‘పురుషాంగంలో 30 శాతం భాగం తొలగించి నా ప్రాణాలు కాపాడారు.. అందుకే సర్జరీని వీడియో తీయడానికి అంగీకరించాను’

    • రచయిత, కాథరిన్ లిస్ట్
  • చదివే సమయం: 6 నిమిషాలు

అలిస్టర్ మన్రో తన పురుషాంగంపై ఉన్న ఒక చిన్న గడ్డ క్రమంగా పెరుగుతుండటాన్ని గమనించారు. తానేదో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నానని సందేహించారు.

కానీ, ఆయన సుమారు ఆరు వారాల పాటు డాక్టరు దగ్గరకు వెళ్లకుండా వాయిదా వేశారు.

ఒకసారి డాక్టర్ ఆయన్ను పరీక్షించిన వెంటనే, అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

''అలా చెప్పడం చాలా ధైర్యంతో కూడిన విషయం'' అని 49 ఏళ్ల అలిస్టర్ అన్నారు.

''నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన (డాక్టర్) వంద శాతం ఖచ్చితంగా చెప్పలేకపోయినా, అది క్యాన్సర్ కావచ్చని భావించారు" అని చెప్పారు.

ఒక వారం తరువాత రైగ్మోర్‌లోని యూరాలజిస్ట్ కూడా అదే మాట చెప్పారు. ఆ తర్వాత బయాప్సీ చేయించుకోవడమే మిగిలింది.

స్కాట్లాండ్‌లో ఇన్వర్నెస్‌కు చెందిన కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అలిస్టర్‌ తన పురుషాంగంపై మొదటిసారి ఆ గడ్డను గమనించిన మూడు నెలల తర్వాత, అది పురుషాంగ క్యాన్సర్ (పెనైల్ క్యాన్సర్) అని నిర్ధరణ అయింది.

ఇది చాలా అరుదైన వ్యాధి

స్కాట్లాండ్‌లో ఏటా 80 నుంచి 90 మంది పురుషులు, మొత్తం బ్రిటన్‌వ్యాప్తంగా 700 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

''నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. కానీ అది క్యాన్సర్ అయ్యి ఉంటుందని ముందే సందేహించాను'' అని అలిస్టర్ బీబీసీ స్కాట్లాండ్ న్యూస్‌తో చెప్పారు.

''ఇలాంటి క్యాన్సర్ గురించి అంతకుముందెన్నడూ నేను వినలేదు. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయాయి" అని అన్నారు.

ఆ క్యాన్సర్ వ్యాపిస్తోందని సీటీ స్కాన్ తీశాక నిర్ధరణ అయింది.

అలిస్టర్‌కు వైద్యులు చేసిన శస్త్రచికిత్సను బీబీసీ కెమెరా బృందం చిత్రీకరించింది.

దీన్ని బుధవారం 'సర్జన్స్: ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ లైఫ్' ఎపిసోడ్‌లో ప్రసారం చేశారు.

ఏడు గంటల పాటు సాగిన ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌లో అలిస్టర్ శరీరంలో కణితిని, ఆయన పురుషాంగంలో 30 శాతం భాగాన్ని తొలగించారు.

క్యాన్సర్ అలిస్టర్ గజ్జల్లోని లింఫ్ నోడ్స్‌కు కూడా వ్యాపించింది, కాబట్టి వాటిని కూడా తొలగించాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఆయన తొడ భాగం నుంచి తీసిన చర్మాన్ని ఉపయోగించి పురుషాంగాన్ని తిరిగి పునర్నిర్మించారు.

ఆరు వారాల తర్వాత, అలిస్టర్ మరో మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మొదటి సర్జరీ ఫలితాల్లో ఇంకా కొద్దిపాటి కణితి మిగిలి ఉన్నట్లు తేలింది.

క్యాన్సర్ ఆయన పెల్విక్ ప్రాంతానికి వ్యాపించే అవకాశం 50 శాతం ఉంది.

''శరీరం లోపల పరీక్షించే వరకు అది క్యాన్సరో కాదో వారు ఖచ్చితంగా చెప్పలేరు'' అని ఆయన అన్నారు.

వారు వాస్తవానికి ఏం చేస్తారంటే, క్యాన్సర్ ఉన్న కణజాలాన్ని కోసి తీసి, వెంటనే వాటిని తనిఖీ చేస్తారు. ప్రాథమికంగా చెప్పాలంటే వారు మీ శరీరాన్ని శోధిస్తూ లోతుగా వెళ్తుంటారు.

