ప్రపంచ పటాల్లో సరైనది ఏది.. దీనిపై ఇంత చర్చెందుకు?

- రచయిత, జరోస్లావ్ లుకివ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడుకలో ఉన్న ప్రపంచపటంలో మార్పులు చేయాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఖండాల వాస్తవ ఆకృతిని, పరిమాణాన్ని ఈ పటం మరింత కచ్చితంగా ప్రతిబింబించాలని పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ "కరెక్ట్ ద మ్యాప్" అనే శీర్షికతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఇప్పటివరకు అనుసరిస్తున్న మెర్కేటర్ పటంలో ఉన్న లోపాన్ని సరిదిద్దడం ఈ తీర్మానం ఉద్దేశం. ఈ పటంలో ఆఫ్రికా, గ్రీన్లాండ్ దాదాపు ఒకే పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే సుమారు 14 రెట్లు పెద్దది.
ఐక్యరాజ్యసమితి "ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్" అనే కొత్త పటాన్ని స్వీకరించింది. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాస్తవ పరిమాణాన్ని మరింత కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. అయితే దీనిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.
గోళాకారంలో ఉన్న భూమిని ఒక సమతల దీర్ఘచతురస్రాకార పటంపై మరింత కచ్చితంగా చూపించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రతి పద్ధతికీ దాని సొంత ప్రయోజనాలు, లోపాలు ఉన్నాయి.


ఫొటో సోర్స్, Getty/mikroman6
మెర్కేటర్ మ్యాప్: ఇందులో కొన్ని దేశాలు ఎందుకు చిన్నవిగా కనిపిస్తాయి?
ప్రస్తుతం ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ప్రపంచ పటంగా మెర్కేటర్ పటాన్ని పరిగణిస్తారు. దీన్ని 1569లో బెల్జియంలోని ఫ్లెమిష్ ప్రాంతానికి చెందిన గెరార్డస్ మెర్కేటర్ రూపొందించారు.
యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో కార్టోగ్రఫీ ప్రొఫెసర్ జేమ్స్ చెషైర్ ప్రకారం, యూరోపియన్ నావికులు సముద్రంలో తమ మార్గాన్ని కనుగొనడంలో సహాయపడటమే ఈ పటాన్ని రూపొందించడం వెనుకున్న ప్రధాన ఉద్దేశం.
"కంపాస్ దిశను అనుసరించి గీసిన సరళరేఖ వాస్తవ ప్రపంచంలో కూడా నేరుగా ఉన్నట్లు పటంలో కనిపించాలనేది ఆయన ఉద్దేశం" అని జేమ్స్ బీబీసీతో చెప్పారు.
"ఈ ఉద్దేశంతోనే పటాన్ని రూపొందించారు. ఆ లక్ష్యాన్ని ఈ పటం చాలా చక్కగా చూపిస్తుంది" అని ఆయన అన్నారు.
సమతల పటంపై కోణాలు కచ్చితంగా ఉండేలా చూపించేందుకు, భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ మెర్కేటర్ పటంలోని గ్రిడ్ రేఖల మధ్య దూరాన్ని పెంచాల్సి వచ్చింది.
ఇక్కడ ముందుగా భూమధ్యరేఖ గురించి తెలుసుకోవాలి. ఇది సున్నా డిగ్రీల వద్ద ఉన్న ఒక ఊహాత్మక రేఖ. ఇది భూమిని ఉత్తర, దక్షిణ అర్ధగోళాలుగా విభజిస్తుంది. అలాగే భూమికి అత్యంతఉత్తరాన, అత్యంత దక్షిణాన ఉన్న ప్రాంతాలను ధ్రువాలు అంటారు.
మెర్కేటర్ రూపొందించిన పటంలో భూమి గుండ్రని ఆకృతిని సమతలంగా చూపించే క్రమంలో, భూమధ్యరేఖకు(ఈక్వేటర్) సమీపంలోని దేశాలు వాటి వాస్తవ పరిమాణం కంటే చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
అదే సమయంలో ధ్రువాలకు సమీపంలోని దేశాలు సాగదీసినట్లు, పెద్దవిగా కనిపిస్తాయి.
గోళాకార భూమి ఉపరితలాన్ని 2-డీ పటంపై పూర్తిగా కచ్చితంగా చూపించడం సాధ్యం కాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
మెర్కేటర్ పటాన్ని రూపొందించి 450 ఏళ్లకు పైగా గడిచినా ఇప్పటికీ అనేక పటాలకు అదే ఆధారంగా ఉంది.
పాఠశాలల్లో, టీవీలో, ఇంటర్నెట్లో కనిపించే అనేక పటాలు, గూగుల్ మ్యాప్స్ సహా, ఈ పటం ఆధారంగానే రూపొందించారు.
అయితే మెర్కేటర్ పటాన్ని విమర్శించేవారు, ఆ పటం కొన్ని ప్రాంతాలను వాటి వాస్తవ పరిమాణం కంటే చిన్నవిగా, మరికొన్ని ప్రాంతాలను వాస్తవ పరిమాణం కంటే పెద్దవిగా చూపిస్తుందని అంటున్నారు. ఇది ప్రజల అభిప్రాయాలపై ప్రభావం చూపవచ్చని వారు చెబుతున్నారు.
