కుక్కలు వాసన చూసి క్యాన్సర్‌ను పసిగడతాయా?

క్యాన్సర్, ఆరోగ్యం, వైద్యం, భారతదేశం, కర్ణాటక, కేరళ

ఫొటో సోర్స్, Dognosis

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 8 నిమిషాలు

మీరు ఏదైనా ఆరోగ్య పరీక్షా శిబిరానికి లేదా ఆసుపత్రికి వెళ్లినప్పుడు, మిమ్మల్ని ఓ పది నిమిషాల పాటు మాస్క్ ధరించి శ్వాస తీసుకోమని వైద్య సిబ్బంది సూచిస్తే.. ఎలాంటి సంకోచమూ లేకుండా అలా చేయండి.

మీరు క్యాన్సర్ వంటి ఏదైనా బయటకు కనిపించని వ్యాధితో బాధపడుతున్నారేమో తెలుసుకోవడానికే వైద్య సిబ్బంది మిమ్మల్ని మాస్క్‌ వేసుకుని శ్వాస తీసుకోమని చెబుతారు.

పెద్దపేగు క్యాన్సర్ (కొలొరెక్టల్ క్యాన్సర్) వంటి కొన్ని వ్యాధులు రెండవ లేదా మూడవ దశకు చేరుకున్నాకే బయటపడతాయని తెలుసు. ఈ దశలో రోగి ప్రాణాలను కాపాడటం వైద్యులకు చాలా కష్టతరమవుతుంది.

మిమ్మల్ని మాస్క్‌లో శ్వాస తీసుకోమని కోరుతున్న సిబ్బంది, వాస్తవానికి మీ శాంపిల్‌ను సేకరిస్తున్నారు. ఆ మాస్క్‌ను ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కతో వాసన చూపిస్తారు. తద్వారా శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయేమో గుర్తిస్తారు.

క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే, ప్రాణాలు కాపాడటం అంత సులభమవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, భారతదేశంలో మొదటిసారిగా కర్ణాటకలోని ఆరు వేర్వేరు ఆసుపత్రులలో శిక్షణ పొందిన కుక్కల సహాయంతో ఒక అధ్యయనం నిర్వహించారు.

ఈ అధ్యయనంలో కుక్కలు 1,502 మంది రోగుల శాంపిల్స్‌ను వాసన చూసి, ప్రధానంగా ఏడు రకాల క్యాన్సర్లలో ఎవరికి ఏ క్యాన్సర్ ఉంది, ఎవరికి లేదు అనేదీ 91 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగాయి. ఈ 1,502 మందిలో 283 మందికి బయాప్సీ(పరీక్షలు) ద్వారా క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. 1219 మందికి క్యాన్సర్ లేదు.

క్యాన్సర్, ఆరోగ్యం, వైద్యం, భారతదేశం, కర్ణాటక, కేరళ

ఫొటో సోర్స్, Dognosis

ఫొటో క్యాప్షన్, బెంగళూరులోని డాగ్నోసిస్ ఫెసిలిటీలో తమ కుక్కలతో ఆకాష్ కుల్గోడ్ (ఎడమవైపు)

అద్భుతమైన వాసన పసిగట్టే శక్తి

కుక్కలతో క్యాన్సర్‌ను గుర్తించే ఈ అధ్యయనాన్ని బెంగళూరుకు చెందిన 'డాగ్నోసిస్' అనే స్టార్టప్ కంపెనీ నిర్వహించింది. ఈ అధ్యయన ఫలితాలు శుక్రవారం 'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ'లో ప్రచురితమయ్యాయి.

కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఉన్న 'రెడ్ ఆన్ క్యాన్సర్ సెంటర్' డైరెక్టర్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజీవ్ కుల్గోడ్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు.

డాగ్నోసిస్ సీఈవో, కో-ఫౌండర్ ఆకాష్ కుల్గోడ్ బీబీసీతో మాట్లాడుతూ, ''ఇప్పటివరకు కర్ణాటకలోని ఆసుపత్రుల సహాయంతో 10 వేల శాంపిల్స్‌ను సేకరించాం. తదుపరి దశలో మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నాం. అక్కడ రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో సుమారు 15 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తాం'' అని చెప్పారు.

