ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళన: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, సీజేపీ ఏమందంటే..

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీ దిశగా మార్చ్ నిర్వహిస్తున్న నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది.
ఆందోళనాకారులను చెదరకొట్టేందుకు నిరసనకారులపై పోలీసులు వాటర్ కానన్లను ప్రయోగించారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకుండా, బారీకేడ్లను దాటుకుని మార్చ్ కొనసాగించారు.
నిరసనలు కొనసాగుతున్న ప్రదేశంలోనే ఉన్న బీబీసీ కరస్పాండెంట్ దిల్‌నవాజ్ పాషా, ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించినట్టు చెప్పారు.
పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారని, అనేకమంది ఆందోళనాకారులకు లాఠీలు తగిలి, గాయపడ్డారని చెప్పారు.
తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో కూడా ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. నిరసనకారులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి చేరుకోవడానికి తాను ముళ్లకంచెలు, బారికేడ్లను దాటి రావాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఝార్ఖండ్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సోమవారం (ఆగస్టు 10వ తేదీ)నాడు అసెంబ్లీ ముట్టడికి కదిలారు.
కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఈ మార్చ్‌కు మద్దతు పలికారు. ‘‘మేం మీతో ఉన్నాం’’ అని చెప్పారు.
అయితే నిరసనకారుల డిమాండ్లలో సుమారు 98 శాతాన్ని అంగీకరించినట్లు ప్రభుత్వం చెబుతుండగా, విద్యార్థులు మాత్రం ఈ వాదనను తిరస్కరిస్తున్నారు.

ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఏమయ్యాయి?
ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(సీజీఎల్) పరీక్షను రద్దు చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలనే ఉద్యోగార్థుల డిమాండ్లు వివాదాంశాలుగా మారాయి.
"నేను నిరాహార దీక్షలో ఉన్నప్పటికీ, ఈ నిరసనలో పాల్గొనడానికి వచ్చా. అంబులెన్స్‌లో ఇక్కడికి చేరుకున్నాను. స్ట్రెచర్‌పై ముందుకు సాగుతున్నా" అని దేవేంద్ర నాథ్ మహతో మీడియాతో అన్నారు.
అభ్యర్థుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ఆమోదించాలని ఆయన కోరారు.
రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వం- ఆందోళనకారుల మధ్య ఆదివారం చర్చలు జరిగాయి.
చర్చల ఫలితంగా 14వ జేపీఎస్‌సీ (ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రాథమిక పరీక్షను రద్దు చేసి, ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది.
''14వ జేపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం అంగీకారానికి వచ్చింది. అలాగే, జేపీఎస్‌సీ బ్యాక్‌లాగ్ పరీక్షలను (2023, 2025) రద్దు చేయడానికి, ఈ పరీక్షల్లో అవకతవకలపై సీఐడీ, ఈడీ, ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు" అని దేవేంద్రనాథ్ మహతో నాయకత్వంలోని నిరసనకారుల వర్గానికి ప్రతినిధి అయిన రవీంద్ర రవి బీబీసీకి చెప్పారు.
పరీక్షలపై సీబీఐ విచారణ జరగాలన్న తమ డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారని రవీంద్ర రవి తెలిపారు.
ఆదివారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లలో దాదాపు అన్నింటికీ అంగీకరించిందని, అయితే కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని మహతో వర్గానికి చెందిన విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ విలేఖరులతో చెప్పారు.

ఝార్ఖండ్‌లో ఉద్యోగార్థులు ఆందోళనపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు.
"ఝార్ఖండ్ యువతతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనికి ఒక పరిష్కారం లభిస్తుందనిఅనుకుంటున్నాం. అయితే, దీనికి అసలైన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఝార్ఖండ్ ప్రజలకు ఉద్యోగాలు కల్పించడానికి కేంద్రం ఏం చేసింది?" అని ఆయన ప్రశ్నించారు.
సోమవారం పాత అసెంబ్లీ భవన సముదాయం నుంచి కొత్త అసెంబ్లీ భవనం వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించాలని ఝార్ఖండ్ ప్రభుత్వంతో ఆదివారం జరిగిన చర్చల అనంతరం ఆందోళనకారులు నిర్ణయించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