పెద్దవిగా కనిపించే వాటిని మనం తరచూ మరింత ముఖ్యమైనవిగా భావిస్తామని, అందువల్ల ఇలాంటి పటం ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయగలదని ఆయన చెప్పారు.
కెన్యా భౌగోళిక శాస్త్రవేత్త కియోకో ముయెండో ప్రకారం, దీని వల్ల ఆఫ్రికా విస్తారమైన వనరులు, భారీ జనాభా, పెట్టుబడుల అవకాశాల ప్రాముఖ్యాన్ని పరోక్షంగా తగ్గించింది.
"పటాలు కేవలం ప్రయాణికులకు దారి చూపించవు. రాజకీయ, ఆర్థిక కోణాల్లో ఒక ప్రాంతాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపైనా అవి ప్రభావం చూపుతాయి" అని కియోకో బీబీసీతో చెప్పారు.

ఈక్వల్ ఎర్త్ పటం: పరిమాణం విషయంలో కచ్చితత్వం, కానీ ఇతర సవాళ్లు
మెర్కేటర్ ప్రొజెక్షన్లో దేశాల పరిమాణానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడమే ఈక్వల్ ఎర్త్ పటం లక్ష్యం.
2018లో ఒక కార్టోగ్రాఫర్ల బృందం దీనిని రూపొందించింది. భూభాగంలోని వివిధ ప్రాంతాల పరిమాణం, ఆకృతిని మరింత కచ్చితంగా చూపించడం దీని ఉద్దేశం.
1963లో రూపొందించిన రాబిన్సన్ ప్రొజెక్షన్ దీనికి స్ఫూర్తి. భూమి సర్ఫేస్ మొత్తాన్ని ఒకేసారి చూపించే పటం ఇది.
ఈ కారణం చేతే ఐక్యరాజ్యసమితి దీన్ని స్వీకరించడానికి ముందే, ఫిబ్రవరిలో ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాలు కూడా ఈక్వల్ ఎర్త్ పటాన్ని స్వీకరించాయి.
అయితే మెర్కేటర్ ప్రొజెక్షన్‌ను సముద్ర మార్గాలను కనుగొనేందుకు ఉపయోగకరంగా చేసిన సరళరేఖలను ఇందులో తొలగించారు.
అంతేకాకుండా, దీనితో వివిధ ప్రాంతాల మధ్య వాస్తవ దూరాన్ని కొలవడం సాధ్యం కాదు.
"మీరు భూభాగం పరిమాణాన్ని కచ్చితంగా చూపించవచ్చు, లేదా ఆకృతిని కచ్చితంగా చూపించవచ్చు, లేదా దూరం, దిశను కచ్చితంగా చూపించవచ్చు" అని చెషైర్ అన్నారు. "కానీ ఇవన్నీ ఒకేసారి కచ్చితంగా చూపించడం సాధ్యం కాదు. అలా చేస్తే మళ్లీ మనం గోళాకార భూమి దగ్గరకే చేరుకుంటాం" అని ఆయన చెప్పారు.

పీటర్స్ గ్లోబల్ మ్యాప్
పీటర్స్ గ్లోబల్ మ్యాప్‌ను జర్మన్ చరిత్రకారుడు ఆర్నో పీటర్స్ 1970ల ప్రారంభంలో రూపొందించారు.
ఈ దీర్ఘచతురస్రాకార పటం 1855లో స్కాటిష్ కార్టోగ్రాఫర్ జేమ్స్ గల్ తొలిసారిగా వివరించిన ఒక ప్రొజెక్షన్‌పై ఆధారపడి ఉంది.
ఈ ప్రొజెక్షన్ పరిమాణ కచ్చితత్వంలో కొంత రాజీపడినప్పటికీ, భూభాగాన్ని కచ్చితమైన విస్తీర్ణంతో చూపించేందుకు ప్రయత్నిస్తుంది.
దీంతో ధ్రువాలకు సమీపంలోని ప్రాంతాలు కుంచించుకుపోయినట్లు కనిపిస్తాయి. భూమధ్యరేఖకు సమీపంలోని ప్రాంతాలు సాగదీసినట్లు కనిపిస్తాయి. ఇది గ్రీన్లాండ్, ఆఫ్రికా పరిమాణాలకు సంబంధించిన సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది.
వివిధ భూభాగాల వాస్తవ పరిమాణాన్ని మెరుగ్గా పోల్చేందుకు ఈ పటం వీలు కల్పిస్తుంది. అదే సమయంలో రేఖాంశాలు, అక్షాంశాల సరళరేఖలను కూడా ఇది కొనసాగిస్తుంది.
అక్షాంశం, రేఖాంశం అనేవి భూమి ఉపరితలంపై ఒక ప్రాంతం కచ్చితమైన స్థానాన్ని సూచించే ఊహాత్మక రేఖలు. పటాల్లో ఈ రేఖలను గ్రిడ్ రూపంలో చూపిస్తారు.
