‘SIR పై ఎన్నికల సంఘంలోనే అభిప్రాయభేదాలు’- మీడియా కథనంపై రాజకీయ దుమారం.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్

ఫొటో సోర్స్, Sanjeev Verma/Hindustan Times via Getty Images
ఎన్నికల సంఘంలోని ఇద్దరు సభ్యులు గత కొన్ని నెలలుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో పలు అంశాలపై విభేదించారని ఆంగ్ల వార్తాపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పరిశోధనాత్మక కథనం ఒకటి పేర్కొంది.
ఈ కథనం ప్రచురితమైన తర్వాత రాజకీయంగా గందరగోళం మొదలైంది.
ఎన్నికల సంఘం పనితీరుపైనా, ప్రభుత్వం మీద ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు '10 నెలల్లో 14 అభ్యంతరాలు' లేవనెత్తారని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం పేర్కొంది.
అయితే, ఇద్దరు కమిషనర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు సర్వసాధారణమేనని, ఇది నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగమని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రశ్నలలో ‘‘ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలకు కొన్ని విషయాలు తెలియకుండా ఉంచడం, కొత్త ఓటర్లను చేర్చడం తొలగించడం అభ్యంతరాలు, అలాగే 'అనధికారిక, చట్టవిరుద్ధమైన' నిర్ణయాలను ప్రశ్నించడం’’ వరకు ఉన్నాయి.
భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ 2025 జూన్‌లో బిహార్‌లో ప్రారంభమైనప్పటికీ, 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లను తొలగించారు.
అయితే, పేర్లు తొలగింపుకు గురైనవారు ఈ ప్రక్రియపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు.
రిపోర్టులో ఇంకా ఏముంది?
గత 10 నెలల్లో ఎన్నికల కమిషన్ తీసుకున్న పలు నిర్ణయాలపై కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ రితికా చోప్రా ఒక కథనంలో పేర్కొన్నారు.
ఈ కథనం ప్రకారం,
జూలైలో కొత్త ఓటర్ల ఫారం 6లో 'సర్' కు సంబంధించిన ఒక ప్రశ్నను చేర్చారు. చట్టాన్ని సవరించకుండా ఇది సాధ్యంకాదని మే నెలలోనే ఇద్దరు కమిషనర్లు ఈసీకి చెప్పారు. అయినాసరే, అలాంటివేమీ లేకుండానే ఈ మార్పులు జరిగాయి. ఇది ''అనధికారికం, చట్టవిరుద్ధం" అని ఇద్దరు కమిషనర్లు పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో 'సర్' సమయంలో ఓటర్ల పేర్లను తొలగింపు, అప్పీళ్లపై ఇద్దరు కమిషనర్లు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రశ్నలు లేవనెత్తారు.
జూలై నెలాఖరులో, దిల్లీలోని కమిషన్ పరిపాలనా విభాగంలో పని విభజనపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం తెలిపారు. కమిషన్‌ను నియంత్రించే చట్టాన్ని ఇది "స్పష్టంగా ఉల్లంఘించడమే" అని పేర్కొంటూ, వారు క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు.
రితికా చోప్రా కథనం ప్రకారం,
గోవాలో స్థానిక అధికారులు 97 మంది ఓటర్లను అర్హులుగా గుర్తించినప్పటికీ, వారి పేర్లను కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయలేదు. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌పై కేంద్రీకృత నియంత్రణ గురించి ఇద్దరు కమిషనర్లు కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images
రాజకీయ పార్టీల స్పందన
ఈ కథనం ప్రచురితమైన తర్వాత, రాజకీయ వర్గాల్లో ఎన్నికల సంఘం పాత్రపై చర్చ తీవ్రమైంది. చాలామంది నేతలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
"ఐదు నెలల కిందటప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ 60 మందికి పైగా రాజ్యసభ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దీనికి 50 మంది ఎంపీల మద్దతు మాత్రమే అవసరం. ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న పలు నిర్ణయాలను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించారన్న పెద్ద వార్త వెలువడిన తర్వాత, ఈ రోజు ఆ తీర్మానాన్ని రాజ్యసభలో ముందుకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి" అని ఎక్స్‌లో టీఎంసీ నాయకుడు డెరెక్ ఓ'బ్రియన్ రాశారు.
భారత ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు జ్ఞానేష్ కుమార్ గుప్తాను బీజేపీ కాపాడుతోందని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు .
