మేక దొంగతనం.. 48 మంది ప్రాణాలను బలితీసుకుంది, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాజ్ సోహైల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
కేవలం ఒకే గది ఉన్న ఈ మదర్సాలో దాదాపు పాతిక మంది పిల్లలు ఖురాన్ చదువుకుంటున్నారు. ఈ మదర్సాకు ఆనుకుని ఉన్న రెండు పాఠశాల భవనాల్లో ఒకటి శిథిలావస్థకు చేరగా, మరోటి ఉపయోగంలో లేదు.
స్థానికంగా రెండు వర్గాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఘర్షణలే ఇందుకు కారణం. వాటి కారణంగానే ఈ స్కూళ్లు కూడా ఇలా పాడుబడిపోయాయి.
పాకిస్తాన్‌లోని ఉత్తర సింధ్ ప్రాంతం, షికర్పూర్ జిల్లాలో 'జునేజో', 'కల్హోడా' అనే రెండు వర్గాల మధ్య గత తొమ్మిదేళ్లుగా జరుగుతున్న ఘర్షణలతో మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు.
అలాగే, ఈ రెండు వర్గాల ప్రజలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు వెళ్లలేని విధంగా 'నో గో జోన్స్'గా మార్చేసుకున్నారు. ఈ ఘర్షణ స్థానికంగా ఉన్న పాఠశాలలను కూడా ప్రభావితం చేసింది.
గత నెలలోనే 'జిర్గా'(పెద్ద మనుషుల పంచాయితీ) ద్వారా ఈ రెండు వర్గాలు తమ వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. అసలు విషయమేంటంటే.. న్యాయస్థానాలు, చట్టాలు ఉన్నప్పటికీ 'జిర్గా' నిర్వహించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. గత తొమ్మిదేళ్లుగా కొనసాగిన ఘర్షణలు, ఉద్రిక్తతలు అక్కడి ప్రజల జీవితాలను ఎంత దుర్భరంగా మార్చాయో తెలుసుకోవడానికి బీబీసీ ఇటీవల సింధ్‌లోని ఆ ప్రాంతాల్లో పర్యటించింది.

అసలు వివాదం ఎలా మొదలైంది?
జలాల్పూర్ గ్రామంలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడే ఖుర్బాన్ అలీ జునేజోను మేం కలిశాం.
జునేజో, కల్హోడా వర్గాల మధ్య జరిగిన వివాదంలో తన సోదరుడు, ఇద్దరు మేనల్లుళ్లు హత్యకు గురయ్యారని ఖుర్బాన్ చెప్పారు. పశువులను సమీపంలోని 'కచ్చా' (నదీ తీర ప్రాంతం)లో మేపడానికి తీసుకెళ్లినప్పుడు వారిని చంపేశారని ఆయన అన్నారు.
తన సోదరుడితో పాటు తమ వర్గంలో మొత్తం 23 మంది ఈ విరోధానికి బలయ్యారని ఆయన చెప్పారు.
తొమ్మిదేళ్ల కిందట మేక దొంగతనంతో ఈ శత్రుత్వం మొదలైందని ఖుర్బాన్ తెలిపారు.
ఈ దొంగతనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కల్హోడా వర్గానికి చెందినవారని స్థానికులు చెప్పారు. అయితే, మేక దొంగతనం ఘటనకు సంబంధించి ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఆ తర్వాత, రెండువర్గాల మధ్య రాజీ కోసం నిర్వహించిన జిర్గాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ముగ్గురిని మేక యజమాని క్షమించారు, కానీ ఒక వ్యక్తిని క్షమించేందుకు నిరాకరించారు.
ఖుర్బాన్ చెప్పిన దాని ప్రకారం, ఆ తర్వాత పరిస్థితి చేయిదాటిపోయి సాయుధ ఘర్షణకు దారితీసింది. దీనివల్ల ఆ ప్రాంతంలో వ్యాపారాలు దెబ్బతినడమే కాకుండా.. ఎంతోమంది జీవితాలు ప్రభావితమయ్యాయి, భారీ ప్రాణనష్టం కూడా జరిగింది.
