తెనాలి: పోలీసులు నడిరోడ్డు మీద నిందితుల అరికాళ్లపై కొట్టిన వివాదం.. ఆ యువకులపై పెట్టిన కేసులో కోర్టు ఏం చెప్పింది?

తెనాలి, గుంటూరు, ఏపీ పోలీస్, దళితులు, గుంటూరు జిల్లా కోర్టు, కానిస్టేబుల్ చిరంజీవి
ఫొటో క్యాప్షన్, యువకులను నడి రోడ్డు మీద కూర్చో బెట్టి అరికాళ్లపై లాఠీతో కొడుతున్న దృశ్యాలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. (ఫైల్ ఫోటో)
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

గుంటూరు జిల్లా తెనాలిలో గతేడాది నడిరోడ్డుపై ముగ్గురు యువకులను పోలీసులు అరికాళ్లపై లాఠీలతో కొట్టిన ఘటనకు సంబంధించిన కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టేసింది.

పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడి చేసి హత్యాయత్నం చేశారంటూ ఆ యువకులపై పోలీసులు నమోదు చేసిన కేసుపై తీర్పు చెప్పింది.

ఆ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేవని 11వ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసిందని ఆ యువకుల తరఫున వాదించిన న్యాయవాది, తెనాలి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్‌ బీబీసీకి తెలిపారు.

గత ఏడాది ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై కొట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఆ ఘటన నేపథ్యానికి సంబంధించి జిల్లా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చలోకి వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెనాలి, గుంటూరు, ఏపీ పోలీస్, దళితులు, గుంటూరు జిల్లా కోర్టు, కానిస్టేబుల్ చిరంజీవి
ఫొటో క్యాప్షన్, యువకులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ

తెనాలి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న చిరంజీవి తాను విధుల్లో ఉండగా ఐతానగర్‌ సమీపంలో బాబూలాల్, చేబ్రోలు జాన్‌ విక్టర్, డోమా రాకేశ్, నవీన్‌కుమార్‌ అనే నలుగురు యువకులు హత్యాయత్నం చేశారని 2025 ఏప్రిల్‌ 24న టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌‌లోనే ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఆ నలుగురిలో అందుబాటులోకి వచ్చిన ముగ్గురు యువకులు బాబూలాల్, చేబ్రోలు జాన్‌ విక్టర్, డోమా రాకేశ్‌ను వీధుల్లో తిప్పుతూ నడిరోడ్డుపై కూర్చోబెట్టి అందరూ చూస్తుండగా లాఠీలతో అరికాళ్లపై కొట్టారు.

స్టేషన్‌ కానిస్టేబుల్‌ చిరంజీవిపై గంజాయి మత్తులో వారు దాడి చేశారని అప్పట్లో ఆ స్టేషన్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌గా ఉన్న రాంలా నాయక్‌ బీబీసీకి చెప్పారు. ఆ తర్వాత వారిని అరెస్టు చేశామని అప్పట్లో ఆయన తెలిపారు.

దొరికిన ముగ్గురిలో ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయని విక్టర్‌పై 9, రాకేశ్‌పై 8 కేసులు వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యాయని, హత్య, దొమ్మీ కేసులతో పాటు గంజాయి కేసులు కూడా ఉన్నాయని చెప్పారు.

ఆ కేసులో మరో నిందితుడు వేము నవీన్‌కుమార్‌పై రౌడీషీట్‌ ఉందని, ఆయన పరారీలో ఉండటంతో ఆ రోజు (అరికాళ్ల మీద కొట్టిన రోజు) దొరకలేదని సీఐ రాంలా నాయక్‌ చెప్పారు.

అయితే అప్పట్లో ఆ యువకుల అరికాళ్లపై కొడుతున్న దృశ్యాలు విపరీతంగా వైరల్‌ అయి కలకలం రేగింది. పోలీసులు చేసింది కరెక్టేనని మొదట్లో వాదించిన జిల్లా పోలీసు అధికారులు, ఆ తర్వాత సీఐ రాంలా నాయక్‌ను సస్పెండ్‌ చేశారు.

ఇప్పటికీ ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారని తెనాలి టూటౌన్‌ ప్రస్తుత సీఐ రవీంద్రబాబు బీబీసీకి తెలిపారు.