క్యాన్సర్ ఆఖరి భాగం దొరికే వరకు వారు వెతుకుతూనే ఉంటారు. వినడానికి ఇది కొంచెం ప్రాచీన పద్ధతిలా అనిపించినా, వారు చేస్తున్నది అదే.

'సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా సెక్స్‌కు దూరం'

అలిస్టర్ శస్త్రచికిత్స తర్వాత ఒక నెల రోజుల పాటు రేడియోథెరపీ చేయించుకున్నారు. ఆయనకు క్యాన్సర్ పూర్తిగా నివారణ అయినట్లు ఫిబ్రవరిలో నిర్ధరణ అయింది.

శస్త్రచికిత్స, రేడియోథెరపీ వల్ల తలెత్తిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఆయన ప్రస్తుతం సెక్స్‌లో పాల్గొనలేకపోతున్నారు. మూత్ర విసర్జన కూడా సరిగ్గా చేయలేకపోతుండడంతో చర్మం వాపు వస్తోంది.

ఈ సమస్యను సరిచేయడానికి సుమారు ఒక సంవత్సరం తర్వాత అలిస్టర్‌కు రీకన్‌స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశం ఉంది.

అయితే, రానున్న రెండేళ్లలో క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయనను హెచ్చరించారు.

అవగాహన కల్పించడానికి బీబీసీ డాక్యుమెంటరీ

తనకు వచ్చిన క్యాన్సర్ గురించి తన కుటుంబసభ్యులకు చెప్పడం అలిస్టర్‌కు చాలా కష్టంగా అనిపించింది. ముఖ్యంగా చాలామందికి దీని గురించి అస్సలు తెలియకపోవడమే అందుకు ప్రధాన కారణం.

కానీ, తన శస్త్రచికిత్సను బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ కోసం చిత్రీకరిస్తున్నారన్న విషయాన్ని కూడా ఆయన తన కుటుంబసభ్యులకు చెప్పాల్సి వచ్చింది.

''పురుషులలో వచ్చే క్యాన్సర్‌ల పట్ల అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం'' అని అలిస్టర్ అన్నారు.

పురుషాంగం విషయంలో ఏదో తేడాగా ఉందని గమనించి కూడా, డాక్టరు దగ్గరకు వెళ్లడానికి సిగ్గుపడుతున్న వారు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూసి, 'నేను డాక్టరును సంప్రదించడం మంచిది' అని అనుకునేలా చేయడమే ఈ ప్రోగ్రామ్ అసలు లక్ష్యం.

''ఇలాంటి క్యాన్సర్‌ను గుర్తించడం చాలా కష్టం. లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. మీ పురుషాంగంపై ఒక చిన్న మచ్చలా కూడా ఇది ఉండవచ్చు" అని అలిస్టర్ అన్నారు.

''ఎవరికైనా ఏదైనా గడ్డలాంటిది కనిపించినా, లేదా అంగస్తంభన సమస్యలు ఉన్నా, లేదా రక్తం కనిపిస్తున్నా.. వెంటనే పరీక్షలు చేయించుకోండి'' అని సూచించారు.

అలిస్టర్ పురుషాంగం ముందు భాగం (హెడ్) మీద ఆ గడ్డ ఉంది. అది నొప్పుగా ఏమీ లేదు కానీ క్రమంగా పెరిగింది. ఒకానొక సమయంలో దాని నుంచి రక్తం రావడాన్ని కూడా ఆయన గమనించారు.

ఎడిన్‌బరోలోని వెస్ట్రన్ జనరల్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ యూరాలజికల్ సర్జన్ సీజే శుక్లా ఆధ్వర్యంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది.

అత్యంత అరుదైన పురుష క్యాన్సర్‌లకు చికిత్స అందించగల సామర్థ్యం ఉన్న స్కాట్లాండ్‌లోని రెండు వైద్య కేంద్రాలలో ఇదొకటి.

అలిస్టర్ ఇప్పటికే 'సర్జన్స్: ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ లైఫ్' కార్యక్రమానికి సంబంధించిన ప్రివ్యూను చూశారు.

''నిజం చెప్పాలంటే, ఆ సర్జరీ వీడియో చూడటానికి చాలా భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని నేను ఒప్పుకోవాలి'' అని ఆయన అన్నారు.

''ఆ ప్రోగ్రామ్‌లో నాకు విపరీతంగా రక్తస్రావం అవ్వడం మీరు చూడవచ్చు. నేను అది చూసినప్పుడు 'దీని గురించి నాకు ఎవరూ చెప్పలేదే' అని ఆశ్చర్యపోయాను'' అని చెప్పారు.

