ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం ఏమంటోంది?

ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన రాజకీయ చర్చకు దారి తీసింది.
ఈ ఆందోళన వెనుక ప్రతిపక్షం ఉందని ప్రభుత్వ వర్గాలు ఆరోపించగా, నిరసనలను అణచేస్తున్నారనీ, న్యాయం చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. మరోవైపు ఏ ప్రభుత్వ ఉద్యోగీ కోరని విధంగా ప్రాథమిక విధులకు సంబంధించిన ఉత్తర్వులనే రద్దు చేయాలని సచివాలయ సిబ్బంది కోరడం సరికాదనే చర్చ కూడా సాగుతోంది.
ఉద్యోగ సంఘాల నాయకుడికి వైయస్సార్ కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వాదన చర్చను మరింత తీవ్రం చేసింది.
ఏపీలో దాదాపు ఒక 1.15 లక్షలమంది ఈ ఉద్యోగాల్లో ఉండడం, దాదాపు ప్రతిపల్లె, పట్టణంలోని ప్రతీ ఇంటికీ వీరు వెళ్తూండడంతో వారి ఆందోళనపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. దీనికితోడు ఆందోళనకు ప్రభుత్వం అనుమతించకపోవడం, దారిలోనే అరెస్టులో, విజయవాడలో భారీ నిరసన, విధుల్లో ఒక సీఐ చనిపోవడం.. ఇదంతా మరింత వేడిని పెంచాయి.
ఈ నేపథ్యంలో అసలు సచివాలయ సిబ్బంది డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది? ముఖ్యంగా సొంత మండలంలోనే డ్యూటీ చేస్తాం, తమ పనిని నిర్దేశించే జీవో 11 రద్దు చేయాలి వంటి డిమాండ్లు ఈ ఆందోళనపై ఆసక్తి పెంచాయి.

2019, 2020 సంవత్సరాల్లో సుమారు 1.23 లక్షల మందిని నెలకు రూ. 15 వేల కన్సాలిడేటెడ్ జీతంతో నియమించారు. ప్రొబేషన్ తరువాత రెగ్యులర్ స్కేల్లో చేరారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సర్వీసు నిబంధనలు వంటి వాటిని వ్యవస్థీకరించారు.
తాజా విజయవాడ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా జరగడంపై అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది.
అనుమతి లేకున్నా ఆందోళన చేయడాన్ని తప్పుబట్టింది. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ ప్రోద్బలం ఉందని ఆ పార్టీ నాయకులు పలువురు ఆరోపణలు చేశారు.
అయితే, జగన్మోహన్ రెడ్డిపై కోపంతో ఆ వ్యవస్థలను నీరుగార్చే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని, అందుకే సచివాలయ ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ విమర్శించింది.
మరోవైపు, తమ ఆందోళన వెనుకున్న ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు సంఘం ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మొహమ్మద్ జానీ పాషా.
వీరు విధుల్లో ఎప్పుడు చేరారు?
జానీ పాషా వాదన ప్రకారం..
