ఎయిరిండియా పైలట్‌కు గంజాయి పరీక్షలో పాజిటివ్ అంటూ వార్తలు, విమానం ఎత్తు కోల్పోవడానికి, పైలట్ గంజాయి మత్తుకు సంబంధం ఉందా?

ఎయిరిండియా, గంజాయి, డ్రగ్స్, విమాన ప్రమాదం, థాయ్‌లాండ్, దిల్లీ

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 ఎయిర్ బస్
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

ఎయిర్ ఇండియా పైలట్‌ ఒకరు గంజాయి వాడినట్టు విమాన ప్రయాణం అనంతరం నిర్వహించిన పరీక్షలో తేలిందన్న వార్తను విమానయాన దర్యాప్తు అధికారులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.

అయితే ఈ ఫలితం ఇంకా అధికారికంగా నిర్ధరణ కాలేదు. ఒకవేళ అది పాజిటివ్ అని నిర్ధరణ అయినప్పటికీ బయటికి కనిపించినంత బలమైన ఆధారం కాకపోవచ్చు.

ఆగస్టు 4న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ ఏ320 విమానం అకస్మాత్తుగా సుమారు 91 మీటర్లు (300 అడుగులు) ఎత్తు కోల్పోవడంతో 13 మంది ప్రయాణికులు,నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

ఈ విమానంలో 137 మంది ప్రయాణికులు,ఎనిమిది మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన తరువాత విమానం దిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లకు తర్వాత సాధారణ డ్రగ్ పరీక్షలు నిర్వహించారని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విమానం అకస్మాత్తుగా ఎత్తు కోల్పోవడానికి , గంజాయికి సంబంధముందా?

కెప్టెన్ ప్రాథమిక పరీక్ష ఫలితాలకు "మరింత నిర్ధరణ" అవసరమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను విమానాలు నడపకుండా విధుల నుంచి తప్పించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కెప్టెన్‌కు నిర్వహించిన నిర్థరణ పరీక్షల్లో గంజాయి పాజిటివ్ వచ్చినట్టు పలు మీడియా సంస్థలు సంబంధిత వర్గాల నుంచి తెలిసినట్టుగా రిపోర్టు చేశాయి. అయితే ఎయిర్ ఇండియా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. ఈ వార్తలు భారత్‌లో పైలట్లకు డ్రగ్ పరీక్షలు, విమానయాన భద్రతపై పెద్ద చర్చకు దారితీశాయి.

పైలట్ డ్రగ్ టెస్ట్ ఫలితానికీ, విమానం అకస్మాత్తుగా కిందకు దిగడానికీ సంబంధం ఉందని ఇంకా అధికారిక సమాచారం ఏదీ లేదు. దర్యాప్తు అధికారులు ఈ ఘటనను సాంకేతిక, నిర్వహణ, వైద్య, మానవ తప్పిదాలతో సహా పలు కోణాల్లో పరిశీలిస్తున్నారు. విమానం కిందకు దిగడానికి గల కచ్చితమైన కారణంపై ఇంకా స్పష్టతలేదు.

ఈ విషయంలో సహజంగా ముందుగా తలెత్తే ప్రశ్న ఈ ఘటనకు, గంజాయి వినియోగానికి ఏమైనా సంబంధం ఉందా, మరో క్లిష్టమైన ప్రశ్న ఏమంటే ఒక పైలట్‌కు గంజాయి పరీక్షలో పాజిటివ్ తేలడం, దానికి కొన్ని గంటల ముందు ఆయన మానసిక స్థితి ఎలా ఉందో నిజంగా మనకు చెబుతుందా?

ఎయిరిండియా, గంజాయి, డ్రగ్స్, విమాన ప్రమాదం, థాయ్‌లాండ్, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిర్ బస్ 320 కాక్‌పిట్

కాక్‌పిట్‌ లోపల అసలేం జరిగింది?

సంక్లిష్టమైన పనులను చేసేటప్పుడు గంజాయి ప్రజలపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రజలకు కొంత అవగాహన ఉంది. కానీ పాజిటివ్ వచ్చినప్పడు దాని ఆధారంగా వ్యక్తి ఏ సమయంలో గంజాయి ప్రభావంలో ఉన్నారో కచ్చితంగా చెప్పడంపై అంత సమాచారం లేదు.