కానీ, సర్జన్ మాత్రం అది పెద్ద విషయమేమీ కాదని, ఆపరేషన్ సమయంలో అలా ఎప్పుడూ జరుగుతుంటుందన్నారని గుర్తుచేసుకున్నారు.

ఇప్పటికే ఐదున్నర నెలలుగా తిరిగి విధుల్లోకి చేరిన అలిస్టర్, నాటి తన శస్త్రచికిత్స దృశ్యాలు చూడటానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఆ ప్రోగ్రామ్ ప్రసారమైనప్పుడు తన శస్త్రచికిత్సను బహుశా మళ్లీ చూస్తానని చెప్పారు.

''ఎడిన్‌బరోలోని వెస్ట్రన్ జనరల్ ఆసుపత్రిలోని సర్జన్లకు, సిబ్బందికి, డిస్ట్రిక్ట్ నర్సులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను'' అని అన్నారు.

''నాకు అందిన చికిత్స అద్భుతం. అందులో ఎలాంటి తప్పు వెతకలేను. ఎన్‌హెచ్‌ఎస్‌కు నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.''

''డాక్టర్ శుక్లా నా ప్రాణాలను కాపాడారు'' అని అలిస్టర్ అన్నారు.

''పురుషుల సత్వర స్పందన చాలా ముఖ్యం''

వైద్యరంగంలో 14 ఏళ్లుగా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న శుక్లా మాట్లాడుతూ, బ్రిటన్ మొత్తంలో స్కాట్లాండ్‌లోనే పురుషాంగ క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని చెప్పారు.

''2030 నుంచి 2040 నాటికి ఈ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా. కాబట్టి ఇలాంటి రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి సిద్ధంగా ఉండాలి'' అని ఆయన అన్నారు.

''సాధారణంగా రోగులు ఈ సమస్యను గుర్తించినా, డాక్టరును సంప్రదించడానికి ముందు రెండు మూడు నెలల పాటు కాలయాపన చేస్తూ ఉంటారు'' అని చెప్పారు.

అసలు 'పురుషాంగ క్యాన్సర్' గురించి తాము వినలేదని చాలామంది రోగులు చెబుతుంటారని అన్నారు.

అవగాహన ఎక్కువగా ఉన్న 'ప్రోస్టేట్ క్యాన్సర్' విషయంలో కూడా పురుషులు సిగ్గు పడి వైద్య సహాయం కోరడానికి వెనుకాడతారని ఆయన చెప్పారు.

కొన్నిసార్లు డాక్టర్లు కూడా దీనిని పొరపాటుగా 'థ్రష్' (ఈస్ట్ ఇన్ఫెక్షన్)గా భావించి తప్పుడు నిర్ధరణ చేసే ప్రమాదం ఉందని, వారాల తరబడి చికిత్స జరిగిన తర్వాత గానీ ఆ రోగిని హాస్పిటల్‌కు పంపరని ఆయన పేర్కొన్నారు.

అప్పుడు కూడా, రోగులను ముందు స్థానిక ఆసుపత్రికి పంపిస్తారు. ఆ తర్వాతే రోగులు ప్రత్యేక చికిత్సా కేంద్రాలకు వస్తారు.

''పురుషులు త్వరగా స్పందించడం చాలా ముఖ్యం'' అని శుక్లా అన్నారు.

స్కాంట్లాండ్‌లోనే ఈ కేసులు ఎందుకు?

బ్రిటన్ లోని ఇతర ప్రాంతాల కంటే స్కాట్లాండ్‌లోనే పురుషాంగ క్యాన్సర్ కేసులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయన్న ప్రశ్నకు డాక్టర్ శుక్లా స్పందిస్తూ, ధూమపానం, ఊబకాయం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, హ్యూమన్ పాపిలోమావైరస్ (హెచ్‌పీవీ) వంటివి ఈ వ్యాధికి కారకాలు కావచ్చని, వీటిలో చాలావరకు సామాజిక వెనుకబాటుతనంతో ముడిపడి ఉండవచ్చని ఆయన చెప్పారు.

అయితే, వయస్సు లేదా సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చని అన్నారు.

స్కాట్లాండ్‌లో ఇలాంటి రోగుల కోసం మరింత మంది నర్స్ ప్రాక్టీషనర్లతో పాటు మనోధైర్యం కల్పించే నిపుణులు అవసరమని శుక్లా అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)