You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, చికిత్స తరువాత మళ్లీ తిరగబెడుతుందా.. పురుషులకూ ఈ వ్యాధి వస్తుందా?
- రచయిత, ప్రియాంక ధీమాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. యువతుల నుంచి పెద్దవారిదాకా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్న వ్యాధి ఇది.
బ్రెస్ట్ క్యాన్సర్, చికిత్సపై ప్రజలలో ఇప్పటికీ అనేక అపోహలు, భయాలు ఉన్నాయి.
రొమ్ము క్యాన్సర్‌కు నివారణ ఉంది. చికిత్స ఉంది. కానీ ఇందుకోసం కచ్చితమైన సమాచారంతో పాటు లక్షణాలను గుర్తించడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం చాలా అవసరం.
ఈ విషయంపై వైశాలి (ఘజియాబాద్)లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్, డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజిందర్ కౌర్‌తో బీబీసీ మాట్లాడింది.
బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే, తప్పనిసరిగా రొమ్మును తొలగించాలా?
డాక్టర్ రాజిందర్ కౌర్: రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్మును తొలగించాలని అర్థం కాదు. ఈ రోజుల్లో ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్-కన్జర్వింగ్ సర్జరీ అనే ఆధునిక శస్త్రచికిత్స చేస్తున్నాం.
రోగులు ప్రారంభ దశలోనే మా వద్దకు వచ్చినప్పుడు కణితిని మాత్రమే తొలగించి, మిగిలిన రొమ్ము పరిమాణాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం.
ఒక మహిళకు రొమ్ముల పరిమాణం పెద్దగా ఉన్నప్పటికీ, దాని పరిమాణాన్ని తగ్గించి, సరైన ఆకృతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇది సాధ్యమే.
పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుందా?
డాక్టర్ రాజిందర్ కౌర్:రొమ్ము క్యాన్సర్ పురుషులకు కూడా రావచ్చు. కానీ చాలా తక్కువ.
మహిళల్లో నమోదయ్యే ప్రతి 100 కేసులకు, పురుషులలో కేవలం ఒక కేసు మాత్రమే వస్తుంది.
పురుషులకు కూడా చనుమొన కింద రొమ్ము కణజాలం ఉంటుంది. అక్కడ క్యాన్సర్ పెరగవచ్చు.
రొమ్ములో గడ్డ, చనుమొన నుంచి స్రావం, లేదా చనుమొన లోపలికి కుంచించుకుపోవడం వంటి లక్షణాలు మహిళల్లో ఉన్నట్లే ఉంటాయి.
రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏంటి?
డాక్టర్ రాజిందర్ కౌర్: రొమ్ము క్యాన్సర్ లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించడం చాలా ముఖ్యం. నొప్పి లేని గడ్డ, చనుమొన నుంచి ద్రవం కారడం, లేదా చనుమొన లోపలికి ముడుచుకుపోవడం, చర్మం గట్టిపడటం లేదా ఎర్రబడటం, రొమ్ము ఆకృతిలో మార్పు రావడం వంటివన్నీ రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు.
రొమ్ము క్యాన్సర్‌కు కారణమేంటి?
డాక్టర్ రాజిందర్ కౌర్: కొన్ని అలవాట్లు, శారీరక మార్పులు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
చిన్న వయసులోనే రుతుస్రావం మొదలుకావడం, ఊబకాయం, రుతుస్రావం ఆలస్యంగా ఆగిపోవడం, పిల్లలు లేకపోవడం లేదా తల్లిపాలు ఇవ్వకపోవడం, అసలు వ్యాయామం చేయకపోవడం, మద్యం, సిగరెట్లు లేదా పొగాకుకు బానిసవడం వంటివన్నీ ప్రమాద సంకేతాలే.
కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉండి ఉంటే, జన్యుపరంగా సంక్రమించే ప్రమదం కూడా ఉంటుంది.
ఈ కారణాలన్నీ కలిస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది.
నివారణా మార్గాలేమిటి?
డాక్టర్ రాజిందర్ కౌర్: ఊబకాయం ఉంటే, దాన్ని తగ్గించుకోవాలి.