ఈ 10 వేల శాంపిల్స్ కుక్కలకు శిక్షణ ఇవ్వడానికే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్‌ను రూపొందించడానికి కూడా ఉపయోగపడతాయని ఆకాష్ కుల్గోడ్ తెలిపారు. ఈ ప్రక్రియను భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం.

''30 కుక్కల సహాయంతో ఏటా 10 లక్షల శాంపిల్స్‌ను పరీక్షించే సామర్థ్యాన్ని సిద్ధం చేయడమే మా లక్ష్యం'' అని ఆయన చెప్పారు.

వారి మాటల్లో కనిపిస్తున్న ఈ తొందరపాటుకు ఒక బలమైన కారణం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ ఏడాది దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటిపోవచ్చు. ఇది గత మూడు దశాబ్దాలలో 26 శాతం పెరుగుదల.

ఈ అధ్యయన రచయిత డాక్టర్ సంజీవ్ కుల్గోడ్ బీబీసీతో మాట్లాడుతూ, ''క్యాన్సర్ కేసులు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి జనాభా పెరుగుదల, రెండోది క్యాన్సర్ వయస్సుతో ముడిపడి ఉన్న వ్యాధి. మనుషుల వయస్సు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి'' అని వివరించారు.

మొట్టమొదటిసారిగా 1989లో కుక్కల వాసన చూసే శక్తిపై దృష్టి సారించారు.

పరిశోధకులు ఎమిలీ మోజర్, మైఖేల్ మెక్‌కులాక్ 2010లో 'జర్నల్ ఆఫ్ వెటర్నరీ బిహేవియర్'లో, ''ఒక మహిళ తన చర్మంపై ఉన్న మచ్చను పరీక్షించుకోవాల్సిందిగా కోరారు, ఎందుకంటే ఆమె కుక్క ఆ మచ్చపై విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉండేది'' అని రాశారు.

''క్లినికల్ పరీక్షల తర్వాత ఆ మచ్చ 'మాలిగ్నెంట్ మెలనోమా', అంటే ఒక ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్‌గా తేలింది."

వారి పరిశోధనా పత్రానికి "కుక్కల ద్వారా మనుషుల్లోని క్యాన్సర్‌ను గుర్తించే సామర్థ్యం, పద్ధతులు, కచ్చితత్వంపై సమీక్ష" అనే శీర్షిక పెట్టారు.

క్యాన్సర్, ఆరోగ్యం, వైద్యం, భారతదేశం, కర్ణాటక, కేరళ

ఫొటో సోర్స్, Kerala Police Academy

ఫొటో క్యాప్షన్, వయనాడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న ఏంజెల్

మృతదేహాలను వెలికితీసిన కేరళ కుక్కలు

కుక్కలకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే, వాటిలో 30 కోట్ల 'ఓల్ఫ్యాక్టరీ రిసెప్టర్లు' (వాసన గుర్తించే కణాలు) ఉంటాయి. మనుషులలో ఈ సంఖ్య కేవలం 50 లక్షలు మాత్రమే.

''మానవ శరీరం నుంచి విడుదలయ్యే అత్యల్ప పరిమాణంలో ఉండే 'వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్' (వీవోసీ)లను కూడా కుక్కలు గుర్తించగలవు. ఈ వాసన శరీరంలో జరుగుతున్న మార్పులు, ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా క్యాన్సర్‌కు సంబంధించినది కావచ్చు'' అని హాంకాంగ్‌కు చెందిన తిమోతీ క్వాన్‌లో, ఆయన బృందం 'ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్'లో రాశారు.

వైద్య బృందం రోగికి ఒక మాస్క్ పెట్టి, 10 నిమిషాల పాటు శ్వాస తీసుకోమని చెప్పారు. ఈ మాస్కులు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తమ సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉంటాయి. ఆ తర్వాత, ఈ మాస్క్‌లను నిర్దేశిత ల్యాబ్ వాతావరణంలో కుక్కల ముందు ఉంచుతారు.