‘‘ఎన్నికల కమిషనర్లు సమష్టిగా నడపాల్సిన సంస్థపై జ్ఞానేష్ కుమార్ గుప్తా అసాధారణమైన నియంత్రణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆదేశాల మేరకు ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ భారతదేశ ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను నాశనం చేశారు’’ అని ఖేరా 'ఎక్స్' లో రాశారు.
ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఎక్స్ లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ , ‘‘మేము ఓట్ల దొంగతనం విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లాం, కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల సంఘం అనే రాజ్యాంగబద్ధమైన సంస్థకు అధిపతిగా ఉంటూ, రాజ్యాంగ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు, మర్యాదలను ఉల్లంఘించి ప్రతిసారీ అందరినీ తప్పుదోవ పట్టించారు" అని ఆయన రాశారు.
"ప్రజాస్వామ్య సంరక్షకురాలే తాను రక్షించాల్సిన ప్రజాస్వామ్యానికే హాని చేస్తున్నట్లు కనిపించడం దారుణం" అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా రాశారు .
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శివసేన యూబీటీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు.
దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బాధ్యుడిని చేస్తూ "ఎన్నికల సంఘం హోంశాఖ పరిధిలోకి వస్తుంది. ప్రధానమంత్రి దేశాన్ని కాపాడాలనుకుంటే, ఆయన అమిత్ షాను ఆ పదవి నుంచి తొలగించాలి" అని అన్నారు .
ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఏమన్నది?
అయితే, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎస్ఐఆర్‌కు సంబంధించి కొన్ని సమస్యలు లేవనెత్తినప్పటికీ, ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే తుది నిర్ణయాలు తీసుకున్నారని, పేరు చెప్పడానికి ఇష్టపడని ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
మరోవైపు దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన ఎన్నికల సంఘం, ''ఈ ప్రశ్నలు అభ్యంతరాలన్నీ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగం. ఈ సలహాలు, సూచనలు, అభ్యంతరాలన్నీ ఎన్నికల ప్రక్రియను మరింత సమర్ధవంతంగా మార్చే చర్యలలో భాగం'' అని పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images
సీనియర్ జర్నలిస్టులు లేవనెత్తిన ప్రశ్నలేంటి?
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అశుతోష్ మూడు ప్రశ్నలు లేవనెత్తారు.
- ఎవరి ఆదేశాల మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు?
- తాను ఏది చేసినా ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది?
- బీజేపీ ఇప్పటికీ ఆయనను సమర్థిస్తుందా?
అలాగే, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రిపోర్ట్ వెలువడిన తర్వాత సీఈసీ ఇకపై ఆ పదవిలో కొనసాగడానికి ఎలాంటి అర్హత లేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని లేదా అభిశంసన ద్వారా తొలగించాలని డిమాండ్ చేశారు.
"రితికా చోప్రా రాసిన ఈ నివేదిక.. కేవలం ఎన్నికల సంఘం అంతర్గత ప్రక్రియలనే కాకుండా, గతేడాది జరిగిన అన్ని ఎన్నికల మీద కూడా నీలి నీడలను కమ్ముకునేలా చేస్తోంది. ఎందుకంటే ఆ టైంలోనే కమిషన్ లోపల ఇటువంటి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి" అని ఎక్స్‌లో సీనియర్ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ రాశారు.
"ఈ కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.
ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు ‘సర్’కు సంబంధించిన ఆదేశాలపై జ్ఞానేష్ కుమార్ చర్యలను వ్యతిరేకించారని, అయితే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఆయన చట్టవిరుద్ధమైన ఆదేశాలు జారీ చేయడంవల్ల ఇప్పటివరకు 13 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు.
"ఒక రాజ్యాంగ సంస్థ ఇప్పుడు కేవలం ఒక వ్యక్తికి తలొగ్గే సంస్థగా మారిపోయిందా? దీనికి జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇస్తారా?" అని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎక్స్‌లో ప్రశ్నించారు.
‘సర్’ నిర్వహణలో జరిగిన అవకతవకలకు ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలని కోరుతూ, ఈవారం మొదట్లో మరో మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాస చేసిన ప్రకటనను రాజ్‌దీప్ సర్దేశాయ్ గుర్తుచేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























