You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఎబోలా’ లక్షణాలు ఏంటి, ఈ వైరస్‌కు మందులు ఉన్నాయా, దీని వ్యాప్తిని అడ్డుకోవడం ఎలా?
- రచయిత, జేమ్స్ గల్లాఘర్, ఎమెరీ మకుమెనో, హఫ్సా ఖలీల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (డీఆర్ కాంగోలో) ఎబోలా మహమ్మారి వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర స్థితిగా (పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.
ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే, ఇది అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందినది. దీనికి ఎలాంటి టీకా లేదు. డీఆర్ కాంగోలో అంతర్గత సంఘర్షణలు నెలకొన్న ప్రాంతంలో ఈ కేసులు నమోదవుతున్నాయి.
ఈ మహమ్మారి వ్యాప్తి ఊహించినదానికంటే వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బీబీసీకి తెలిపింది.
ఎబోలా అంటే ఏమిటి? దాని లక్షణాలేంటి?
ఎబోలా ఒక అరుదైన, వైరస్ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి.
ఎబోలా వైరస్‌లు సాధారణంగా జంతువులకు సోకుతాయి. ముఖ్యంగా ఒక రకమైన గబ్బిలాలకు (ఫ్రూట్ బ్యాట్స్‌కు) వస్తుంది. వైరస్ సోకిన వాటిని తిన్నా, లేదా వాటిని తాకినా మనుషులలోనూ ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభం కావచ్చు.
దీని లక్షణాలు బయటపడేందుకు రెండు నుంచి 21 రోజుల సమయం పడుతుంది. హఠాత్తుగా అలసట, జ్వరం, తలనొప్పితో ఫ్లూలాగా కనిపించడం మొదలవుతుంది.
ఈ వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ, వాంతులు, విరేచనాలు ఎక్కువవుతాయి. ఇది అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. కొంతమంది రోగులలో బాహ్య, అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.
వ్యాధి పీడితుని రక్తం, వాంతులు వంటి స్రావాలను తాకడం ద్వారా ఈ వైరస్ ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది.
ఎబోలాకు టీకా ఉందా?
ప్రస్తుత వ్యాప్తి ఒక దశాబ్ద కాలానికి పైగా కనిపించని బండిబుగ్యో వైరస్ వల్ల సంభవించింది.ఈ వైరస్ గతంలో కేవలం రెండు సార్లు మాత్రమే వ్యాప్తి చెందింది. ఆ సమయంలో ఇది సోకిన వారిలో దాదాపు మూడో వంతు మంది చనిపోయారు.
ఈ అరుదైన ఎబోలా జాతి పలు ఇబ్బందులను కలగజేస్తుంది. వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతాలలో ఎబోలా గుర్తింపు కోసం చేసిన రక్తపరీక్షలన్నీ నెగటివ్‌గా వచ్చాయి. దీనికి కారణం సాధారణం వైరస్ జాతులను మాత్రమే గుర్తించే రక్తపరీక్షలు చేయడమే.
బండిబుగ్యో వైరస్‌కుఎలాంటి టీకా లేదు. ప్రస్తుతం ప్రయోగాత్మక టీకాలను అభివృద్ధి చేస్తున్నారు.
ఎబోలాలోనే జైర్ వైరస్ కోసం రూపొందించిన టీకా కొంతమేరకు రక్షణను అందించే అవకాశం ఉంది.
బండిబుగ్యో వైరస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు ఎలాంటి ఔషధాలను అభివృద్ధి చేయలేదు. అందుకే, ఈ వ్యాధికి చికిత్స చేయడం క్లిష్టంగా మారింది.
పైగా ఈ వ్యాధి వ్యాప్తి సంఘర్షణలతో సతమతమవుతున్న ప్రాంతంలో ఉండటం మరో సమస్య. పది లక్షల మంది ప్రజల్లో పావు వంతుమంది నిరాశ్రయులయ్యారు. ప్రజలు సులభంగా దాటగలిగే సరిహద్దులద్వారా పొరుగు దేశాలకు తరలివెళుతున్నారు.