పైలట్లే ఈ విషయం చెప్పాలి.

1976లో జరిగిన ఒక ప్రయోగంలో 10 మంది పైలట్లకు కొద్ది మోతాదులో గంజాయి ఇచ్చి ఆ తర్వాత వారిని ఒక 'సిమ్యులేటర్' విమానం నడపమని చెప్పారు. దానివల్ల వారి పనితీరు దెబ్బతిని, వారు ఎత్తు, దిశ,రేడియో నావిగేషన్‌లో తప్పులు చేశారు.

ఈ ప్రభావాలు కనీసం రెండు గంటల పాటు స్పష్టంగా కనిపించాయి. నాలుగు నుంచి ఆరు గంటలలోపు ఆ ప్రభావాలు తగ్గిపోయాయని ఆ అధ్యయనంలో తేలింది.

మత్తుమందు ప్రభావం తగ్గిపోయాక ఏం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి ఒక దశాబ్దం తర్వాత పరిశోధకులు ప్రయత్నించారు.

గంజాయి సేవించిన 24 గంటల తర్వాత వారు 10 మంది అనుభవజ్ఞులైన ప్రైవేట్ పైలట్లను ఒక సిమ్యులేటర్‌లో పరీక్షించారు.

ఎలివేటర్లు, విమానాన్ని నియంత్రించే భాగాలను నియంత్రించడంలో, అలాగే ల్యాండింగ్ కచ్చితత్వంలో, ల్యాండింగ్ సమయలో నిలువు, అడ్డ దిశల నుంచి విమానం ఎంత వరకు తప్పిపోయిందనే అంశాల్లో వారి పనితీరు గణనీయంగా క్షీణించిపోయింది.

దీనిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమ పనితీరు క్షీణించిన విషయాన్ని పైలట్లు కూడా గ్రహించలేదని ఈ అధ్యయనంలో తేలింది.

1991లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి హెచ్చరికే చేసింది.

20 మిల్లీగ్రాముల టీహెచ్‌సీ లేదా టెట్రాహైడ్రోకానాబినాల్‌తో కూడిన సిగరెట్ తాగిన తరువాత తొమ్మిదిమంది పైలట్లు విమానాన్ని నడిపారు. (టీహెచ్‌సీ అంటే గంజాయిలోని ప్రధాన రసాయనం. మత్తు భావన కలగడానికి, మెదడు,శారీరక కదలిలకపై అనేక ప్రభావాలకు ఇదే కారణం)

ఒక అధ్యయనంలో 15 నిమిషాలు, నాలుగు గంటలు, ఎనిమిది గంటలు,24 గంటల తర్వాత పరీక్షించినప్పుడు వారి పనితీరు దెబ్బతింది. 24 గంటల తర్వాత కూడా ఆ తొమ్మిది మందిలో ఏడుగురి పనితీరులో ఇంకా లోపాలు కనిపించాయి. కానీ వారిలో ఒకరికి మాత్రమే తాను మత్తుమందు ప్రభావంలో ఉన్నానని తెలుసు.

ఈ అధ్యయనాలు చిన్నవి, పాతవి, ఆధునిక ప్రయాణవిమానాలకు బదులుగా సిమ్యులేటర్లను ఉపయోగించి నిర్వహించినవి.

ఎయిర్ ఇండియా విమానం కాక్‌పిట్ లోపల ఏం జరిగిందో అవి కచ్చితంగా చెప్పలేవు.

అయితే ఇవి ఓ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. విమానాన్ని నడపడానికి అవసరమైన సున్నితమైన కదలికల నియంత్రణ, ఏకాగ్రత, మనిషి-యంత్రం మధ్య సంక్లిష్టమైన సమన్వయంపై గంజాయి ప్రభావం చూపవచ్చు.

ఎయిరిండియా, గంజాయి, డ్రగ్స్, విమాన ప్రమాదం, థాయ్‌లాండ్, దిల్లీ

ఫొటో సోర్స్, /LightRocket via Getty Images

ఫొటో క్యాప్షన్, విమానం 300 అడుగులు కిందకు దిగిన సమయంలో పుకెట్ నుంచి దిల్లీకి ప్రయాణిస్తోంది.

సంక్లిష్టంగా మారిన పరీక్షలు

ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరోకు చెందిన విమానయాన వైద్య నిపుణుడు డేవిడ్ న్యూమాన్ నిర్వహించిన ఒక అధ్యయనం కూడా ఇదే నిర్ధరణకు వచ్చింది.

