. బాబర్ సైన్యంలోని ఎడమ భాగం నుంచి సుమారు నాలుగు వేల మంది సైనికులు ముందుగా దాడికి దిగారు. మిగిలిన సైనికులతో బాబర్ మధ్యలో నిల్చున్నారు.
ఒకవేళ ముందు వెళ్లిన సైనికులు విజయవంతంగా దూసుకెళ్తే, ఆ ఊపుతో మిగిలిన సైన్యాన్ని యుద్ధంలోకి దించాలని, ఒకవేళ వారు విఫలమైతే వెనక్కి వచ్చే వారికి రక్షణ కల్పించాలని ఆయన భావించారు.
అయితే, బాబర్ దాడి విఫలమైంది. లోదీ సైన్యం ఈ దాడిని ఎదుర్కోవడానికి అప్పటికే సిద్ధంగా ఉంది. ఈ విఫల ప్రయత్నమే బాబర్‌కు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. బాబర్ మొదటి నుంచి కోరుకుంటున్నట్లే, లోదీ సైన్యం తన స్థావరాలపై దాడికి దిగింది.
ఏప్రిల్ 20 ప్రశాంతంగా గడిచినా, ఏప్రిల్ 21 ఉదయం లోదీ సైన్యాలు ముందుకు కదులుతున్నట్లు సమాచారం అందింది. బహుశా అంతకుముందు రాత్రి బాబర్ దాడి విఫలం కావడంతో, మొఘలులను సులభంగా ఓడించవచ్చని వారు భావించి ఉండవచ్చు. కానీ, అది వారు చేసిన పెద్ద పొరపాటు. లోదీ సైనికులు బాబర్ పన్నిన వలలో చిక్కుకుపోయారు.
వెనక్కి పరుగెత్తిన ఏనుగులు
ఆభాస్ మల్దాహియార్ తన పుస్తకం 'బాబర్ ది క్వెస్ట్ ఫర్ హిందుస్థాన్'లో ఇలా రాశారు: "బాబర్ తన ఫిరంగి దళం, ఎడ్లబండ్ల సమూహంతో సిద్ధంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితి కోసం రిజర్వ్ సైన్యాన్ని వెనుక ఉంచారు. లోదీ సైనికులు ముందుకు రాగానే, ఒకవైపు పానిపట్ గోడలు, మరోవైపు మొఘలులు తవ్విన గొయ్యిలు, అడ్డంకుల మధ్య ఇరుక్కుపోయారు. వారు మొఘల్ రక్షణ శ్రేణికి దగ్గరవ్వగానే మొఘలుల ఫిరంగుల మోత మొదలైంది".
"ఆ ఇరుకైన ప్రాంతంలో అఫ్గాన్ సైన్యం(లోదీ సైన్యం) చెల్లాచెదురైపోయింది. కొద్దిసేపటికే లోదీ సైన్యం ఒక గుంపులా మారిపోయింది. వారు సరిగ్గా పోరాడలేక, వెనక్కి పారిపోలేక సతమతమయ్యారు".
బాబర్ తన బాబర్నామా పుస్తకంలో "శత్రువులపై బాణాల వర్షం కురిపించాలని ఆదేశించాను. నా జనరల్ మెహదీ ఖ్వాజా నిరంతరం బాణాలు వేయడంతో లోదీ ఏనుగులు వెనక్కి పరుగెత్తాయి. కొద్దిసేపటికే శత్రువుల పరిస్థితి సాలె గూడులో చిక్కుకున్న కీటకంలా తయారైంది" అని తెలిపారు.
బాబర్ ఈ అవకాశాన్ని వాడుకుంటూ లోదీ సైన్యంపై వెనుక నుంచి కూడా దాడి చేశారు.
"అఫ్గాన్లు ధైర్యంగా పోరాడారు కానీ, వారికి గెలిచే అవకాశం దక్కలేదు. సూర్యోదయ సమయంలో మొదలైన యుద్ధం మధ్యాహ్నానికి ముగిసింది. లోదీ సైన్యం ఓడిపోయింది. సుమారు 15 నుంచి 16 వేల మంది అఫ్గాన్ సైనికులు చనిపోయారు. మైదానమంతా శవాలతో నిండిపోయింది" అని బాబర్ రాశారు.
