హంటా వైరస్: క్రూయిజ్‌‌లో వారి కలల ప్రయాణం కాస్తా కాళరాత్రిగా మారిందా?

అంతర్జాతీయం, పర్యాటకం, అమెరికా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, బ్రిటన్, హంటా వైరస్, వ్యాధులు, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం కేప్ వెర్డే సమీపంలో లంగరు వేసి ఉన్న ఎంవీ హోండియస్
    • రచయిత, జేక్ లాఫమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

"మేము కేవలం ఒక వార్త కాదు. కేవలం ఒక హెడ్‌లైన్ అసలే కాదు. మేము కూడా మనుషులమే, మాకూ కుటుంబాలు ఉన్నాయి, జీవితాలు ఉన్నాయి, మా కోసం ఇంట్లో ఎదురుచూసే వారు ఉన్నారు'' అని జేక్ రోస్మరిన్ కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.

అట్లాంటిక్ మహాసముద్రంలో 'ఎంవీ హోండియస్' అనే లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న అమెరికన్ ట్రావెల్ వ్లాగర్‌కు, ఆ కలల ప్రయాణం కాస్తా ప్రాణాంతకంగా మారింది.

ఆఫ్రికా పశ్చిమ తీరంలోని కేప్ వెర్డే సమీపంలో చిక్కుకుపోయిన ఈ నౌకలోనున్న 23 దేశాలకు చెందిన సుమారు 150 మంది ప్రయాణికులలో ఆయన ఒకరు.

సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపించే అరుదైన, తీవ్రమైన వ్యాధి 'హంటా వైరస్' కేసులు ఇక్కడ బయటపడ్డాయి.

ఇప్పటివరకు నిర్ధరణ అయిన కేసులు రెండు, అనుమానిత కేసులు ఐదు నమోదయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దాదాపు నెల రోజుల కిందట అర్జెంటీనా నుంచి బయలుదేరిన 'ఎంవీ హోండియస్' నౌకలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరికొందరు అనారోగ్యంతో లేదా వ్యాధి లక్షణాలతో ఉన్నారు.

ప్రస్తుతం ఆరోగ్య అధికారులు ప్రయాణికుల నుంచి నమూనాలను సేకరించి, పరీక్షించే పనిలో పడ్డారు. ఈ వైరస్ ఓడలోని ఇతరులకు కూడా వ్యాపించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది.

ఈ వారం మొదట్లో, కేప్ వెర్డే అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆ నౌక అక్కడే లంగరు వేసి, నిలిచిపోయింది.

అయితే, తాజాగా స్పానిష్ ప్రభుత్వం ఈ నౌకను కానరీ దీవులకు రావడానికి అనుమతించింది. అక్కడ ప్రయాణికులకు చికిత్స అందించి, తిరిగి వారి దేశాలకు పంపే ఏర్పాట్లు చేయనున్నారు.

''ప్రస్తుతం అంతా అనిశ్చితిగా ఉంది, అదే మాకు పెద్ద కష్టంగా మారింది. మాకు ఇప్పుడు కావాల్సిందల్లా భద్రత, స్పష్టత.. త్వరగా ఇంటికి చేరుకోవడమే'' అని రోస్మరిన్ సోమవారం తన టిక్‌టాక్ అనుచరులతో చెప్పారు.

అంతర్జాతీయం, పర్యాటకం, అమెరికా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, బ్రిటన్, హంటా వైరస్, వ్యాధులు, ఆరోగ్యం
ఫొటో క్యాప్షన్, రోస్మరిన్

రోస్మరిన్ వీడియోలతో కలకలం

రోస్మరిన్ భావోద్వేగపూరిత మాటలకు భిన్నంగా, అదే నౌకలో ఉన్న మరో ప్రయాణికుడు కాసెమ్ హటో మాట్లాడుతూ, ''పరిస్థితిని ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా చేసి చూపిస్తున్నారు'' అని అన్నారు.

''నౌకలో ఉన్న ఒక వ్యక్తి భయాందోళనతో చేసిన వీడియో మీడియాలో వైరల్ అవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది'' అని ఆయన చెప్పారు.

ఇది రోస్మరిన్ వీడియోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా కనిపిస్తోంది.