అయితే ఇప్పుడు జిర్గాతో రాజీ కుదిరిందని, ఇది ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఖుర్బాన్ జునేజో ఆశిస్తున్నారు.
జలాల్పూర్ గ్రామం జాతీయ రహదారికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ ఒక పాత పోలీస్ స్టేషన్‌ను బీబీసీ టీమ్ గుర్తించింది. కానీ, చాలాకాలం నుంచి ఆ పోలీస్ స్టేషన్లో కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఇప్పుడు అక్కడ పోలీసులు లేరని స్థానికులు చెప్పారు.
అక్కడి నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారికి సమీపంలో ఒక పోలీస్ చెక్ పోస్ట్ కనిపించింది.

ఆధునిక ఆయుధాలు
జలాల్పూర్ నుంచి మరింత లోపలికి, ''కచ్చా'' (నదీతీర) ప్రాంతం వైపు ప్రయాణించాం. నదీతీర ప్రాంతానికి ఇరువైపులా వేలాది ఎకరాల్లో గోధుమ పంట కోతకు సిద్ధంగా ఉంది. చాలా ప్రాంతాల్లో కోత పనులు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాంతానికి సరైన రోడ్డు లేదు. వర్షం పడితే వెళ్లడం కష్టమే. మా వాహనం పలుచోట్ల బురదలో చిక్కుకుపోయింది. కల్హోడా వర్గం ఉంటున్న మీరల్ కల్హోడా గ్రామానికి చేరుకునేందుకు మేం 15 కి.మీలు ప్రయాణించాం.
గ్రామస్థులు సమావేశమయ్యే ఒక స్థలానికి చేరుకున్నాం, అక్కడ ఆర్పీజీ మోర్టార్స్, ఎల్ఎంజీ, ఎస్ఎంజీ వంటి ఆధునిక ఆయుధాలు గోడకు వేళ్లాడదీసి ఉన్నాయి.
గ్రామంలోని మరో నాలుగు సమావేశ మందిరాల్లోనూ ఇలాంటి ఆయుధాలు ఉంటాయని స్థానికులు చెప్పారు. ఈ ఘర్షణల్లో తన తండ్రితో పాటు తమ వర్గంలోని 28 మంది చనిపోయినట్లు హఫీజ్ కల్హోడా తెలిపారు.
రాజీ కుదరక ముందు, గ్రామం చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లు చేసేవారు. ఈ ఘర్షణకు ఒక మేక దొంగతనమే కారణమని హఫీజ్ కల్హోడా కూడా అన్నారు. అయితే, ఆ దొంగ జునేజో వర్గానికి చెందిన వ్యక్తని, ఆ దొంగతనం సమయంలోనే ఆయన హత్యకు గురైనట్లు చెప్పారు.
ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతల సమయంలో ఆయుధాలు, భద్రతా చర్యల కోసం ఎంత ఖర్చు చేశారని అడిగినప్పుడు, ఘర్షణలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు 50 లక్షలు (పాకిస్తానీ రూపాయాల్లో) దాటేసిందన్నారు.

అంతటి అధునాతన ఆయుధాలను ఎక్కడి నుంచి సంపాదించారని ఆయన్ను అడగ్గా, అదంతా పరిచయాల ద్వారానేనని వివరించారు. "నేను మీకు ఇచ్చాను, మీరు నాకు ఇచ్చారు" అంతే అన్నారు.
అయితే, ఇప్పుడు రాజీ కుదిరిన తర్వాత ఆయుధాలు, భద్రతపై చేసే ఖర్చు తగ్గుతుందని వారు ఆశిస్తున్నారు.
ఈ ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డారని, స్థానికంగా మగవారు రాత్రింబవళ్లూ కాపలా కాయాల్సి వచ్చిందని హాఫిజ్ కల్హోడా అన్నారు.
"ఇప్పుడు సమస్య పరిష్కారం కావడంతో, పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంది" అని తెలిపారు.
ఇది సింధ్‌లోని ఒక ప్రాంతం అయినప్పటికీ, ఇక్కడ కనిపించే ప్రతి వ్యక్తి భుజంపై ఎప్పుడూ ఏదో ఒక ఆయుధం వేలాడుతూ ఉండడం బీబీసీ బృందం గమనించింది.