కుక్కలు శరీరంలోని వీవోసీలలో వచ్చే మార్పులను పసిగట్టి, ఏడు రకాల క్యాన్సర్లను గుర్తిస్తాయి. ప్రాథమిక దశలో ఉన్న క్యాన్సర్‌ను కూడా ఇవి గుర్తించగలవు.

బెంగళూరులోని హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్‌, అకడమిక్ అండ్ రీసెర్చ్ డీన్ డాక్టర్ విశాల్ యూఎస్ రావు బీబీసీతో మాట్లాడుతూ, ''కుక్క ముక్కు లోపలి భాగంలో 'వోమెరోనాసల్ ఆర్గాన్' లేదా 'జాకబ్సన్స్ ఆర్గాన్' అనే ఒక ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. ఇది తేమతో కూడిన వాసనలను, సంక్లిష్టమైన రసాయన సంకేతాలను గుర్తించడంలో వాటికి సహాయపడుతుంది'' అని వివరించారు.

కుక్కలకు ఉన్న ఈ సామర్థ్యాన్ని గమనించి, కేరళ పోలీస్ అకాడమీ అటువంటి వాటికి శిక్షణ ఇచ్చింది. ఇవి 2024 జులైలో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సమయంలో మృతదేహాలను గుర్తించాయి.

కేవలం మూడు రోజుల్లోనే (జులై 31 నుంచి ఆగస్టు 2 మధ్య కాలంలో), మాయ, మర్ఫీ, ఏంజెల్ అనే కుక్కలు 23 మృతదేహాలను వెలికితీశాయి. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది. కేరళ రాష్ట్రం ఇలాంటి విపత్తును ఇంతకుముందెన్నడూ చూడలేదు.

శిథిలాల కింద 25 అడుగుల లోతులో కూరుకుపోయిన మృతదేహాలను కూడా ఆ కుక్కలు వాసన చూసి కనిపెట్టగలవు.

మీరట్‌లోని రిమౌంట్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్ నుంచి మరో మూడు కుక్కలను కూడా మృతదేహాల గాలింపు కోసం రంగంలోకి దించారు.

అకాడమీ ఐజీపీ, డైరెక్టర్ కె.సేతురామన్ బీబీసీతో మాట్లాడుతూ, ''మా కుక్కలను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) కూడా మృతదేహాలను వెతకడానికి తీసుకువెళుతుంది. ప్రస్తుతం కుక్కలకు ఎలా శిక్షణ ఇవ్వాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నాం'' అని చెప్పారు.

ఈ కుక్కలకు, వాటి శిక్షకులకు కాలికట్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫోరెన్సిక్ విభాగం శిక్షణ ఇచ్చింది.

కాలికట్ యూనివర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు కోఆర్డినేటర్ శివ ప్రసాద్ బీబీసీతో మాట్లాడుతూ, ''రక్తాన్ని ఒక గాజ్ (మెడికల్ వస్త్రం)పై పూసి, కొంతకాలం పాటు ఒక రహస్య ప్రదేశంలో కుళ్లిపోయేలా వదిలేస్తాం. కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ఇలా కృత్రిమ వాసనలనే ఉపయోగిస్తాం" అని వివరించారు.

కేరళ పోలీస్ అకాడమీ, ఫోరెన్సిక్ విభాగం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఇప్పుడు పోలీసులకు, సామాన్య ప్రజల కోసం ఒక సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించారు. ఈ కోర్సులో కుక్కల ద్వారా మనుషుల్లో క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలో శిక్షణ ఇస్తారు.