అయితే, అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా దీన్ని ప్రకటించినంత మాత్రాన, మనం కోవిడ్ తరహా మహమ్మారి ప్రారంభ దశలో ఉన్నామని కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. తూర్పు ఆఫ్రికా వెలుపల ఎబోలా వల్ల కలిగే ప్రమాదం చాలా తక్కువ.
ఈ మహమ్మారి వ్యాప్తి ఎలా మొదలైంది?
ఓ నర్సుకు ఈ వైరస్ సోకిన విషయం వెలుగులోకి రావడం ద్వారా కొన్నివారాలుగా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి గురించి తెలిసింది. ఆమెకు ఏప్రిల్ 24న లక్షణాలు కనిపించాయి. ఈ నర్సు తూర్పు తూర్పు డీఆర్ కాంగోలోని ఇటూరి ప్రావిన్స్ రాజధాని బునియాలో మరణించినట్టు కాంగో ఆరోగ్య శాఖ మంత్రి శామ్యూల్ రాజర్ కాంబా తెలిపారు.
ఆ నర్సు మృతదేహాన్ని మొంగ్వాలుకు తరలించారు. అత్యధిక కేసులు నమోదైన రెండు బంగారు గనుల పట్టణాలలో ఇది ఒకటి.
అంత్యక్రియల సమయంలో చాలామంది ఆ మృతదేహాన్ని తాకడం వల్లే ఈ వైరస్ ఇంత వేగంగా వ్యాపించడానికి ఒక కారణమని కాంబా తెలిపారు.
అంటే, ఈ మహమ్మారి వ్యాప్తి నిజంగా ఎంత ఎక్కువగా ఉందో కచ్చితంగా తెలియదు. వ్యాధి సోకిన రోగులను కనుగొనడం, అలాగే వారు ఎవరెవరికి వైరస్‌ను వ్యాపింపజేసి ఉండవచ్చో తెలుసుకోవడం మరింత సవాలుగా మారుతుంది.
గతంలో ఎబోలా విజృంభించిన సమయంలోలాగే, ఇప్పుడు కూడా అంత్యక్రియల కార్యక్రమాలు ఒక ప్రధాన ఆందోళనకరమైన విషయమని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ డాక్టర్ జీన్ కసేయా 'బీబీసీ వరల్డ్ సర్వీస్ న్యూస్‌డే' కార్యక్రమానికి తెలిపారు.
ఈ వ్యాధి సోకిన కమ్యూనిటీలు దీన్నొక ''చేతబడిగా'', ''మాయరోగంగా'' చూస్తుండటంతో ఈ మహమ్మారి కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని, అలా నమ్మిన ప్రజలు ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రార్థనా కేంద్రాలకు, మంత్రగాళ్ల దగ్గరకు చికిత్స కోసం వెళ్తున్నారని కాంబా చెప్పారు.
ఈ కేసులు ఎక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి?
మొంగ్వాలు, ర్వంపారాల్లో, అలాగే బునియాలో తొలుత ఈ కేసులు నమోదయ్యాయి.
సుమారు ఎనిమిదన్నర లక్షల మంది జనాభా ఉన్న తూర్పు డీఆర్ కాంగోలోని అతిపెద్ద నగరం గోమాలో కూడా ఎబోలా కేసు రికార్డైంది. ప్రస్తుతం ఈ నగరం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది.
బునియాలో ఎబోలాతో తన భర్త మరణించిన తర్వాత గోమాకు వచ్చిన ఒక మహిళకు ఇక్కడ ఈ వ్యాధి సోకినట్లు నిర్ధరణ అయిందని కాంగోలీస్ ఇన్‌స్టిట్యూట్ నేషనల్ డె రీసెర్చె బయోమెడికలే (ఐఎన్ఆర్‌బీ) డైరెక్టర్ జీన్ జాక్వెస్ ముయెంబే ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.