దాదాపుగా గ్రామంలోని మగవారందరిపైనా అనేక కేసులు ఉండడంతో స్వేచ్ఛగా బయటకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు అంటున్నారు. ప్రత్యర్థుల భయంతో పాటు అరెస్టు ముప్పు కూడా ఉంది.

ఈ ప్రాంతాల్లో వర్గ నాయకుల ఆధిపత్యం
షికర్పూర్తో సహా ఉత్తర సింధ్‌లోని అనేక ప్రాంతాల్లో రాజకీయ, అధికారుల అండదండల కారణంగా వర్గ నాయకుల(కమ్యూనిటీ లీడర్లు) ఆధిపత్యం ఉంటుంది. తరచూ భూ తగాదాలు, పశువుల దొంగతనం, వివిధ వర్గాల మధ్య వివాహాల విషయంలో వివాదాలు చోటుచేసుకుంటుంటాయి.
నేతల బలమైన ఆధిపత్యం కారణంగా వివాదాలను పరిష్కారానికి సంప్రదాయ, జిర్గా వంటి అనధికారిక న్యాయ వ్యవస్థలపై ఆధారపడుతుంటామని చాలామంది స్థానికులు చెప్పారు.
జిర్గా ద్వారానే కల్హోడా, జునేజో వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ జిర్గాలోనే ఇతరుల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించినందుకు ఇరుపక్షాలపై మొత్తం 149.1 మిలియన్ల పాకిస్తానీ రూపాయలు(భారత కరెన్సీలో సుమారు 5 కోట్ల రూపాయలు) జరిమానా విధించారు.
భవిష్యత్తులో ఎవరైనా దాడులకు పాల్పడితే భారీ జరిమానాలు తప్పవని కూడా నిర్దేశించారు.
గతంలో ఇలాంటి ఒప్పందం ఎందుకు కుదరలేదని హఫీజ్ కల్హోడాను బీబీసీ ప్రశ్నించింది. "ఈ విషయం కమ్యూనిటీ లీడర్లకు తెలుసు. ఈసారి ప్రభుత్వం నుంచి ఒత్తిడి, పెద్ద మనుషుల ప్రయత్నాల వల్ల అంగీకారం కుదిరింది" అని తెలిపారు.
జిర్గా లేకుండా సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. "కోర్టులు సంవత్సరాల తరబడి కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోనందువల్లే జిర్గాలు జరుగుతున్నాయి. ఎనిమిదేళ్లైనా కేసులు ముందుకు కదలవు" అని ఆయన అన్నారు.

ఈ రాజీకి నేషనల్ అసెంబ్లీ మాజీ సభ్యులు, సింధ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ గౌస్ బక్ష్ మెహర్ మధ్యవర్తిగా, సాక్షిగా ఉన్నారు .
ఇరువర్గాల మధ్య వివాదం ఇంతకాలంగా ఎందుకు కొనసాగుతోందని, ఇంతకుముందే ఇది ఎందుకు పరిష్కారం కాలేదని మేం ఆయన్ను అడిగాం.
"గతంలో, యంత్రాంగం అంత బలంగా లేదు. ఒకవేళ యంత్రాంగం ఈ హత్యలపై కఠిన చర్యలు తీసుకుని, అరెస్టులు చేసి, న్యాయస్థానాలు త్వరితగతిన శిక్ష విధించి ఉంటే, ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు" అని అన్నారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నించారని, కానీ స్థానిక యంత్రాంగం సహకరించకపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన తెలిపారు. "ప్రస్తుత యంత్రాంగం బాధ్యత తీసుకోవడంతో, స్థానికులు కూడా ముందుకు వస్తున్నారు."
పాకిస్తాన్లో వెనుకబడిన జిల్లాల్లో జిర్గా సంప్రదాయం చాలా సాధారణం. సాధారణంగా పలుకుబడి ఉన్న పెద్దలు, కమ్యూనిటీ లీడర్లు లేదా స్థానిక ప్రముఖులు పాల్గొనే ఒక అనధికారిక వేదిక ఇది. ఇక్కడ ఇరుపక్షాల వాదనలు విని, వివాదం పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.