''మేం మాట్లాడిన ఆసుపత్రుల నుంచి మంచి స్పందన లభించింది. సుమారు డజను మంది వైద్యులు త్రిసూర్‌లోని మా శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఇది కేరళ పోలీస్ అకాడమీ ప్రధాన కార్యాలయం. ఈ వైద్య సంస్థల నుంచి శాంపిల్స్ సేకరించి మొదట కుక్కలకు, ఆ తర్వాత సిబ్బందికి శిక్షణ ఇవ్వడమే మా ఉద్దేశం'' అని శివ ప్రసాద్ చెప్పారు.

క్యాన్సర్, ఆరోగ్యం, వైద్యం, భారతదేశం, కర్ణాటక, కేరళ

ఫొటో సోర్స్, Dognosis

ఫొటో క్యాప్షన్, డాగ్నోసిస్ ల్యాబ్‌లో మాస్క్‌ను వాసన చూస్తున్న కుక్క

కుక్కల వినియోగానికి మరో ప్రధాన కారణం

క్యాన్సర్ గుర్తింపులో కుక్కలు ఒక ముఖ్యమైన సాధనంగా మారవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతుల్లో రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉదాహరణకు, మమ్మోగ్రామ్ వంటి పరీక్షల్లో రోగి అయోనైజింగ్ రేడియేషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రేడియేషన్ శరీరానికి హానికరమైనది.

కొలొరెక్టల్ క్యాన్సర్ గుర్తింపు కోసం 'ఇన్వేసివ్ ప్రొసీజర్' (శరీరం లోపలికి పరికరాలను పంపే పద్ధతి) చేయాల్సి ఉంటుంది.

భారత్ వంటి దేశంలో రోగులకు ఇటువంటి క్యాన్సర్ పరీక్షల కోసం నమ్మదగిన, సులభంగా అందుబాటులో ఉండే కేంద్రాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న.

క్యాన్సర్ పరీక్షల్లో ఉన్న ఇలాంటి లోపాలను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌కు చెందిన ఎలిజబెత్ హాఫ్, ఆమె బృందం 2024లో ''నేచర్: సైంటిఫిక్ రిపోర్ట్స్''లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు.

ఈ అధ్యయనం ప్రకారం, ఇజ్రాయెల్‌కు చెందిన 'స్పాట్ ఇట్ ఎర్లీ లిమిటెడ్' అనే సంస్థ క్యాన్సర్ గుర్తింపులో ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది. ఇందులో శరీరంలోకి ఏదీ పంపాల్సిన అవసరం ఉండదు (నాన్-ఇన్వేసివ్), అలాగే ఎటువంటి ప్రత్యేక సహాయం అవసరం లేదు. కేవలం శ్వాస శాంపిల్‌ను తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.

ఈ సాంకేతికత కుక్కల ఘ్రాణ శక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో పనిచేస్తుంది.

యూరిన్ (మూత్రం) శాంపిల్స్ కంటే శ్వాస శాంపిల్స్ క్యాన్సర్‌ను గుర్తించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని వారి అధ్యయనంలో తేలింది.

మనుషుల శ్వాసలో ఉండే 'ప్రత్యేక వాసన'ను గుర్తించడానికి కుక్కలకు శిక్షణ ఇస్తారని డాక్టర్ సంజీవ్ కుల్గోడ్ తెలిపారు.

బాంబులు, మాదకద్రవ్యాలు, విపత్తుల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న మనుషులను గుర్తించడానికి కుక్కలకు ఎలాగైతే శిక్షణ ఇస్తారో, ఇది కూడా సరిగ్గా అలాగే ఉంటుంది.

క్యాన్సర్, ఆరోగ్యం, వైద్యం, భారతదేశం, కర్ణాటక, కేరళ

ఫొటో సోర్స్, Kerala Police Academy

ఫొటో క్యాప్షన్, మృతదేహాలను గుర్తించడంలో కాలికట్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో శిక్షణ పొందిన లైలా

ఏయే కుక్కలు వాసన బాగా పసిగడతాయి?

కేరళ పోలీస్ అకాడమీ, డాగ్నోసిస్ వేర్వేరు జాతుల కుక్కలను ఉపయోగించాయి. వీటిలో మన దేశీ కుక్కలు కూడా ఉన్నాయి.