''ఆయన స్పందన వ్యక్తిగతంగా సరైనదే కావచ్చు, కానీ అది నౌకలోని ప్రస్తుత వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేది కాదు. మిగిలిన వారందరూ (149 మందిలో 148 మంది) చాలా ప్రశాంతంగా ఉన్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది. అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం'' అని ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా అయిన హటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రయాణికులు పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ, హాట్ డ్రింక్స్ తాగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆయన బీబీసీకి తెలిపారు.

మరోవైపు, రోస్మరిన్ వరుస పోస్ట్‌లు చేస్తూ, ''నా భావోద్వేగాలు కుదుటపడటానికి కొంత సమయం పట్టింది. ప్రస్తుతం ఓడలో అందరూ బాగున్నారు'' అని చెప్పారు.

''నేను ఆరోగ్యంగా ఉన్నాను, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను. సిబ్బంది మాకు మంచి ఆహారం అందిస్తూ, బాగా చూసుకుంటున్నారు.. ప్రస్తుతానికి పాజిటివ్ విషయాలపైనే దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను'' అని పేర్కొన్నారు.

క్రూయిజ్ ఆపరేటర్ 'ఓషన్ వైడ్ ఎక్స్‌పెడిషన్స్' స్పందిస్తూ, ''వాతావరణం ప్రశాంతంగా ఉంది. ప్రయాణికులు సాధారణ స్థితిలోనే ఉన్నారు. అతిథులకు భరోసా కల్పిస్తూ, వారు త్వరగా గమ్యం చేరడానికి, వైద్య పరీక్షలను వేగవంతం చేయడానికి కృషి చేస్తాం'' అని ఒక ప్రకటనలో వెల్లడించింది.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ప్రయాణికుడు బీబీసీతో మాట్లాడుతూ, తాము సముద్రంలో మరో మూడు నాలుగు రోజులు గడపడానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.

''ప్రస్తుతానికి మేము ఎప్పుడు బయలుదేరుతామో మాకు తెలియదు'' అని అన్నారు.

మొదటి మరణం సంభవించి దాదాపు నెల రోజులు కావస్తున్న తరుణంలో, నౌకలో చిత్రీకరించిన తాజా దృశ్యాలు అక్కడ దైనందిన జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

రక్షణ పరికరాలు ధరించిన ఆరోగ్య అధికారులు దిగడం, విలాసవంతమైన నౌక లాంజ్‌లు కాస్తా నిర్మానుష్యంగా మారడం కనిపిస్తున్నాయి.

ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, తరచుగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని నౌకలో సిబ్బంది సూచించినట్లు మరో ప్రయాణికుడు తెలిపారు.

అంతర్జాతీయం, పర్యాటకం, అమెరికా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, బ్రిటన్, హంటా వైరస్, వ్యాధులు, ఆరోగ్యం

‘జీవితకాలపు మధుర జ్ఞాపకం’గా మిగులుతుందనుకుంటే...

అట్లాంటిక్ మహాసముద్రంలోని అత్యంత కఠినమైన, సహజసిద్ధమైన ప్రకృతి దృశ్యాల గుండా సాగే ఈ యాత్ర, ప్రయాణికులకు ఇది జీవితకాలపు మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఈ క్రూయిజ్ నిర్వాహక సంస్థ హామీ ఇచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత దక్షిణాన ఉన్న నగరమైన అర్జెంటీనాలోని 'ఉషువయా' నుంచి ఏప్రిల్ 1న ఎంవీ హోండియస్ బయలుదేరింది.

''పర్వతాలపై మంచు కురుస్తోంది, తీరం వెంబడి శరదృతువు రంగులు కనిపిస్తున్నాయి, అద్భుతమైన వన్యప్రాణులు కూడా ఉన్నాయి" అని కొన్ని వారాల కిందట పోస్ట్ చేసిన వీడియోలో రోస్మరిన్ ఎంతో ఉత్సాహంగా చెప్పారు.

అర్జెంటీనా నుంచి ఈ ప్రయాణం బ్రిటిష్ భూభాగమైన 'సౌత్ జార్జియా'కు చేరుకుంది. ఇది పెంగ్విన్ల నివాసాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత వన్యప్రాణి పర్యాటక కేంద్రం.

ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత మారుమూల మానవ నివాస ప్రాంతమైన 'ట్రిస్టన్ డా కున్హా' దీవికి వెళ్లారు.

రోస్మరిన్ సోషల్ మీడియా వీడియోలు చూస్తుంటే, ఈ నెల రోజుల ప్రయాణంలో ఆయన ఎంతగా ఆస్వాదించారో అర్థమవుతుంది. పక్షులను, పెంగ్విన్లను చూడటం నుంచి నౌకలో చల్లని లాటే తాగడం వరకు అన్నీ అందులో ఉన్నాయి.

''ఇలాంటి క్షణాలను వివరించడం చాలా కష్టం, కానీ అవే మన మదిలో ఎక్కువ కాలం నిలిచిపోతాయి" అని ట్రిస్టన్ డా కున్హా గురించి రోస్మరిన్ పేర్కొన్నారు.

అంతర్జాతీయం, పర్యాటకం, అమెరికా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, బ్రిటన్, హంటా వైరస్, వ్యాధులు, ఆరోగ్యం

‘గమ్యం ఎక్కడనేదీ అనిశ్చితి’

హోండియస్ నౌక మారుమూల ద్వీపమైన సెయింట్ హెలెనా వైపు వెళ్తుండగా, క్రూయిజ్ నిర్వాహకులకు ఒక ఆందోళనకరమైన విషయం తెలిసింది.

ఏప్రిల్ 11న, నౌకలో ఉన్న ఒక డచ్ వ్యక్తి మరణించారు. అయితే, ఆయన మృతికి కారణం అప్పట్లో తెలియలేదు.

దాదాపు రెండు వారాల తర్వాత, సెయింట్ హెలెనాలో ఆయన మృతదేహాన్ని నౌక నుంచి కిందికి దించారు. ఆయన భార్య కూడా ఆయన వెంటే ఉన్నారు. ఆమెను చికిత్స నిమిత్తం దక్షిణాఫ్రికాకు తరలించగా, జోహన్నెస్‌బర్గ్‌లోని ఒక ఆసుపత్రిలో ఆమె మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆ 69 ఏళ్ల మహిళకు 'హంటావైరస్' సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తర్వాత ధ్రువీకరించింది.

ఏప్రిల్ 27న, ఒక బ్రిటిష్ ప్రయాణికుడు అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ని కూడా దక్షిణాఫ్రికాకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, నిలకడగా ఉందని, ఆయనకు కూడా హంటావైరస్ సోకిందని నిర్ధరణ అయింది.

మే 2న ఒక జర్మన్ పౌరుడు కూడా మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే ఈయనకు కూడా వైరస్ సోకిందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

ప్రస్తుతం ఇద్దరు క్రూయిజ్ సిబ్బందికి 'తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు' ఉన్నాయని, వారిలో ఒకరి పరిస్థితి సాధారణంగా ఉండగా, మరొకరికి అత్యవసర వైద్య సహాయం అవసరమని ఓషన్ వైడ్ ఎక్స్‌పెడిషన్స్ తెలిపింది.

నౌక కేప్ వెర్డే సమీపంలో నిలిచిపోయిన సమయంలో, ప్రయాణికులను ఎక్కడ దించాలనే విషయమై అనిశ్చితి నెలకొంది.

అయితే, కానరీ దీవులలో నౌకను నిలపడానికి స్పెయిన్ అనుమతి ఇచ్చిందని, అక్కడ వైద్య పర్యవేక్షణ, రిస్క్ అసెస్‌మెంట్ చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కానరీ దీవులకు నౌక చేరుకోవడానికి మూడూ నాలుగు రోజులు పడుతుందని స్పెయిన్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నౌక ఏ ఓడరేవుకు చేరుకుంటుందనేది ఇంకా ఖరారు కాలేదు, అయితే 'గ్రాన్ కానరియా లేదా టెనెరిఫే' వైపు ప్రయాణించాలనేది తమ ప్లాన్ అని ఓషన్ వైడ్ ఎక్స్‌పెడిషన్స్ పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)