iPhone Duo: ఫోల్డబుల్ ఐఫోన్‌ను తెచ్చిన కొత్త బాస్, యాపిల్ చరిత్రలోనే అతిపెద్ద డిజైన్ మార్పు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, కలి హేస్, టెక్నాలజీ రిపోర్టర్
- హోదా, లిలీ జామలీ, నార్త్ అమెరికా టెక్నాలజీ కరెస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
యాపిల్ తన చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్‌ను విడుదల చేసింది. అదే ఐఫోన్ డ్యూయో. ఇది ఫోల్డబుల్ ఫోన్. దీని ప్రారంభ ధర రూ. 2,50,000 (£1,999)కు పైగా ఉంది. గత 20 ఏళ్లలో ఇంతటి భారీ డిజైన్ మార్పుతో ఐఫోన్ రావడం ఇదే తొలిసారి.
కొత్త బాస్ జాన్ టెర్నస్ తీసుకున్న ఒక పెద్ద సాహసోపేత నిర్ణయమే ఈ 'ఐఫోన్ డ్యూయో'.
యాపిల్‌కు దీర్ఘకాలంగా సీఈఓగా ఉన్న టిమ్ కుక్ నుంచి జాన్ టెర్నస్ ఈ నెలలోనే బాధ్యతలు స్వీకరించారు.
దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్, చైనాకు చెందిన హువావే వంటి సంస్థలతో పోలిస్తే ఈ ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లోకి యాపిల్ చాలా ఆలస్యంగానే అడుగుపెట్టింది.
''ఇతర కంపెనీల ఫోల్డబుల్ ఫోన్లు.. రెండు ఫోన్లను బలవంతంగా అతికించినట్లు ఉంటాయి. కానీ యాపిల్ మోడల్, వినియోగదారులకు అసలైన ఫోల్డబుల్ ఫోన్ వాడకం అనుభూతి ఎలా ఉంటుందో చూపిస్తుంది'' అని కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో జాన్ టెర్నస్ అన్నారు.

అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 1999 డాలర్లు మొదలుకొని అత్యధికంగా 3200 డాలర్ల వరకు ఉంటుంది. దీనిని డెవలప్ చేయడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. యాపిల్ హార్డ్‌వేర్ విభాగంలో చాలా ఏళ్ల పాటు కీలక పదవిలో ఉన్న టెర్నస్ ఈ ఫోల్డబుల్ ఫోన్ తయారీ ప్రాజెక్ట్‌లో పనిచేశారు.
ఈ ఫోన్‌ను మడత విప్పి చూస్తే ఒక చిన్న ఐప్యాడ్‌లా, మడతపెడితే కాస్త వెడల్పాటి ఐఫోన్‌లా కనిపిస్తుంది.
''ఇది పూర్తిగా కొత్త డిజైన్. కానీ పట్టుకోగానే మనకు బాగా అలవాటైన ఫోన్‌లాగే అనిపిస్తుంది. పాస్‌పోర్ట్ సైజులో ఉండటం వల్ల ఒక చేత్తో వాడటానికి చాలా సౌకర్యంగా ఉంటుంది'' అని టెర్నస్ చెప్పారు.
అయితే మార్కెట్లో యాపిల్‌కు గట్టి పోటీ ఉంది.
''అసలు పోటీ చైనాలోనే ఉంది. అక్కడ ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా హువావేదే'' అని ఐడీసీ ఈఎంఈఏలో డేటా అండ్ అనలిటిక్స్ డివైజెస్ ఉపాధ్యక్షుడు ఫ్రాన్సిస్కో జెరోనిమో అన్నారు.
రాబోయే కొన్నేళ్ల పాటు అత్యంత ఖరీదైన ఐఫోన్లలో ఒకటిగా చెప్పదగిన ఈ ఫోన్ లాంచ్ అవుతున్న తరుణంలోనే, దానికి తగ్గట్టుగా టెర్నస్‌కు ప్రమోషన్ ఇచ్చారని ఎఫ్‌డీఎం సీసీఎస్ ఇన్‌సైట్ సంస్థ చీఫ్ అనలిస్ట్ బెన్ వుడ్ అభిప్రాయపడ్డారు.
''యాపిల్ సంస్థలో ఏది కూడా అనుకోకుండా జరగదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
2007లో తొలి ఐఫోన్ వచ్చినప్పటి నుంచి యాపిల్ మళ్లీ అంతటి ఇన్నోవేటివ్ ప్రాడక్ట్‌ను తీసుకురాలేదనే విమర్శలకు ఈ డిజైన్ మార్పు ఒక సమాధానం కావచ్చు.
''కానీ ఈ ఫోల్డబుల్ ఫోన్ యాపిల్ కంపెనీకి పేరు తెస్తుందే తప్పా ఆశించిన స్థాయిలో వ్యాపార వృద్ధిని ఇవ్వకపోవచ్చు. ఇదొక ఖరీదైన అలంకార వస్తువులా వారి పోర్ట్‌ఫోలియోలో ఉండిపోతుంది'' అని ఫారెస్టర్ అనలిస్ట్ దీపాంజన్ ఛటర్జీ అభిప్రాయపడ్డారు.