''గత 9 నెలలుగా యూనిఫైడ్ ఫామిలీ సర్వే, టాక్స్ కలెక్షన్, సెన్సస్ విధులు, యోగాంధ్ర, ఎస్ఐఆర్ ఇలా ఉక్కిరిబిక్కిరిగా వివిధ విధుల్లో పనిచేశారు సచివాలయ సిబ్బంది. పన్నుల కోసం, జనాభా లెక్కల కోసం, రాష్ట్ర ప్రభుత్వ సర్వే కోసం, ఎస్ఐఆర్ కోసం అనేకసార్లు ప్రజల ఇళ్లకు వెళ్లడం, ఓటీపీలు అడగడం, పత్రాలు అడగడం, వారు మా సిబ్బందిపై చిరాకు పడడం, ఓటీపీలు చెప్పబోము అనడం.. ఇలా మా సిబ్బంది తీవ్ర అసహనంలో, పని ఒత్తిడిలో ఉన్నారు. ఆదివారాలు, సెలవులు అని లేకుండా పనిచేశాం''
''ఎన్నిసార్లు ఇళ్లకు వస్తారంటూ జనం మా మొహం మీదే అడిగిన పరిస్థితి'' ఏర్పడింది. ఎస్ఐఆర్ మ్యాపింగ్ కోసం పత్రాల సేకరణ, నోటీసులు, ఫోటోలు చాలా పెద్ద ప్రహసనం అయింది. అక్షరం తేడా వచ్చినా పెద్ద సమస్య అవుతోంది. మధ్యలో సర్వర్ సమస్యలు. పెన్షన్ల పంపిణీ ఎటూ ఉంది. ఇక ఎన్టీయార్ భరోసా అప్లికేషన్ల స్వీకరణ, అందులో సర్వర్ సమస్యలు.. ఈ ఎనిమిది తొమ్మిది మాసాలుగా ఏంటంటే ఆదివారాలు పండగలు సెలవు రోజుల్లో పూర్తిగా అసలు సెలవు అనేది లేకుండా ఉండటం, అదంతా ఒక్కసారిగా ఉద్యోగుల్లో ఒక ఆవేదన కలిగింది వచ్చింది. ఆ క్రమంలో ఎక్కడైనా ఎవరైనా మన హక్కుల కోసం పోరాడాలని ఒక చిన్న వాయిస్ గట్టిగా బయటకు వచ్చినా, అందరూ అటు ఆకర్షితులయ్యారు'' అన్నారు జానీపాషా.
కాగా.. ఉద్రిక్తంగా మారిన ఆందోళనలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నవేళ, నిరసనలు విరమించామని చెబుతోంది ఈ సంఘం.
''ప్రస్తుతం నిరసన వాయిదా వేశాం. ప్రభుత్వ స్పందన పాజిటివ్‌గానే ఉంది. కొందరు రెచ్చగొట్టి ఏమైనా చేస్తే అది వారి వ్యక్తిగతం, దానికి వారు బాధ్యత వహించాలి. మేం 1.15 లక్షలమందిమి ఉన్నాం. వారిలో ఇలాంటోళ్లు అటు ఇటుగా పదిశాతం ఉంటారేమో. మేం శాంతియుతంగానే నిరసన చేపడతాం'' అన్నారు పాషా.
వైయస్సార్సీపీ మనిషిలాగా వ్యవహరిస్తున్నారన్న తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలపై ''మా నాన్న కార్మిక సంఘాల్లో పనిచేశారు. నేను కూడా ప్రభుత్వం ఉద్యోగం రాకముందు కార్మిక సంఘాల్లో, ప్రజాసంఘాల్లో పనిచేసినప్పుడు పార్టీలతో కూడా కలసి పనిచేశాను. కానీ ఉద్యోగం వచ్చిన తరువాత ఎక్కడా, ఏ పార్టీవైపు వెళ్లకుండా ఉన్నాను. కావాలంటే నాపై ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చు'' అన్నారు పాషా.
"గ్రామ సచివాలయ ఉద్యోగులను ఓ వర్గ శత్రువుగా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఎందుకంటే, క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకే సేవల్ని తీసుకెళ్లాలని పట్టిష్ఠమైన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలను వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సృష్టించారు. జగన్మోహన్ రెడ్డిపై కోపంతో ఆ వ్యవస్థలను నిర్వీర్వం చేసే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సచివాలయ ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు" మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఓ ప్రెస్మీట్లో అన్నారు.

సచివాలయ సిబ్బంది డిమాండ్లు ఏంటి?
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు పది పాయింట్ల డిమాండ్ల పత్రం విడుదల చేశారు.