గంజాయి మోతాదును బట్టి, ఒక వ్యక్తి ప్రవర్తన, ఆలోచనా విధానం, శారీరక పనితీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విమానం నడపడం వంటి సంక్లిష్టమైన పనుల విషయంలో ఈ ప్రభావం కనిపిస్తుంది. గంజాయి ప్రభావం 24 గంటల వరకు ఉండవచ్చని కూడా ఈ అధ్యయనంలో ఆధారాలు లభించాయి.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గంజాయి వాడకం విస్తరించడం, గంజాయి ఉత్పత్తుల్లో మత్తు కలిగించే పదార్థం ప్రభావం పెరగడంతో ఈ అంశానికి సంబంధించి శాస్త్రీయ అవగాహన మరింత సంక్లిష్టంగా మారింది.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్ డియాగోకు చెందిన థామస్ మార్‌కోట్ నేతృత్వంలో 2022లో జరిగిన ఒక అధ్యయనంలో క్రమం తప్పకుండా గంజాయి వాడే 191 మందిని పరీక్షించారు.

టీహెచ్‌సీని పీల్చుకున్నవారి పనితీరు సిమ్యులేటర్‌డ్రైవింగ్ ‌లో దెబ్బతింది.

అయితే గతంలో ఆ వ్యక్తి గంజాయి వాడిన అనుభవం లేదా ఆయన రక్తంలోని టీహెచ్‌సీ పరిమాణాన్ని బట్టి గంజాయి వల్ల కలిగిన ప్రభావాన్ని అంచనా వేయలేవని పరిశోధకులు గుర్తించారు.

గంజాయి మొదట్లో వారి పనితీరుపై ప్రభావం చూపింది. కానీ సుమారు నాలుగున్నర గంటల తర్వాత వారు గంజాయిని ఉపయోగించని వారితో సమానంగా రాణించారు. ఈ ఫలితం విమానయాన పరీక్షలకు చాలా ముఖ్యమైనది.

ఎయిరిండియా, గంజాయి, డ్రగ్స్, విమాన ప్రమాదం, థాయ్‌లాండ్, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గంజాయి తీసుకోవడంపై కెనడా ట్రాన్స్‌పోర్ట్ విభాగం పైలట్లకు కఠిన నిబంధనలు అమలుచేస్తోంది.

"ఈ వ్యక్తి ప్రస్తుతం విమానం నడపలేనంత గంజాయి మత్తులో ఉన్నాడు" అని చెప్పే పరీక్ష ఉందా?

ఒక వ్యక్తికి పరీక్షలో 'పాజిటివ్' అని వస్తే దాని అర్థం వారి శరీరంలో టీహెచ్‌సీ ఉందని మాత్రమే. వారు గంజాయిని ఎప్పుడు ఉపయోగించారో, లేదా ఒక నిర్దుష్ట సమయంలో మత్తులో ఉన్నారో లేదో కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. తీసుకున్న మోతాదు, ఏ రూపంలో తీసుకున్నారు, ఎంత తరచుగా గంజాయి తీసుకుంటారు, వ్యక్తి శరీర స్వభావం వంటి అంశాలను బట్టి ఇది మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

మద్యం తాగారా లేదా అన్నది గుర్తించడం కంటే గంజాయి వాడకాన్ని గుర్తించడం అధికారులకు మరింత సవాలుగా మారడానికి ఇదో కారణం.

"రక్తంలో ఆల్కహాల్‌ స్థాయికి, దానివల్ల కలిగే పనితీరు లోపానికి సంబంధం స్పష్టంగా తెలిసిపోతుంది. టీహెచ్‌సీ విషయంలో అలా కనిపించదు. గంజాయిని పీల్చుకున్నతర్వాత టీహెచ్‌సీ రక్తప్రవాహం నుంచి చాలా త్వరగా తొలగిపోతుంది. కాబట్టి రక్తంలోని టీహెచ్‌సీ స్థాయికి, పనతీరు లోపానికి మధ్య సంబంధం చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలుండకపోవచ్చు" అని మార్‌కోట్ బీబీసీతో చెప్పారు.