ఇంతకుముందు కొత్త ఐఫోన్‌లలో అత్యధిక ప్రారంభ ధర 900 డాలర్లు.
ఐఫోన్ డ్యూయోతో పాటు బుధవారం యాపిల్ సంస్థ ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌లను కూడా ఆవిష్కరించింది. అమెరికాలో వీటి ప్రారంభ ధరలు వరుసగా 1,199 డాలర్లు, 1,299 డాలర్లుగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, EPA
గతంలో యాపిల్ 3,699డాలర్ల ధరతో తీసుకొచ్చిన 'విజన్ ప్రో' హెడ్‌సెట్‌లాగే ఈ ఫోల్డబుల్ ఐఫోన్ కూడా కస్టమర్లను ఆకట్టుకోలేకపోవచ్చని ఛటర్జీ అన్నారు.
లేదా, ఐఫోన్ అంత పాపులర్ కాకపోయినా ఏటా మిలియన్ల కొద్దీ అమ్ముడయ్యే 'యాపిల్ వాచ్' లాగా స్థిరమైన మార్కెట్‌ను సంపాదించుకోవచ్చని చెప్పారు.
ఇప్పటికే సాధారణ ఐఫోన్లను వాడటానికి అలవాటుపడిన ప్రజలు ఈ కొత్త డిజైన్‌కు మారడం కూడా ఒక ప్రధాన సవాలే .
ప్రస్తుతం మొత్తం స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో శామ్‌సంగ్, హువావే ఫోల్డబుల్ ఫోన్ల వాటా కేవలం 2 శాతమే ఉందని బెన్ వుడ్ గుర్తుచేశారు. యాపిల్ రాకతో ఆసక్తి పెరిగినా, వచ్చే పదేళ్లలో ఇది 4 శాతానికి మాత్రమే చేరవచ్చని ఎఫ్‌డీఎం సీసీఐ ఇన్‌సైట్ డేటా చెబుతోంది.
ప్రతీ ఏడాది యాపిల్ సంపాదనలో సగానికి పైగా ఆదాయం ఐఫోన్ల అమ్మకాల ద్వారానే వస్తోంది. ఇటీవల వచ్చిన మోడళ్లకు ఆల్-టైమ్ డిమాండ్ వచ్చిందని కంపెనీ చెబుతోంది.

ఫొటో సోర్స్, Apple/courtesy
సిరి ఏఐ
యాపిల్ తమ వాయిస్ అసిస్టెంట్ సిరి రీలాంచ్‌కు సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది. 'సిరి ఏఐ' పేరుతో రీలాంచ్ చేయనుంది.
'ఐఫోన్ 18 నుంచి రాబోతున్న ఈ ఫీచర్.. యూజర్ల అనుమతితో మెసేజ్‌లు, ఈమెయిళ్లను పరిశీలిస్తుంది. దానికి అనుగుణంగా ప్రశ్నలకు జవాబులివ్వడమే కాకుండా, కావాల్సిన పనులను కూడా పూర్తి చేస్తుంది.
కొత్త యాపిల్ వాచ్‌లో సిరి ఏఐ ఫీచర్లు కొన్ని అందుబాటులోకి రానున్నాయి. సంభాషణలను విని నోట్స్ రాసుకోవడం, వాటిని టెక్స్ట్‌గా మార్చడం వంటి ఫీచర్లు రానున్నాయి.
ఐఫోన్‌లోని ఈ నూతన ఏఐ సామర్థ్యాలను 'ఇంటెలిజెంట్ పర్సనల్ హబ్' అని టెర్నస్ అభివర్ణించారు. అయితే, ఇందుకోసం యాపిల్ 'మీ రోజువారీ జీవితంలోని అత్యంత వ్యక్తిగత వివరాలను' ఉపయోగిస్తుందని ఆయన అంగీకరించారు.
కానీ ఈ డేటా అంతా చాలా సురక్షితంగా ఉంటుందని, ఏఐ ఫీచర్లు నేరుగా ఫోన్ (డివైజ్) లోనే రన్ అవుతాయని స్పష్టం చేశారు. ఏ ఇతర థర్డ్ పార్టీ కంపెనీలకు ఈ డేటా వెళ్లదని చెప్పారు. ఒకవేళ ఏదైనా థర్డ్ పార్టీ అవసరమైనా, డేటా అంతా క్లౌడ్‌లోనే గోప్యంగా ఉంటుందని చెప్పారు.
''ఇతరులు కస్టమర్ల డేటాను సేకరించి దాచుకోవడానికి చూస్తారు. కానీ ఇక్కడ మీ అనుమతి లేనిదే యాపిల్ కూడా మీ సమాచారాన్ని చూడలేదు'' అని టెర్నస్ స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