తెనాలి, గుంటూరు, ఏపీ పోలీస్, దళితులు, గుంటూరు జిల్లా కోర్టు, కానిస్టేబుల్ చిరంజీవి
ఫొటో క్యాప్షన్, కానిస్టేబుల్‌ అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదు కాపీ

ఆ కేసును కొట్టివేసిన జిల్లా కోర్టు

హత్యాయత్నం చేశారంటూ ఆ నలుగురు యువకులపై తెనాలి టూ టౌన్‌ పీఎస్‌ కానిస్టేబుల్‌ చిరంజీవి పెట్టిన కేసును సెప్టెంబర్‌ 29వ తేదీన తెనాలిలో 11వ అదనపు గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసిందని ఆ కేసును వాదించిన న్యాయవాది ప్రభాకర్‌ బీబీసీకి తెలిపారు.

''అది తప్పుడు కేసు అని మొదటి నుంచి వాదిస్తున్నాం. కోర్టులో కూడా నేను అదే వాదించా. నాయస్థానం కూడా అదే నమ్మింది. అందుకే హత్యాయత్నం జరిగిందనడానికి తగిన సాక్ష్యాలు లేవని న్యాయాధికారి ఆ కేసును కొట్టేశారు'' అని ఆయన అన్నారు.

కాగా ఈ కేసును వాదించిన డిఫెన్స్‌ లాయర్, ఏపీపీ సాంబశివరావుతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా ఆయన మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు..

జిల్లా కోర్టులో ఆ కేసు కొట్టివేసినప్పటికీ తాము పైకోర్టుకు అప్పీల్‌కి వెళతామని తెనాలి టూటౌన్‌ సీఐ రవీంద్రబాబు బీబీసీకి తెలిపారు.

తెనాలి, గుంటూరు, ఏపీ పోలీస్, దళితులు
ఫొటో క్యాప్షన్, గుంటూరు జిల్లా కోర్టు తీర్పుపై పైకోర్టుకు వెళతామని పోలీసులు చెప్పారు.

ఆ వీడియోలో ఏముందంటే...

పోలీసులు ముగ్గురు యువకులను నడిరోడ్డుపై కాళ్లు చాపి కూర్చోబెట్టారు. ఓ పోలీస్ లాఠీతో ఓ యువకుడి కాళ్లపై బలంగా కొట్టసాగారు. నొప్పి తట్టుకోలేక కాళ్లు వెనక్కి తీసుకుంటే కాళ్లు సరిగ్గా పెట్టమని గద్దించి తిరిగి కొట్టారు.

రెండో యువకుడినీ అదే మాదిరి కొట్టసాగారు. ‘సార్‌.. సార్‌. సార్‌. అబ్బా అమ్మో’ అని ఆ యువకుడు అరుస్తూనే పరుగెత్తారు.

మూడో యువకుడి దగ్గరకు మరో పోలీస్ వచ్చి కొట్టడం ప్రారంభించారు. ఇంకో పోలీస్ ఆ యువకుడి కాళ్లు కదలకుండా కాళ్లపై తన కాలు బలంగా అదిమిపెట్టారు.

పరుషమైన భాషలో తిడుతూ, కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది.

ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది పోలీసులు స్పష్టంగా చెప్పడం లేదు, కానీ 2025 మే 26న ఇది వైరల్‌ అయింది.

‘‘ఈ ఘటన తెనాలి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐతా నగర్‌లో జరిగింది. ఆ ముగ్గురూ బాబూలాల్, చేబ్రోలు జాన్‌ విక్టర్, డోమా రాకేశ్. మా స్టేషన్‌ కానిస్టేబుల్‌ చిరంజీవిపై గంజాయి మత్తులో వారు దాడి చేశారు’’ అని సీఐ రామ్‌లా నాయక్‌ అప్పట్లో బీబీసీకి చెప్పారు.

విచారణలో భాగంగా నడిరోడ్డుపై అలా అరికాళ్లపై లాఠీలతో కొట్టొచ్చా అని బీబీసీ అడగ్గా.. ‘‘మేం అలా కొట్టలేదు. వీడియో మార్ఫింగ్‌ చేశారేమోనని అనుమానంగా ఉంది’’ అని సీఐ అప్పట్లో వ్యాఖ్యానించారు.

మరో పోలీసు అధికారి మాత్రం అసహనం వ్యక్తం చేశారు.

''పోలీసులపై దాడి చేస్తే ఏం చేయాలి.. తప్పు చేసిన వారికి, తప్పులు చేసే వారికి పోలీసులంటే భయం ఉండాలి. అందుకే వారికి నడిరోడ్డుపై అరికాలి ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం'' అని అసహనంగా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)