ఉగాండా రాజధాని కంపాలాలో కూడా ఒకరు మరణించారు. మరొకరికి చికిత్స జరుగుతోంది. వీరిద్దరూ కూడా కాంగో పౌరులు. ఇటీవలే వారు ఆ దేశానికి వెళ్లారు.
ఈ మహమ్మారి వ్యాప్తి అడ్డుకోవడం ఎలా?
ప్రభుత్వం సంరక్షణ సదుపాయాలతో వైద్య బృందాలను బునియాకు పంపింది.
డబ్ల్యూహెచ్ఓ, మెడికల్ చారిటీ మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్ (ఎంఎస్ఎఫ్) కూడా అక్కడకు వెళ్లాయి. వారు అక్కడ చికిత్సా కేంద్రాలను నెలకొల్పాయి. ఈ వ్యాధికి తక్షణమే స్పందించే ప్రణాళికపై అవి పనిచేస్తున్నాయి.
ఈ వ్యాధి లక్షణాలను నివేదించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 151ను అందించారు.
అక్కడ ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
- లక్షణాలు కనిపిస్తే వెంటనే కాల్ చేయాలి.
- ఈ లక్షణాలతో మరణించిన వారి మృతదేహాలను లేదా చనిపోయిన జంతువులను తాకకూడదు.
- పచ్చి మాంసం తినకూడదు . సరిగ్గా వండని ఆహారం వల్ల వైరస్ వ్యాప్తి చెందొచ్చు.
- సామాజిక దూరం పాటించాలి.
తిరుగుబాటుదారుల స్పందన ఏంటి?
ఉత్తర కివు ప్రావిన్స్ రాజధాని గోమా ప్రస్తుతం ఏఎఫ్‌సీ-ఎం23 గ్రూప్‌కు చెందిన తిరుగుబాటుదారుల చేతిలో ఉంది. ఎబోలా రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వారు చెబుతున్నారు.
'' మా నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో ఎబోలా వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య సేవలు, స్థానిక వైద్య సదుపాయాలతో కలిసి వెంటనే ప్రతి స్పందించే యంత్రాంగాలను సిద్ధం చేశాం'' అని ఆదివారం ఏఎఫ్‌సీ-ఎం23 అధికార ప్రతినిధి లారెన్స్ కన్యుకా తెలిపారు.
ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడానికి తమ విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో లేదో ప్రభుత్వం కానీ, తిరుగుబాటుదారులు కానీ చెప్పలేదు.
రువాండా, ఇతర సరిహద్దు దేశాలు ఏం చేస్తున్నాయి?
డీఆర్ కాంగోతో సరిహద్దు దేశాలు ముఖ్యంగా ఉగాండా, రువాండా, దక్షిణ సూడాన్‌లలో ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆఫ్రికా సీడీసీ హెచ్చరించింది.
ఈ వ్యాధిని ఎదుర్కొనే యంత్రాంగాన్ని ఎలా బలోపేతం చేయాలో ఈ నాలుగు దేశాలతో మాట్లాడాలని భావిస్తోంది.
సరిహద్దు ప్రాంతమైన గోమాలో ఈ వ్యాధి కేసు నిర్ధరణ కావడంతో దేశంలోకి ప్రవేశించే ప్రజల తనిఖీని మరింత పటిష్టం చేస్తున్నట్లు రువాండా అధికారులు తెలిపారు.
గోమా నుంచి రువాండాలోకి రాకుండా తమల్ని అడ్డుకున్నట్లు ఒక కాంగో వ్యక్తి బీబీసీకి చెప్పారు.
ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని ప్రతి సంవత్సరం జూన్ 3న జరిగే అమరవీరుల దినోత్సవ యాత్రను వాయిదా వేశారు. ఈ క్రైస్తవ పండుగ సందర్భంగా సాధారణంగా వేలాది మంది కాంగో జాతీయులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)