అకాడమీ తెలిపిన వివరాల ప్రకారం, వారు దేశీ కుక్కలతో పాటు ఒక లాబ్రడార్, ఒక బీగిల్ జాతి కుక్కను ఉపయోగించారు. మరోవైపు, ఫోరెన్సిక్ విభాగం ఎనిమిది బెల్జియన్ మాలినోయిస్ కుక్కలను కొనుగోలు చేసింది. వీటికి శిక్షణ ఇస్తారు. వీటి ద్వారా సర్టిఫికెట్ కోర్సు విద్యార్థులకు కూడా శిక్షణ ఇస్తారు.

డాగ్నోసిస్ సంస్థ నాలుగు బీగిల్స్, ఒక లాబ్రడార్-ఇండీ మిశ్రమ జాతి కుక్క, ఒక డచ్ షెపర్డ్-బెల్జియన్ మాలినోయిస్ మిశ్రమ జాతి కుక్కను ఉపయోగించింది.

విశేషమేమిటంటే, ఈ లాబ్రడార్-ఇండీ మిశ్రమ జాతి కుక్కను డాగ్నోసిస్ ఒక జంతు సంరక్షణ కేంద్రం నుంచి దత్తత తీసుకుంది.

కేరళ పోలీస్ అకాడమీ, డాగ్నోసిస్ ఈ కుక్కలకు 10 వారాలకు పైగా 'రివార్డ్-బేస్డ్' పద్ధతిలో శిక్షణ ఇచ్చాయి. కుక్కలు సరైన వాసనను గుర్తించినప్పుడు వాటికి ఇష్టమైన ఆహారం లేదా బహుమతిని అందిస్తారు.

శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రక్రియలో పరీక్షించాల్సిన వ్యక్తికి మాస్క్ ధరింపజేసి, సుమారు 10 నిమిషాల పాటు సాధారణంగా శ్వాస తీసుకోమని చెబుతారు. ఆ తర్వాత అవసరమైన క్లినికల్ పరీక్షలు నిర్వహించి, కుక్క చేసిన అంచనా సరైనదా కాదా అని నిర్ధరిస్తారు.

''కుక్కలు ఎవరికైతే క్యాన్సర్ ఉండవచ్చని సంకేతం ఇస్తాయో, వారికి తదుపరి దశలో ఫుల్ బాడీ పెట్-సిటి (PET-CT) స్కాన్ వంటి సమగ్ర పరీక్షలు నిర్వహిస్తారు'' అని ఆకాష్ కుల్గోడ్ చెప్పారు.

''ప్రారంభ దశలో ఉన్న ట్యూమర్లను కూడా ఈ పరీక్ష పసిగడుతుంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రజలకు తక్కువ ఖర్చుతో, సులభంగా పరీక్షలు నిర్వహించడం సాధ్యమవుతుంది" అని ఆయన వివరించారు.

ఇంకా సులువుగా చెప్పాలంటే, క్యాన్సర్‌ను భారీ స్థాయిలో ముందుగానే గుర్తించడానికి ఒక సమర్థవంతమైన సాధనంగా ఈ శ్వాస పరీక్ష ప్రాచుర్యం పొందుతోంది.

అయితే, ''విస్తృత స్థాయిలో దీనిని గుర్తించేందుకు ఒక ప్రామాణిక పద్ధతిని అభివృద్ధి చేసేందుకు పశువైద్య శాస్త్రవేత్తలు, మెడికల్ క్లినికల్ నిపుణులు మధ్య మంచి సహకారం అవసరం" అని డాక్టర్ విశాల్ రావు సూచిస్తున్నారు.

ఆవిష్కరణల గురించి ప్రస్తావిస్తూ, ''కుక్కల వాసన పసిగట్టే వ్యవస్థ మాదిరిగా, ఈ వీవోసీలను గుర్తించగల 'కృత్రిమ ముక్కు'ను భారత్ అభివృద్ధి చేయడానికి ఇది సరైన సమయం'' అని డాక్టర్ విశాల్ రావు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)