సాధారణంగా ఇరుపక్షాలు తమ వాదనలను వినిపిస్తాయి. వాటిపై పెద్దలు చర్చించి, జరిమానాలు, దియత్ (బ్లడ్ మనీ), క్షమాభిక్షలు, లేదా భవిష్యత్తులో దాడులు జరగకుండా హామీలు వంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటారు.
హత్య లేదా వర్గాల మధ్య శత్రుత్వం వంటి సందర్భాలలో జరిమానా, బ్లడ్ మనీ లేదా ఒకరికొకరు హామీ ఇచ్చుకోవడం వంటి విషయాలపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థలు బలహీనంగా ఉన్నచోట జిర్గా వ్యవస్థ త్వరిత పరిష్కారాలను అందిస్తుందని దాని మద్దతుదారులు వాదిస్తారు. మరోవైపు, విమర్శకులు ఈ వ్యవస్థ చట్టపరమైన రక్షణలు, పారదర్శకత లేకుండా, అధికార పరిధికి వెలుపల పనిచేస్తుందని వాదిస్తున్నారు.

"వర్గ విభేదాల పరిష్కార నిర్ణయాలు 'సరెండర్ పాలసీ' (లొంగిపోవడం)లో భాగమేనని, ఎందుకంటే చాలామంది బందిపోట్లు గిరిజనవర్గాల మధ్య వైరం కారణంగానే బందిపోట్లుగా మారారు" అని షికర్పూర్ ఎస్ఎస్పీ కలీమ్ మాలిక్ అంటున్నారు.
"ఈ జిర్గా లేదా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ సింధ్ సంస్కృతిలో ఒక భాగం. దాని ఆధారంగానే ఇప్పుడు స్థానిక వర్గ నాయకులు వారిని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చారు. ఇలాంటి నిర్ణయాలకు అందరూ సానుకూలంగా ఉంటే మంచిదే. కానీ, కొంతమంది నేరస్థులు ప్రతిఘటించాలని చూడొచ్చు, అలాంటి వారి కోసం కఠినమైన పద్ధతులు కూడా ఉన్నాయి."
ఇక్కడ అసలు విషయమేంటంటే, సింధ్ హైకోర్టు సుక్కూర్ బెంచ్ పదేళ్ల కిందట జిర్గా నిర్వహణను నిషేధించింది. దానిని 'ప్రైవేట్ కోర్టు'గా ప్రకటించింది.
ఈ కేసులో పిటిషనర్ అయిన లాయర్ షబ్బీర్ షా మాట్లాడుతూ, "సింధ్‌లోని జిర్గా వ్యవస్థ చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, చట్టానికి వ్యతిరేకమని ప్రకటించాలి" అని పిటిషన్లో కోరినట్లు చెప్పారు.
"ఎక్కడ జిర్గా జరిగినా, ప్రైవేట్ కోర్టు ఏర్పాటు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారే వాదులుగా మారతారని కోర్టు తీర్పులో పేర్కొంది. ఇటీవల జరిగిన జిర్గాలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయి. కానీ ఎవరైనా బాధితులు, వలంటీర్లు జిర్గా జరిగిందని కోర్టుకు తెలియజేస్తేనే కేసు నమోదవుతుంది" అని ఆయన చెప్పారు.
ఇలాంటి కేసుల్లో అధికార యంత్రాంగం, పోలీసులే మధ్యవర్తులుగా మారుతున్నారని ఆయన అన్నారు.
దీనిపై సర్దార్ గౌస్ బక్ష్ మెహర్ మాట్లాడుతూ.. జిర్గా ఇరుపక్షాల అంగీకారంతోనే జరుగుతుందని, ఒప్పందం కుదిరిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
అయితే, హత్యల వంటి కేసులను జిర్గా ఎలా పరిష్కరించగలదని అడిగినప్పుడు సమాధానమిస్తూ, "ప్రజలు ఒకరినొకరు క్షమించుకుంటారు. కానీ, వ్యక్తిగతంగా నేను ఇలాంటి కేసులు కోర్టుకు వెళ్లి శిక్షలు పడాలని కోరుకుంటున్నా. అప్పుడే శాశ్వత శాంతి నెలకొంటుంది."
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































