కాలిఫోర్నియాలో బాల్య వివాహాలపై నిషేధం.. అమెరికాలోని 32 రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇలాంటివి చట్టబద్ధమే.. ఏటా వేల మంది చిన్నారులకు పెళ్లిళ్లు

బాల్య వివాహాలు, అమెరికా, కాలిఫోర్నియా, బాల్య వివాహాల నిరోధక చట్టం
ఫొటో క్యాప్షన్, బ్రిట్టానీ బీ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు.
    • రచయిత, రీగన్ మోరిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

బాల్య వివాహాలను అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఇటీవల అధికారికంగా నిషేధించింది. సెప్టెంబర్ 30న గవర్నర్ గావిన్ న్యూజమ్ సంతకంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.

అమెరికాలో ఇప్పటికీ 32 రాష్ట్రాల్లో బాల్య వివాహాలు చట్టబద్ధమే.

కాలిఫోర్నియాలో ఈ నూతన చట్టం 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

దీని ప్రకారం, ఆ రాష్ట్రంలో వివాహం చేసుకోవాలనుకునేవారికి కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.

యువ కాలిఫోర్నియన్లు, మైనర్ల రక్షణకు ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సి ఉందని న్యూజమ్ అన్నారు.

బాల్య వివాహాలను నిషేధిస్తున్నట్లు న్యూజమ్ ప్రకటించిన సమయంలో ప్రముఖ అమెరికన్ మోడల్, అడ్వకేట్ కోర్ట్నీ స్టాడెన్ ఆయన పక్కనే ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కోర్ట్నీకి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెకు 50 ఏళ్ల హాలీవుడ్ నటుడితో వివాహం చేచేయడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు.

బాల్య వివాహాలను నిషేధించాలని కోర్ట్నీ చాలా కాలంగా ఉద్యమిస్తున్నారు. ఈ మార్పుని విజయంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. చిన్న పిల్లలపై పెళ్లి అనే బరువు మోపొద్దని కోరారు.

అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో బాల్య వివాహాల నుంచి చిన్నారులను రక్షించేందుకు పోరాడుతూనే ఉంటానని కోర్ట్నీ పేర్కొన్నారు.

ది గ్రీన్ మైల్, అయామ్ సామ్ వంటి చిత్రాలతో పేరుగాంచిన హాలీవుడ్ నటుడు డగ్ హచ్చిసన్‌ని 2011లో కోర్ట్నీ పెళ్లి చేసుకున్నారు. కపుల్స్ థెరపీ సహా అనేక రియాలిటీ షోలలో పాల్గొని ఆమె వార్తల్లో నిలిచారు.

బాల్య వివాహాలు, అమెరికా, కాలిఫోర్నియా, బాల్య వివాహాల నిరోధక చట్టం
ఫొటో క్యాప్షన్, ఈ చట్టం చాలా కాలం క్రితమే రావాల్సిందని గవర్నర్ గావిన్ న్యూజమ్ అన్నారు.

బాల్య వివాహంతో విడాకులు కూడా కష్టమే

బాల్య వివాహాల నుంచి తప్పించుకున్న మరికొందరు ఈ కొత్త చట్టాన్ని కొనియాడారు.

"కాలిఫోర్నియా ఈ రోజు ప్రపంచానికి స్పష్టమైన సంకేతాన్ని పంపించింది. వ్యవస్థాగత హింస నుంచి చిన్నారులకు స్వేచ్ఛ లభించనుందనే ఆశను ఈ చట్టం రేకెత్తించింది. ఇకపై చిన్నారులు తమ భవితను తామే నిర్ణయించుకోవచ్చు" అని బ్రిటనీ బీ అనే మహిళ అన్నారు.

ఇంట్లో వేధింపులు తాళలేక తాను 17 ఏళ్లకే పెళ్లి చేసుకున్నట్లు బ్రిటనీ వెల్లడించారు. అయితే వివాహం చేసుకున్న అనంతరం భర్త హింసించడం మొదలుపెట్టాడని ఆమె అన్నారు.