చనిపోయిన వారిలో ఇబ్రహీం లోదీ కూడా ఉన్నారు. రణరంగంలో మరణించిన దిల్లీ పాలకుడు ఆయనొక్కరే.
అబ్రహం ఇరాలీ రాసిన పుస్తకం ప్రకారం, "మొఘల్ సైనికులు సుల్తాన్ మృతదేహాన్ని గుర్తించి, నాటి సంప్రదాయం ప్రకారం ఆయన తల నరికి బాబర్ ముందు ఉంచారు. కానీ, బాబర్ ఆ మృతదేహం పట్ల గౌరవం చూపారు."
"లోదీ పార్థివ దేహానికి బాబర్ గౌరవిస్తూ, 'నీ పరాక్రమాన్ని గౌరవిస్తున్నాను' అంటూ సెల్యూట్ చేశారు. మృతదేహాన్ని జరీ వస్త్రంతో కప్పించారు. అలాగే తన సేనాధిపతులైన దిలావర్ ఖాన్, అమీర్ ఖలీఫాలను ఇబ్రహీం లోదీ మృతదేహానికి స్నానం చేయించి, ఆయన మరణించిన ప్రదేశంలోనే పూర్తి గౌరవాలతో ఖననం చేయాలని ఆదేశించారు".
'బాబర్ పేరుతో ఖుత్బా చదివించారు'
"భారత సామ్రాజ్యాన్ని కేవలం ఐదు గంటల యుద్ధంలోనే గెలిచాం. సమయం వృథా చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లోదీ రాజధాని ఆగ్రాను స్వాధీనం చేసుకుని, అక్కడి ఖజానాను తన ఆధీనంలోకి తీసుకోవాలని హుమాయున్ను ఆదేశించాను" అని బాబర్ తన ఆత్మకథలో రాశారు.
మరుసటి రోజు బాబర్ కూడా ఆగ్రా వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన కొన్ని రోజులు దిల్లీలో ఆగారు. అక్కడి ఖజానాను స్వాధీనం చేసుకుని, నగరంలోని రాజభవనాలు, తోటలు, పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అలావుద్దీన్ ఖిల్జీ, గ్యాసుద్దీన్ బల్బన్ సమాధులను సందర్శించారు. వీటితో పాటు కుతుబ్ మీనార్, హౌజ్ ఖాస్, సికిందర్ లోదీ తోటలకు కూడా వెళ్లారు.
"ఈ శక్తి చిహ్నాలన్నింటినీ పరిశీలించిన తర్వాత నేను ఒక పడవ ఎక్కి నా విజయోత్సాహంలో 'అరక్(మద్యం)' తాగాను. రాత్రి కాగానే యమునా నది ఒడ్డున నిలబడి తుగ్లకాబాద్ కోటను చూశాను. రోజురోజుకూ హిందుస్థాన్‌పై నా పట్టు బలపడుతూ వచ్చింది" అని బాబర్ రాశారు.
తన పాలనకు చట్టబద్ధత కల్పించడానికి, నగరం ప్రధాన మసీదులో శుక్రవారం నమాజ్ సందర్భంగా తన పేరుతో 'ఖుత్బా' చదివించేలా బాబర్ చర్యలు తీసుకున్నారు. మౌలానా మహమూద్, షేక్ జైన్ ఈ పనిని పూర్తి చేశారు.
పానిపట్ నుంచి రెండు వారాల్లో 280 కిలోమీటర్లు ప్రయాణించి, మే 4న బాబర్ ఆగ్రాకు చేరుకున్నారు. ఒక వారం పాటు నగరం శివార్లలోని బహిరంగ మైదానంలో తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
మే 10న బాబర్ ఒక భారీ ఊరేగింపుతో ఆగ్రాలోకి ప్రవేశించి, ఇబ్రహీం లోదీ ప్యాలెస్ ముందు గుర్రం దిగి, హిందుస్థాన్ చక్రవర్తిగా గద్దె నెక్కారు. అప్పుడు బాబర్ వయసు 43 ఏళ్లు. ఇక ఎప్పటికీ భారతదేశంలోనే స్థిరపడాలని ఆ సమయంలో ఆయన నిర్ణయించుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)