1.నోషనల్ ఇంక్రిమెంట్లు: ప్రొబేషన్ కాలంలో ఆపేశారు. వాటిని ఇవ్వాలని డిమాండ్
2.జూనియర్ అసిస్టెంట్ క్యాడర్: ఉద్యోగుల విద్యార్హతలు, విధులు మరియు బాధ్యతలకు అనుగుణంగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించాలి.
3.ప్రొబేషన్ ఆలస్య అరియర్స్: వీరు రిక్రూట్ అయిన తరువాత ప్రొబేషన్ ముగించి పర్మినెంట్ చేయడం ఆలస్యం అయింది. ఆ ఆలస్యానికి సంబంధించిన బకాయిలు
4.ప్రభుత్వ శాఖల్లో విలీనం: స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు ఉద్యోగులను వారి అర్హతలు, విధులకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలి.
5. మల్టిపుల్ బాస్ సిస్టమ్ రద్దు: సచివాలయ సిబ్బందిపై రకరకాల శాఖల ఉన్నతాధికారులు పెత్తనం చేస్తున్నారని వారి ఆరోపణ. ఎవరో ఒక రిపోర్టింగ్ అథారిటీ, స్పష్టమైన జాబ్ చార్ట్ ఉండాలని డిమాండ్.
6.పని వేళల పరిరక్షణ: అదనపు పని భారాన్ని తగ్గించి, నిర్దిష్ట పని వేళలు, సమయపాలన కచ్చితంగా అమలు చేయాలి.
7.సెలవు దినాల్లో విధుల నుంచి విముక్తి: అత్యవసర ప్రజాసేవలు మినహా ఆదివారాలు, పండుగలు, ప్రభుత్వ సెలవు దినాల్లో విధులు అప్పగించే విధానాన్ని నియంత్రించాలి.
8.పెండింగ్ పదోన్నతుల అమలు: అర్హత కలిగిన ఉద్యోగుల పెండింగ్ పదోన్నతులను తక్షణమే అమలు చేయాలి.
9.పదోన్నతులు లేని విభాగాలకు ప్రమోషన్ చానల్: పదోన్నతి అవకాశాలు లేని విభాగాలకు స్పష్టమైన ప్రమోషన్ చానల్, కెరీర్ ప్రొగ్రెసన్ కల్పించాలి.
10.పదోన్నతుల పునఃపరిశీలన: పదోన్నతులకు సంబంధించి ఉద్యోగులు సమర్పించిన అభ్యర్థనలు, అభ్యంతరాలు, పునఃపరిశీలన వినతులను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయాలి.
తాము ఈ పది పాయింట్లే డిమాండ్ చేసినట్టు బీబీసీతో చెప్పారు షేక్ మొహమ్మద్ జానీపాషా.
‘మండలంలోనే పని అన్నది మా డిమాండ్ కాదు’
జీవో 11ను రద్దు చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘం డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కొందరు అటువంటి డిమాండ్లు ఉన్న ఫ్లెక్సీ కూడా పట్టుకుని కనిపించారు. అయితే జానీ పాషా ఆ ఆరోపణను తిరస్కరించారు.
సొంత మండలంలోనే పనిచేస్తామనిగానీ, జీవో 11 రద్దు చేయాలనిగానీ తాము డిమాండ్ చేయలేదని ఆయన అంటున్నారు. ''మండలంలోనే పనిచేయాలన్న డిమాండ్ ఎవరైనా వ్యక్తిగతంగా చేసినా మేం సమర్థించం’’ అన్నారాయన.
అయితే ఈ డిమాండ్లలో చాలా వరకూ తాము సానుకూలంగా పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
''గత ప్రభుత్వం కేవలం ఉద్యోగాలు ఇచ్చింది. వారిని పర్మినెంట్ చేయడం దగ్గర నుంచి అన్నీ మా ప్రభుత్వమే అమలు చేసింది. సిబ్బంది కొరత ఉన్నప్పుడు ఒకరికొకరు సేవలు అందించేలా డీసెంట్రలైజ్ చేశాం. గత ప్రభత్వ హయాంలో ఒక్క ఉద్యోగికీ ప్రమోషన్ ఇవ్వలేదు, మేం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే సుమారు 14 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చాం. మిగతా వారికి నెల రోజుల్లో ప్రమోషన్లు కల్పిస్తాం'' అని ప్రకటించారు మంత్రి డా. డోల బాల శ్రీ వీరాంజనేయస్వామి.