ముఖ్యంగా నెలసరి ఆగిపోయిన తర్వాత, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి
30 ఏళ్లలోపు బిడ్డను కనడం ప్రయోజనకరమని భావిస్తారు. అలాగే బిడ్డకు కనీసం ఒక సంవత్సరం పాటు తల్లిపాలు ఇవ్వడం చాలా అవసరం. ఆహారంపై శ్రద్ధ వహించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఇలాంటి దైనందిన అలవాట్లు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవు.
కాన్సర్ ప్రమాదాన్ని గుర్తించడానికి ఏ పరీక్షలు చేయాలి?
డాక్టర్ రాజిందర్ కౌర్:20 ఏళ్లు దాటిన ప్రతి మహిళ నెలకొకసారి స్వీయ పరీక్ష చేసుకోవాలి.
దీనివల్ల మీ శరీరం సాధారణ స్థితి గురించి తెలియడంతోపాటు, ఏవైనా అసాధారణత ఉంటే వాటిని త్వరగా గుర్తించడంలో కూడా ఇది సాయపడుతుంది.
మార్పులను ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అంత సులభం అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి.
ఇంకో పద్ధతి ఏంటంటే ఏడాదికోసారి మీ డాక్టర్‌తో పరీక్ష చేయించుకోవడం. దీన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్ అంటారు. ఈ పరీక్షలో అంతా సవ్యంగా ఉందో లేదో మీ డాక్టర్ చేతితో పరీక్షిస్తారు.
మూడవ, కచ్చితమైన పద్ధతి మామోగ్రఫీ. ఈ పరీక్ష ఎంత కచ్చితమైనదంటే రొమ్ములో ఉండే అతి చిన్న గడ్డను కూడా గుర్తించవచ్చు. 40 ఏళ్లు దాటినవారు ప్రతి ఏడాది మామోగ్రామ్ చేయించుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 40 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
పిల్లలకు పాలివ్వని తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువా?
సమాధానం:
డాక్టర్ రాజిందర్ కౌర్: బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం.
ఏడాదిపాటు బిడ్డకు పాలు ఇచ్చే తల్లులకు క్యాన్సర్ ప్రమాదాన్ని 2 నుంచి 4 శాతం వరకు తగ్గుతుంది. ఎంత ఎక్కువ కాలం తల్లిపాలు ఇస్తే, అన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
ఉదాహరణకు ఒక మహిళ రెండేళ్లపాటు బిడ్డకు పాలిస్తే, రొమ్ము కాన్సర్ సోకే ప్రమాదం 8 నుంచి 12 శాతం వరకు తగ్గుతుంది.
వాస్తవానికి పాలిచ్చే సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తక్కువ చురుకుగా ఉంటుంది. ఇది రొమ్ము కణాలు వేగంగా పరిపక్వం చెందడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సాయపడుతుంది.
రొమ్ము క్యాన్సర్‌ను ఏ దశలో నయం చేయవచ్చు?
డాక్టర్ రాజిందర్ కౌర్: రొమ్ము క్యాన్సర్ చికిత్స ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. మొదటి, రెండవ దశలో, 90 నుంచి 95 శాతం మంది రోగులను నయం చేయవచ్చు. మొదట శస్త్రచికిత్స చేస్తారు. ఆ తర్వాత కీమోథెరపీ, ఆపై రేడియేషన్ థెరపీ చేస్తారు.
3వ దశలో క్యాన్సర్ కొద్దిగా వ్యాప్తిచెందుంతుంది. అందువల్ల కణితిని తగ్గించి, ఆపరేషన్‌ను సులభతరం చేయడానికి మొదట కీమోథెరపీ ఇచ్చి, తర్వాత మిగిలిన చికిత్స కొనసాగిస్తారు.
4వ దశలో క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. రోగి జీవితాన్ని మెరుగుపరచడానికి, పొడిగించడానికి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ చేస్తారు.
మంచి విషయమేంటంటే ఈ ఆధునిక చికిత్సలన్నీ భారత్‌లో అందుబాటులో ఉన్నాయి.
క్యాన్సర్ ఏ వయసువారికైనా వస్తుందా?