అయితే పీటర్స్ పటం భూమిపై ఉన్న భూభాగాల ఆకృతిని గణనీయంగా వక్రీకరిస్తుంది. దీంతో భూభాగాలు వాటి వాస్తవ ఆకృతికి భిన్నంగా కనిపిస్తాయి.
ఉదాహరణకు, రష్యా దాని వాస్తవ పరిమాణం కంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది.
పీటర్స్ పటంలోని సరళరేఖలు కూడా వాస్తవ కంపాస్ దిశను సూచించవు. అందువల్ల దీన్ని నావిగేషన్ కోసం ఉపయోగించలేరు.
ఇతర రకాల మ్యాప్‌లు....
తలకిందులుగా, మార్పులతో కూడిన పటాలు కూడా రూపొందించారు.
ఒక భూభాగం కనిపించే పరిమాణం ప్రజల దృష్టిలో దాని ప్రాముఖ్యాన్ని ప్రభావితం చేయగలిగినట్లే, పటంలో అది ఉన్న స్థానం కూడా ప్రభావం చూపుతుంది.
కొంతమంది కార్టోగ్రాఫర్లు దక్షిణాన్ని పైవైపు ఉంచే విధంగా పటాలను రూపొందించేందుకు ప్రయత్నించారు. ప్రపంచ దక్షిణ ప్రాంతాన్ని పటంలో దిగువన చూపించడం వల్ల అది తక్కువ ప్రాముఖ్యత కలిగినదిగా భావించే అభిప్రాయాన్ని ఇది సవాలు చేస్తుంది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పటానికి మధ్యలో ఏ ఖండాన్ని ఉంచాలనే విషయంలో కూడా తేడాలు ఉండచ్చు.
సాధారణంగా ఉపయోగించే పటాల కంటే ఈ ప్రత్యామ్నాయ పటాలు ప్రపంచాన్ని మరో కోణంలో చూపిస్తాయి.
అయితే ఒక ప్రాంతాన్ని మరింత ప్రముఖంగా చూపించే సమస్యను ఈ పటాలు పరిష్కరించవు. అవి పటం మధ్యభాగాన్ని, దృష్టి కేంద్రీకరణను మాత్రమే మారుస్తాయి.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
ఏ దేశాన్నీ మధ్యలో చూపని ధ్రువ కేంద్రిత పటం
ఐక్యరాజ్యసమితి జెండా గాలికి రెపరెపలాడుతోంది. జెండాపై తెల్లని చిహ్నం ఉంది. ఇందులో సమదూర ప్రొజెక్షన్లో రూపొందించిన ప్రపంచ పటం, దాని చుట్టూ రెండు ఆలివ్ కొమ్మలు ఉన్నాయి.
పటంలో ఏ భూభాగాన్ని మధ్యలో చూపించాలి, అందువల్ల ఏ ప్రాంతం అత్యంత ప్రముఖంగా కనిపించాలి అనే సమస్యకు ఒక పరిష్కారం- ఏ భూభాగాన్నీ మధ్యలో ఉంచకపోవడం.
ఐక్యరాజ్యసమితి లోగోలోని పటం ఈ సూత్రంపై ఆధారపడి ఉంది.
ఇందులో ప్రపంచాన్ని ఉత్తర ధ్రువం చుట్టూ కేంద్రంగా చూపిస్తారు. అక్కడి నుంచి ఖండాలు బయటికి విస్తరిస్తాయి.
దీనిని "అజిముతల్ ఈక్విడిస్టెంట్ ప్రొజెక్షన్" అంటారు.
ఇది ఒక కేంద్ర బిందువు చుట్టూ వృత్తాకార పటంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను చూపిస్తుంది. భూగోళంపై ఒక ప్రాంతం కేంద్ర బిందువు నుంచి ఎంత దూరంగా ఉంటే, పటంలో దానికి సంబంధించిన పరిధి అంత పెద్దదిగా ఉంటుంది.
ఇలాంటి పటంలో అన్ని పాయింట్లు కేంద్రం నుంచి వాస్తవ "అజిముత్" అంటే సమాంతర దూరంలో ఉంటాయి.
అయితే గోళాకారంలో ఉండే సర్ఫేస్ మొత్తాన్ని ఒక పటంపై చూపించడం వల్ల కొంత వక్రీకరణ ఏర్పడుతుంది. పటం కేంద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ ఈ వక్రీకరణ కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు, ఐక్యరాజ్యసమితి పటంలో దక్షిణ ధ్రువానికి సమీపంలోని ప్రాంతాలు కుదించబడినట్లు, సాగదీసినట్లు కనిపిస్తాయి.
దీనికి కారణం ఉత్తర ధ్రువం చుట్టూ ఉన్న అదే పరిధితో పోలిస్తే, దక్షిణ ధ్రువం వైపు పరిధి చాలా పెద్దదిగా మారడం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