ఫొటో సోర్స్, UGC
ప్రభుత్వం ఏం చెప్పింది?
1. గత ప్రభుత్వం 1.23 లక్షల మందిని స్వర్ణగ్రామం, వార్డుల్లో ఉద్యోగులుగా నియమించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుని వారి సర్వీసు రూల్స్ గురించి పట్టించుకోలేదు. మేం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి అన్ని అంశాలను చర్చించి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేశాం.
2.ఇప్పటికే 18 కేడర్లలో 14, 331 మందికి పదోన్నతులు కల్పించాం. మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికిపైగా పదోన్నతులు కల్పించబోతోంది.
3.రికార్డు అస్టిస్టెంట్ కేడర్‌లో నియామకమైన ఈ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వంపై రూ. 150 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ వర్తింప చేయాలని నిర్ణయించాం.
4. జీఓ 11 లో వారికి కేటాయించిన విధులను ఈ ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకానీ అదనపు భారం కాదు.
5.నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ ను ఇప్పటికే ఆర్థికశాఖకు పంపాం.
6. ఒకే పోస్టులో 6 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ ఇస్తున్నాం. ఈ నెల 21న జీఓ 7 విడుదల చేశాం.
7. ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ కేడర్లకు మూడు వారాల్లోగా పదోన్నతి మార్గదర్శకాలు సిద్ధమవుతాయి.
8.సెలవుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆటోమేటిక్ క్యాజువల్ లీవ్ అప్రూవల్ ఫెసిలిటీ తెచ్చాం.
9.ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే ఎర్న్డ్ లీవ్, ఇతర సెలవు ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లు అర్హత మేరకు ఇస్తాం.
10.పని ఒత్తిడిపై కమిటీని ఏర్పాటు చేస్తాం. ప్రతినెలా గ్రీవియెన్స్ పెడతాం.
11.అత్యవసర సందర్భాల్లో తప్ప, మిగతా సెలవు రోజుల్లో ఉద్యోగులకు విధులు కేటాయించకుండా జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశాం.
12.డెత్ బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఇప్పటి వరకూ 121 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చాం.
ఇదీ ప్రభుత్వ వాదన. అయితే జూనియర్ అసిస్టెంట్ హోదా మాత్రం సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నారు ఉన్నతాధికారులు.
''నోషనల్ ఇంక్రిమెంట్లకు సంబంధించి ప్రొబేషన్ ప్రకటించిన అనంతరం ఉద్యోగులకు పీఆర్సీ-2022 పే స్కేళ్లు అమలు చేయడంతోపాటు అర్హత గల వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కూడా అమలు చేశాం. స్టైఫండ్ కాలానికి సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయడానికి ప్రస్తుతం స్పష్టమైన నిబంధన లేనప్పటికీ ఈ అంశంపై తగిన ఉత్వర్యులు జారీకి ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపుతాం. అయితే జూనియర్ అసిస్టెంట్ హోదా కష్టమే కావచ్చు. ఇది అన్ని శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులందరినీ ప్రభావితం చేస్తుంది. నిబంధనలకు విరుద్ధం. అంతేగాక 20 కేడర్ల ఉద్యోగులందరినీ జూనియర్ అసిస్టెంట్ కేడర్ కు అప్‌గ్రేడ్ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. దీనివల్ల ఇతర శాఖల ఉద్యోగులందరూ తిరుగుబాటు చేస్తారు'' అని చెప్పారు ప్రభుత్వ కార్యదర్శి కాటంనేని భాస్కర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