''అప్పుడప్పుడు గంజాయి వాడేవారిలో చివరిసారి వాడిన తర్వాత కొన్ని రోజుల పాటు, కొన్నిసార్లు వారాల పాటు రక్తంలో టీహెచ్‌సీని గుర్తించవచ్చు. తరచుగా వాడేవారిలో దీని ప్రభావాలు ఎక్కువ కాలం ఉంటాయి. అయితే గంజాయి వల్ల కలిగే తక్షణ ప్రభావం అప్పటికి పూర్తిగా తగ్గిపోయిఉండొచ్చు'' అని ఆయన చెప్పారు.

గంజాయిని పొగ రూపంలో తీసుకున్న తర్వాత దాని ప్రభావం సాధారణంగా మూడు నుంచి ఐదు గంటల వరకు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిని పదార్థాల రూపంలో తీసుకున్నప్పుడు ఆ ప్రభావాలు ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉండవచ్చు.

గంజాయిని పదార్థంగా తీసుకున్న తర్వాత శరీరంలో ఏర్పడే '11-ఓహెచ్- టీహెచ్‌సీ-(11-హైడ్రాక్సీ-టీహెచ్‌సీ) ' అనే మెటాబొలైట్(శరీరం టీహెచ్‌సీని విచ్ఛిన్నం చేసినప్పుడు ఏర్పడే ఓ పదార్థం) ఒక వ్యక్తి మానసిక స్థితిని ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందని మార్‌కోట్ చెప్పారు.

"ఈ వ్యక్తి ప్రస్తుతం విమానం నడపలేనంతగా మత్తులో ఉన్నాడు" అని కచ్చితం చెప్పగల, ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించిన గంజాయి పరీక్ష ఏదీ లేదు.

కెనడా ఈ విషయంలో చాలా స్పష్టమైన, కఠినమైన విధానాన్ని అనుసరిస్తోంది. 2018లో గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసిన తర్వాత విమాన సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు తమ విధులకు కనీసం 28 రోజుల ముందు గంజాయి వాడకుండా ఉండాలనే నిబంధనను ట్రాన్స్‌పోర్ట్ కెనడా ప్రవేశపెట్టింది.

గంజాయి వల్ల కలిగే ప్రభావం, దాన్ని గుర్తించే పరీక్షల విషయంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిబంధనను ప్రవేశపెట్టారని, విమానయాన సంస్థలు మరింత కఠినమైన నియమాలను విధించవచ్చని ఆ సంస్థ చెబుతోంది.

కేవలం 'పాజిటివ్' పరీక్ష ఫలితం ఆధారంగా తొందరపాటు నిర్ణయాలకు రాకూడదనడానికి అమెరికా విమానయాన రంగం అనుభవం కూడా హెచ్చరిస్తోంది.

2018 నుంచి 2022 వరకు అమెరికా పౌర విమాన ప్రమాదాలలో మరణించిన పైలట్లపై 2026లో ఎన్‌టీఎస్‌బీ జరిపిన ఒక అధ్యయనంలో 52.8శాతం మందిలో కనీసం డ్రగ్ అవశేషాలు గుర్తించగా, 27.7శాతం మందిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ డ్రగ్స్ తీసుకున్న నేపథ్యం ఉన్నట్టు తేలింది.

అక్రమ మాదకద్రవ్యాల వాడకాన్ని గుర్తించడంలో టీహెచ్‌సీ కీలక పాత్ర పోషించింది. అయిత, ఇది కేవలం శరీరంలో మాదకద్రవ్యం ఉందో లేదో నిర్ధరించే పరీక్ష మాత్రమేనని, వారు మత్తులో ఉన్నారో లేదో నిర్ధారించే పరీక్ష కాదని ఎన్‌టీఎస్‌బీ స్పష్టం చేసింది.

ఎయిరిండియా, గంజాయి, డ్రగ్స్, విమాన ప్రమాదం, థాయ్‌లాండ్, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

సమాధానం లేని మూడు ప్రశ్నలు

ఒక వ్యక్తి శరీరంలో గంజాయి ఉన్నట్టు గుర్తిస్తే, ఏదైనా ఘటన లేదా ప్రమాదానికి కారణం అదే అని చెప్పలేం.

