You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పన్నెండేళ్ల తరువాత గర్భం.. ఒకే కాన్పులో అయిదుగురు జననం
- రచయిత, మైఖేల్ టెఫెరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 3 నిమిషాలు
ఇథియోపియాలోని హరారీ ప్రాంతంలో ఒక మహిళ 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత అరుదైన రీతిలో ఐదుగురు పిల్లల(క్వింటుప్లెట్స్)కు జన్మనిచ్చారు.
ఒకేసారి ఐదుగురు పిల్లలు కలగడం పట్ల బెద్రియా అడెమ్, ఆమె భర్త ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 35 ఏళ్ల బెద్రియా నలుగురు అబ్బాయిలకు, ఒక అమ్మాయికి జన్మనివ్వగా.. శిశువులందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని హివోట్ ఫానా స్పెషలైజ్డ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
"నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను" అని ఆమె బీబీసీతో అన్నారు. తన ప్రార్థనలు ఫలించే వరకు ఎంతో బాధను, మానసిక వేదనను అనుభవించానని ఆమె అన్నారు.
తల్లీబిడ్డలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ నూర్ అబ్దుల్లాహి చెప్పారు.
పుట్టినప్పుడు శిశువులు 1.3 నుంచి 1.4 కిలోల బరువు ఉన్నారని, కిలోకు పైగా బరువున్న పిల్లలు క్షేమంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.
5.5 కోట్లలో ఒకరికి..
బెద్రియా ఎటువంటి కృత్రిమ పద్ధతులు (ఐవీఎప్) లేకుండానే సహజంగా గర్భం దాల్చారని వైద్యులు చెప్పారు. ఆ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సౌకర్యం కూడా లేదన్నారు.
సాధారణంగా ఐవీఎఫ్ చికిత్సలో ఒకటిగా పైగా ఎంబ్రియోలను ప్రవేశపెడితే ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది.
సహజ సిద్ధంగా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం 5.5 కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుంది.
మంగళవారం సాయంత్రం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈ ప్రసవం జరిగినట్లు వైద్యులు చెప్పారు.
"గర్భధారణ సమయంలో ఆమె క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు ఆమెకు ముందే తెలుసు. గర్భం దాల్చినప్పటి నుంచి ఆమెకు సరైన వైద్య సహాయం అందించాం" అని డాక్టర్ మొహమ్మద్ చెప్పారు. ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆయన అన్నారు.
మొదట తనకు నలుగురు పిల్లలు ఉన్నారని చెప్పారని, కానీ ప్రసవ సమయంలో ఐదుగురు ఉన్నట్లు తెలిసిందని బెద్రియా చెప్పారు.
"నేను ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తే, దేవుడు నాకు ఐదుగురిని ఇచ్చారు" అని ఆమె అన్నారు.
'ఊరంతా మాటలనేవారు'
తొలిసారి తల్లి అయిన బెద్రియాకు ఇదే తొలి కాన్పు. ఆమె భర్తకు అంతకుముందు వివాహం ద్వారా ఒక బిడ్డ ఉండగా, ఆ బిడ్డ కూడా వీరితోనే ఉంటున్నారు.
"ఆ బిడ్డ ఉన్నాడు కదా, ఇక చాలు అని నా భర్త నన్ను ఓదార్చేవారు. కానీ, ఊరి వారందరూ నాకు సంతానం లేకపోవడం గురించి ప్రశ్నిస్తుంటే మనసులో ఎంతో వేదన అనుభవించాను" అని ఆమె అన్నారు.
"గతంలో నేను పడ్డ కష్టాలు ఇప్పుడు ఒక పీడకలలా అనిపిస్తున్నాయి, వాటిని అస్సలు గుర్తు తెచ్చుకోవాలని లేదు" అన్నారు బెద్రియా.
"పిల్లల కోసం నిరంతరం ప్రార్థిస్తూ, 12 ఏళ్లు ఎంతో వేదన అనుభవించాను. చివరికి దేవుడు నా మొర ఆలకించారు" అన్నారు.
అయితే, తమది సామాన్య రైతు కుటుంబమని, ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదని బెద్రియా అంటున్నారు.
ఈ ఐదుగురు పిల్లలకు నైఫ్, అమ్మర్, ముంజీర్, నజీరా, అన్సార్ అని పేర్లు పెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)