డాక్టర్ రాజిందర్ కౌర్: రొమ్ము క్యాన్సర్ ఏ వయసులోనైనా రావచ్చు. ఓ 19 ఏళ్ల యువతి తన తల్లితో కలిసి నా దగ్గరకు వచ్చింది. ఆమె రొమ్ములో ఒక కణితి ఉంది. దాన్నుంచి రక్తస్రావం అవుతోంది. నేను దాన్ని పరీక్షించినప్పుడు, అది రొమ్ము క్యాన్సర్ అని రిపోర్టులో నిర్ధరణ అయింది.
ఎందుకింత ఆలస్యం చేశారని వాళ్లమ్మను అడిగినప్పుడు...19 ఏళ్ల అమ్మాయి ఛాతీలోని చిన్న గడ్డ క్యాన్సర్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు అని ఆమె చెప్పారు. ఇలాంటి ఆలోచనతోనే వారు ఐదారునెలలు గడిపేయడంతో ఆ గడ్డ క్యాన్సర్‌గా మారి శరీరం అంతటా వ్యాపించింది. నెలల తరబడి చికిత్స చేసినా ఆమెను కాపాడలేకపోయారు.
ఈ విషాద గాథ మనందరికీ నేర్పేదేంటంటే...ఆలస్యం చేయద్దు, గడ్డ కనిపిస్తే వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్ళండి అని.
క్యాన్సర్ చికిత్స వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా?
డాక్టర్ రాజిందర్ కౌర్: క్యాన్సర్ చికిత్స వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి, కానీ చికిత్స పూర్తయిన తర్వాత సాధారణంగా తగ్గిపోతాయి. మహిళల్లో కనిపించే దుష్ప్రభావం జుట్టు రాలడం, కనుబొమ్మల రోమాలు కూడా రాలిపోవడం.
ఈ చికిత్సలో భాగంగా రోగి రొమ్మును తొలగిస్తారు. దీనివల్ల చాలా మానసిక, శారీరక మార్పులు కలుగుతాయి.
అయితే చికిత్స తర్వాత రోగి బాగా కోలుకుంటారు. తలపై జుట్టు, కనుబొమ్మల రోమాలు తిరిగి పెరుగుతాయి. రొమ్మును దాని అసలు పరిమాణానికి పునరుద్ధరిస్తాం.
ఆయుర్వేద చికిత్సతో నయమవుతుందా?
డాక్టర్ రాజిందర్ కౌర్: శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆయుర్వేదం సహాయపడుతుంది. కానీ అది క్యాన్సర్‌కు నివారణ కాదు. చాలాసార్లు ఆయుర్వేద మందులు క్యాన్సర్‌ను నయం చేస్తున్నాయని రోగులు నమ్ముతారు. వాస్తవానికి క్యాన్సర్ అంతర్గతంగా పెరుగుతూనే ఉంటుంది.
నిజం తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా ఉండొచ్చు.
అందువల్ల ఆయుర్వేదాన్ని ఒక సహాయకారిగా పరిగణించండి. కానీ క్యాన్సర్‌కు కచ్చితమైన చికిత్స కోసం వైద్యుని సలహా మాత్రమే తీసుకోండి.
క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉందా?
డాక్టర్ రాజిందర్ కౌర్: కొన్ని సందర్భాల్లో చికిత్స తర్వాత రొమ్ము క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
మొదట్లోనే వ్యాధి ముదిరిన వారిలో, లేదా చికిత్స మధ్యలోనే ఆపేసిన వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
భాగస్వామి పాత్ర ఎలా ఉండాలి?
డాక్టర్ రాజిందర్ కౌర్: క్యాన్సర్ అనేది కేవలం మహిళల పోరాటమే కాదు. మొత్తం కుటుంబం బాధ్యత. ఈ సమయంలో మహిళకు భావోద్వేగ, మానసిక మద్దతు చాలా అవసరం.
ఈ సమయంలో మహిళలు చాలా భయపడతారు. వారి మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. నిద్రలేమి, ఆకలి లేకపోవడం, ఏడుపు రావడం వంటి వాటితో బాధపడతారు.
ఈ సమయంలో వారికి అన్నింటికన్నా ఎక్కువగా మానసిక మద్దతు అవసరం. ఆమె భాగస్వామే ఆమెకు పెద్ద అండ.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)