అయితే దర్యాప్తు అధికారులు మరింత లోతుగా పరిశీలించిన కేసులు కూడా ఉన్నాయి. 2011లో కెనడాలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో పైలట్ రక్తంలో ప్రతి మిల్లీమీటరుకు 50.1 నానోగ్రాముల(ng/ml) టీహెచ్‌సీ ఉన్నట్టు తేలింది. ఆ స్థాయిలో మత్తు కలిగించే టీహెచ్‌సీ ఒక వ్యక్తి ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీయగలదని, పైలట్ విమాన ప్రయాణాన్ని ప్లాన్ చేయడం, నిర్వహించడంపై కూడా ప్రభావం చూపి ఉండొచ్చని ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ నిర్ధరించింది.

దీనికి విరుద్ధంగా కూడా జరిగింది.

2017లో న్యూజిలాండ్‌లో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ రెండు రోజుల ముందు తీసుకున్న గంజాయి ఆనవాళ్లు ఆయన రక్తంలో గుర్తించారు. కానీ, ప్రమాదం జరిగిన సమయంలో ఆయన మత్తులో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని, అలాగే ఆ ప్రమాదానికి గంజాయి కారణమయ్యే అవకాశం చాలా తక్కువని ఫోరెన్సిక్ టాక్సికాలజిస్టులు తెలిపారు.

అంటే గంజాయి పరీక్షలో 'పాజిటివ్' అని వచ్చినంత మాత్రాన దానికి ఎలాంటి అర్ధం లేదని కాదు. దాని అసలు ప్రభావం, తీసుకున్న పరిమాణం, ఎప్పుడు వాడారు, పరిస్థితులు, దర్యాప్తులో లభించిన ఇతర ఆధారాలపై ఆధారపడి ఉంటుందని ఈ కేసుల ద్వారా అర్ధమవుతుంది.

ఎయిర్ ఇండియా ఘటనలో కెప్టెన్ నిర్థరణ పరీక్ష ఫలితం 'పాజిటివ్' అని తేలడమే కాకుండా దర్యాప్తు అధికారులు ఇంకా అనేక విషయాలను నిరూపించాల్సి ఉంటుంది.

ఏ శాంపిల్‌ని పరీక్షించారు. అందులో టీహెచ్‌సీ ఉందా లేక దాని మెటాబొలైట్ (శరీరం టీహెచ్‌సీని విచ్ఛిన్నం చేసినప్పుడు ఏర్పడే పదార్థం) ఉందా, అది ఏ స్థాయిలో ఉంది, దాని ఆధారంగా వారు గంజాయిని ఎప్పుడు ఉపయోగించారో ఎలా తెలుసుకోవాలి వంటి వివరాలు వారికి తెలియాలి.

ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన పైలట్లందరికీ తక్షణమే డ్రగ్ టెస్టులు నిర్వహించనుంది. ఇంతకుముందు కంపెనీ తన పైలట్లలో కనీసం పది శాతం మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించేది. ఇప్పుడు దానిని విస్తరించింది.

మూత్రం, రక్తం, లాలాజలం ద్వారా ఒక వ్యక్తి టీహెచ్‌సీ వాడారో లేదో తెలుసుకోవచ్చు. కానీ వారు దానిని ఎప్పుడు వాడారో లేదా కొన్ని గంటల క్రితం ఒక నిర్దిష్ట సమయంలో మత్తులో ఉన్నారో లేదో కచ్చితంగా చెప్పలేమని మార్‌కోట్ అంటున్నారు.

లాలాజల పరీక్ష ద్వారా ఇటీవలి వాడకాన్ని సులభంగా తెలుసుకోవచ్చని, గంజాయి సేవించిన గంటల తర్వాత, కొన్నిసార్లు ఒకటి రెండు రోజుల తర్వాత కూడా టీహెచ్‌సీని గుర్తించవచ్చని అంటున్నారు.

పైలట్ గంజాయి వాడారా లేదా అన్నది మాత్రమే ఇక్కడ ప్రశ్న కాదని నిపుణులు భావిస్తున్నారు.

ఇందులో మూడు ప్రశ్నలు ఉన్నాయి:

  • గంజాయి తీసుకున్నారా?
  • విమానాన్ని నడుపుతున్నప్పుడు పైలట్ గంజాయి ప్రభావంలో ఉన్నారా?
  • విమానం అకస్మాత్తుగా కిందకు దిగడానికి ఆ మత్తు స్థితి కారణమా?

మొదటి ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకవచ్చు. కానీ మిగిలిన రెండు ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)