"ఒక జైలు నుంచి మరో జైలుకి వెళ్లినట్లు అయ్యింది నా పరిస్థితి. చుట్టుపక్కల వారు ఇది నా తప్పనే అంటున్నారు" అని బ్రిటనీ చెప్పారు.

కాలిఫోర్నియా సహా అమెరికా వ్యాప్తంగా బాల్య వివాహాల నిషేధం కోసం బ్రిటనీ వంటి ఎందరో మహిళలు ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు.

దశాబ్దం కిందటి వరకు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో బాల్య వివాహాలకు చట్టపరంగా అనుమతి ఉండేది.

కానీ అనేక ఉద్యమాల ఫలితంగా చాలా రాష్ట్రాల్లో చట్టాలను మారుస్తూ వస్తున్నారు.

బాల్య వివాహాలపై నిషేధం విధించిన 18వ రాష్ట్రం కాలిఫోర్నియా.

కాలిఫోర్నియాలో వివాహాం చేసుకోవడానికి చట్టపరంగా నిర్దిష్టమైన వయసు అంటూ ఉండేది కాదు. తల్లిదండ్రుల అనుమతి, ఓ జడ్జి ఆమోదంతో చిన్నారులకు వివాహం జరిపించేవారు.

18 సంవత్సరాల లోపు పిల్లలకు పెళ్లి జరిగిన తర్వాత విడాకులు తీసుకునే విధానమూ అందుబాటులో లేదు.

దీంతో ఎందరో బాలికలు వేధింపులు, పీడనకు గురవుతూ వివాహ బంధంలోనే మగ్గిపోయేవారు.

కాలిఫోర్నియాలో ఏటా సుమారు 9000 మంది బాలికలకు వివాహం జరుగుతోందని, దాదాపు ఈ అన్ని వివాహాలలో పురుషులు వయోజనులే అని అమెరికా వ్యాప్తంగా బాల్య వివాహాల నిషేధం కోసం ఉద్యమిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.

"బాల్య వివాహాలు చట్టపరమైనవే అని అమెరికాలో చాలా మందికి తెలియదు. వాటి వల్ల చిన్నారులు వేధింపులకు గురవుతున్నారనే అవగాహన కూడా వారికి లేదు" అని పలువురు న్యాయవాదులు చెప్పారు.

బాల్య వివాహాలు, అమెరికా, కాలిఫోర్నియా, బాల్య వివాహాల నిరోధక చట్టం
ఫొటో క్యాప్షన్, 15 ఏళ్ల వయసులో తనకు పెళ్లైనప్పుడు తన భర్తను పెళ్లి రోజు ఉదయమే చూశానని సారా తస్నీమ్ చెప్పారు.

"నా పెళ్లి జరిగే ఉదయమే నా భర్త ఎవరో నాకు తెలిసింది"

సారా తస్నీమ్ అనే మహిళ మాట్లాడుతూ, తనకు 15 ఏళ్ల వయసులోనే తనకంటే రెట్టింపు వయసున్న వ్యక్తితో వివాహం జరిగిందని చెప్పారు.

బాల్య వివాహాలను నిషేధించాలని ఎట్టకేలకు ప్రభుత్వం గుర్తించడం నమ్మశక్యంగా అనిపించడం లేదని అన్నారు. దీనికోసం ఆమె 2017 నుంచి పోరాడుతున్నారు.

"నా పెళ్లి జరిగే ఉదయమే నా భర్త ఎవరో నాకు తెలిసింది. బలవంతంగా ఆయనకు భార్యగా వెళ్లాల్సి వచ్చింది. దాంతో నా జీవితం తలకిందులైంది" అని సారా ఆవేదన చెందారు.

పెళ్లైన మరుసటి ఏడాది, 16 ఏళ్ల వయసులోనే సారా తల్లి అయ్యారు.

దీంతో స్కూల్‌కి వెళ్లడం మానేయాల్సి వచ్చింది.

"ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చాక ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇక వచ్చే ఏడాది నుంచి పెళ్లి అనే కంచె నుంచి చిన్నారులకు విముక్తి లభించనుందని తెలిసి ఊపిరిపీల్చుకుంటున్నా" అని సారా పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)